ఆఫ్-పాక్ ‘హోం మేడ్’ బాంబులకు హడలుతున్న అమెరికా, పాక్‌కి సహాయం నిలిపివేత


ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాలలోని మిలిటెంట్లు వాడుతున్న హోం మేడ్ బాంబుల ధాటికి అమెరికా ఠారెత్తుతోంది. అమెరికా, నాటో సైనికులను ఇంటి తయారీ బాంబులే వణికిస్తున్నాయి. ‘ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’ (ఐ.ఇ.డి) గా పిలిచే ఈ బాంబులవల్లనే పలువురు అమెరికా, నాటో సైనికులు చనిపోవడంతో వాటిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక సతమతమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ అమెరికా తన నిస్సహాయతను అంతా పాకిస్ధాన్ పైన చూపిస్తోంది. ఐ.ఇ.డిలను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ సరైన చర్యలు తీసుకోవాలనీ, ఐ.ఇ.డి లను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ సరైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చేవరకూ దానికి ఇవ్వవలసిన 700 మిలియన్ డాలర్ల సహాయాన్ని ఆపివేస్తున్నట్లుగా ప్రకటించింది.

అమెరికా చర్య పాక్ తో సంబంధాలను మరింత చెడగొట్టడానికి తప్ప మరి దేనికీ దోహదపడదని పాకిస్ధాన్ సెనేట్ సభ్యుడు సలీం సైఫుల్లా తెలిపాడు. అమెరికా చర్య సరైంది కాదని ఆయన నిరసించాడు. అమెరికా ప్రకటించిన ‘టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం’ లో పాకిస్ధాన్ మిత్ర దేశంగా చేరాక, ఆ యుద్ధం కోసం పాకిస్ధాన్ చేసే ఖర్చులన్నింటినీ అమెరికా తిరిగి చెల్లిస్తోంది (రీఇంబర్స్‌మెంట్). ఇలా పాకిస్ధాన్ చేసిన ఖర్చులను అమెరికా తిరిగి చెల్లించడాన్నే పాకిస్ధాన్ కు అమెరికా చేస్తున్న సహాయంగా పశ్చిమ దేశాల పత్రికలు గొప్పలు చెబుతుంటాయి. అమెరికా సహాయం లేకపోతే పాకిస్ధాన్ బతుకే లేదన్నట్లుగా తప్పుడు రాతలు రాస్తుంటాయి. పాకిస్ధాన్ అప్పటికే చేస్తున్న ఖర్చులను అమెరికా చెల్లిస్తుంది తప్ప ఉచితంగా సహాయం చెయ్యడం లేదన్న విషయాన్ని అవి విస్మరిస్తాయి. పాకిస్ధాన్ కి సహాయం నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించినప్పుడల్లా ‘ఇంకేముంది, పాకిస్ధాన్ పని ఐపోయింది’ అన్నట్లుగా వార్తా కధనాలు ఇష్టంగా రాసుకుంటాయి. అందులో రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రధమ స్ధానంలో ఉంటుంది.

మిలిటెంట్లపైన యుద్ధం చేయడం లేదని పాకిస్ధాన్ పైన ఆరోపిస్తూ పాక్ కీ ఇస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని అమెరికా కాంగ్రెస్ లో చాలాకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం సి.ఐ.ఎ గూఢచారులను పాక్ నుండి వెనక్కి పంపించినపుడు అమెరికా ఇలాగే సహాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత సంబంధాలు మెరుగైనాయని ఇరుదేశాలూ ప్రకటించాయి. రెండు వారాల క్రితం ఆఫ్ఘన్, పాక్ సరిహద్దులో కాపలా ఉన్న పాక్ సైనికులను 24 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు కాల్చి చంపాక పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకడంతో పాక్ ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంది. పాక్ భూభాగం ద్వారా ఆఫ్గన్ లోని అమెరికా, నాటో బలగాలకు అందే ఆయుధ, ఆహార, ఇంధన సరఫరాలను నిలిపివేసింది. ఆఫ్ఘన్, పాక్ భూభాగాల్లోని జనావాసాల్లో మిలిటెంట్లపై దాడుల పేరుతో ప్రయోగిస్తున్న డ్రోన్ విమానాలకు కేంద్రంగా సి.ఐ.ఎ ఉపయోగిస్తున్న షంషీ వైమానిక స్ధావరాన్ని ఖాళీ చేయించింది. అమెరికాతో సహకారాన్ని పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. బాన్ నగరంలో ఆఫ్ఘనిస్ధాన్ పై జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కు గైర్హాజరయ్యింది.

