అబద్ధాలతో ‘పాక్ సైనికుల హత్యల’ను కప్పిపుచ్చుకుంటున్న అమెరికా


పాకిస్ధాన్ లో చెక్ పోస్టు వద్ద ఉన్న పాక్ సైనికులను 24 మందిని (28 మందని ‘ది టెలిగ్రాఫ్ చెబుతోంది) చంపి, మరో 13 మందిన గాయపరిచిన అమెరికా, తన దాడులను సమర్ధించుకోవడానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అమెరికా చెబుతున్న అబద్ధాలను నిజాలుగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. గోబెల్ ను ఎప్పుడో తలదన్నిని ఈ పడమటి పత్రికలు ఆర్ధికంగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా అమెరికా, యూరప్ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచారం చేయడంలో ఇప్పటికి దశాబ్దాల అనుభవం సంపాదించాయి. తాజాగా అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు పాకిస్ధాన్ చెక్ పోస్టు పై దాడి చేసి పాక్ సైనికులను చంపడం విషయంలో కూడా అదే అబద్ధపు ప్రచార ఎత్తుగడలను తలకెత్తుకున్నాయి.

అమెరికా చెబుతున్న పెద్ద అబద్ధం ‘పాకిస్ధాన్ భూభాగం నుండి తమ పైకి కాల్పులు జరగడంతో ఆ కాల్పులకు తాము ప్రతిస్పందించామని. పాక్ సైనికులు కాపలాగా ఉన్న చెక్ పాయింటు పాక్, ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దుకు దాదాపు రెండున్నర కి.మీ దూరంలో ఉన్నట్లుగా పత్రికలు తెలిపాయి. అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు ఆఫ్ఘనిస్ధాన్ భూభాగం నుండి మాత్రమే కాల్పులు జరిపాయి తప్ప పాకిస్ధాన్ భూభాగం లేదా గగనతలం లోకి చొరబడలేదని కూడా అమెరికా అధికారులు చెప్పారు. అంటే పాక్ భూభాగంలో నేలపైన నిలబడి ఉన్న పాకిస్ధాన్ సైనికులు అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహాద్దుకి ఆవల ఉన్న నాటో కూటమి సైన్యాలపైకి కాల్పులు జరిపారన్నమాట! ఆ కాల్పులనుండి రక్షించుకోవడానికి ఆఫ్ఘన్ గడ్డపైన ఉన్న భూతల బలగాలు హెలికాప్టర్, జెట్ ఫైటర్ విమానాల సహాయం కోసం అర్ధించారట. అప్పుడు ‘గజేంద్ర మోక్షం’ లో గజేంద్రుడిని రక్షించడానికి పంచె ఊడుతున్నా పట్టించుకోకుండా, ఆయుధాలు కూడా తెచ్చుకోకుండా పరుగు, పరుగున వచ్చిన విష్ణుమూర్తి లెవల్లో హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు వాయు వేగంతో వచ్చి ఎవర్ని కాలుస్తున్నదీ కూడా చూసుకోకుండా సరిగ్గా చెక్ పోస్టు పైన కాల్పులు జరిపాయన్నమాట. ఇది ప్రపంచం నమ్మాలి.

ఎంత హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు అయినా రెండున్నర కి.మీ దూరంలో ఉన్న పాక్ సైనికులపై కాల్పులు జరపడం సాధ్యమా? కంప్యూటర్ల సాయంతో పేల్చే మిసైళ్ళు అయితే తప్ప అంత దూరంలో ఉన్న తీవ్రవాదులు ఆఫ్ఘన్ గడ్డపై ఉన్న నాటో బలగాలపైకి ఎలా కాల్పులు జరిపగలిగాయి? సమాధానం ఇవ్వడానికి వీలు లేని ప్రశ్నలివి. ఈ వాదనను పాకిస్ధాన్ మిలట్రీ తోసిపుచ్చింది. “ఇది నిజం కాదు. వారు సాకుల కోసం చూస్తున్నారు. వారేమి నష్టపోయారు? గాయాలు తగిలాయా? ఎవరైనా చనిపోయారా?” అని పాక్ మిలట్రీ ప్రతినిధి మేజర్ జనరల్ అధర్ అబ్బాస్ ప్రశ్నించాడని రాయిటర్స్ తెలిపింది.

