గ్రీన్ టెక్న్లాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం?


పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాణిజ్యంలో అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన పర్యావరణ సాంకేతిక ఉత్పత్తులు అమెరికా కంపెనీల ఉత్పత్తులకు హానికరంగా పరిణమించాయని భావిస్తూ ‘అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్’ విచారణ చేయడానికి నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా చర్యలు వాణిజ్యంలో ‘రక్షణాత్మక విధానాలతో’ (ప్రొటెక్షనిజం) సమానమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇతర దేశాలనుండి వచ్చే దిగుమతులతో పోటీ పడలేక అటువంటి దిగుమతులపైన పెద్ద ఎత్తున దిగుమతి సంకాలు విధించడం ద్వారా దేశీయ కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్ పడిపోకుండా కాపాడుకునే విధానాలని ‘ట్రేడ్ ప్రొటెక్షనిజం’ విధానాలుగా పరిగణిస్తారు. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొటెక్షనిస్టు విధానాలు అనుసరించడం అక్రమంగా పరిగణించబడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొటెక్షనిష్టు విధానాలు అనుసరించడం స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక విధానాలను విరుద్ధం. స్వేచ్ఛా మార్కెట్ విధానాలను వల్లిస్తూనే అమెరికా, యూరప్ దేశాలు వాణిజ్యంలో పరోక్ష ప్రొటెక్షనిస్టు విధానాలను అనుసరిస్తుంటాయి. అటువంటి విధానాలు అనుసరిస్తున్నపుడు బాధిత దేశం ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

గతంలో ఇదేరకమైన ఆరోపణలు చేస్తూ చైనానుండి దిగుమతి అయ్యే టైర్లపైనా, ఇనప పైపుల పైనా పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను అమెరికా విధించింది. దిగుమతి సుంకాలు విధించడం ఒక పద్ధతి కాగా అమెరికా ఇంకా అనేక అక్రమ పద్ధతులతో దిగుమతులను అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం ఇండియానుండి టెక్స్ టైల్ దిగుమతులను అడ్డుకోవడానికి భారత దేశం నుండి దిగుమతి అయ్యే వస్త్రాలకు తేలికగా మంటలు అంటుకుంటున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. దానితో ఇండియా వస్త్ర ఉత్పత్తుల అమ్మకాలు అమెరికాలో పడిపోయాయి. నిజానికి ఏ వస్త్రాలకైనా నిప్పు అంటుకుంటుందన్న విషయం అమెరికా వార్తా సంస్ధల ప్రచారంలో పడి అమెరికన్లు పూర్తిగా విస్మరించారు. ఇటువంటి అక్రమ పద్ధతులను అనుసరించడం అమెరికా, యూరప్ దేశాలకు వెన్నతో పెట్టిన విద్య.

ఓవైపు మూడో ప్రపంచ దేశాలు తమ మార్కెట్లను బార్లా తెరవాలని డిమాండ్ చేస్తూ మరోపక్క తమ సొంత మార్కెట్లను సంరక్షించుకునే విధానాలను పశ్చిమ దేశాలు అనుసరిస్తాయి. కర్బనవాయువుల వలన భూమి వేడెక్కి పర్యావరణం దెబ్బతింటున్నదని శాస్తవేత్తలు కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తుండంతో గ్రీన్ టెక్నాలజీకి మార్కెట్ పెరిగిపోయింది. ఈ రంగంలో చైనా ఇప్పటికే పురోగతి సాధించడంతో చైనా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ ను ముంచివేస్తున్నాయి. చౌక శ్రమ శక్తితో తయారవడం వలన సౌరశక్తి తో నడిచే యంత్రాలను చైనా తక్కువ ధరలకే అందించగలుగుతోంది. వీటితో అమెరికా కంపెనీలు పోటీపడలేక చైనా దిగుమతులవలన తమ ఉత్పత్తులకు హాని జరుగుతోందని అమెరికాకి చెందిన ట్రేడ్ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. చైనా అక్రమ వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నదంటూ అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. సోలార్ ఎనర్జీ రంగంలో చైనా తయారు చేస్తున్న ఉత్పత్తులపైన ఈ దర్యాప్తు చేయడానికి ఐటిసి ఏకగ్రీవంగా నిర్ణయించింది. దర్యాప్తు లో చైనా అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నదని నిర్దారిస్తే చైనా సోలార్ ఉత్పత్తులపైన భారీగా దిగుమతి సుంకాలను అమెరికా విధించడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే అటువంటి పరిస్ధితి అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి దారితీస్తుంది.

చైనా కంపెనీల వాదనలను పట్టించుకోకుండా అమెరికా ట్రేడ్ కమిషన్ ఏక పక్షంగా దర్యాప్తుకు ఆదేశించిందని చైనా ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా దేశీయ పరిశ్రమల నుండి వస్తున్న వ్యతిరేకత ను కూడా అమెరికా పట్టించుకోలేదని చైనా ఆరోపిస్తోంది. “చైనా ఈ నిర్ణయం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. నిజాలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వాణిజ్య రక్షణాత్మక విధానాలవైపుకి మొగ్గు చూపడాన్ని ఇది సూచిస్తున్నది” అని చైనా వాణిజ్యమంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. “అమెరికాకి చెందిన కొన్ని సోలార్ పానెల్ కంపెనీలు ఎందుకు పోటీపడలేకపోతున్నాయో విశ్లేషించుకోవలసి ఉన్నది. దాని బదులు రక్షణాత్మక విధానాలకు పాల్పడడం తగదు” అని చైనా దెప్పి పొడిచింది.

అమెరికా వాణిజ్య శాఖ దర్యాప్తు జరిపి చైనా కంపెనీలు అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నదీ లేనిదీ నిర్ణయించవలసి ఉంది. సాధారణంగా నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ దేశీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడడానికే ఇటువంటి సమయాలలో అమెరికా ప్రాధాన్యత ఇస్తుంది. చైనా ఉత్పత్తులపైన యాంటీ డంపింగ్ సుంకాలు తదితర సుంకాలను విధించడానికే సాధారణంగా దర్యాప్తు మొగ్గు చూపుతుంది. అదే జరిగితే అమెరికా, చైనాల మధ్య మరోసారి వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తడం ఖాయం. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యం ఎదుర్కోనున్నదన్న భయాలు వ్యాపిస్తున్న నేపధ్యంలో అటువంటి ఉద్రిక్తతలు ఇరు దేశాలకూ నష్టకరంగానే పరిణమిస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s