12 వ సంవత్సరంలోకి ప్రవేశించిన “ఇరోం షర్మిలా” నిరాహార దీక్ష


Irom Sharmila

-రచన: డేవిడ్

ఉక్కు సంకల్పం ఆమె. మొక్కవోని మనో నిబ్బరం ఆమె. అత్మరవం నుంచి జనించిన ఆగ్రహం ఆమె. తల్లడిల్లుతున్న యుద్ధభుమిలో తపోదీక్ష చేస్తున్న శాంతికపోతం ఆమె. తుపాకి గొట్టాల విచ్చలవిడీ తనాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక గొంతు. నిరంకుశ చట్టాన్ని నిరసించిన నిప్పు కణిక. జాతికోసం జంగ్ చేస్తున్న జ్వలిత. అన్యాయంపై తిరగబడ్డ అగ్గిబరాట. శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న సాహస వనిత. పుష్కర కాలంగా అన్నపానియాలు ముట్టని అసలు సిసలు సత్యాగ్రహి. కన్నీళ్ళను, కష్టాలను కలబోసిన నెత్తుటి గేయం ఆమె దీక్ష. మరుభుమిగా మారిన మాతృ భుమి గాయాలను మాంపేందుకు తనుఫు, మనసును ఏకం చేసి సందించిన దీక్ష పేరు ఇరోం చాను షర్మిలా.

నవంబర్ 2, 2000 సంవత్సరం మణిపాల్ లోయలోని మలోం బస్టాండ్ లో అస్సాం రైఫిల్స్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. పదిమంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మలోం నరమేధం, సాయిధ దళాల పద ఘటనలో దశాబ్దాలుగా నలిగిపోతున్న మణిపూర్ లో ఒక విషాద ఘట్టం. సాయుధ దళాల కౄరత్వం అందరిని కలచివేసింది. ఇరోం షర్మిలా స్థానిక పత్రికలో జర్నలిస్టు. కవయిత్రీ కూడా. కనికరం లేని సాయుధ బలగాల తీరుతో కలతచెందిన షర్మిలా కఠిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఆమరణ దీక్షకు దిగింది. యమపాశంగా మారిన ‘సాయుధ భద్రత దళాల ప్రత్యేక అధికారల చట్టం’ రద్దు చేసేదాకా దీక్ష సాగిస్తానని శపధం చేసింది. తన చావుతోనైనా తన జాతికి పట్టిన పీడనను వొదిలించాలని పట్టుదలతో దీక్ష చేపట్టింది.

దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు షర్మిలాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఎంత బలవంతం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో నాసోగ్యాస్ట్రిక్ ఇన్ ట్యుబ్యెషన్ పద్దతిలో ముక్కుద్వారా ద్రవ పదార్థాలను పంపించడం మొదలు పెట్టారు. షర్మిలా బెయిల్ తీసుకోవడాంకి నిరాకరించింది. ఆత్మహత్య నేరం కింద విధించిన జైలు శిక్ష సంవత్సరం మాత్రమే. కాని ఏడాది కాగానే జైలు నుంచి విడుదల చెయడం మళ్ళీ అరెస్టు చేయడం. 12 ఏండ్లుగా మణిపూర్ పోలిసులు అదే పని చేస్తున్నారు.

ఇప్పటికే 500 సార్లు కోర్టు, జైలు, హాస్పిటల్ వార్డుకు తిరిగింది. 12 ఏండ్లుగా షర్మిలా నోటిద్వారా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ముక్కుద్వారా పైపుతో ప్లూయిడ్ ఎక్కించడం నిజంగా ఒక హింస. షర్మిలా శరీరం రోజురోజుకు కృశించిపోతోంది. అవయవాలు మెల్లగా దెబ్బతింటున్నాయి. 38 ఏళ్ళ షర్మిలా బరువు ఇప్పుడు 37 కిలోలు. 2006లో విడుదలైనప్పుడు షర్మిలా ఢిల్లీ లోని రాజ్ ఘాట్ చేరుకోని మహాత్ముడికి మొరపెట్టుకుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష సాగించింది. కేంద్రం వెంటనే అరెస్టు చేసి ఆసుపత్రిలో నిర్భంధించింది. తరువాత ఇంఫాల్ కు తరలించింది.

సంచలన వార్తల గుంపులో కొట్టుకుపోతున్న జాతీయ మీడియాకు షర్మిలా దీక్ష వార్త కాదు. అసలే గుర్తింపుకు నోచుకోని ఈశాన్య రాష్ట్రాలు. పైగా కనీస కవరేజ్ ఇవ్వని మీడియా. సంవత్సరాలు గడుస్తున్నా కదలిక లేని తోలు మందం ప్రభుత్వం. శారీరక బలహీనత, మానసిక సంఘర్షణ చుట్టూ తుపాకులు. ఐతే హాస్పిటల్ లేదంటే జైలు. కత్తుల వంతెనమీద పయనం. అటు కానరానీ పరిష్కారం. ఐతేనేం ఆమె మానసిక దృడత్వం ముందు ఏ అవాంతరాలు నిలువలేదు. ఆమె సంకల్ప బలం ముందు నిరాశ, నిశ్పృహలు వెలవలేదు. నిబద్ధత, నిజాయితి, తన జాతి జనుల పట్ల ప్రేమ, అమానవీయ చట్టాలను ఆంతం చేయాలన్న కర్తవ్యం అమెను ముందుకు నడిపించాయి.

