వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల వాల్-మార్ట్, కేరేఫర్, టెస్కో లాంటి బడా బహుళజాతి సంస్ధలు దేశీయ ప్రవేటు కంపెనీలతో కలిసి పెద్ద ఎత్తున రిటైల్ షాపులు నెలకొల్పే అవకాశం లభిస్తుంది.
భారత దేశం లో నిత్యావసర సరుకులను చిల్లర ధరలకు అమ్మే దుకాణాలపైన ఆధారపడి కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. విదేశీ చిల్లర దుకాణాలు రావడం వలన వారితో పోటీ పడలేక చిల్లర దుకాణాలను ఎత్తివేయాల్సిన పరిస్ధితి తలెత్తుతుంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించేది లేదని బి.జె.పి మొదటి నుండి చెబుతూ వస్తోంది.
ఈ నేపధ్యంలో బి.జె.పి లో ఇటీవలే మళ్ళీ వచ్చి చేరిన ఉమా భారతి వాల్ మార్ట్ షాపు ఎక్కడ నెలకొల్పినా తన పార్టీ కార్యకర్తలతో కలిసి తగలబెడతానని ప్రకటించింది. “రిటైల్ రంగంలో నేరుగా విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు ఇవ్వడం ద్వారా దళితులు, పేదలు, వెనకబడ్డవారు తదితరుల ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని ఆమె విమర్శించింది. “దేశంలో ఎక్కడ షాపు పెట్టినా నేను వ్యక్తిగతంగా వెళ్ళీ తగలబెడతాను. కావాలంటె అరెస్టు అవడానికి కూడా సిద్ధం” అని ఉమా భారతి ప్రకటించింది.
అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఉమా భారతి మాటలతో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించింది. సి.పి.ఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా ఆమె మాటలను ‘పిచ్చి మాటలు’ గా కొట్టిపారేశాడు. పార్లమెంటు సభ్యురాలుగా ఉంటూ అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించాడు.