కుల దురాచారంపై ఫిర్యాదు చేసిన బి.సి నాయకుడ్ని చితకబాదిన అగ్ర కులస్ధులు


కర్ణాటకలో కుక్కె సుబ్రమణ్య దేవాలయంలో ఇప్పటికీ అమలులో ఉన్న కుల దురాచారానికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బి.సిల నాయకుడిని చావబాదిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ ఆయనకు చావు దెబ్బలు తప్పలేదు. ఆయన చేసిన పాపమల్లా ‘మాదె స్నాన’ అన్న పేరుతో సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న దురాచారాన్ని ఆపాలని కోరడమే.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుబ్రమణ్య గుడి మంగుళూరు దగ్గరలో ఉన్న సుల్యా తాలూకాలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఒక దురాచారం జరుగుతుంది. బ్రాహ్మణులు తిని వదిలేసిన ఆహార పదార్ధాలు కలిగి ఉన్న అరటి ఆకులపైన దొర్లితే చర్మ వ్యాధులు తగ్గిపోతాయన్నది అక్కడ నమ్మకం. ప్రతి సంవత్సరం చంపా షష్టి పండుగ నాడు మూడు రోజుల పాటు దీనిని ఆచరిస్తారు. నమ్మకం, సాంప్రదాయం లాంటి పేర్లతో జరుగుతున్న ఈ దురాచారం కులాధిపత్య భావనతో కూడి ఉండడంతో, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్న గుడి కనుక ఆచారాన్ని రద్దు చేయాలని ‘కర్ణాటక రాజ్య హిందూలిద వర్గగల జాగృత వేదికె’  రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.శివరాము కోరాడు. పుత్తూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ సుందర్ భట్ కు ఆయన ఆ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించి బైటికి వచ్చాక ఈ సంఘటన జరిగింది.

మెమొరాండం సమర్పించాక దాని గురించి శివరాము విలేఖరులకు వివరించాడు. విలేఖరులతో మాట్లాడుతుండగానే కొంతమంది ఆయనను చుట్టుముట్టారు. మాట్లాడడం పూర్తయ్యాక శివరాముతో వాళ్ళు వాదనకు దిగారు. అంతలోనే శివరాముని వాళ్ళు పిడిగుద్దులు కురిపించడం ప్రారంభించారు. టి.వి ఛానెళ్ల సాక్షిగానే ఈ దురంతం చోటు చేసుకుంది. చుట్టుముట్టి కొడుతుండడంతో శివరాము పరిగెత్తడం ప్రారంభించారు. అయినప్పటికీ శివరాము వెంటబడిన మూక కొద్ది దూరంలో పట్టుకుని మళ్ళీ చావబాదారు. ఇదంతా శివరాముకి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ జరగడం విశేషం. కొట్టడం పూర్తయ్యాక మాత్రమే పోలీసులు వచ్చి శివరాముని ఆస్పత్రిలో చేర్పించారు.

దాడి జరగడానికి ముందు శివరాము విలేఖరులతో మాట్లాడుతూ “మాదే స్నాన ఆచారం పూర్తిగా అశాస్త్రీయం. మానవతకు మచ్చ లాంటిది. ఈ ఆచారాన్ని రద్దు చేయాలి” అని కోరాడు. “కాని దాని కంటె ముందు దేవాలయంలోపల కేవలం ఒక్క కులానికి చెందిన వారికి మాత్రమే భోజనాలు పెట్టడాన్ని ఆపాలి. మూఢ నమ్మకాలను కొనసాగించడానికే మతం పేర, ఆచారం పేర ఈ దురాచారాన్ని కొనసాగిస్తున్నారు” అని శివరాము పేర్కొన్నాడు. దురాచారం పైన తాను నిజ నిర్ధారన నివేదికను తయారు చేసి రాష్ట్రపతికి పంపుతాననీ, అనంతరం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాననీ ఆయన పేర్కొన్నాడు.

పత్రికా విలేఖరులు అనంతరం సుబ్రమణ్య పోలీసు స్టేషన్ కు వెళ్ళి డి.ఎస్.పి ఎమ్.బి.నాగరాజు ను వివరణ కోరగా ఏం జరిగిందీ తనకు తెలియదనీ తన జూనియర్లను అడిగి తెలుసుకోవలసి ఉందనీ చెప్పాడు. ఇంతలోనే బి.సి సంఘంకి చెందిన మరొక నాయకుడు విజయ కుమార్ అక్కడికి చేరుకోవడంతో “ఎందుకు అతను సమస్యలు సృష్టించడం మొదలు పెట్టాడు?” అని తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు. డి.ఎస్.పికి ముందే తెలిసినప్పటికీ తనకు తెలియనట్లు చెబుతున్నట్లు దాన్ని బట్టి అర్ధమవుతోంది. పైగా దెబ్బలు తిన్న వ్యక్తే సమస్యలు సృష్టిస్తున్నట్లుగా కేకలు వేయడం బట్టి పోలీసులు ఎవరి పక్షాన ఉన్నదీ స్పష్టం అవుతోంది.

