మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు


లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా ప్రభుత్వం ప్రజలను, తిరుగుబాటుదారులను చంపుతున్నదంటూ ప్రపంచం మీదికి వదులుతున్నాయి. పేరు తెలియని మానవ హక్కుల సంస్ధలు చెప్పాయనో, కార్యకర్తలు చెప్పారనో సిరియా సైన్యం కాల్పుల్లో వందలమంది చనిపోతున్నారంటూ ప్రచారం చేస్తున్న పశ్చిమ పత్రికలు సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల జోక్యానికి వ్యతిరేకంగా, ప్రజలు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రదర్శనలను రిపోర్టు చేయకుండా తొక్కి పెడుతున్నాయి.

ఈ నేపధ్యంలో మధ్య ప్రాచ్యంలో కీలక ప్రాంతంలో ఉన్న సిరియా పైన దాడికి రష్యా, చైనాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు దేశాలూ భద్రతా సమితిలో వీటో హక్కు కలిగి ఉండడంతో ఐక్యరాజ్యసమితిలో సిరియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీర్మానం చెయ్యడం అసంభవంగా మారింది. దానితో సిరియానుండి వచ్చిన అద్దె విప్లవకారులకు టర్కీలోనూ, లెబనాన్ ఉత్తర ప్రాంతంలోనూ సి.ఐ.ఎ, ఎం.ఐ5 తదితర అమెరికా, యూరప్ ల గూఢచార సంస్ధలు ఆయుధ శిక్షణను ఇచ్చి సిరియాలోకి పంపుతున్నాయి. తిరుగుబాటు అని చెబుతున్న కార్యకలాపాలన్నీ టర్కీకి దగ్గర్లో ఉన్న కొద్ది సిరియా భూభాగంలోనే కేంద్రీకృతమవడం ఈ సందర్భంగా గమనార్హం.

సాయుధులై అల్లర్లు చేస్తున్న వారిని ఏ దేశ ప్రభుత్వమూ పిలిచి చర్చించదు. ఏ దేశమైనా అటువంటి కార్యకలాపాలను దేశద్రోహంగా పరిగణించి అణిచివేస్తుంది. సిరియా ప్రభుత్వం అది చేయకుండా దేశద్రోహులను, సిరియా ప్రయోజనాలను అమెరికా, యూరప్ లకు తాకట్టు పెట్టడానికి సిద్ధపడి సాయుధంగా అల్లర్లు సృష్టిస్తున్నద్రోహులతో చర్చించి ప్రజాస్వామిక హక్కులు ఇవ్వాలని అమెరికా, యూరప్ లు డిమాండ్ చేస్తున్నాయి. పక్కనే అత్యంత క్రూరంగా ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్న బహ్రెయిన్, సౌదీ అరేబియా నియంతలను చంకనెక్కించుకుని, సెక్యులర్ సిద్ధాంతాలు కలిగిన బాత్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని కూలదోయడానికి నాటో దేశాలు సకల కుట్రలు చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో మధ్యధరా సముద్రంలో అమెరికా, రష్యాల యుద్ధ నౌకలు మెహరించడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మధ్యధరా సముద్రంలో ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు తిష్టవేసి ఉన్నాయి. దానికి ప్రతిగా రష్యా కూడా తన నౌకా బలగాలను మధ్యధరా సముద్రానికి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. భారీ విమానవాహక నౌక ‘అడ్మిరల్ కుజ్నెత్సోవ్’ రెండు నెలల మధ్యధరా సముద్ర ప్రయాణానికి డిసెంబరు 6 న బయలుదేరుతుందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారని ‘ది హిందూ’ ప్రకటించింది. బుధవారం ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజన్సీ తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించినట్లు తెలుస్తోంది.

