పాకిస్ధాన్ హెచ్చరికతో అక్కడ ఉన్న వైమానిక స్ధావరాన్ని అమెరికా బలగాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కొద్ది రోజుల తర్వాత పాక్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందని భావించినవారి ఊహలు, ఊహలుగానే మిగిలాయి. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి పాకిస్ధాన్ సైన్యం, పౌర ప్రభుత్వం ఔదలదాల్చాయి. ఆదివారం షంషి వైమానిక స్ధావరాన్ని పాకిస్ధానీ ఆర్మీ అమెరికా బలగాలనుండి స్వాధీనం చేసుకుంది.
ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో రెండు చెక్ పోస్టుల వద్ద ఉన్న పాక్ సైనికులను ఇరవై నాలుగు మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు కాల్చి చంపిన తర్వాత తన వైమానిక స్ధావరాన్ని ఖాళీ చేయాలని పాకిస్ధాన్ అమెరికాను హెచ్చరించింది. దానితో పాటు పాక్ భూభాగం ద్వారా ఆఫ్ఘన్ లోని అమెరికా, నాటో బలగాలకు రవాణా అయ్యే ఆయుధ, ఆహార, ఇంధన సరఫరాలను కూడా పాక్ నిలిపివేసింది. సరఫరాలపై పాక్ నిషేధం మరికొన్ని వారాలపాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.
పాక్ విధించిన గడువులోపే అమెరికా బలగాలు షంషి స్ధావరం నుండి వెళ్ళిపోయాయని పాక్ సైన్యం తెలిపింది. ఆఫ్-పాక్ సరిహద్దులో గల తాలిబాన్, ఆల్ ఖైదా స్ధావరాలపై దాడులు చేస్తున్నామన్న పేరుతో అక్కడి జనావాసాలపైన అమెరికా బలగాలు మానవరహిత డ్రోన్ విమానాలతో దాడులు జరిపి అనేకమంది ప్రజల మృతికి కారకులయ్యారు. ఆ డ్రోన్ విమానాలను షంషి వైమానిక స్ధావరంనుండే అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఎ ప్రయోగించి పర్యవేక్షించేది. ఈ డ్రోన్ దాడులలో కొన్ని వేలమంది పౌరులు మరణించినప్పటికీ అంతర్జాతీయ సమాజానికి కనపడదు. సిరియాలో జరగని హత్యలకు మాత్రం పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ సిరియా పై ఆంక్షలు విధించి తద్వారా సిరియా ప్రజలనే ఇబ్బందులకు గురిచేయడానికి మాత్రం అంతర్జాతీయ సమాజం ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది.
బలూచిస్ధాన్ రాష్ట్రంలో ఉన్న షంషీ నుండి చివరి అమెరికా విమానం సైనికులతోనూ, పరికరాలతోనూ విడిచి పోయినట్లుగా పాక్ సైన్యం తెలిపింది. “షంషీ వైమానిక స్ధావరంపై నియంత్రణ పాకిస్ధాన్ ఆర్మీ చేతికి వచ్చింది” అని ‘ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్’ తెలిపింది. గడువులోపే అమెరికా సైన్యం ఖాళీ చేసిందని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ విలేఖరులకు తెలిపాడు. షంషి స్ధావరంలో 70 మందికి పైగా సి.ఐ.ఎ సిబ్బంది ఉండి డ్రోన్ లను నడిపేవారని తెలుస్తోంది.
అమెరికా బలగాలు ఖాళీ చేయడంతో షంషి వైమానిక స్ధావరం వద్ద గల అమెరికా జెండాను కిందికి దించి పాకిస్ధాన్ జెండాను ఎగురవేశారు. అమెరికా జెండాను అవనతం చేయడం వరకే కాకుండా పాకిస్ధాన్ లో అమెరికా ప్రభావాన్ని శూన్యపరిచేవరకూ పాక్ ప్రజలు తమ అమెరికా వ్యతిరేక పోరాటాన్ని తీవ్రం చేయవలసి ఉంది.