తనను కొట్టినందుకు శివారాము పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, కొట్టినవారు సైతం శివరాము తమను కొట్టాడని ఫిర్యాదు చేయడం దానిని పోలీసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది.

14 thoughts on “కుల దురాచారంపై ఫిర్యాదు చేసిన బి.సి నాయకుడ్ని చితకబాదిన అగ్ర కులస్ధులు

 1. ఇది ఎప్పుడు జరిగింది? కొట్టినవారు అగ్రకులస్థులే అని ఎలా నిరూపణ అయింది? బ్రాహ్మణులు – అంటే ఏ బ్రాహ్మణుడైనానా లేక ఎవరన్నా specific గా తినిన విస్తళ్ళా? దొర్లేవారు వారంతటవారే దొర్లుతుంటారా లేక బలవంతంగా దొర్లింపబడతారా? అగ్రకులస్తులు కూడా దొర్లుతారా లేక అగ్రకులస్తులుకానివారేనా? అసలు ఆ దొర్లడం వెల్నుకనున్న కారణాలు ఏమిటి? విషయాన్ని పూర్తిగా చెబితే బాగుంటుంది.

 2. కొట్టినవారు అగ్ర కులస్ధులేనని నిరూపణ అయిందో లేదో తెలియదు కాని వారేనని అక్కడి విలేఖరుల అభిప్రాయం. టెక్నికల్ గా చూస్తే కొట్టినవారిలో బ్రాహ్మణేతర అగ్రకులస్ధులు కూడా ఉండవచ్చు. బి.సి నాయకుడు కనుక బి.సి లు కొట్టే అవకాశాలు లేవు. ‘ఏ బ్రాహ్మణుడైనా’ అనే శివరాము వివరణ లో తెలుస్తున్నది. ముందు ఆ గుడిలో బ్రాహ్మణులకే భోజనాలు పెట్టే దుస్సంప్రదాయం ఆపాలని ఆ తర్వాత ఎంగిలి ఆకులపై దొర్లే సాంప్రదాయం ఆగిపోతుందని శివరాము విలేఖరులకు చెప్పిన వివరణలో పేర్కొన్నాడు. బలవంతం ఏమీ లేదనుకుంటా. ఎందుకంటే చర్మ వ్యాదులు తగ్గుతాయన్న నమ్మకంతో దొర్లుతారని శివరాము చెప్పాడని ‘ది హిందూ’ రాసింది. దాన్ని బట్టి ఆ నమ్మకం ఉన్నవారే దొర్లుతుండవచ్చు. ఆ నమ్మే వారిలో బ్రాహ్మణులు సైతం ఉండవచ్చు కూడా. చర్మవ్యాధులు తగ్గుతాయని నమ్మడం వల్లనే దొర్లుతున్నారని పోస్టులో రాశాను.

  రోగాలు తగ్గుతాయన్న నమ్మకంతో ‘తొక్కుడు బాబా’ తో తెలంగాణలో తొక్కించుకుంటున్నారు (ఏ జిల్లా అన్నది గుర్తు లేదు). యి.పిలో ఒక ఫేమస్ ‘తన్నుడు బాబా’ ఉన్నాడు. ఆయన చేత కాంగ్రెస్, బి.జె.పి ల నాయకులు కూడా నెత్తిపైన తన్నించుకున్న ఫొటొలు పత్రికల్లో వచ్చాయి. ఇటువంటి నమ్మకాలకు ‘మాదే స్నాన’ లో కులం కూడా జతకలిసింది.

 3. కొట్టినవాళ్ళలో ఒకడు తప్ప మిగితావాళ్ళు అగ్ర కులస్తులే. అది అగ్రకులస్తుల పని కాదు అని చెప్పుకోవడానికి ఒక గిరిజనుడితో కలిసి కొట్టారు. గూగుల్ సెర్చ్‌లో మాదె స్నాన అని వెతికినప్పుడు తెలిసింది.

