ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్


అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలు ఇరాక్ లో లక్షన్నర వరకూ ఉండగా, చిన్నపాటి కాశ్మీరు లోయలో మాత్రం భారత సైన్యాలు ఏడు లక్షలకు పైగా మొహరించాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ వారు నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో కాశ్మీరు విషయమై మాట్లాడుతూ ఆమే ఈ వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్: ద కేస్ ఫర్ ఫ్రీడం” అన్న అంశంపై ఈ కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన ఆక్రమణలలో కాశ్మీరు ఒకటని అరుంధతి రాయ్ చర్చలో పాల్గొంటూ అభివర్ణించింది. కాశ్మీరులో విధించిన ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం’ (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ) ను వెంటనే ఉపసంహరించాలను ఆమే డిమాండ్ చేసింది. కాశ్మీరు ప్రజలకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోగల స్వయం నిర్ణయాధికార హక్కు ఉన్నదని ఆమె నొక్కి చెప్పింది.

“ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన, సుదీర్ఘమైన ఆక్రమణలలో కాశ్మీరు ఆక్రమణ ఒకటి. ప్రపంచం విస్మరించిన వాటిలో కూడా కాశ్మీరు ఒకటి. భారత దేశం కాశ్మీరును క్రూరమైనదిగా చేస్తుండగా, ఆ ఆక్రమణ భారతీయులను క్రూరులుగా చేస్తోంది. కాశ్మీరు ప్రజలకు తమ భవిష్యత్తుని నిర్ణయించుకునే హక్కు ఉంది. వారికి తాము ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కుంది. ఆ దిశలో మొదటి అడుగు కాశ్మీరునుండి మిలట్రీని ఉపసంహరించాలి. నమ్మడానికి వీలు లేని ‘ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ’ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి” అని అరుంధతి రాయ్ పేర్కొంది.

“కాశ్మీరులో భారత మిలట్రీ పాలనలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వ సామాన్యం. ఎన్నికలు రిగ్గింగ్ కు గురవుతాయి. పత్రికలను అదుపు చేస్తారు. తుపాకులు ధరించి ఉండే భద్రతా బలగాల వలన కాశ్మీరు ప్రజల బ్రతుకులు కనా కష్టంగా తయారయ్యాయి. ఎటువంటి చట్టాల భయం లేకుండానే భద్రతా బలగాలు కాశ్మీరి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వ్యక్తులు మాయం కావడం అక్కడ దాదాపుగా రోజువారీ కార్యక్రమం. కిడ్నాప్, అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్‌లు, చిత్ర హింసలు సర్వ సాధారణం. సామూహిక సమాధులను కనుగొన్నారు. కాని ప్రపంచం యొక్క చేతన స్పందన లేకుండా పడి ఉంది” అని అరుంధతి చర్చల సందర్భంగా తెలిపింది.

“అర మిలియన్ పైగా గల భారత సైన్యం కాశ్మీరులో పాల్పడుతున్న అత్యాచారాల గురించి బైటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.  నిరంతర నిర్భంధం కొనసాగుతోంది. పురుషులు, స్త్రీలు, పిల్లలను అగౌరవపరచడం మామూలు దిన చర్య. ఆ చిన్న లోయలో ఏడు లక్షలకు పైగా భారత సైన్యం మొహరించి ఉంది. కాశ్మీరులోని పట్టణాలు, నగరాలన్నింతిలో ప్రతి అడుగుకి, ప్రతి మూలా ఒక చెక్ పాయింటు దర్శనమిస్తుంది. ఇరాక్ లో అమెరికా సైన్యం లక్షా అరవై వేల సైన్యం ఉంది. కాశ్మీరులో మొహరించి ఉన్న ఏడు లక్షల భారత సైన్యాన్ని ఇరాక్ తో పోల్చి చూడండి” అని అరుంధతీ రాయ్ వివరించింది.

ఇలా ఉండగా న్యూయార్క్ నగరంలో కాశ్మీరు విషయమై జరిగిన కాన్ఫరెన్సు లో అరుంధతీ రాయ్ ప్రసంగాన్ని పురస్కరించుకుని ముగ్గురు కాశ్మీరీ పండిట్లు జమ్మూ కాశ్మీరు హైకోర్టు కి చెందిన జమ్ము బెంచిలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేశారు. విజయ్ కుమార్ కష్కారి, అజయ్ కుమార్ భట్, వీర్ జి సరాఫ్ అను ముగ్గురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాశ్మీరు ప్రజల కష్టాలను చెప్పటం వల్ల కాశ్మీరు ప్రజల ప్రయోజనాలకు ఏమన్న జరిగితే లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. కాశ్మీరు పండిట్లను కాశ్మీరు లోయకు తిరిగి రమ్మని కాశ్మీరు ప్రజలు, హురియత్ కాన్ఫరెన్స్, జె.కె.ఎల్.ఎఫ్ లాంటి సంస్ధలు అనేక సార్లు విజ్ఞప్తి చేశాయి. కాశ్మీరీ పండిట్లను చూపి కాశ్మీరీ ప్రజలపై భద్రతా బలగాలు జరుపుతున్న అత్యాచారాలను సమర్ధించలేరు. సంస్కృతీపరంగా కాశ్మీరీలు సెక్యులరిస్టులు. మతతత్వ చరిత్ర వారికి లేదు. పాకిస్ధాన్ ను బూచిగా చూపి కాశ్మీరుని భారత సైన్యాలు ఆక్రమించి కాశ్మీరీలకి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ తుంగలో తొక్కింది.

కాశ్మీరు భారత దేశంలో భాగంగా ఉండాలంటే భారత ప్రభుత్వం గానీ అక్కడి సైన్యం గానీ కాశ్మీరీల హృదయాలను గెలుచుకోవాలి తప్ప భూభాగాలను ఆక్రమించి నిర్భందం అమలు చేయడం వల్ల ధన ప్రాణ నష్టాలే సంభవిస్తున్నాయని అనుభవం రుజువు చేస్తోంది. భారత ప్రభుత్వ ఇప్పటికైనా కాశ్మీరీల మనసులను గెలుచుకునేందుకు చర్యలు చేపట్టాలి.

20 thoughts on “ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్

 1. ఇరాక్ అమెరికాకి చాలా దూరంగా వున్న స్వతంత్ర దేశం.కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం.రెండిటికీ పోలికే లేదు.మన దేశాన్ని పాకిస్తాన్ ,చైనాల దురాక్రమణనుండి రక్షించు కోడానికి ఎంత సైన్యాన్నయినా ఉపయోగించు కొనే హక్కు మనకుంది.అరుంధతీ రాయ్ వంటి దేశ ద్రోహుల రచనలు,ఉపన్యాసాలకి ప్రచారం కల్పించ వద్దని కోరుతున్నాను.

 2. రమణారావు గారూ, ఇరాక్, అమెరికా, పాక్, చైనా… వీళ్ళందర్నీ వదిలెయ్యండి. కాశ్మీరు ప్రజల గురించి ఆలోచించండి. అరవై సంవత్సరాల తర్వాత కూడా కాశ్మీరు ప్రజలు సైన్యం పహారాలో ఎందుకు బతకవలసి వస్తోంది? మా ఊళ్ళలో సైన్యం వద్దు అని కోరే హక్కు వారికి లేదా?

 3. మరి కాశ్మీరులో పాకిస్థాన్‌ సైన్యం ఎంతమంది ఉన్నారు..? (పాకిస్థాన్‌ ఆక్రమిత (స్వతంత్ర) కాశ్మీరు)
  చైనా సైనికులు ఎంతమంది ఉన్నారు..? (చైనా ఉంచుకున్న కాశ్మీరు)
  “ముజఫరాబాద్‌” (పాకిస్థాన్‌ ఆక్రమిత(స్వతంత్ర) కాశ్మీర్‌) ప్రాంతంలో కాశ్మీర్‌ పండితులు ఎంతమంది ఉన్నారు..? ఎంతమంది చచ్చిపోయారు..? ఎంతమంది మతం మార్చబడ్డారు.?
  కాశ్మీరులో కాశ్మీరు పౌరులకి(ముస్లింలకి) ఉన్న స్వేచ్ఛ అక్కడివారే అయిన కాశ్మీరు పండితులకి అక్కర్లేదా..?
  ఢిల్లీ మురికివాడల్లో కాపురముంటున్న ఒకప్పటి (ఒక ప్రాంతపు) గురువులను ఎక్కడ ఉంచాలి.?
  అసలు ఉంచాలా.? వాళ్ళని చంపేస్తే సరిపోతుందా..? లేదా “టిబెట న్ల”కి మల్లే ప్రవాస కాశ్మీరు ప్రభుత్వం నడుపుకోమని చెప్పాలా..?
  “జమ్మూ” ప్రాంత హిందువుల్లో ఎంతమందిని పంపించేస్తే బావుంటుంది.?
  ఇలాంటి విషయాలు శ్రీ. తిరు. మాననీయ. మహిమాన్విత. అరుంధతీరాయ్‌ గారు సెలవిస్తే సంతోషిస్తాం..! విని తరిస్తాం..!