అమెరికాకి చెందిన అణ్వస్త్ర పాటవం గల యుద్ధవిమాన వాహక నౌక ‘యు.ఎస్.ఎస్ జార్జి హెచ్.డబ్ల్యు. బుష్’ ను సిరియా సముద్ర జలాల బయట లంగరు వేసినట్లుగా వార్తలు వచ్చిన కొద్ది సేపటికే రష్యా నుండి పై వార్త వెలువడింది. అమెరికా యుద్ధవిమాన వాహక నౌకతో పాటు అదనంగా మరిన్ని యుద్ధ నౌకలు అమెరికా మొహరించిందని వార్తలు తెలుపుతున్నాయి. అయితే, రష్యా యుద్ధనౌకల ప్రయాణానికీ ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న సంక్షోభానికీ సంబంధం లేదని రష్యా రక్షణ రంగ అధికారి ఒకరు చెప్పాడు. ఈ కార్యక్రమానికి చాలా కాలం క్రితం పధక రచన జరిగిందని ఆయన చెప్పాడు. యుద్ధ నౌకలు అట్లాంటిక్, మధ్యధరా సముద్రాలలో సిరియాకి చాలా దూరంగా డ్రిల్లులు నిర్వహిస్తాయనీ, ఫిబ్రవరికల్లా అవి తమ ఉత్తర నౌకాబలగాల స్ధావరానికి చేరుకుంటాయనీ ఆయన చెప్పాడు. దానితో పాటు సిరియాలో ఉన్న రష్యా నౌకా స్ధావరాన్ని ‘టార్టస్’ కూడా రష్యన్ యుద్ధ నౌకలు సందర్శిస్తాయనీ, అక్కడ ఉన్నవారికి ఆహారం, ఇంధనం సరఫరాలు అందిస్తాయనీ ఆయన చెప్పాడు.

అమెరికా, యూరప్ ల నాయకులకు రష్యా ఒక సందేశం పంపిస్తోందని రష్యా మాజీ నౌకాదళ కమాండర్ ఒకరు తెలిపాడు. “నాటో యేతర మిలట్రీ బలగాలు ఈ ప్రాంతంలో మొహరించి ఉండడం ఈ ప్రాంతానికి చాలా ఉపయోగం. ఎందుకంటె అది సాయుధ ఘర్షణ జరగకుండా నివారిస్తుంది” అని మాజీ ఛీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ విక్టర్ క్రావ్‌చెంకో ఓ రష్యా పత్రికతో మాట్లాడుతూ చెప్పాడు. సిరియా తీరానికి దగ్గరగా మూడు రష్యా యుద్ధ నౌకలు లంగరు వేశాయని గత వారంలో వార్తా కధనాలు వెలువడ్డాయి. ఈ కధనాలను నిర్ధారించడానికి గానీ, ఖండించడానికి గానీ రష్యా అధికారులు నిరాకరించారు.

ఇటీవల కాలంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. యూరప్ లో మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధను నెలకొల్పడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను రష్యా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే రష్యా ప్రతీకార చర్యలు తీసుకుంటుందనీ కొత్త మిసైళ్లను మొహరిస్తామనీ రష్యా అధ్యక్షుడు డిమిట్రీ మెడ్వడోవ్ ప్రకటించాడు. దానివల్ల రష్యా అణ్వస్త్ర పాటవం అసమ తూకానికి గురవుతుందనీ, అణ్వస్త్ర సమతూకం దెబ్బతిని అమెరికావైపు మొగ్గు చూపుతుందని రష్యా వాదిస్తోంది. తన చర్యలలో భాగంగా రష్యా క్యూబాతో మిలట్రీ ఒప్పందాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. గోర్బచెవ్ పతనంతో తెగిపోయిన మిలట్రీ సంబంధాలను క్యూబాతో పునరుద్ధరించడానికి రష్యా నిర్ణయించుకుని చర్యలు తీసుకుంటోంది. ఆయుధ సరఫరా ఒప్పందం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. రష్యా పక్కనే గల మాజీ సోవియట్ రష్యా రిపబ్లిక్కులను నాటోలో చేర్చుకుంటున్నందుకు ప్రతీకారంగా, అమెరికా పక్కనే గల క్యూబాతో సంబంధాలను రష్యా పునరుద్ధరించుకుంటోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s