గత శుక్రవారం, నవంబరు 11 వ తేదీన వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన నేరానికి 21 సంవత్సరాల యువకుడిపై అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడిపై హత్యా ప్రయత్నం నేరం మోపింది. బారక్ ఒబామాను “క్రీస్తు వ్యతిరేకి” గానూ, “దయ్యం” గానూ ‘అస్కార్ ఒర్టెగా-హెర్నాండెజ్ గా అభివర్ణించినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ పై కాల్పులు జరిగిన అనంతరం వైట్ హౌస్ అధికారులు వెంటనే కాల్పుల గురించి స్పందించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి కారులో పారిపోయినట్లుగా వార్తలు వెలువడ్డాయి తప్ప పూర్తి వివరాలు పత్రికలు వెల్లడించలేదు. నిందితుడిని కోర్టులో హాజరు పరచడంతో కోర్టు రికార్డులను బట్టి పత్రికలు ఈ శుక్రవారం వార్తలు ప్రచురించాయి.
వైట్ హౌస్ పైన గత శుక్రవారం రాత్రి కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు బారక్ ఒబామా, అమెరికా ప్రధమ మహిళ మిచెల్లే ఒబామా లు వాషింగ్టన్ లో లేరు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇదాహో, ఇదాహో ఫాల్స్ నివాసితుడైన ఆస్కార్ ఒర్టెగా-హెర్నాండెజ్ ను పిట్స్‌బర్గ్ లోని ఫెడరల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. అక్కడి జడ్జి అతనిని వాషింగ్టన్ కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆదేశించాడు. హెర్జాండెజ్ ను బుధవారం (నవంబరు 16) పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇండియానాలో ఒక హోటల్ లో అరెస్టు చేసారు.
శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఒక బుల్లెట్ వైట్ హౌస్ కిటికీ అద్దానికి తగిలిందనీ, కాని రక్షణాత్మక బాలిస్టిక్ గ్లాస్ కావడం వలన బుల్లెట్ ను ఆపిందనీ సీక్రెట్ సర్వీస్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మరొక బుల్లెట్ భవంతి బైటి ప్రాంతంలో తగిలిందని వారు తెలిపారు. డార్క్ కారులో ఉన్న ఒకరు వైట్ హౌస్ పై కాల్పులు జరిపి వేగంగా పారిపోతుండగా తాన చూశానని ఓ సాక్షి రిపోర్ట్ చేసినట్లుగా కోర్టు పత్రాలు తెలుపుతున్నాయని పత్రికలు రాశాయి. మరొక సాక్షి ఎనిమిది సార్లు ఏదో వస్తువు డార్క్ రంగు కారునుండి దూసుకు వచ్చిన శబ్దాలు విన్నట్లు సాక్ష్యం చెప్పాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి.
దగ్గర్లో వదిలేయబడిన హోండా ఎకార్డ్ కారు ఇదాహో లైసెన్స్ ప్లేట్లతో కనుగొన్నారనీ, అందులో సెమీ ఆటోమేటిక్ అస్సాల్ట్ రైఫిల్ ఉన్నదని కోర్టు పత్రాలు తెలుపుతున్నాయి. దూరాన ఉన్న లక్ష్యాలను కాల్చగల అవకాశం రైఫిల్ కు ఉన్నదనీ అవి తెలుపుతున్నాయి. లోడ్ చేయబడిన మూడు మేగజైన్లు, తొమ్మిది ఖాళీ బుల్లెట్ లు, ఒక అల్యూమినియం బేస్ బాల్ బ్యాట్ కారులో లభ్యమయ్యాయని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోందని పత్రికలు రాశాయి. కారు డ్రైవర్ కారు దిగి పారిపోయినట్లుగా మరొక సాక్షి తెలిపాడనీ, హోండా కారు ఒర్టేగా-హెర్నాండెజ్ పేరున రిజిస్టర్ అయి ఉందనీ కోర్టు పత్రాలు చెబుతున్నాయి.
వైట్ హౌస్ కి చెందిన ఎక్జిక్యూటివ్ మేడ రెండో అంతస్తు పైగా అనేక బుల్లెట్లు తాకినట్లుగా ఆనవాళ్ళను ఎఫ్.బి.ఐ పోలీసులు కనుగొన్నారు. అధ్యక్షుడి కుటుంబ క్వార్టర్లు అక్కడే ఉన్నాయని తెలుస్తోంది. అధ్యక్షుడి పైన హత్యా ప్రయత్నం చేసినట్లుగా హెర్నాండెజ్ పైన కేసు నమోదు చేసారు. నేరం రుజువైన పక్షంలో హెర్నాండెజ్ కు జీవితకాలం జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
ఒర్టేగా-హెర్నాండెజ్ అధ్యక్షుడిని గాయపరచాలని కోరుకున్నట్లుగా సాక్షులు తెలిపారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఒబామాను క్రీస్తు వ్యతిరేకిగా, దెయ్యంగా అభివర్ణించాడనీ వారు తెలిపారని తెలుస్తోంది. సాక్షులు దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఈ విషయాలు తెలిసాయి. అమెరికా ప్రభుత్వంలో ఒబామా యే పెద్ద సమస్యగా పేర్కొనేవాడని సాక్షులు తెలిపారు. కొన్ని రోజులుగా అతను దేని కోసమో తయారవుతున్నట్లు కనిపించాడని సాక్షులు తెలిపారు. అర్లింగ్టన్ పోలీసులు అనుమాస్పదంగా సంచరిస్తున్నట్లుగా భావించి హెర్నాండెజ్ ను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.
సాక్షులు చెప్పిన సాక్ష్యాలన్నీ హెర్నాండెజ్ ఒబామాను చంపడానికే కంకణం కట్టుకున్నట్లుగా తిరుగులేని విధంగా అప్పుడే నమోదైపోయాయి. వారం రోజుల్లోనే అన్ని సాక్ష్యాలు వెతుక్కుని మరీ పోలీసుల దగ్గరకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. సాక్ష్యాల కోసం ఎఫ్.బి.ఐ కానీ, సీక్రెట్ సర్వీసు లు కానీ పెద్దగా శ్రమించినట్లుగా కనిపించడం లేదు. ముందు ముందు వెల్లడి కానున్న వివరాలు తెలిస్తే తప్ప ఈ విషయంలో అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.