 4. గీత గారూ, కాశ్మీరుని ఇండియాతో పాటు పాకిస్ధాన్, చైనాలు కూడా ఆక్రమించాయని చెబుతున్నారా మీరు? అదే అయితే నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్.ఎ.సి) కు అవతల కాశ్మీరుని చైనా ఆక్రమించుకుంది. ‘ఆధీన రేఖ’ (ఎల్.ఒ.సి) కి అవతల కాశ్మీరుని పాకిస్ధాన్ ఆక్రమించుకుంది. ఎల్.ఎ.సి, ఎల్.ఒ.సి లకు ఇవతలి కాశ్మీరుని ఇండియా ఆక్రమించుకుంది. ఇది కాకుండా కాశ్మీరుని చైనా, పాక్ లు మాత్రమే ఆక్రమించుకున్నాయి, కాని ఇండియా మాత్రం ఆక్రమించుకోలేదు అని మీరు చెప్పదలిస్తే కాశ్మీరు ప్రజలు దాన్ని అంగీకరించడం లేదు. వారు కోరుతున్నది వేరే ఉంది.

  మూడు ఆక్రమణ దేశాల మధ్య కాశ్మీరు చీలిపోయి ఉంది. కాశ్మీరులో ప్రధాన స్రవంతి ఉద్యమ సంస్ధలు జె.కె.ఎల్.ఎఫ్, హురియత్ కాన్ఫరెన్స్ లో కొన్ని సంస్ధలు కూడా ఈ విషయాన్నే చెబుతూ మాకు ఇండియా వద్దూ, పాక్ వద్దూ స్వతంత్రం కావాలి అని కోరుతున్నారు. నెహ్రూ హామీ ఇచ్చినట్లు ఫ్లెబిసైట్ ఎందుకు జరపలేదు అనడుగుతున్నారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తాము ఏది కోరితే అది చేయండి అని కోరుతున్నారు.

  తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు కాశ్మీరీలకు ఉన్నదా లేదా అన్నదే ప్రధాన అంశం ఇక్కడ. ఆ హక్కుని పాక్, ఇండియాలు ఇరువురూ వ్యతిరేకిస్తున్నాయి. మా దేశంలోనే కలవండి అని 1947 నుండీ బలవంతపెడుతూ వచ్చాయి. కాశ్మీరు గురించి పాక్ ప్రభుత్వం తమ ప్రజలకు ఎన్నో అబద్ధాలు చెబుతూ వచ్చింది. ఇండియా ప్రభుత్వం కూడా నెహ్రూ ఇచ్చిన వాగ్దానాలను గానీ, కాశ్మీరు ఏ పరిస్ధితుల్లో ఇండియాలో కలిసిందన్న విషయాన్ని గానీ, కేవలం పాక్ నుండి దండెత్తిన వారి నుండి రక్షణ కోసమే ఇండియా సహాయం కోరుతూ ఆ తర్వాత ఫ్లెబిసైట్ ద్వారా కాశ్మీరు భవితవ్యం నిర్ణయించాలన్న అంగీకారానికి వచ్చారని గానీ ఎన్నడూ భారతీయులకు చెప్పలేదు. అలా చెప్పని ఫలితంగానే కాశ్మీరు మొదటినుండీ ఇండియాలో భాగం అనీ, దాన్ని పాక్ లాక్కోవడానికి ప్రయత్నిస్తోందనీ, కాశ్మీరీలు వారికి సహకరిస్తున్నారనీ ఇప్పుడు భారతీయులు నమ్ముతున్నారు. కాని కాశ్మీరీలు ఏం కోరుతున్నారో తెలియడానికి అక్కడ పత్రికలను స్వేచ్ఛగా అనుమతిస్తే తెలుస్తుంది. వారు కోరుతున్నది ఏ దేశాన్ని కాదు. వారు కాశ్మీరు స్వాతంత్రాన్ని మాత్రమే కోరుతున్నారు. 1947 కి పూర్వం వరకూ తాము స్వతంత్రంగా ఉన్నామనీ ఆ స్వతంత్రమే ఇప్పుడు కూడా తమకు కావాలనీ కోరుతున్నారు. ఈ నిజం తెలియకపోతే మనకు చాలా దురభిప్రాయాలు సహజంగానే కలుగుతాయి.

  ఇక్కడ అరుంధతీ రాయ్ ఏం చెబుతున్నది సమస్య కాదు. పాక్, ఇండియా, చైనాలు ఏమంటున్నాయో సమస్య కాదు. కాశ్మీరు భూమికి సొంతదారులైన కాశ్మీరు ప్రజలు ఏమి చెబుతున్నారో, వారు ఏమి కోరుతున్నారో అదే ముఖ్యం. వారి జాతీయ ఆకాంక్షలే కాశ్మీరు భవితవ్యాన్ని నిర్ణయించాలి తప్ప భారతీయులకు గానీ, పాకిస్ధానీయులకి గానీ లేదా చీనీయులకు గానీ కాశ్మీరు భవితవ్యాన్ని నిర్ణయించే హక్కు లేదు. అంతర్జాతీయ చట్టాలు అదే చెబుతున్నాయి. ప్రజాస్వామిక సంస్కృతి అదే నేర్పుతుంది. ప్రజలు తప్ప ఇంకెవ్వరూ నిర్ణేతలు కారని ఆధునిక ప్రజాస్వామిక భావజాలం ప్రభోదిస్తుంది. విశాల దృష్టితో పరికిస్తే అరుంధతి రాయ్ ఉపన్యాసం ప్రధానంగా ఆ విషయాన్ని చెబుతోంది. కాశ్మీరు నేల గురించి కాశ్మీరు ప్రజలు ఏమనుకుంటూన్నారో చెబితే అది భారత దేశానికి దేశద్రోహం గా పరిణమించడంలో న్యాయబద్ధత ఉందా?

  కాశ్మీరు పండితుల సమస్యకు జె.కె.ఎల్.ఎఫ్ లాంటి సంస్ధలు ఎన్నడో పరిష్కారం చెప్పాయి. వారిని తక స్వస్ధలాలకు తిరిగి రమ్మని కోరాయి. కాదు మేం రాము. మాకక్కడ రక్షణ లేదని పండిట్లు చెబుతున్నారు. ఈ సమస్యకు ఆచరణే ఒక దారి చూపుతుంది. ఎన్ని చర్చోప చర్చలు చేసుకున్నా ఏ పరిష్కారమూ రాదు. కాశ్మీరీలు, పండిట్లూ చర్చించుకుంటె పరిష్కారం తప్పకుండా వస్తుంది. ఈ లోపు పండిట్ల పేరున మనం ఆవేశపడినా లాభం ఉండదు.

 5. 1947 వరకూ హైదరాబాద్‌ నిజాం, తిరువాంగూరు రాజు, భోపాల్‌ నవాబు ఇలా చాలా చాలా మంది స్వతంత్రంగానే ఉన్నారు. మరి అక్కడి రాజులు ఏ ప్రజాభిప్రాయంతో భారతదేశంలో విలీనం అయ్యారు.? ఇప్పుడు ప్రత్యేక దేశం అడిగివాడికల్లా అడిగినట్టు ఇచ్చెయ్యాలంటారా..? అలా అంటే కాశ్మీరొక్కటే కాదు, ఖాలిస్థాన్‌, గ్రేటర్‌ నాగాలేండ్‌, ద్రవిడనాడు, దళితస్థాన్‌, ఆదివాసీ భూమి.. ఇలా చాలా మొదలైపోతాయి..! వీటన్నిటికీ కూడా ప్రజామద్దతు వచ్చేస్తుంది. కావాలనుకుంటే..!మరి ఇంకెందుకు ఆలస్యం…? దేశాన్ని ముక్కలు చేసేయ్యండి.. చైనా “టిబెట్‌” దురాక్రమణ చేసిందంటే ఒప్పుకోనివాళ్లందరూ భారతదేశం కాశ్మీరుని ఆక్రమిచేసిందని వాగుతూంటే “దెయ్యాలు వేదం వల్లించినట్టు” ఉంటుంది.
  సి.పి.ఐ, సి.పి.ఎం., మావోయిస్టులుగానీ, అరుంధతీరాయ్‌ వంటి మేధావులు(?)గానీ “టిబెటన్ల” స్వాతంత్ర కాంక్ష గురించి మాట్లాడమనండి ముందు..! ఆ తర్వాత కాశ్మీరు సంగతి..!