మొన్న నవంబర్ 4వ తారీకుతో ఆమె దీక్ష 12 వ ఏడాదిలో ప్రవేశించింది. పుష్కర కాలంగా అదే సహసం అదే సహనం. ఈ 12 ఏండ్లలో పుస్తకాలు, కవితలే ఆమె నేస్తాలు. ఈ ప్రస్ధానంలో షర్మిలా లవ్ స్టోరీ మరొక ఆసక్తికరమైన కోణం. షర్మిలా దీక్ష కాలంలోనే ప్రేమలో పడింది. అతని పేరు డెస్మాండో కొటినో. బ్రిటన్ లో పుట్టిన భారతీయుడు . మానవ హక్కుల కార్యకర్త. మరి పెండ్లెప్పుడు అని అడిగితే, సైనిక చట్టం రద్దై , శిక్ష ముగిశాక అని చెప్పేసింది.

ఆ వనిత సాహస దీక్షకు ఏన్నో అవార్డులు వచ్చాయి. ఏషియన్ హ్యూమన్ రైట్స్ ఫోక్ స్కూల్ మానవ హక్కుల పురస్కారం 2007లో లభించింది. కాని మన ప్రభుత్వం కనికరించలేదు. సెవెన్ సిస్టర్స్ లో ఒకరైన మణిపూర్ సిస్టర్ కన్నీళ్ళను తుడవడానికి చేయి రాలేదు. నామమాత్రంగా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అన్నా హాజారే దీక్ష, మీడియా హడావుడి, విమర్శలు, చర్చల నేపథ్యంలో ఎక్కడో మూలన పడిపొయిన షర్మీలాది ఇప్పటికి ఒక వార్తగా మెయిన్ స్ట్రీం మీడియాకు ఎక్కింది. దేశ వ్యాప్త చర్చకు నోచుకున్నది. షర్మిలా దీక్షా, లక్ష్యం పైనా ఫొకస్ పెరిగింది. ఇప్పుడు ప్రశ్న ఈ దీక్ష ఇంకెంత కాలం సాగుతుందన్నది కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇంకెన్నాళ్ళు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంటాయన్నదే ప్రశ్న.ఒక మహిళ గాంధీ మార్గంలో సాగిస్తున్న సత్యాగ్రహం పాలకులను కదిలించ్లేకపోవడం మహా విషాదం. ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం.

షర్మిలా హిమాలయమంత ఎత్తున ఎదిగిన ఉద్యమ మూర్తి. అన్యాయాన్ని ఎదిరించి నిలుస్తున్న వాళ్ళకు కొండంత స్పూర్తి . ఆమె నుండి ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు ఏన్నో. నలుగురి కోసం బతకడం, నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద అదే అంతటా ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అంతటా ఆవిష్కరించిన షర్మిలాజికి రెండు చేతులెత్తి చేయాలి వందనం.

3 thoughts on “12 వ సంవత్సరంలోకి ప్రవేశించిన “ఇరోం షర్మిలా” నిరాహార దీక్ష

 1. మొన్ననే మరో సందర్భంలో గాంధీజీ తప్ప గాంధేయవాదాన్ని మరెవ్వరూ పాటించని దేశంలో అంటూ రాసినట్లు గుర్తు. ఈ ఒక్క సందర్బంలో దాన్ని ఉపసంహరించుకుంటున్నాను.
  “శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న సాహస వనిత..

  నిబద్ధత, నిజాయితి, తన జాతి జనుల పట్ల ప్రేమ, అమానవీయ చట్టాలను ఆంతం చేయాలన్న కర్తవ్యం…

  నలుగురి కోసం బతకడం, నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద అదే అంతటా ఆదర్శం.’

  ఇవన్నీ సాక్షర సత్యాలే. కాని సమకాలీన తరానికి ఎన్నటికీ అర్థం కాని ఆదర్శమేమో ఇది. తిరుగుబాట్లు… అవి సాయుధమైనా, నిరాయుధమైనా సరే…. దేశద్రోహపూరితమైనవిగా ఆరోపించబడుతున్న కాలమిది.
  ‘అత్మరవం నుంచి జనించిన ఆగ్రహం’ షర్మిలా.. నిరాహారదీక్ష పేరుతో ఒకరోజుకే నీరుగారిపోతున్న వారికి ఈ పన్నెండేళ్ళ నిరాహారి ఎలా అర్థమవుతుంది?
  గాంధీజీ ఈమెలో మాత్రమే బతికి ఉన్నారేమో..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s