 4. వివరణకు ధన్యవాదాలు. మూఢ నమ్మకం అంటే సమంజసంగా ఉండేదేమో? కానీ మీరు పెట్టిన title అదేదో కులాల మధ్య గొడవలు జరిగినట్టు లేదా? పైపెచ్చు, బలవంతంగా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగ గర్హనీయం. కానీ ఎవరికి వారే తమంతట తామే స్వచ్ఛందంగా పాల్గొంటున్నప్పుడు, దానికి కులాల రంగు పూయడం సబబుకాదేమోనని నా అభిప్రాయం. పైగా, మీరు నమ్మే B.B.C. వారే ఈ విషయంలో వ్రాసినది చదివే ఉంటారు. The local Malekudiya tribe believes that it will cure skin diseases. అలాంటప్పుడు కొట్టింది అగ్రవర్ణాలే అని ఎలా నిర్ణయానికి రావచ్చు?

  @Praveen Sarma: “అది అగ్రకులస్తుల పని కాదు అని చెప్పుకోవడానికి ఒక గిరిజనుడితో కలిసి కొట్టారు.” — ఇది అనుమానమా లేక ఋజువులున్న సాక్ష్యమా? B.B.C. వారు చెప్పినదానిబట్టి ఈ విశ్వాసంపై అక్కడి మలేకుదియా తెగవారికి నమ్మకమని చెప్పారు. అలాంటప్పుడు మీరు తెలిపిన అనుమానం తప్పని తేటతెల్లమవుతోందని బా అభిప్రాయం.

 5. సత్యాన్వేషి గారూ, భారత దేశంలో కులపరమైన అణచివేత ఉందని అంగీకరిస్తే, అది ఈనాటికీ కొనసాగుతున్నదని అంగీకరిస్తే మీకిన్ని అనుమానాలు రావలసిన అవసరం లేదేమో కదా!

  కులాధిక్యతతో కూడిన మూఢనమ్మకం అని మీకు అనిపించడం లేదా? భ్రాహ్మణులు తినగా మిగిలిన ఆకులపైనే దొర్లుతున్నారు తప్ప మరో కులంవారు తిన్నవి కాదు. అటువంటి ఆచారం ఎలా వస్తుంది? బ్రాహ్మణులు అగ్రకులం వారు కనుక, సంఘంలో గురువులుగా, శ్రేష్టులుగా వారే ఉన్నారు గనక వారి సామాజిక హోదానుండే ఈ ఆచారం పుట్టిందని మీకు అనిపించడం లేదా? ఫలానా తెగవారికి ఆచారం ఉందని బిబిసి చెబుతోంది. ఒక తెగవారికే పరిమితం కనుక అది కుల దురాచారం కాదని మీరు చెప్పదలుచుకున్నారా?

  కొట్టే అవసరం ఎవరికి ఉంటుంది? బి.సి ల నాయకుడిని బి.సిలు, దళితులు కొడతారని మీరు భావిస్తున్నారా? చర్మ వ్యాధులు తగ్గుతాయన్న నమ్మకం కుల దురాచారాన్ని ఆటంకం లేకుండా కొనసాగడానికి ఏర్పాటు చేసిన నమ్మకం గా మీకు కనిపించడం లేదా? కులాచారాలు, దురాచారాలు ఎలా పుట్టి పరిమాణం చెంది స్ధిరపడిందీ మననం చేసుకుంటే ఈ అంశాన్ని కేవలం మూఢనమ్మకంగా కొట్టి పారేయడం అసంభవం.

  ఇందులో అగ్రకులస్ధుల తప్పు లేదనీ, బి.సి ల నాయకుడిని బి.సిలూ, దళితులూ, గిరిజనులే కొట్టుకున్నారనీ చెప్పడానికి మీరు పడుతున్న శ్రమ కనిపిస్తోంది. కాని భారత దేశంలో కుల దురాచారాలు ఉన్నాయని నిరూపించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. లేవని చెప్పడానికే కష్టపడాలి.

  “Caste discrimination is illegal in India but bias remains in many areas.” ఇది కూడా బిబిసి రాసిందే. ఈ వార్తలో ఈ వాక్యం అవసరం ఎందుకు వచ్చిందో మీరు బిబిసి ని కూడా రుజువులు అడుగుతారా?

 6. అన్యథా భావించవద్దు. కానీ మీ వ్యాఖ్య విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నది. నా ప్రశ్నలకు సమాధానం తెలియజేయగలరని ఆసిస్తున్నాను.