పాకిస్ధాన్ ప్రకటించిన ఈ చర్యలతో అమెరికా మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది. వరుసగా పాకిస్ధాన్ ప్రకటించిన ప్రతీకార చర్యలనుండి ఆ దేశాన్ని వెనక్కి మళ్లించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి విపలం అయ్యింది. అమెరికా సైనికాధికారులు మొదట సంఘటన పట్ల విచారం ప్రకటించినా పట్టించుకోలేదు. అమెరికా సైనికాధికారులు పదే పదే విచారం ప్రకటించినప్పటికీ పట్టించుకోకపోవడంతో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా విచారం ప్రకటించింది. పాకిస్ధాన్ ఎదుర్కొన్న సైనిక నష్టం దురదృష్టకరమని అభివర్ణించింది. అయినా పాకిస్ధాన్ కిమ్మనలేదు. చివరికి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీకి ఫోన్ చేసి అమెరికా సైన్యం ఉద్దేశ్య పూర్వకంగా పాక్ సైనికులను చంపలేదనీ, అయినా జరిగిన సంఘటన దురదృష్టకరమనీ, సంఘటనపై ఉన్నత స్ధాయి కమిటీ దర్యాప్తు చేస్తున్నదనీ కనుక పాకిస్ధాన్ తన చర్యలను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు. ఇన్ని చేసినప్పటికీ అమెరికా, పాకిస్ధాన్ కోరిన విధంగా అపాలజీ చెప్పడానికి ముందుకు రాలేదు.’సారీ’ ఒక్కటే చెప్పలేదని పత్రికలు వ్యాఖ్యానించాయి. అయినా పాకిస్ధాన్ వైపునుండి బహిరంగంగా అయితే వెనక్కి తగ్గినట్లు సూచనలు వెలువడలేదు.

ఈ నేపధ్యంలోనే అమెరికా తీసుకున్న తాజా సంఘటనను పరిశీలించవలసి ఉంది. మిలిటెంట్లు వాడుతున్న ఐ.ఇ.డి లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయనీ, తాలిబాన్ వ్యతిరేక పోరాటంలో ఇవి అమెరికా, నాటో బలగాలకు పెద్ద ఆటంకంగా ఉన్నాయనీ అమెరికా భావిస్తోంది. కుప్పలు తెప్పలుగా అణ్వాయుధాలు పోగేసుకుని ప్రపంచ పోలీసుగా చెలామణి అవుతూ ప్రపంచాధిపత్యం చెలాయిస్తున్న అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించి చివరికి మిలిటెంట్లు ఇళ్ళలో తయారు చేసి వాడుతున్న ఐ.ఇ.డి లకు అమెరికా, నాటో బలగాలకు భయపడుతున్నాయంటే సిగ్గు చేటైన విషయం. అమెరికా ఇరాక్ పైన దాడి చేసినా, లేదా ఆఫ్ఘన్, లిబియాల పైన దాడి చేసినా ఆ దేశాల్లో కనీస శక్తి కలిగిన ఆయుధాలు లేకుండా చూసి దాడి చేసింది. ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ లు పాలిస్తున్నపుడు వారి వద్ద ఎలాగూ ఆయుధ సంపత్తి లేదు. కనుక ధైర్యంగా దాడి చేసింది. ఇరాక్ విషయానికి వస్తే దాదాపు పది సంవత్సరాల పాటు ఆయుధ తనిఖీల పేరుతో ఐక్యరాజ్య సమితి పరిశీలకులను దించి అక్కడ ఉన్న ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేయించింది. ఒక మాదిరి ఆయుధాలనుండి, భారీ ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేశాక ఇక అమెరికా సైనికులకు ప్రమాదం లేదని నమ్మాకనే ఇరాక్ పైన జబ్బలు చరుచుకుంటూ దాడి చేసింది. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ కూడా అంతకు ఐదు సంవత్సరాల క్రితం నుండీ తన వద్ద నున్న భారీ ఆయుధాలను ధ్వంసం చేసి అమెరికా, యూరప్ లతొ సంబంధాలను పెంచుకున్నాడు. ఆవిధంగా గడ్డాఫీ వద్ద సైతం ఆయుధాలు లేకుండా అమెరికా చూసుకుంది. పూర్తి స్ధాయి యుద్ధం మొదలు కాకముందే ‘నో ఫ్లై జోన్’ పేరుతో అమెరికా, ఫ్రాను, బ్రిటన్ దేశాల జెట్ ఫైటర్లు, హెలికాప్టర్లు పెద్ద ఎత్తున దాడులు చేసి గడ్డాఫీ ఆయుధాగారాలన్నింటినీ ధ్వంసం దేశాయి.