  ఎందుకంటే చైనా చేసిన దురాక్రమణ ఎంత క్రూరమైనదో ప్రపంచం మొత్తానికీ తెలుసు..! “దలైలామా”వంటి పెద్దమనుషులు, మతగురువులు ప్రత్యేకంగా వకాల్తా పుచ్చుకోవల్సిన ఖర్మ చైనా వల్లా, అరుంధతీ రాయ్‌ వంటి స్వయంప్రకటిత మేధావుల వల్లనే వచ్చింది.

  ఇంకపోతే, కాశ్మీరు పండితులు వెనక్కి పిలిస్తున్నాయి కొన్ని సంస్థలు అంటున్నారుగా..! వాటి పిలుపుల సంగతి , లోయని వదిలేసినవాళ్ల సంగతీ పక్కన వుంచండి.. శ్రీనగర్‌ లో నిరాశ్రయుల శిబిరాల్లో ఉంటున్నవారి పరిస్థితే ఇంకా మెరుగుపడలేదు. మిగిలినవాళ్లు ఎందుకు వెనక్కి వెళతారు.? ప్రతీ సంవత్సరం ఢిల్లీకి వచ్చే నిరాశ్రయుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఆ మాటకొస్తే అసలు ఢిల్లీ జనాభా మొత్తం నిరాశ్రయులతోనే ఉందనవచ్చు. దేశవిభజనకి ముందు 6-7 లక్షలుండే ఊరు 1947లోనే సుమారు 8 లక్షలకి పైగా నిరాశ్రయులతో నిండిపోయింది. అప్పట్నుంచీ మొదలైంది, పాకిస్థాన్‌ అల్లర్ల సమయంలోనూ, ఆఫ్ఘనిస్థాన్‌ లోని తాలిబన్ల పాలనలోనూ, కాశ్మీరు కల్లోలాల వలన నిరాశ్రయులైనవారు నిరంతరం వస్తూనే ఉన్నారు. ఢిల్లీ మురికివాడలు ఒక్కసారి చూస్తే తెలుస్తాయి వారి దీనగాధలు.

  దేశరాజధానిలో ఉన్నవారి కష్టాలు పట్టించుకోవడం మానేసి, కాశ్మీరు ప్రజలు చాలా అమాయకులూ, స్వేచ్ఛాపిపాసులూ, టపాసులూ, కాకరపువ్వొత్తులూ, మతాబాలూ అంటే ఉపయోగం ఏముందీ?

 6. గీత గారూ, మీరు చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. “కాశ్మీరు ప్రజలకు తమ భవిష్యత్తుని నిర్ణయించుకునే హక్కు ఉంది. వారికి తాము ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కుంది. ఆ దిశలో మొదటి అడుగు కాశ్మీరునుండి మిలట్రీని ఉపసంహరించాలి”.అని అమే ఒక ఉపన్యాసంలో పాల్గోని తన అభిప్రాయాని వెలిబుచ్చారు. మీకు అమే మీద ఉన్న వ్యతిరెకతతో చర్చను పక్కదారి పట్టిస్తే ఎలాగండి.

 7. నమస్తే..! విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిజానికి “కాశ్మీరు” మీరనుకున్నంత చిన్న సమస్యకాదు. దానితో ఎన్నెన్ని విషయాలు ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవాలి మీరు.
  ఈ క్రింది టపాలో దీని మీద పెద్ద చర్చే జరిగింది. వీలుంటే వెళ్లి చూడండి.
  http://malakpetrowdy.blogspot.com/2011/10/blog-post_12.html

  //ఆ దిశలో మొదటి అడుగు కాశ్మీరునుండి మిలట్రీని ఉపసంహరించాలి//

  కాశ్మీరు విషయంలో భారతదేశం మొదటి అడుగు వెయ్యడమే కాదు. ఇతర దేశాలు వేయాల్సిన అడుగులకోసం ఎంతో సహనంతో ఎదురుచూస్తోంది. “కాశ్మీరు” కి ప్రత్యేక హోదా ఇవ్వడమే నేననే మొదటి అడుగు. “కాశ్మీరు” విషయంలో భారతదేశాన్ని ఏ దేశమూ కూడా వేలెత్తి చూపలేదు. వియత్నాం, టిబెట్‌ ప్రాంత ప్రజలు తప్పితే. అందుకే చైనా, పాకిస్థాన్‌ లు యిలా దొడ్డిదారిన దెబ్బతీయాలని చూస్తున్నాయి..అరుంధతీ రాయ్‌ వంటి మేధావుల రూపంలో..!
  మీరనే మొదటి అడుగు పాకిస్థాన్‌, చైనా దేశాలు వేయాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ఈ విషయం తేలదు.

 8. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేముందు బ్రిటిష్ వాడు పాకిస్ధాన్ ను విభజించడంతో పాటు స్వతంత్ర సంస్ధానాలకి మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. బ్రిటిష్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి స్వతంత్ర సంస్ధానాల భవిష్యత్తు ఆధారపడి ఉండకూడదు వాస్తవానికి కాని జరిగిందేమిటని మాట్లాడుకోవడం కోసం ఆ ప్రస్తావన తేవాల్సి వస్తోంది. ఒకటి ఇండియాలో విలీనం కావడం, రెండు పాక్ లో విలీనం కావడం, మూడు స్వతంత్రంగా ఉండడం. చాలా సంస్ధానాల్ని అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ బలవంతంగా హెచ్చరించి, బెదిరించి ఇండియాలో కలిపేసుకున్నాడు. అందుకే ఆయన్ని ఉక్కుమనిషి అని కూడా మనం పిలుచుకుంటాం. అది వేరే సంగతి. కాని కాశ్మీరు, హైద్రాబాద్ విషయాల్లో తేడా వచ్చింది. హైద్రాబాద్ పాకిస్ధాన్ లో కలుపుతానని నిజాం చెప్పడంతో పటేల్ సైనిక చర్య జరిపాడు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో భూస్వాములనుండి ప్రజలు ఆక్రమించుకున్న భూముల్ని ప్రజలనుండి లాక్కుని మళ్లీ భూస్వాములకి ఇచ్చే కార్యక్రమం కూడా సైనిక చర్యలో జరిగింది. తెలంగాణ విలీనాన్ని ‘విమోచన’ అని పిలుచుకుంటున్నారు.

  కాశ్మీరు విషయంలోనూ పేచీ వచ్చింది. మహారాజా హరిసింగ్ అప్పటివరకూ కాశ్మీరు ఎలా ఉందో అలాగే (స్వతంత్రంగా) ఉండడానికే ఇష్టపడ్డాడు. కాని పాకిస్ధాన్, గిరిజన తెగలకి ఆయుధాలిచ్చి తన సైన్యాన్ని కూడా పంపి కాశ్మీరుపైన దాడి చేయించింది. అందువలన కాశ్మీరు ప్రజలు అప్పట్లో పాకిస్ధాన్ దురాక్రమణను వ్యతిరేకించారు. పాక్ ఆక్రమణను తిప్పికొట్టలేని పరిస్ధితుల్లో హరిసింగ్ భారత్ సాయం కోరాడు. కాశ్మీరు సంస్ధానం ఉన్న బలహీన పరిస్ధితిని నెహ్రూ బాగా ఊపయోగించుకున్నాడు. ఇండియాలో కలిస్తేనే రక్షిస్తా అన్నాడు. కాని అది హరిసింగ్ కి గానీ, కాశ్మీరు ప్రజలకి గానీ ఇష్టం లేదు. ఈ లోపు పాక్ సైన్యం దాదాపు శ్రీనగర్ సరిహద్దులదాకా వచ్చేశాయని వార్తలొచ్చాయి. అప్పుడు హరిసింగ్ అయిష్టంగా నెహ్రూతో (ఇండియాతో) ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం

  –॥కాశ్మీరు ఒక దేశంగా కొనసాగుతుంది. ఇండియా సహాయానికి గాను కాశ్మీరు దేశానికి సంబంధించిన హోం, విదేశీ, మిలట్రీ శాఖలు ఇండియా నిర్వహణలో ఉండాలి. సమస్య సమసిపోయాక కాశ్మీరులో ఫ్లెబిసైట్ నిర్వహించి దాని ప్రకారం కాశ్మీరు పాకిస్ధాన్, ఇండియాల్లో ఒక దానిలో కలవాలా లేక స్వతంత్రంగా ఉండాలా అన్నది నిర్ణయించాలి.॥–