 7. లేదు, శుభ్రంగా రహదారిలోనే వస్తున్నాను. ‘మాదే స్నాన’ ఆచారం కులాధిక్యత లో భాగంగానే జరుగుతోంది. ఆ విషయాన్ని ఈ వార్త రాసిన ప్రతి వార్తా సంస్ధ కూడా రాసింది. గమనించండి. భారత దేశంలో కులం అనేక రూపాల్లో కనిపిస్తుంది. అందులో మాదే స్నాన ఒకటి. అదే నేను చెబుతున్నాను. భారత దేశంలో కులాచారానికి ప్రత్యేకంగా సాక్ష్యాలు, రుజువులు అవసరం లేదనే నేను చెప్పదలిచాను.

 8. కుల వివక్షతకు వ్యతిరేకినంటూనే మీరు తేలని విషయాలను పట్టుకొచ్చి కులాల రంగు పూయడం సబబేనా? ఎక్కడా కొట్టినవారు అగ్రవర్ణాల వారు అని చెప్పే సాక్ష్యంలేదు. నమ్మకమేమో అక్కడి గిరిజనులది. దానికి వ్యతిరేకంగా మాట్లాడిన అతడిని చితకబాదితే, ఇది తప్పకుండా అగ్ర వర్ణాల పనే అని తీర్పివ్వడం వల్ల so called కులాల మధ్య మీ టపా దూరాన్ని పెంచుతుందా లేక తగ్గిస్తుందా?

  నా ప్రశ్నలన్నింటికీ మీరు ఇంకా సమాధానం తెలుపనే లేదు. “సమాధానాలివ్వను” అని మీరు నిర్త్ణయించుకుంటే ఇక మిమ్మల్ని వేధించను.

 9. బ్రాహ్మణులు భోజనం చేసిన ఎంగిలాకులపైన దళితులు దొర్లే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ పాటిస్తున్నది దళితులే కాదు, బ్రాహ్మణులు కూడా. ఇక్కడ కులం కనపడలేదంటారేంటండీ?

 10. బ్రాహ్మణ విధానానికి బానిసలైన దళితులయినా వారు దళిత వ్యతిరేకులేఅవుతారు. పాలేరు వ్వస్థలో పాలేర్లు వారి సొదర గణాన్నే బలిచేయాలి. బానిస విద్యకు బలిచేయబడిన దళిత వర్గాలలో వివేచన బానిస సంస్కృతికి చెందినదే గాని స్వీయ సంస్కృతి అలవడదు. అదే కారణంగా IAS లేక IPS సాధించిన దళితులుకూడ బ్రాహ్మణీయ తత్వ బానిసలే భారత స్వతంత్రాన్నిమనువాదులకు తాకట్టు పెట్టారు. మరో విషయం. ఈనాడు బ్రాహ్మణీయ విదానాన్ని అమలు చేయటానికి బ్రాహ్ఙణుడవసరంలేదు. ఆ నాగరికత తన స్వప్రయోజనానికి వాడుకొన తెలిసిన యేకులస్తుడయినా యితర వర్గాల బానిసత్వాన్నే కోరుకుంటాడు.

  అసలు బ్రాహ్మణ తత్వంమంటే ఆపద కవసరమయిన అబధ్దాలతో అడ్డుతొలగించుకోవటమే నని వేరే చెప్పనఖ్కరలేదు. ఆ విధానాన్ని నిరసించిన బ్రాహ్మణులు కూటికీ కులానికీ కూడ చెడిన విషయం చరిత్ర లిఖితం. సత్యవాదులకు ప్రత్యేక ఆచార వ్యవహారాలేమీ అవసరంలేదు. తెలిసిన నిజం పలకటమే – వారికి కావలసింది, నిర్ద్వందంగా పరిస్ధైతి నెదుర్కోగల ధైర్య మొక్కటే.

 11. కిరణ్ గారూ నేను జరిగినవే రాస్తున్నాను. కులం గురించి నేను చేసిన ప్రస్తావనలన్నీ జాతీయ, ప్రాంతీయ పత్రికలు చేసినవే. అవి ఎక్కువగా ఉన్నాయంటే దానికి కారణం సమాజంలో కులం పాత్ర ఎక్కువగా ఉండడమే. విశ్లేషణలో వాస్తవం ఉందోలేదో చూడండి. క్వాలిటీ విషయంలో నేను చెప్పేదేమీ లేదు. మీకు బాధ కలిగితే దానిని సమాజంలోని పరిస్ధితిపైకి మళ్లించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s