ఈ భయాలతోనే అమెరికా, యూరప్ లు ఇరాన్ పైన అణు బాంబులు తయారు చేస్తున్నదంటూ అబద్ధపు ఆరోపణలు చేసి ఆదేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయి. మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాలను కాపాడే ఇజ్రాయెల్ కి ఇరాన్ భయం లేకుండా చేయడానికి నానా అబద్ధపు కూతలన్నీ ఇరాన్ పైన ప్రచారం చేస్తున్నాయి. ఇరాన్ ని కూడా ఆయుధాల పరంగా నిర్వీర్యం చేసి దాడులు చేయాలనీ, అక్కడ తమ కీలు బొమ్మ ప్రభుత్వం నిలబెట్టాలనీ అమెరికా, యూరప్ లు ప్రయత్నిస్తున్నాయి. తాము దాడులు చేసే దేశాల పోరాట శక్తుల పట్ల అమెరికా ఎంతగా భయపడుతుందో పాకిస్ధాన్ ఐ.ఇ.డి ల పట్ల దాని ప్రకటన విప్పి చూపుతోంది. ఐ.ఇ.డిలను అమ్మోనియం నైట్రేట్ తో తయారు చేస్తారు. ఎరువుల కోసం తయారు చేస్తున్న ఆమోనియం నైట్రెట్ ను దారి మళ్లించి కుటీర పరిశ్రమ లాగా ఐ.ఇ.డి లు తయారు చేసి మిలిటెంట్లు వాటిని అమెరికా, నాటో బలగాలపైన వాడుతున్నారు. ఇలా ఇళ్ళల్లో తయారు చేసి ప్రయోగిస్తున్న బాంబులంటేనే ఇప్పుడు అమెరికా హడలుతోంది.

పాకిస్ధాన్ లో ఉన్న రెండు ఎరువుల ఫ్యాక్టరీలనుండే అమోనియం నైట్రేట్ ను మిలిటెంట్లు సంపాదిస్తున్నారని అమెరికా సైనికాధికారులు ఆరోపిస్తున్నారు. అమెరికా, నాటో సైన్యాలను టార్గెట్ చేస్తున్న ఆఫ్ఘన్ మిలిటెంట్లు పాకిస్ధాన్ నుండి దిగుమతి చేసుకున్న అమోనియం నైట్రేట్ తో చేసిన బాంబులను వినియోగిస్తున్నారన్నది అమెరికా అభియోగం. ఈ స్మగ్లింగ్ నిరోధానికి కృషి చేస్తున్నట్లు పాకిస్ధాన్ హామీ ఇస్తేనే సహాయం చేస్తానని అమెరికా ఇప్పుడు షరతు విధించింది. స్మగ్లింగ్ అన్నది ప్రతి దేశం ఎదుర్కొంటున్న సమస్య. ఏ దేశమూ కూడా స్మగ్లింగ్ ను రాత్రికి రాత్రే అరికట్టలేవు. ఆ మాటకొస్తే దశాబ్దాల తరబడి కృషి చేస్తున్నప్పటికీ ఏ దేశమూ పూర్తిగా స్మగ్లింగ్ ను అరికట్టిన జాడలు లేవు. అలాంటిది ఆఫ్ఘన్, పాక్ సరిహద్దు ఎంత అననుకూలంగా ఉంటుందో అమెరికాయే అనేక సార్లు చెప్పింది. డ్యూరండ్ సరిహద్దుగా సరిగా గుర్తించలేదనీ అక్కడ తన, పర గుర్తించడం కష్టమనీ పాక్ సైనికులను చంపిన సందర్భంగా కూడా అమెరికా చెప్పింది. కాని పాకిస్ధాన్ మాత్రం ఆఫ్-పాక్ సరిహద్దులో అమోనియం నైట్రేట్ స్మగ్లింగ్ అరికట్టి తద్వారా మిలిటెంట్లు ఐ.ఇ.డి లుతయారు చేయకుండా అడ్డుకోవాలట!