  ఒప్పందం ప్రకారం ఇండియా సైన్యం పాక్ సైన్యానికి ఎదురెళ్ళింది. అప్పుడే సమితి ఆధ్వర్యంలో ‘కాల్పుల విరమణ’ ప్రకటించారు. రెండు సైన్యాలూ కలిసిన చోట ‘ఆధీన రేఖ’ గీశారు. యుద్ధం ముగిసింది. ఐదు సంవత్సరాల పాటు కాశ్మీరుకి ప్రధాని, రాష్ట్రపతి ఉన్నారు. (ఇప్పటికీ అజాద్ కాశ్మీరుకి రాష్ట్రపతి, ప్రధాని ఉన్నారు, నామమాత్రంగానే అయినా) అప్పటి కాశ్మీరీల నాయకుడు షేక్ అబ్దుల్లా ఒప్పందం ప్రకారం ఫ్లెబిసైట్ జరపాలని కోరాడు. (అబ్దుల్లా, హరిసింగ్ రాచరికపు పాలనకు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు జరిపి అరెస్టయ్యి జైలు జీవితం గడిపాడు. అంటే కాశ్మీరులో ప్రజాస్వామిక విప్లవం కోసం కూడా అబ్దుల్లా కృషి చేసాడని ఇక్కడ గుర్తించాలి. భూస్వామ్య, రాచరిక పాలనకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటాలు లేదా విప్లవాలని ప్రజాస్వామిక పోరాటాఉ లేదా విప్లవాలు అంటారు) ఆ నేరానికి నెహ్రూ ఆయన్ని జైల్లో పెట్టాడు. ఆ విధంగా అబ్దుల్లా మొత్తం పదిహేడు సంవత్సరాలకు పైగా జైల్లో గడిపాడు. కాశ్మీరుకోసం పోరాడిన ఆయన్ని కాశ్మీరు సింహంగా (షేర్-ఎ-కాశ్మీర్) కాశ్మీరు ప్రజలు ఇప్పటికీ గౌరవించుకుంటారు.

  అప్పటినుండీ కాశ్మీరు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అబ్దుల్లా లాగే జైల్లో ఉండిపోయింది. ప్రత్యేక ఆర్టికల్ కాశ్మీరు కోసం భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టినా దాన్ని కూడా నామమాత్రం చేశారు. దాని గురించి ఇప్పుడు తలచుకున్నవారే లేరు. ఈ వాస్తవాలు చాలా వరకు భారతీయులకి తెలియదు. చెప్పెవారు లేరు. పాఠ్యపుస్తకాల్లో కాశ్మీరు గురించిన వాస్తవాలకు బదులు అబద్ధాలు ఉంటాయి. ‘కాశ్మీరు భారత్ లో అంతర్భాంగం’ అని భారత దేశ నాయకులు చేసే ప్రకటనలే వాస్తవాలుగా భారత ప్రజల్లో స్ధిరపడిపోయింది. ఆ విధంగా కాశ్మీరు భారత దేశంలో అంతర్భాగం అయింది తప్ప ఇష్టపడి కాదు. సాయం కోరి వచ్చిన కాశ్మీరుని నెహ్రూ చెరపట్టాడని కాశ్మీరు ప్రజలు నమ్ముతున్నారు.

  కాశ్మీరు కావాలనుకుంటే భారత దేశం బలవంతంగా లాక్కోవడం కాకుండా అక్కడి ప్రజల మనసులను గెలుచుకోవాలి. భారత దేశంలో కాశ్మీరీల హక్కులు భద్రం అని నమ్మకం కలిగించాలి. దానికి బదులు భారత ప్రభుత్వాలు మిలట్రీ కాపలాని అందించాయి. నిరంతరం నిర్భంధం, చిత్రహింసలు, అరెస్టులు, మాయం, చంపుడు లను అమలు చేశాయి. దాని ఫలితమే కాశ్మీరు ప్రజలు ఇప్పటికీ స్వతంత్రం కావాలని కోరుతున్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని మనం ఇష్టంగా చెబుతాం. కాశ్మీరుకి కూడా అదే వర్తిస్తుంది. కాశ్మీరు అంటే సుందర దృశ్యాలు, ప్రకృతి రమణీయత, టూరిజం ఆదాయం ఇవి కాదు. అక్కడ మనుషులు ఉన్నారు. భారతీయులకూ, పాకిస్ధానీయులకీ లేదా అమెరికన్లకు మల్లేనే వారికి ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉన్నాయి. వారికి ప్రాధమిక హక్కులు ఉన్నాయి. వారికి ప్రత్యేక సంస్కృతి -కాశ్మీరీ సంస్కృతి- ఉంది. వారు కాశ్మీరీ అన్న ప్రత్యేక జాతికి చెందిన వారు. నెహ్రూ ప్రవచించిన సిద్ధాంతాల ప్రకారమే, జాతులకు స్వయం నిర్ణయాదికార హక్కులు ఉంటాయి. ఆ హక్కుని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. జాతుల పుట్టుక, పరిణామం, ఆవిర్భావం ఇవన్నీ కూడా జాతులు స్వతంత్ర దేశాలుగా ఏర్పడడానికి దారి తీశాయి. వివిధ దేశాలు ఏర్పడిన క్రమం అదే. ఆ క్రమం ప్రకారమే ఒక దేశంగా కాశ్మీరు మొదటినుండీ ఉంది. ఆ హక్కుని పాకిస్ధాన్, భారత్ లు కాశ్మిరీలకు లేకుండా చేశాయి.

  ఇవీ వాస్తవాలు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు కొన్ని వాస్తవాలని అంగీకరించాలి. ఆ వాస్తవాల ప్రాతీపదికన చర్చించి సరైన అభిప్రాయానికి ఎవరైనా రావాల్సి ఉంటుంది. దానికి బదులు ఇతర సంస్ధానాలు ఏ ప్రజాభిప్రాయంతో కలిసాయి అని సంబంధం లేని ప్రశ్నలు వేస్తే ఏమిటి లాభం? ఇతర సంస్ధానాలు ఇబ్బంది లేకుండా భారతదేశంలో కలిసిపోయాయి. వారి ఆప్షన్ అది. వారు చేసినట్లే కాశ్మీరు చెయ్యాలని చట్టాలేవీ లేవు. అటువంటి చట్టాలు ఉండవు, ఉండరాదు.

  ‘అడిగినవాడికల్లా ఇచ్చెయ్యాలా?’ఏమిటండీ ఈ ప్రశ్న. ఎందుకీ అహంకారం? మనం ఎవరం ఇవ్వడానికి? మనం పుట్టింది ఎ.పిలో. భారత దేశంలో భాగం అని మనం పుట్టినప్పటినుండీ నమ్ముతున్నాం. కానీ కాశ్మీరీలు పుట్టినప్పటినుండీ భారత సైన్యాలని చూస్తూ పెరిగారు. వారి అత్యాచారాలను భరిస్తూ పెరిగారు. తమ ఇంటి పక్క వాళ్ళు ఉన్నట్లుండి మాయమవడం, పక్కూరి వ్యక్తి శవమై ఇంటికి రావడం… ఇలాంటి వాతావరణంలో కాశ్మీరీ యువతీ యువకులు పుట్టి పెరిగారు. వారికి భారత్ అనగానే సైన్యం, వారి అకృత్యాలు గుర్తొస్తాయి తప్ప దేశం గుర్తుకు రాదు. అందులో తాము భాగమని వారెలా అంగీకరిస్తారు? బూటుకాలికింద అణిగిమణిగి పెరిగినవాడు దానికిందనుండి ఎప్పుడు బైటపడదామా అని చూస్తాడు తప్ప అది కొనసాగాలని కోరుకోడు. కాశ్మీరీల పరిస్ధితీ అదే. అందుకే అక్కడ మొదట సైన్యాన్ని తొలగించమంటున్నది. సైన్యాన్ని తొలగించి భారత దేశం అంటే సైన్యం, వారి అకృత్యాలు కాదని చూపాల్సి ఉంది. కాశ్మీరీల ప్రజాస్వామిక హక్కులు కాపాడబడతాయి అని హామీ ఆచరణ రీత్యా ఇవ్వాల్సి ఉంది. అప్పుడే కాశ్మీరు ప్రజలను గెలుచుకోగలుగుతారు.

