2012 లో కుదేలు కానున్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ


వచ్చే సంవత్సరం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర స్ధాయిలో కుచించుకుపోతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చాలా తక్కువగా ఉంటుందని ఈ బ్యాంకు గతంలోనే జోస్యం చెప్పింది. గతంలో అంచనా వేసినట్లుగా వృద్ధి చెందడానికి బదులు బ్రిటన్ ఎకానమీ కుచించుకుపోతుందని బ్యాంకు ఇప్పుడు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఎకానమీ 0.6 శాతం వృద్ధి చెందుతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ అంచనా వేసింది. దానికి బదులు 1.3 శాతం మేరకు కుచించుకుపోతుందని (లేదా -1.3 శాతం వృద్ధి చెందుతుందని) బ్యాంకు తన అంచనాను తగ్గించుకుంది.

పదిహేడు సభ్య దేశాలు కలిగిన యురో జోన్ ఆర్ధిక వ్యవస్ధ అంతకంటే ఘోరంగా 1.5 శాతం కుచించుకుంటుందని బ్యాంకు ఆర్ధికవేత్తలు తెలిపారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ మాంద్యం (రిసెషన్) ఎదుర్కొంటుందన్న సూచనలకు రోజు రోజుకీ బలం చేకూరుతోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో వృద్ధి ఏ కోశానా కనిపించకపోవడం, ఉద్యోగాల పరిస్ధితిలో మెరుగుదల లేకపోవడం, యూరప్ దేశాలు గత శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ ఆ ఒప్పందం మార్కెట్లను శాంతపరిచే పరిస్ధితి కనపడకపోవడంతో మాంద్యం అంచనాలు బలం పుంచుకుంటున్నాయి.

వచ్చే సంవత్సరం ప్రపంచంలోని ప్రతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధా నెమ్మదిస్తుందని ఒ.ఇ.సి.డి (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) సంస్ధ అంచనా వేస్తున్నట్లుగా బిబిసి తెలిపింది. బ్రిటన్, యూరోజోన్ దేశాల దీర్ఘకాలిక ఆర్ధిక వృద్ధి సగటు కంటే కిందికి ఆ దేశాల ఆర్ధిక వృద్ధి పడిపోతుందని ఒ.ఇ.సి.డి అంచనా వేస్తున్నది. బ్రిటన్ ప్రభుత్వ సంస్ధ ‘ఆఫీస్ ఫర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ’ మాత్రం వచ్చే సంవత్సరం బ్రిటన్ ఎకానమీ 0.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. బ్రిటన్ ట్రెజరీ విభాగం నవంబరు లో జరిపిన ఆర్ధిక అంచనాల సర్వేలో 2012 లో ఆర్ధిక వృద్ధి -0.4 శాతం నుండి 2.3 శాతం మధ్యలో ఉంటుందని తేలిందని బిబిసి తెలిపింది. ఇంత రేంజ్ లో వేసే అంచనాను వెయ్యకపోయినా అడిగేవారెవరో తెలియదు! ఈ రేంజ్ అంచనా, బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చితిని పరోక్షంగా తెలుపుతున్నది.

యూరో జోన్ లో సంక్షోభం తీవ్రం అవుతుండడం వలన బ్రిటన్ ఆర్ధిక వృద్ది అంచనా సవరించుకోక తప్పలేదని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు నిపుణులు చెబుతున్నారు. వారి ఉద్దేశ్యంలో వచ్చే సంవత్సరం యూరోపియన్ ఆర్ధిక వ్యవస్ధ కి మూడు షాక్ లు తగలనున్నాయి. అవి:

  1. విశ్వాస సంక్షోభం: ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసం కొరవడి వినియోగదారులు తక్కువ ఖర్చు పెడతారు. వ్యాపారస్ధులు కూడా తక్కువ పెట్టుబడులు పెడతారు.
  2. క్రెడిట్ లభ్యత తగ్గుదల: బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సుముఖంగా ఉండవు. వాటికి కూడా క్రెడిట్ లభ్యం కాకపోవడమే దానికి కారణం.
  3. బడ్జెట్ ఖర్చుల కోత: ప్రభుత్వాలు బడ్జెట్ లను కత్తిరించుకుంటాయి. రుణ సంక్షోభం విధిస్తున్న షరతుల దృష్ట్యా బడ్జెట్ కోతలు తీవ్రం కానున్నాయి. దానితో ఆర్ధిక వ్యవస్ధలో చురుకుదనం తగ్గుతుంది.

ఈ మూడు షాక్ ల వలన యూరో జోన్ తో పాటు బ్రిటన్ లో కూడా మాంధ్య సంభవించనుందని బ్యాంకు నిపుణులు తెలిపారు.

ఇదిలా ఉండగా ఆసియా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ అది ప్రమాదకర స్ధాయిలో లేకపోవచ్చని కూడా స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేస్తోంది. యూరోపియన్ ఆర్ధిక వ్యవస్ధ కుచించుకుపోయినప్పటికీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మొత్తంగా 2.2 శాతం వృద్ధి చెందుతుందని బ్యాంకు తెలిపింది. దానికి కారణం ఆసియాయేనని ఆ బ్యాంకు అంచనా వేస్తున్నట్లుగా తెలిపింది. 2011 లో ఆసియా 7.3 శాతం వృద్ధి చెంతుందనీ 2012లో అది 6.5 శాతం వృద్ధి చెందుతుందనీ బ్యాంకు తెలిపింది. ఆసియా వృద్ధి తగ్గినప్పట్తికీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ రికవరీకి అది సరిపోతుందని తెలిపింది. “తూర్పున రికవరీ సాధించగా దానిని పశ్చిమ ప్రాంతం అనుభవిస్తుంది” అని బ్యాంకు తెలిపింది.

వచ్చే సంవత్సరం ఆర్ధిక వ్యవస్ధ కుచించుకుపోయినప్పటికీ ఆ తర్వాత వృద్ధి చెందుతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు భావిస్తోంది. ఈ నేపధ్యంలో 2012 లో భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ గమనం ఆందోళనకరంగానే ఉంటుందని భావించవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s