ప్రపంచాన్ని అనేక సార్లు భస్మీ పటలం చేయగల అణ్వస్త్రాలను దగ్గర ఉంచుకున్న అమెరికా చివరికి పాకిస్ధాన్ గల్లీల్లో తయారు చేసే ‘ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్’ అనే చిన్న బాంబులకు భయపడుతోందన్నమాట! ఎంత సిగ్గుచేటైన విషయం! అణు బాంబులు మానవ వినాశనానికి తప్ప యుద్ధంలో గెలుపుని ఇవ్వలేవని అమెరికాకి ఇప్పటికైనా తెలిసి వస్తే, ఆ తెలివిడితోనైనా అణ్వస్త్రాలను నిర్మూలించడానికి నడుం కడితే…..

5 thoughts on “ఆఫ్-పాక్ ‘హోం మేడ్’ బాంబులకు హడలుతున్న అమెరికా, పాక్‌కి సహాయం నిలిపివేత

 1. అమెరికా భయపడుతోందా? ఏదో మిష మీద భయపడుతున్నట్లు నటిస్తోందా? అమెరికా మాటలు చేతల వెనుక ఏదో నిగూఢమైన కారణం ఉంది. దానిని తెలుసుకొనేందుకు ప్రయత్నించండి. పైపై విశ్లేషణతో అమెరికా భయపడుతోంని హడావుడి నిర్ణయాలకు రావటం అమెరికాకే ప్రయోజనకరం.

 2. శ్యామలరావుగారూ, నాకెందుకండీ హడావుడి?

  అమెరికా భయపడడంలో అంతా కానిదేమీ లేదు. సామ్రాజ్యవాదం మట్టి కాళ్ళ మహారాక్షసి అని లెనిన్ అంటాడు. అది అక్షరాలా నిజం.

  అమెరికా, నాటో సైనికుల మరణాలన్నీ ఐ.ఇ.డి ల వల్లనేనని తెలిస్తే అమెరికా భయం ఎందుకో అర్ధం అవుతుంది. ‘నేను భయపడుతున్నాను’ అని చెప్పుకోవడం ద్వారా అమెరికాకి వచ్చే లాభం ఉండదు, పరువు పోవడం తప్ప. దాని గూఢచార డ్రోన్ విమానాన్ని ఇరాన్ కూల్చితేనే ‘అబ్బే ఇరాన్ కూల్చలేదు. దానంతటదే కూలింది’ అని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నించింది. దానంతటదే కూలితే డ్రోన్ విమానం అంత పనికిమాలిందా అన్న అనుమానం వస్తుందన్న భయం మరొకవైపు పీడిస్తుంటే ఏదీ ఇదమిద్ధంగా చెప్పుకోలేక చచ్చింది. అటువంటిది ఐ.ఇ.డి కి భయపడుతున్నాని అంత తేలిగ్గా అది ఒప్పుకోదు. ఐ.ఇ.డి లను కనిపెట్టే సాధానాలు దానివద్ద లేవు. ఉన్నా ఎక్కడని వాటిని పెడతారు. అమెరికా దురాక్రమణకి వ్యతిరేకంగా తాలిబాన్ ఉపయోగిస్తున్న శక్తివంతమైన ఆయుధం మానవ బాంబు కాగా, దాని తర్వాత స్ధానం ఐ.ఇ.డిలదే.