మరో అబద్ధం ఏమిటంటే సంఘటన జరిగిన దగ్గర పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ ల మధ్య సరిహద్దు స్పష్టంగా లేదట! గుట్టలూ, ఎగుడు దిగుళ్లతో ఉండే ఆ ప్రాంతంలో సరిహద్దులను గుర్తించడం చాలా కష్టమని అమెరికా మిలట్రీ అధికారులు వాదిస్తున్నారు. అటువంటి చోట మిత్రుడెవరో, శత్రువు ఎవరో తెలియని పరిస్ధితుల్లో పొరబాట్లు జరగడం సహజమేనని అమెరికా అధికారులు సెలవిస్తున్నారు. నిజానికి సంఘటన జరిగిన ప్రాంతంలోనే డ్యూరాండ్ లైన్ ఉంది. ఇది అంతర్జాతీయ సరిహద్దు. అంతర్జాతీయ సరిహద్దునే గుర్తించలేకపోయామని అమెరికా మిలట్రీ సిగ్గు విడిచి చెప్పుకుంటోంది. తమ సైనిక ప్రతిభా పాటవాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని గొప్పలు చెప్పుకుంటూ ఆయుధాలు అమ్ముకునే అమెరికా మిలట్రీ ఈ విధంగా సరిహద్దు గుర్తించలేని పరిస్ధితిలో ఉంటారా? పాక్ సైనికులు కాపలా కాస్తున్న చెక్ పాయింటుగా అప్పటికే మిలట్రీ మ్యాప్ లలో అది గుర్తించబడి ఉంటుంది. అయినప్పటికీ పాకిస్దాన్ చెక్ పోస్టును గుర్తించలేకపోయామనడం అతకని అబద్ధమని స్పష్టమవుతోంది.

పశ్చిమ వార్తా సంస్ధలు సంఘటనకు సంబంధించిన వార్తలు ప్రచురిస్తూనే ఆ వార్తలలో కూడా అబద్ధాలు చొప్పిస్తున్నాయి. అమెరికా బలగాలు పాక్ సైన్యాన్ని చంపడంలో పెద్ద తప్పు లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని పశ్చిమ దేశాల మిలట్రీ అధికారి ఒకరూ, ఆఫ్ఘనిస్ధాన్ మిలట్రీ అధికారి ఒకరూ ‘సరిహద్దుకు అవతలి నుండి వచ్చిన కాల్పులకు మాత్రమే ప్రతిస్పందించామని’ చెప్పినట్లుగా రాయిటర్స్ రాసింది. ఇంతకీ ఆ అధికారులు పేర్లు చెప్పడానికి ఇష్టపడకపోవడానికి ఇందులో రహస్యం ఏం ఉంది? పైగా పాక్ వైపునుండి కాల్పులు నిజంగా జరిగితే దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి వార్తా సంస్ధలు గానీ నాటో, అమెరికా లు గాని కాచుకు కూర్చుంటాయి. అలాంటిది పాక్ వైపునుండి కాల్పులు జరిగాయని రహస్యంగా చెప్పవలసిన అవసరం ఏముంది? తాలిబాన్ తీవ్రవాదులకు పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ ల హస్తం ఉందని బహిరంగంగా ఆరోపించినా అమెరికా అధికారులు ప్రస్తుత సందర్భంలో పాక్ జరిపిన కాల్పులను రహస్యంగా ఉంచుతారా? అదీ ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా రహస్యంగా ఉంచుతారా? అసంభవం. జరగని వాటినే ఇల్లెక్కి చాటింపు వేసే అమెరికా జరిగిన విషయాలను చెప్పడానికి జంకుతుందన్నది ఏమాత్రం నమ్మలేనిది.

అమెరికా వాదనలు, పాకిస్ధాన్ ఆరోపణలు రెండూ నిజం కావచ్చని రాయిటర్స్ సంస్ధ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తీవ్రవాదులపైన జరిగిన కాల్పులు అనూహ్యంగా ట్రాజిక్ మలుపు తీసుకుని పాకిస్ధాన్ సైనికుల మరణానికి దారి తీసి ఉండవచ్చు అని రాయిటర్స్ అమెరికా దుర్మార్గాన్ని కష్టపడి వెనకేసుకొచ్చింది. ఆ విధంగా అమెరికా కాల్పుల్లో పాక్ సైనికులు చనిపోవడమూ నిజమే, సరిహద్దుకు ఆవలి వైపునుండి కాల్పులకు నాటో బలగాలు స్పందించడమూ నిజమే అని ఆ పత్రిక చెబుతోంది. తద్వారా అమెరికా దుర్మార్గాన్ని కేవలం ప్రమాదం గా కొట్టిపారేయడానికి రాయిటర్స్ ప్రయత్నించింది. అదే నిజమయితే పాక్ అధికారి ప్రశ్నించినట్లు తమవైపు నష్టాలను నాటో, అమెరికాలు చూపించవలసి ఉంటుంది. అమెరికాకి నష్టమే జరిగిఉంటే పాకిస్ధాన్ కి ఈ మాత్రం ఆరోపణలు చేసే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు.