  లేని డిమాండ్లను ప్రస్తావించి ఉన్న డిమాండ్లను హేళన చేయడం, ఆయా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఎగతాళి చెయ్యడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు చెయ్యదగ్గపని కాదు. మీరు ముందా ధోరణిని తొలగించుకోవాలి. ప్రజల డిమాండి తప్పైనా ఒప్పైనా గౌరవించ గలిగితేనే ఆ డిమాండ్ల మంచి చెడ్డల గురించి సరిగ్గా మాట్లాడగలం. మీ వ్యాఖ్యానం అంతా వ్యక్తులపైనా వ్యంగ్యం తోనూ, ఎగతాళితోనూ, ద్వేషంతోనూ నిండి ఉంది.

  మీకొక ఉదాహరణ చెబుతాను. రష్యా విప్లవం వచ్చినపుడు అక్కడి సోషలిస్టు ప్రభుత్వం జాతులకు విడిపోయే హక్కుని కల్పించింది. సోవియట్ రష్యాలో అనేక జాతులు ఉన్నాయని మీకు తెలుసని భావిస్తున్నాను. బాల్టిక్ రిపబ్లిక్స్ అని పిలిచే లాత్వియా, లిధువేనియా, ఎస్తోనియా లు ఆ హక్కుని వినియొగించుకుని విడిపోయాయి. కానీ మూడు సంవత్సరాలు తిరగక ముందే సోవియట్ రష్యాలోనే తమకు రక్షణ ఉంటుందని గమనించి తిరిగి వచ్చి కలిసిపోయాయి. అవి తప్ప ఏ జాతీ (కజక్, తజక్, తుర్కులు, అజర్ బైజాన్, ఉక్రెయిన్ ఇలా అనేక జాతులు అక్కడ ఉన్నాయి) సోవియట్ రష్యానుండి విడిపోలేదు. అక్కడ స్టాలిన్ చనిపోయాక సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఆగిపోయింది. కృశ్చెవ్ కాలం నుండి పెట్టుబడిదారీ వ్యవస్ధ పునరుద్ధరించబడింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో జాతుల అణచివేత సాధారణంగా జరుగుతుంది. పెట్టుబడిదారులు తమ లాభాల కోసం జరిపే అన్వేషణలో అనివార్యంగా జాతుల ఆకాంక్షలను ఆణచివేస్తారు. దానితో మళ్ళీ రష్యానుండి విడిపోవాలని అక్కడి జాతులు డిమాండ్ చేసి యెల్ట్సిన్ కాలానికి బైటికి వచ్చేశాయి. అది కూడా రష్యా అంగీకారంతో కాదు. తమకు తామే స్వతంత్రం ప్రకటించుకుని విడిపోయాయి. జాతుల ఆకాంక్షలు, వారి స్వాతంత్ర్యాభిలాష, వారి భవిష్యత్తు, జాతి హక్కులు వీటన్నింటి గురించి ముందు తెలుసుకుని సరైన అభిప్రాయాలు ఏర్పరుచుకోకపోతే మీలాగే జాతుల ఆకాంక్షల పట్ల ఎగతాళి ధోరణి వ్యక్తం చేస్తుంటారు.

  కాశ్మీరుకి స్వతంత్రం ఇవ్వగానే ఇతర రాష్ట్రాలన్నీ అలా డిమాండ్ చేస్తాయనడం వాస్తవం కాదు. ఒక ప్రజాస్వామిక డిమాండ్ ని పరిశీలించకుండా మరొక లేని డిమాండ్ ని అడ్డు పెట్టడం సరైంది కాదు. జాతులను అణచిపెట్టి ఉంది దేశాన్ని జాతుల బందిఖానాగా మార్చడం వల్ల సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయ్యింది. కాశ్మీరుని గూడా ఆదే విధంగా బందిఖానాలో పెట్టడం వల్ల అక్కడ స్వాతంత్ర్యాభిలాష పెరుగుతోందే తప్ప తరగడం లేదు. వారి హక్కులని గుర్తించనంతకాలం ఏదో రూపంలో కాశ్మీరులో అలజడి రేగుతూనే ఉంటుంది.

  నాకు తెలిసినంతవరకూ టిబెటన్ల స్వాతంత్ర్య కాంక్షని మావోయిస్టులు బలపరుస్తున్నారు. జాతుల స్వయం నిర్ణయాధికర హక్కుని వారు గుర్తిస్తారని నేను విన్నాను. సి.పి.ఐ, సి.పి.ఎం లను ఎందుకు కలిపారు? వారు కాశ్మీరు స్వాతంత్ర్యాన్ని సమర్ధించరని మీకు తెలియదా? ముందు అవి తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందేమో చూడండి. ముందు వెనకల కాదు. వివిధ సమస్యలపైన ఒక సమగ్ర దృక్పధాన్ని కలిగి ఉండడం రాజకీయ పార్టీలు, వ్యక్తుల బాధ్యత. దాని ప్రకారమే ఆయా సమస్యలపైన వారు అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఏది ముందు, ఏది వెనక అన్నది ఏమీ ఉండదు. అరుంధతీ రాయ్ తనకు తాను మేధావిగా ప్రకటించుకుందా? వ్యక్తులపై ద్వేషం మితిమీరితే ఇలాగే ఉంటుంది. ఆవిడకి బుకర్ ప్రైజ్ వచ్చినంతవరకూ ఆమె ఎవరో లోకానికి తెలియదు. అంతటితో ఆగిపోతే ఆవిడ పేరు కూడా అంతవరకే ఆగి ఉండేది. కాని ఆమె భారత దేశవ్యాపితంగా వివిధ చోట్ల ప్రజలు చేస్తున్న ఉద్యమాలలో స్వయంగా పాల్గొంది. ఆయా సమస్యలపైన అనేక సెమినార్లలో ప్రసంగించింది. వివిధ ఉద్యమకారులకు మద్దతు ప్రకటించింది. ఆ విధంగా ఆమెకు భారత దేశంలో ఖ్యాతి వచ్చింది తప్ప తనను తాను మేధావిగా ఆమె ప్రకటించుకున్న దాఖలాలైతే ఏమీ లేవు. మీకు తెలిసి ఏమైనా ఉన్నాయా?

  చైనా దురాక్రమణ అని దేన్ని గురించో నాకు అర్ధం కాలేదు. కాశ్మీరు గురించైతే ఆ పని ఇండియా, పాక్ లు గూడా చేశాయని కాశ్మీరీలు భావిస్తున్నారు. కాశ్మీరు గురించి, దాని భవిష్యత్ గురించి అక్కడి ప్రజలకే సర్వహక్కులూ ఉన్నాయి. ఇంకెవరికీ ఆ హక్కులు లేవు, బలవంతంగా లాక్కుంటే తప్ప. అసలు నేనిలా రాయడమే దేశద్రోహం అనే ప్రభుద్ధులున్నారు. వారికి ప్రజాస్వామిక హక్కుల పైన బొత్తిగా గౌరవం లేకపోవడాన్ని అది సూచిస్తుంది.

  శ్రీనగర్ లో నిరాశ్రయులా? ఢిల్లీకి ఏ నిరాశ్రయులు వస్తున్నారు? కాశ్మీరీ పండిట్లా? అబద్ధపు ప్రచారాలను నమ్ముతున్నారేమో ఒక్క సారి సరిచూసుకోండి. ఏ విషయాలని మీరు ప్రస్తావిస్తున్నారు? ఢిల్లీ జనాభా మొత్తం నిరాశ్రయులు అంటే అక్కడ ఉన్నవారంతా కాశ్మీరు పండిట్లనా మీ ఉద్దేశ్యం? పాకిస్ధాన్ అల్లర్లు, ఆఫ్ఘన్ తాలిబాన్లు, కాశ్మీర్ కల్లోలాలు వీటివల్ల ఢిల్లీకి వలసలు పెరిగాయా? ఎక్కడినుండి వలసలు? పాక్, ఆఫ్ఘన్, కాశ్మీర్ నుండి వలసలు పెరిగాయని చెబుతున్నారా మీరు? ఢిల్లీ మురికివాడల్లో కాస్మీరు పండిట్లు నివసిస్తున్నారా? వివరంగా చెప్పండి. మీ బ్లాగ్ల్ లో మీరు “ఏదేదో రాస్తుంటాను” అని రాసుకున్నారు. ఇది కూడా అలాగేనా?

