ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి అమెరికా సైన్యాన్ని విరమించుకుంటున్నట్లు కొద్దివారాల క్రితం ప్రకటించిన బారక్ ఒబామా, ‘ఆసియాలో అమెరికా ఉనికి కొనసాగుతుందని’ ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగిస్తూ తేల్చి చెప్పాడు. అయితే ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండు విరమించుకునే ఆలోచనలో అమెరికాకి మరో ఉద్దేశ్యం లేదు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి ఉపసంహరించుకుంటున్నంత మాత్రాన తాము ఆసియా నుండి వెళ్ళిపోతున్నట్లు కాదన్ ఒబామా చెప్పదలుచుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆసియాలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్న నేపధ్యంలో ఒబామా ప్రసంగం చేనాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా పత్రికా సంస్ధలన్నీ భావిస్తున్నాయి.
మిలట్రీ బడ్జెట్ లో కోతలు విధిస్తున్నప్పటికీ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా సైనిక స్ధావరాలను మరింత విస్తరించడానికి కట్టుబడి ఉందని ఒబామా స్పష్టం చేశాడు. ఆసియా-ఫసిఫిక్ దేశాల్లో తన మిత్రుల కోసం పసిఫిక్ శక్తిగా ఆసియా ప్రాంతంలో అమెరికా సైనిక పాటవం పెరుగుతుందని ఒబామా స్పష్టం చేశాడు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతం భవిష్యత్తు రూపకల్పనలో అమెరికా పాత్ర తప్పనిసరని ఒబామా చెప్పాడు. ఆసియాలో పెరుగుతున్న తన ప్రాబల్యాన్ని దెబ్బతీయడానికి అమెరికా ప్రయత్నిస్తున్నదని చైనా ఇప్పటికె అనేకసార్లు అనుమానం, అసహనం వ్యక్తం చేసింది. చైనా అనుమానాలను ఒబామా ప్రసంగం నిర్ధారించినట్లయ్యింది. ఆస్ట్రేలియాలో మిలట్రీ స్ధావరాలను అమెరికా చైనాకి వ్యతిరేకంగా మొహరిస్తున్నదన్న చైనా అనుమానాలకు బలం చేకూరినట్లయ్యింది.
తన చర్యలు చైనా చుట్టుముట్టినట్లుగా భావించరాదని కూడా ఒబామా తన ప్రసంగంలో తెలిపాడు. చైనాతో కూడా సహకరించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపాడు. “నేటి యుద్ధాలను ముగిస్తున్న సందర్భంలో నేను జాతీయ భద్రతా బృందానికి కొన్ని సూచనలిచ్చాను. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఉనికి మరియు మిషన్లకు అత్యున్నత ప్రాధామ్యం ఇవ్వాలని వారికి చెప్పాను” అని ఒబామా ఆస్ట్రేలియా పార్లమెంటులో తెలిపాడు. “ఫలితంగా అమెరికా రక్షణ ఖర్చుల్లో కోత అన్నది, ఆసియా పసిఫిక్ ప్రాంతానికి నష్టకరంగా పరిణమించదు” అని ఒబామా తెలిపాడు. “చైనాతో మరింత సహకారాన్ని మేము కోరతాము. ఇరు దేశాల మిలట్రీల మధ్య సమాచార పెంపు కూడా సహకారంలో కలిసి ఉంటుంది. పరస్పర అవగాహనను పెంపొందించుకుని, అపార్ధాలు లేకుండా ఉండడానికి కృషి చేస్తాము” అని ఒబామా తెలిపాడు.