ఇదిలా ఉండగా పాకిస్ధాన్ లో అమెరికా దుర్మార్గం పైన ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారనే లేదు. దేశ వ్యాపితంగా పాక్ ప్రజలు అమెరికా దాడిపైన నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు కత్తులు దూస్తున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. వీరికి పాకిస్ధాన్ పత్రికలు కూడా జత కలిశాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా యుద్ధానికి సహకారం ముగించాలని జంగ్ లాంటి పత్రికలు డిమాండ్ చేస్తున్నాయి.

5 thoughts on “అబద్ధాలతో ‘పాక్ సైనికుల హత్యల’ను కప్పిపుచ్చుకుంటున్న అమెరికా

 1. మధు గారూ, లాడెన్ దాక్కున్నది పాకిస్ధాన్ లోనే. నిజమే. కాని లాడెన్ ను పెంచి పోషించింది అమెరికాయే కదా? ఆల్-ఖైదా పైన ఒక పక్క యుద్ధం చేస్తున్నామని చెబుతున్న అమెరికా లిబియాలో వారితో కలిసి గడ్డాఫిని చంపి వారితో ప్రభుత్వం ఏర్పాటు కూడా చేసింది కదా? పాకిస్ధాన్ తో పాటు అమెరికా కూడా తాలిబాన్ అధికారంలోకి రావడానికి సహకరించింది కదా?

  అసలు ప్రపంచంలో టెర్రరిజం పుట్టుకకు ప్రధాన చోదక శక్తి అమెరికాయే. అది అనేక ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లొ తనకు ఇష్టం లేని ప్రభుత్వాలను కూల్చడానికి ఆయుధాలిచ్చి టెర్రరిస్టుల్ని పెంచింది. తీరా వాళ్ళు తనకే ఎదురు తిరిగే సరికి ఆ యుద్ధాన్ని ప్రపంచం మీదికి రుద్దింది. అది మనం అంతా పూసుకుని టెర్రరిస్టులంటూ ఆవేశపడిపోతున్నాం.

  అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోతే అక్కడ యుద్ధం జరుగుతుందా? ఇరాక్ పైన దాడి చేయకపోతే ఇరాక్ యుద్ధం జరిగేదా?

  ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నా మీకు అమెరికా పైన కోపం రాదేమండీ బాబూ?

  పాకిస్ధాన్ మన పక్కదేశం. అరవై అదేళ్ల క్రితం వరకూ మన దేశంలో భాగం. మనలో ఇంకా చాలామందికి అక్కడ బంధువులున్నారు. అక్కడ ఉన్నవాళ్లలో చాలా మందికి ఇక్కడ బంధువులున్నారు. ఆ పక్క దేశం ఆఫ్ఘనిస్ధాన్. మన సార్క్ కూటమిలో సభ్య దేశం. సార్క్ దేశాలన్నీ మన పొరుగు దేశాలే. భారత ప్రభుత్వమే పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ లతో సంబంధాల మెరుగుదల కోసం కృషి చేస్తోంది. అమెరికా సముద్రాల అవతల ఉన్న దేశం. మన పక్క దేశంపైన దాడి చేసి అనేకమందిని చంపుతూ ఆయుధాలు ఖర్చు చేస్తూ ఆ యుద్ధాన్ని చూపి తన ఆయుధాలు అమ్ముకుంటున్న దేశం. అటువంటి దగుల్బాజీ దేశాన్ని వదిలి పెట్టి మన పక్క దేశాన్ని ద్వేషించడం భావ్యమా చెప్పండి?

 2. 26/11 రోజున ముంబై లో 160 మందిని చంపింది కూడా అమెరికానే అంటారా??
  ఒకప్పటి ప్రెసిడెంట్ లాడెన్ ని పెంచి పోషించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు కదా.
  మాఫియా అడ్డా పాకిస్తాన్ కాదంటారా..??