  కోటికి పైగా గల కాశ్మీరు ప్రజల గుణగణాలపైన మీరు చేసిన వ్యంగ్యం వ్యాఖ్యానం మీ గురించి చెబుతోందని భావించవచ్చా? ఒక జాతికి చెందిన ప్రజా సమూహంపై వ్యంగ్యం గా వ్యాఖ్యానించడం బొత్తిగా తగనిపని. దయచేసి ఆ గౌరవాన్ని పాటించండి

  టపాసులు, కాకర పువ్వుత్తులూ అయినప్పుడు మీ స్పందన అనవసరం కదాండీ? విషయాలపైన చర్చించాలి అనుకుంటె మనకు కొంత సంస్కారం కూడా ఉండాలి. అది మీకు ఉందని నమ్ముతున్నాను.

 9. డేవిడ్ గారి వ్యాఖ్యలో కాశ్మీరు చిన్న విషయం అన్న సూచన లేదనుకుంటా గీత గారూ. నిజానికి కాశ్మీరు అంశం పరిష్కారంతో భారత్, పాకిస్ధాన్ లు తమ భద్రతా సమస్యను ముడిపెట్టి కాశ్మీర్ ప్రజలను వేధిస్తున్నాయి. ఆ విషయమే గీతగారు చెబుతున్నట్లుంది. భారత్, పాక్ లు తగువులాడుకుని ఒకరి భద్రతకు మరొకరిని ప్రమాదంగా ఎంచుకుని మధ్యలో కాశ్మీరు ప్రజల స్వతంత్రతను బలి పెట్టడం భావ్యం కాదు కదా.

  మొదటి అడుగైనా, రెండో అడుగైనా అది ఏన్నో అడుగన్న విషయం కాశ్మీరు ప్రజలు ఆమోదించాలి తప్ప వేరెవరూ కాదు. కాశ్మీరు ప్రజల దృష్టిలో వారి చుట్టూ ఉన్న సైన్యం వాళ్ల ఊళ్ళని ఖాళీ చెయ్యడమే మొదటి అడుగు. లేదా అలాంటి అడుగు ఏదైనా సరే. కాశ్మీరులో ఫ్లెబిసైట్ జరుపుతానని ఇచ్చిన హామీ ఇండియా అమలు చేయలేదు. ఈ విషయంలో కాశ్మీరుని చాలామంది వేలెత్తి చూపుతున్నారు.

  ఇండియాకు చైనా, పాక్ లతో ఉన్న సమస్యలను కాశ్మీరు తో ముడిపెట్టి చూసి దానిద్వారా కాశ్మీరు ప్రజల భవిష్యత్తుని నిర్ణయిస్తామనడం అన్యాయమే కదా.

  ఇదే బ్లాగ్ లో కాశ్మీరు విషయమై చాలా చర్చలు జరిగాయి గీత గారు. ఓపిక ఉంటే చూడగలరు.

  కాశ్మీరు ప్రజల ఎదురుచూపుల సంగతే ఎవరూ పట్టించుకోరు.

 10. పాకిస్తాన్ నుండి అక్రమ మర్గాల ద్వారా కాశ్మీర్లో ప్రవేశించి అక్కడ చేస్తున్న ఉగ్రవాద చర్యలు లేకపోతె అరవై సంవత్సరాలు కాదు అరవై రోజులలో భారత సైన్యాలను అక్కడ నుండి ఉపసంహరింపజేయవచ్చు. ఆ తదుపరి కాశ్మీరీ ప్రజలు తమదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, భారతదేశంలో అంతర్భాగంగా.

 11. కిరణ్ గారూ, ఆధీన రేఖకు అవతలి కాశ్మీరు, ఇవతలి కాశ్మీరూ రెండూ 1947 వరకూ ఒకే కాశ్మీర్. బైటినుండి ఇండియా, పాక్ లు వచ్చి కాశ్మీరుని విడగొట్టాయి. నిన్నటివరకూ ఇరుగు పొరుగుగా ఉన్న ఊళ్లు తెల్లారేసరికల్లా శత్రుదేశాల ప్రాంతాలుగా విడిపోయాయని చెప్పారు. ఇరు వైపులా ఉన్నది కాశ్మీరు ప్రజలే. వారి మధ్య బంధుత్వాలు, పక్క ఊరి సంబంధాలు ఉన్నాయి. అటువంటిది మిమ్మల్ని విడగొట్టాం. అవతలి నుండి ఇవతలికి వస్తే టెర్రరిస్టుల కింద జమకట్టి కాల్చేస్తామని చెబితే ఆత్మ గౌరవం ఉన్నవారెవరైనా అంగీకరిస్తారా? అజాద్ కాశ్మీరు నుండి ఇండియా కాశ్మీరుకి వచ్చే కాశ్మీరీలను ఆ విధంగానే ఇన్నాళ్లూ టెర్రరిస్టులని కాల్చి చంపుతూ వచ్చారు. ఇటునుండి అటు పోయే కాశ్మీరీలను అక్కడ కాల్చి చంపుతూ వచ్చారు. ఈ చావులు కాశ్మీరీలకు అవసరంగా తోస్తాయా?

  కాశ్మీరు భారత దేశంలో భాగం అని మనం భావించడం కాదు. కాశ్మీరీలు భావించాలి. కాశ్మీరీలను బలవంతంగా రెండుగా విడగొట్టి శతృత్వాన్ని వారిపై రుద్దితే ప్రతిఘటించకుండా ఎవరైనా ఉంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం రెండు రాష్ట్రాలుగా విడగొట్టాలని కోరితేనే సీమాంధ్రులు అంగీకరించడం లేదు. ఇక రెండు దేశాలుగా విడగొట్టి అది కూడా మిమ్మల్ని కాపాడతామని ఒకరు, మాలో కలవండి అని ఇంకొకరు తగువులాడుకుని విడుగొట్టడం న్యాయమా? అలా గీసిన విభన రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించమని తమతో సంబంధం లేని రెండు దేశాలు చర్చించుకుంటే కడుపు మండదా? మనసు పెట్టి, హృదయం పెట్టి ఆలోచించి వీటికి సమాధానాలు చెప్పుకుంటే కాశ్మీరీల ప్రజల పరిస్ధితి అర్ధం అవుతుంది. ఉగ్రవాద చర్యలని మనం కాదు అనవలసింది. కాశ్మీరు ప్రజలు అనాలి. వారు ఆ చర్యలని ఉగ్రవాద చర్యలని భావిస్తే 1947 లో లాగానే భారత్ సాయం కోరతారేమో. కాని వారలా భావించడం లేదు. పైగా వారిని అమరవీరులుగా కీర్తించుకుంటున్నారు. కాశ్మీరీల భూభాగం అయిన కాశ్మీరు ఎక్కడ ఎలా ఉండాలన్న విషయం పైన ఇక్కడ ఉండి నిర్ణయించడానికీ, దాదాపు కమాండ్ చేయడానికి, తీర్పులివ్వడానికి కూడా సాహసిస్తున్నామంటే ఏ హక్కుతో అలా చేస్తున్నామో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

 12. భాస్కర గారూ, కాశ్మీరు ప్రజల్లాగే టిబెటన్లకు కూడా తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉంటుందన్నదే నా అభిప్రాయం.

 13. //కాశ్మీరుకి స్వతంత్రం ఇవ్వగానే ఇతర రాష్ట్రాలన్నీ అలా డిమాండ్ చేస్తాయనడం వాస్తవం కాదు//
  వాస్తవమో కాదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీకు ఇప్పటి పరిస్థితులూ, మావోయిస్టుల మాటలూ, చర్యలూ చూసినా అర్థం కాకపోతే, వేరే కొత్తగా చెప్పినా అర్థం కాదు.

  //చైనా దురాక్రమణ అని దేన్ని గురించో నాకు అర్ధం కాలేదు.//
  చైనా చేసిన దురాక్రమణ దేనిమీదో అర్థం కాలేదన్నారు. చైనా దేనిమీద దురాక్రమణ చేయలేదో తెలుసుకుంటే సరిపోతుంది. టిబెట్‌ మీద, భారతదేశం మీద, తైవాన్‌ మీద, రష్యా మీద వియత్నాం మీద.. దురాక్రమణలేగా (సైనికంగా కావచ్చు., ఆర్థిక ఆంక్షల రూపంలో కావచ్చు). పాకిస్థాన్‌ తప్ప చైనాకి ప్రపంచంలో ఏ దేశంతో, ఏ దేశప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను.