 3. అమెరికా భయపడిందో లేదా భయపడలేదో కాస్సేపు పక్కన బెడదాం. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టాండిగ్ ఆర్మీని కలిగిన అమెరికన్ సైనిక బలగాల భీకర ఆయుధ శక్తితో కొట్లాడటానికి ప్రపంచ వ్యాప్తంగా గెరిల్లాలకు ఉన్న ఏకైక వనరు దేశీయ సాంకేతిక శక్తి మాత్రమే -ఇండీజినియస్ టెక్నాలజీ- దేశీయంగా మెరుగుపర్చిన ఈ చిన్న చిన్న ఆయుధాలే మొదటినుంచి దురాక్రమణ దారులపై తీవ్రంగా ప్రభావం చూపాయి. చూపుతున్నాయి కూడా.

  ప్రపంచ స్థాయిలో బలంగా ఉండే శక్తిని ఢీకొట్టడానికి చిన్న చిన్న దేశాలకు, జాతులకు, బలగాలకు అనివార్యమైన వనరు ఐ.ఎ.డీలే. దురాక్రమించిన సైన్యాన్ని దెబ్బతీయడానికి, మెరుపు దాడులు చేయడానికి ఈ స్థానిక టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకున్న దేశాలే అంతిమంగా దురాక్రమణను నిలువరించాయి.

  బలమైన శత్రువును హిట్ అండ్ రన్ పద్దతుల్లో మెరుపుదాడి చేసి తప్పుకోవాలంటే చిన్న స్థాయి బలగాలకు ఇంప్రూవైజ్డ్ డివైసెస్‌ని ఉపయోగించడం తప్పనిసరి. యుద్ధ క్రమం, యుద్ధ స్థాయే ఏ ఆయుధాలను ఎప్పుడు ఎందుకు వాడాలి అనే అంశాన్ని నిర్ణయిస్తుంది.

  వియత్నాం అడవుల్లో అమెరికా సైన్యం చావుదెబ్బ తిన్నది సోవియట్ రష్యా అందించిన ఆయుధాలతోనో, మరే బాహ్య సహాయం తోటో కాదు. ప్రచ్చన్నయుద్ద కాలంలో ఒక అగ్రరాజ్యపు అమేయ సైనిక శక్తిని వియత్నాం గెరిల్లాలు తిప్పికొట్టారంటే దేశీయ సాంకేతిక జ్ఞానాన్ని చరిత్రలో తిరుగులేని రీతిలో ఉపయోగించుకోవడమే కారణం. సోవియట్ రష్యా దురాక్రమణ సైన్యాలు 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్‌ని భల్లూకప్పట్టులో బిగించినప్పటికీ అంతిమంగా మట్టిగరిచాయంటే ఆప్ఘన్ గెరిల్లా బలగాలు వాడిన సాంప్రదాయిక ఆయుధ వనరులే కారణం.

  అమెరికా అందించిన విమాన విధ్వంసక స్ట్రింగర్ మిస్సైల్స్ రష్యా యుద్ధవిమానాలను, సైనిక హెలికాప్టర్లనూ కూల్చడంలో సాయపడవచ్చు కాని రష్యా దురాక్రమణ సైన్యాన్ని దేశ సరిహద్దుల దాకా తరిమింది ఆప్ఘన్ గెరిల్లాల సాంప్రదాయిక సాయుధ శక్తే తప్ప మరొకటి కాదు.

  ఈరోజు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా సైన్యం భయపడుతోంది అనేది నిజమే అయితే ఆప్ఘన్ గడ్డనుంచి ఎన్ని అమెరికన్ సైనిక కళేబరాలు స్వదేశానికి శవపేటికల్లో బయలుదేరతాయి అనే వాస్తవికతే ఆ భయానికి కారణం తప్ప మరేమీ కాదు. తన దురాక్రమణ సైన్యం దెబ్బ తినకుండా ఉంటే అమెరికా ఏ దేశంలోనూ భయానికి గురికాదు కదా.. వేలమందిని, లక్షల మందిని చంపుతూనే ఉంటుంది.

  ప్రపంచాన్నే భస్మీపటలం చేయగల అణుబాంబులను కుప్పేసుకుని కూర్చున్నప్పటికీ, తన శత్రువు నాటు ఆయుధాలతో కలిగించే పెద్ద నష్టానికి తట్టుకోలేకపోవడం అనే వాస్తవికతే అమెరికా కలవరానికి కారణం. ప్రపంచంలో ఏ దురాక్రమణ సైన్యానికయినా సమానంగా వర్తించే సూత్తం ఇది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s