  పాకిస్తాన్ మీద వల్లమాలిన అభిమానమేన్టండి బాబు???

 3. పాకిస్ధాన్ మిలట్రీలో కొంతమంది వెధవలు ఆ పని చేయించారు. దానికి పాకిస్ధాన్ ప్రజలందర్నీ బాధ్యుల్ని చేద్దామా?

  ఒకప్పటి ప్రెసిడెంటా? అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా, ఎవరు పోయినా అమెరికా విధానాలు, దాని ఆధిపత్య దురాక్రమణలు ఎన్నడూ మారలేదు. అందరూ ఆ విధానాలని కొనసాగించినవారే. జార్జి బుష్ తండ్రి మొదట ఇరాక్ పై దాడి చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన తర్వాత వచ్చిన బిల్ క్లింటన్ కూడా ఇరాక్ పైన అమానుషమైన ఆంక్షలు అమలు చేసి అక్కడి పిల్లలు, పిల్ల తల్లుల ఉసురు తీసుకున్నాడు. ఆంక్షల వల్ల డబ్బా పాలు దొరక్క పసి పిల్లలు లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత కొడుకు బుష్ వచ్చాడు. క్లింటన్ చేయగా మిగిలిన పని కొడుకు బుష్ ఎత్తుకున్నాడు. రెండు యుద్ధాలు చేశాడు. ఆ పిమ్మట ఒబామా వచ్చాడు. మారుస్తా అన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ కి సైన్యాన్ని పెంచాడు. బుష్ కాలం కంటె ఒబామా కాలంలో ఆఫ్ఘన్ పౌరుల మరణాలే కాదు, అమెరికా సైనికుల మరణాలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇంకా ఆ హింస రచన కొనసాగుతోంది. సైన్యాన్ని బ్యారక్స్ లో ఉంచి మానవ రహిత విమానాలు పంపి వందలమందిని చంపుతున్నాడు.

  కనిక ఈ ప్రెసిడెంటు, ఆ ప్రసిడెంటు లాంటి తేడాలేవీ లేవు. అంతా దేశాలపై పడి చంపుతూ, దోచుకు తినేవాళ్ళే. ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుడి చేతిలో ఏమీ ఉండదు. ఏ దేశంలోనైనా అక్కడి కంపెనీలు, ధనవంతులే ప్రభుత్వాల్ని వెనకుండి నడిపేది. పార్టీలు మారినా, ఉత్సవ విగ్రహలు మారినా వారు మారరు. వారి బందిపోటు దోపిడి కొనసాగడానికి అవసరమైన అన్ని విధానాలని అధ్యక్షులు అమలు చేస్తూ ఉంటారు అంతే. వాడు వేరే, వీడు వేరే అనేదేమీ ఉండదు. అంతా ఒకటే కొట్టుడు. ఇది మీరు ముందు అర్ధం చేసుకోవాలి.

  మాఫియా లేని దేశం ఒకటి చెప్పండి. అమెరికా ప్రభుత్వమే పెద్ద మాఫియా ప్రభుత్వం. ఆ మాఫియాకి సి.ఐ.ఎ, ఎఫ్.బి.ఐ లాంటి నరహంతక సంస్ధలు అంగాల లాంటివి. వాటిని ప్రపంచం అంతా చాచి కుట్రలు కుతంత్రాలు పన్ని… ఇక మిగిలింది మీకు తెలిసిందే. చాలా సార్లు రాశాను.

  భారత దేశంలో మాఫియా లేదనా మీ ఉద్దేశ్యం. అయ్యో రాత! ఏ చిన్న పట్నానికి వెళ్లినా మాఫియా దర్శనం ఇస్తుంది. మాఫియా అనగానే సినిమాల్లో చూపినట్లు తుపాకులు, కాల్పులు, వీధి పోరాటాలు ఇవే అనుకునేరు. నల్లధనం ఎక్కడ ఉంటే అక్కడ మాఫియా ఉన్నట్లే. వారి రూపాలు మారుతూ ఉంటాయంతే. రాయలసీమ కి వెళ్తే వారిని ఫ్యాక్షన్ కింగ్ లు అంటారు. వ్యాపార సామ్రాజ్యాల వద్దకు వస్తే లిక్కర్ కింగ్, పేపర్ కింగ్, ఏవియేషన్ లార్డ్ ఇలా పేర్లు మారుతూ ఉంటాయి.