  //శ్రీనగర్ లో నిరాశ్రయులా? ఢిల్లీకి ఏ నిరాశ్రయులు వస్తున్నారు? కాశ్మీరీ పండిట్లా? అబద్ధపు ప్రచారాలను నమ్ముతున్నారేమో ఒక్క సారి సరిచూసుకోండి. ——————. మీ బ్లాగ్ల్ లో మీరు “ఏదేదో రాస్తుంటాను” అని రాసుకున్నారు. ఇది కూడా అలాగేనా?//
  అబద్ధపు ప్రచారాలేమో చూసుకొమ్మంటున్నారు. నేను ఏడాదిన్నరగా ఉత్తరభారతదేశంలోనే ఉంటున్నాను. నా మిత్రుల్లో కాశ్మీరులో పుట్టి, “స్వతంత్ర” కాశ్మీరు అనే ఉద్దేశ్యాలు ఉన్నవాళ్ళూ ఉన్నారు, (పైకి చెప్పకపోయినా మాటలబట్టి అర్థం అయ్యిందదే), అక్కణ్నుంచి పారిపోయి వచ్చినవాళ్లూ ఉన్నారు. “ఢిల్లీ” జనాభా మొత్తం నిరాశ్రయులతో నిండి ఉండవచ్చు అని నేను మాటవరసకు అన్నాను. నిజం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఢిల్లీరోడ్లమీద తిరిగినవాణ్ణి.కనుకనే కొద్దిగా ఐడియా ఉంది.”అరోరా” అని ఇంటి పేరున్నవాళ్లూ, “సెహగల్‌” అని ఇంటిపేర్లున్నవాళ్ళూ..ఇలా చాలామంది నిజానికి ఈ (ప్రస్తుత) భారతభూభాగానికి చెందినవాళ్లు కాదు. ఆఫ్ఘనిస్థాన్‌ నుండి, పాకిస్థాన్‌ నుండి వచ్చినవాళ్లు.
  ఇంకపోతే నా బ్లాగులో “ఏదేదో రాస్తూ ఉంటాను”..అన్నాను.. అది నిజమే కానీ, అది నా బ్లాగులో., మీకు అర్థం కాకపోతే (లేదా నచ్చకపోతే) నా వ్యాఖ్యని ప్రచురించడం మానెయ్యాలి. అంతేగానీ ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకూ సబబో మీరే ఆలోచించుకోండి.(BTW నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు)

  నాది అహంకారమో, అహంభావమో..,ఏదైనా కావచ్చు.
  నా దేశం గురించి “కాశ్మీరు” టూ “క న్యాకుమారి” అని చిన్నప్పణ్నుంచి అనుకుంటూ పెరిగినవాణ్ని. అందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒళ్లు మండుతుంది.

 14. గీత గారూ

  “వాస్తవమో కాదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీకు ఇప్పటి పరిస్థితులూ, మావోయిస్టుల మాటలూ, చర్యలూ చూసినా అర్థం కాకపోతే, వేరే కొత్తగా చెప్పినా అర్థం కాదు.”

  ఏమిటీ వ్యాఖ్య? దీన్ని అహంకారం అనాలా, ఇంకేం అనాలి? తమరు నాకు చెప్పడం ఏమిటి? నేను అర్ధం చేసుకోవడం ఏమిటి?
  చర్చించాలనుకుంటే అందుకు సదా ఆహ్వానితులు. కాదు ‘నా పైత్యం గుమ్మరిస్తాను. నువ్వు అర్ధం చేసుకుని తీరాలి’ అని చెప్పదలుచుకుంటే, సారీ. అందుకు ఇక్కడ స్ధానం లేదు. మీలాగా అర్ధం పర్ధం లేని పైత్యం కుమ్మరించేవాళ్ళూ లేకపోలేదు. అక్కడికెళ్ళి సాధ్యమైనంత కుమ్మరించుకుని పరవశించండి. అంతే తప్ప ఇక్కడికొచ్చి నాకు అర్ధం చేయిస్తాననడం ఏమిటి?

  మీరు వ్యాఖ్య చేస్తున్న పద్ధతిని సవరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ వ్యాఖ్యానాన్ని బట్టే నా స్పందన కూడా ఉంటుందని మర్చిపోకండి. వ్యంగ్యం చేయడం మీ అంత కాకపోయినా, కొద్దో గొప్పో అందరూ చేయగలుగుతారు.

  చైనా సంబంధాల గురించి నేను చర్చించడం లేదు. నేనీ పోస్టు లో రాయలేదు కూడా. చైనా గురించి తెలుసుకోవలనుకున్నప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తాను.

  ఏడాదిగా ఉత్తర భారతంలో ఉంటేనో, కాశ్మీరు మిత్రులు ఉంటేనో ఢిల్లీలో ఎవరు ఉంటున్నారో తెలిసిపోతుందన్నమాట? మీ అంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు గానీ, సర్వే చేసి ఎవరైనా రాస్తే చదివి తెలుసుకోగల జ్ఞానం మాత్రం ఉంది. ఊరికే ఊహించి చెప్పే మాటల్ని కాకుండా నిజంగా సర్వే చేసి చెప్పే విషయాలని మాత్రమే నమ్మాలన్న మూఢనమ్మకం కూడా ఉంది మరి. ఏవో నా నమ్మకాలు నావి. ఢిల్లీ రోడ్లమీదు తిరుగుతూ, ఇంటి పేర్లను బట్టి మీరు వాస్తవాలేమిటో గ్రహించి నిర్ధారించుకోగల శక్తి మీకు ఉండవచ్చు. కాదనను. కాని నాకు మాత్రం అటువంటి ఊహాలను వెంటనే నమ్మగల శక్తి మాత్రం ఇంక అబ్బలేదు. జనాభా లెక్కలు లాంటి వివరాలు, సంబంధిత సమస్యలపైన సర్వేలు చేసిన వివరాలు నమ్మడం మాత్రమే ఇంతవరకూ నాకు తెలిసింది.

  భారత భూభాగం నుండి పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ లకు వెళ్లినవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒకదేశం నుండి మరొక దేశానికి వలసలు జరగడం సాధారణం. భారత దేశంనుండి పనుల కోసం గల్ఫ్ దేశాలకు అనునిత్యం బోలెడుమంది వెళ్తుంటారు.

  వ్యాఖ్య అర్ధం కాకపోతే అర్ధం కాలేదని చెప్తాను కాని ప్రచురించడం ఎలా మానేస్తాను? మీరు వ్యాఖ్య రాసింది ప్రచురించడానికే గదా? మానెయ్యమంటారేమిటండీ బాబూ? నేను ఏ విధంగా ప్రవర్తించాను? మీ వ్యాఖ్యలు ఒకసారి చూసుకొండి ఎంత వ్యంగ్యంగా, ఆధిక్యతా భావంతో ఉన్నాయో. ఇలాంటి వాళ్ళతో వేగి వేగి ఉన్నందున నాకు కొన్ని పద్ధతులు అలవడ్డాయి మరి. కాశ్మీరు, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ తదితర దేశాలకు సంబంధిచి రాసేటప్పుడు కొంతమంది వెధవలు బూతులు తిడుతూ కూడా రాస్తుంటారు. వారితో పోలిస్తే మీరూ చాలా చాలా బెటర్ కదండీ అందుకే ప్రచురించాను. వద్దనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసుకదా?

  “నా దేశం గురించి “కాశ్మీరు” టూ “కన్యాకుమారి” అని చిన్నప్పణ్నుంచి అనుకుంటూ పెరిగినవాణ్ని. అందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒళ్లు మండుతుంది.”