  ఒక్క పాకిస్ధానే కాదండీ. ఈ ప్రపంచంలో ఏ దేశం అన్నా నాకు అభిమానమే. నాకు తెలిసినంతవరకు దేశం అంటే అక్కడ ఉండే జనం. అక్కడ గద్దె పైన కూర్చునే వాళ్లూ, పార్లమెంటులో కొట్టుకునే వాళ్లూ, వాళ్ళని పోషించే వ్యాపార సామ్రాజ్యాధిపతులూ… వీళ్ళు కాదు. ఒళ్ళొంచి పని చేసేవారంతా మనకు మిత్రులే. ఒళ్లొంచకుండా, ఇక్కడి పూచిక పుల్ల అక్కడ పెట్టకుండానే లక్షలు, కోట్లు సంపాదించేవాళ్లంతా మాఫియా మార్గాల్లో సంపాదించినవారే. డబ్బు దానంతట అదే పుట్టదు. శ్రమ చేస్తేనే పుడుతుంది. ఆ శ్రమ చేసేది జనం. మేసేది బిలియనీర్లు.

  లాడెన్, దావూద్, గిలాని, భుట్టో, హీనా రబ్బానీ, తాలిబాన్, ఆల్-ఖైదా, జమాత్ ఉద్ దవా, లష్కర్ ఎ తొయిబా, ముజాహిదీన్…. మీ దృష్టిలో ఇవే పాకిస్ధాన్ అంటే. కానీ నా దృష్టిలో పాకిస్ధాన్ అంటే అక్కడ ఉండే జనం. శ్రమ చేస్తూ ఉత్పతీ తీసే జనం. శ్రమ చేస్తూ ఉత్పత్తి తీస్తూ కూడా ఆ ఉత్పత్తిలో వీసమెత్తు కూడా తమకోసం మిగుల్చుకోలేని జనం.

  భారత దేశం అంటే ఒక అమ్మోరు, ఆ అమ్మోరు నెత్తిన కాశ్మీరు, పాదాల చెంత కన్యాకుమారి, కంఠాభరణాలుగా గంగ, యమునా, సరస్వతి, పాదాభరణాలుగా కృష్ణ, గోదావరి, కావేరి ఇదేనాండీ? కాదండీ. భారత దేశం అంటే నూట ఇరవై కోట్ల జనం. వారూ, వారి బ్రతుకులూ, వారి భవిష్యత్తూ… ఇదే దేశం. ఇవి బాగుంటేనే, వీటికి గ్యారంటీ ఉంటేనే దేశం బాగున్నట్లు. ఎన్ని కార్లు తిరిగినా, ఎన్ని ఐ ఫోన్లు మోగుతున్నా, ఎంతమంది సచిన్ లు ఎన్ని వేల సార్లు పరుగెత్తినా… ఈ జనం లేకుంటే దేశం లేదు. ఆ దేశానికి కూడూ, గుడ్డా, నీడా ఉన్నాయా లేదా అని మనం ఆలోచించగలితే నిస్సందేహంగా మనం దేశం గురించి ఆలోచిస్తున్నట్లే.

 4. “భారత దేశం అంటే నూట ఇరవై కోట్ల జనం. వారూ, వారి బ్రతుకులూ, వారి భవిష్యత్తూ… ఇదే దేశం. ఇవి బాగుంటేనే, వీటికి గ్యారంటీ ఉంటేనే దేశం బాగున్నట్లు. ఎన్ని కార్లు తిరిగినా, ఎన్ని ఐ ఫోన్లు మోగుతున్నా, ఎంతమంది సచిన్ లు ఎన్ని వేల సార్లు పరుగెత్తినా… ఈ జనం లేకుంటే దేశం లేదు. ఆ దేశానికి కూడూ, గుడ్డా, నీడా ఉన్నాయా లేదా అని మనం ఆలోచించగలితే నిస్సందేహంగా మనం దేశం గురించి ఆలోచిస్తున్నట్లే.”

  చాలా ఆలస్యంగా చూస్తున్నాను మీ వ్యాఖ్యను. అద్భుత వ్యాఖ్య. గురజాడ దేశమంటే మనుషులోయ్ అంటూ ఆధునికంగా చెబుతున్నట్లుంది నాకయితే. అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s