  మరే. మండడం తెలిసింది మీ ఒంటికే గదా! అఖంఢ భారత్ అంటూ కంఠతా పడుతూ పెరిగినవాళ్లూ చాలామంది ఉన్నారు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్, కాశ్మీర్ ఆ మాటకొస్తే భారత దేశం నుంది కూడా ముస్లింలంతా వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్న అధములూ ఉన్నారు. వారికిక ఒళ్ళు ఏ స్ధాయిలో మండుతోందో. (ఆ వేడితో విద్యుత్ ప్రాజెక్టులు కట్టొచ్చేమో కదా)

  గీత గారూ మీ ఒళ్లుమంటని ఇతరుల మీద చూపించడం ఏమిటి? మీరు ఏదో అనుకుని పెరిగితే అంతా అనుకోవాలని డిమాండ్ చెయ్యడం ఏమిటి? మనం ఉంటున్నది ప్రజాస్వామ్య వ్యవస్ధ అనీ, అందులో ప్రతి పౌరుడికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందనీ, అభిప్రాయ భేదాలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలనీ… తెలుసుకుని మసులుకోవాలని మీ పండిత బుర్రకి తట్టడం లేదా? మీ అనుకున్నవన్నీ వాస్తవాలు కానవసరం లేదని తట్టడం లేదా? అటువంటి నమ్మకాలు మీకు గొప్పవైతే కావచ్చు. ఇతరులకి కాదు. ముఖ్యంగా నాకు అస్సలు కాదు. అటువంటి బుర్రతక్కువ అశాస్త్రీయ భావాలను నా బ్లాగులో రాస్తాను అంటె నేను ఇష్టపడను. తగిన సమాధానం రాసి తీరుతాను. సమాధానం అఖ్కర్లేదు అనుకుంటె అసలు రాయడమే మానెయ్యండి. అంతే తప్ప “నేను రాసేది రాస్తాను. ఇష్టంలేకపోతే ప్రచురించొద్దు” అనడం ఏమిటి? (నేను బ్లాగు మొదలెట్టిన కొత్తలో కొందరు పనికిమాలిన వెధవలు ఇలాగే రాశారు. వారికి మీకు చెప్పినట్లు సరళంగా కాకుండా ఇంకా గట్టిగా చెప్పాన్లెండి) మీకున్న హక్కులు ఇతరులకీ ఉంటాయి కదా? ఇంటర్నెట్ లో ఎదుటి వ్యక్తి ప్రత్యక్షంగా లేరు కదాని మీ ఇష్టం వచ్చినట్లు రాస్తానంటే ఎలాగండీ?

  ఇంతకీ మీరు రాసిందే వేదమన్న ధోరణే తప్ప నేను లేవనెత్తిన అంశాల గురించి ఒక్క ముక్కైనా చెప్పారా? చర్చకు పూనుకున్నారా? ఎందుకు పూనుకుంటారు? మీలాంటివారికి ‘తా మునిగింది గంగ, తా వలచింది రంభ’.

 15. మీకు చెప్పదగినవాణ్ని కాదని నాకు ముందు నుండీ అనిపించినా, ఆవేశంకొద్దీ రాసిన వ్యాఖ్యలో, ఒక్క చోట ఉన్న వ్యంగ్యాన్ని ఎత్తి చూపించి., చాలా మంచిపని చేసారు.
  నాది పండిత బుర్రా కాదు. నేను పండితుణ్ణీ కాదు..
  మా భావాలు బుర్రతక్కువ అశాస్త్రీయ భావాలని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు (వ్యంగ్యం కాదు.. సీరియస్‌ గానే)
  అందుకే ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తున్నాం..!

  రోడ్లమీద తిరిగితే తెలిసిపోతుందా..అనే ప్రశ్నకి (లేదా అనుమానానికి, అభిప్రాయానికి)..నేనివ్వగలిగే సమాధానం, మిమ్మల్ని సంతృప్తి పరచగలిగే సమాధానం నా దగ్గర లేదు. సమాచారాన్ని సేకరించుకోడానికి ఎవరికుండే “వనరులు” వారికుంటాయి. మనది కరెక్టు పక్కనోడిది తప్పు అనేలా నేనెక్కడా రాయలేదు. మీకలా అనిపిస్తే నేనేమీ చేయలేను.ప్రతీ ఒక్కడి “భావప్రకటనా స్వేచ్ఛ” ఉంటుందని నాకు తెలియకపోవడం ఏం లేదు. మీ స్వేచ్ఛకు నేనే విధంగా భంగం కలిగించానో చెబితే సరిచేసుకోడానికి ప్రయత్నిస్తాను.

  నా ఒళ్లుమంటని ఇతరుల మీద చూపించడం ఏంటని అడుగుతున్నారు..? ఇటువంటివాటికి సమాధానం చెప్పగలిగే జ్ఞానం నాకింకా రాలేదు.

  నేను వ్యాఖ్య చేస్తున్న పద్ధతిని సవరించుకోవలసి ఉందన్నారు. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. రాకపోతే తప్పుకుంటాను.

 16. గీత గారూ, మీరన్నది నిజం. ‘సమాచారాన్ని సేకరించుకోవడానికి ఎవరి వనరులు వారికుంటాయి.’ కాని ఎన్ని వనరులు ఉన్నా వాస్తవం అన్నది ఎల్లపుడూ ఒక్కటే.

  అందువల్ల మనకు ఉన్న వనరులను కూడా పరీక్షలకు గురిచెయ్యవలసిన అగత్యం ఉంది. ఇప్పటి సమాచార విప్లవ యుగంలో, ప్రజలలో అనేక భావాలు చొప్పించడానికి దాదాపు అన్ని రాజకీయ, మత భావాల వాళ్లు శాయశక్తుల ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ అగత్యం మరింత అవసరంగా ముందుకొచ్చింది. దాదాపు పత్రికలన్నీ వార్తలు రాస్తున్నట్లు రాస్తూనే అవి నమ్మిన భావాలని చొప్పిస్తూ వాటి పని అవి చేసుకుపోతున్నాయి. ఛానెళ్ళూ, ఇంటర్నెట్టూ ఇక సరేసరి. ఇన్నింటిలో నిజం ఏదని తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అందుకనే ఒక దృక్పధం వినగానే నమ్మక ఇతర దృక్పధాలను కూడా విని ఆలోచించి నిర్ధారించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం మన బుర్రలని అన్ని వేళలా, అన్ని రకాల దృక్పధాలకీ తెరిచి ఉంచాలి. నాలుగైదు దృక్పధాలు విన్నపుడు మనలో సహజంగా ఉండే తెలివిడి (ఇంట్యూషన్) ఏది వాస్తవానికి దగ్గరగా ఉన్నదో సూచనలు ఇస్తుంది. దాన్ని అంతరాత్మ గొంతు అనవచ్చునేమో. ఆ అంతరాత్మ గొంతు నొక్కకుండా పని చేయనిస్తే మనకు పూర్తిగా కాకపోయినా కొంతైనా వాస్తవం అర్ధం అవుతుంది. ఇది నా అనుభవంలో తెలుసుకున్నది. మీకు నచ్చితే స్వీకరించండి లేకుంటే వదిలెయ్యండి.

  మీ ఒళ్ళుమంట ఎదుటివాడి భావ ప్రకటనా స్వేచ్ఛను గుర్తించడం లేదని మీకు తోచడం లేదా?

  నేను ఇప్పటికి ఈ బ్లాగ్ ప్రారంభించినప్పటినుండి చాలా దూషణలు, బూతులు ఎదుర్కొన్నాను. ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను. దూషణలు చేసేవారు అనేక పేర్లు పెట్టుకుని వచ్చి మళ్లీ మళ్ళీ వెకిలిరాతలు రాస్తున్నారు. ఆ నేపధ్యంలోనే మీ వ్యాఖ్యపట్ల పరుషంగా స్పందించవలసి వచ్చింది. అంతేతప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని బాధించాలన్న కోరిక నాకు లేదని గమనించండి.

 17. వెంకట్ గారూ, ప్రజలు సవ్యంగా లేకపోవడం అంటే ఏమిటి? చెప్పగలరా?
  ప్రజలు సవ్యంగా లేనందుకేనా మణిపూర్ లో ఆడవాళ్ళను రేప్ చేసింది?
  ప్రజలు సవ్యంగా లేనందుకేనా కాశ్మీరు లో పౌరులను చంపి తీవ్రవాదులని చెప్పి ప్రమోషన్లు సంపాదిస్తున్నది?
  ప్రజలు సవ్యంగా లేనందుకేనా విశాఖ పట్నం జిల్లా ఏజన్సీలో వాకపల్లిలో గిరిజనులను మూకుమ్మడిగా రేప్ చేసింది?
  ప్రజలు ఏం చేశారని బెంగాల్ లో నందిగ్రామ్ లో ప్రజల్ని చంపేశారు?
  ప్రజలు ఏం చేశారని బెంగాల్ లోనే లాల్ ఘర్ లో ఆడవాళ్ళను రేప్ చేయడమే కాక, పిల్లలను నక్సలైట్లని చెప్పి జైల్లో పెట్టారు?
  ఒరిసాలో ప్రజలేం చేశారని వాళ్ళ భూములు లాక్కోని పోస్కో కి ఇచ్చేశారు?
  సోంపేట ప్రజలు ఏం చేశారని ఇద్దర్ని కాల్చి చంపారు?
  కాకరాపల్లి ప్రజలు ఏం చేశారని పోలీసులతో కొట్టించారు?
  మళ్లీ అడుగుతున్నాను. ప్రజలు సవ్యంగా లేకపోవడం అంటే ఏమిటి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s