చైనా ప్రాబల్యమ్ పెరుగుతున్న నేపధ్యంలో జపాన్, సౌత్ కొరియా లాంటి అమెరికా మిత్రులు అమెరికా సహయం కొనసాగుతుందని స్పష్టం చేయవలసిందిగా కోరుతున్నట్లుగా రాయిటర్స్ ఊహిస్తోంది. ఆగ్నేయూసియాలో అమెరికా ఉనికి పెంచుకునే కృషిలో భాగంగా మొదటి అడుగుగా అమెరికా మెరైన్లు, నౌకా దళ నౌకలు, విమానాలు ఉత్తర ఆస్ట్రేలియాకు పంపడానికి రంగం సిద్దం అయ్యింది. 2012 నుండీ ఈ విస్తరణ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. 2016 నాటికి 2500 మంది అమెరికా సైన్యం ఆస్ట్రేలియా చేరుకుంటారని తెలుస్తోంది. అయితే దక్షిణ కొరియాలో ఇప్పటికే ఉన్న 28,000 మంది సైనికులూ, జపాన్ లో ఉన్న 50,000 మంది సైనికుల కంటె బాగా తక్కువ కావడం గమనార్హం. కాని ఇండొనేషియాకు 820 కి.మీ దూరంలో గల డార్విన్ లో అమెరికా మిలట్రీ స్ధావరం ఉన్నందున అవసరమైనప్పుడు త్వరగా ఆగ్నేయాసియా చేరడానికి అమెరికాకు వీలుంది.
ఆస్ట్రేలియా పెరల్ హార్బర్ గా పేరొందిన డార్విన్ నుండే అమెరికా ఆస్ట్రేలియాల సైనిక సహకారం ప్రారంభమైందని ఒబామా గుర్తు చేశాడు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికాలోని హవాయ్ ద్వీపాల కంటే డార్విన్ ద్వీపం పైన అధికంగా బాంబు దాడులు చేసిందని తెలుస్తోంది. డార్విన్, ఉత్తర ఆస్ట్రేలియాలలో అమెరికా కొత్త చాప్టర్ లిఖిస్తుందని ఒబామా పేర్కొన్నాడు. ఆసియాలోని సముద్ర మార్గాల రక్షణకు అమెరికా, ఆస్ట్రేలియాలు నడుం బిగించాయనీ ఇరు దేశాలకు ఇది అత్యవసరమనీ ఒబామా వివరించాడు. ఆస్ట్రేలియాలో కొత్తగా స్దావరం నెలకొల్పడం ద్వారా అమెరికా సైనిక ఉనికి ఉనికి దక్షీణ కొరియా, జపాన్ లను దాటి విస్తరిస్తుందని భావిస్తున్నారు. చైనా ఆర్ధిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్న ఆగ్నేయాసియాలో కూడా అమెరికా ప్రభావ విస్తరణకు అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ప్రాబల్యాన్ని నిలవరించడమే అమెరికా లక్ష్యమన్నది ఇక్కడ స్పష్టమే.
సౌత్ చైనా సముద్రానికి కూడా దగ్గరగా అమెరికా సైన్యాలు, నౌకలు, యుద్ధ విమానాలు నెలకొల్పడానికి అమెరికా పధకం వేసింది. పేరులో చైనా అని ఉన్నంతమాత్రాన సౌత్ చైనా సముద్రం మొత్తం మీద చైనా ఆధిపత్యం కొనసాగడానికి వీల్లేదని గతంలో అనేకసార్లు జపాన్, అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఆస్ట్రేలియాలో అమెరికా ఉనికిని చైనా పెద్దగా పట్టించుకున్నట్లు కనపడలేదు. ఆర్ధిక సంక్షోభం సమయంలో దానిపైన దృష్టి పెట్టాలని మాత్రం కోరింది. అమెరికా సైనిక విస్తరణ పట్ల చైనా పెద్దగా స్పందించకపోవడానికి రాయిటర్స్ సంస్ధ, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఒక భాష్యం చెప్పుకుంది. నాయకత్వ మార్పుల్లో బిజిగా ఉన్నందున ఒబామా ప్రసంగంపై చైనా స్పందించలేదని చెప్పుకుని సంతృప్తి పడింది. “ఈ ప్రాంతంలో ప్రతి దేశమూ ఇక్కడ అమెరికా ఉనికిని ప్రశ్నించడానికి సరైన కారణాలే కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్రాంతంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నందున ఉత్తర ఆస్ట్రేలియా సైనిక స్ధావరం పెద్ద ఆశ్చర్యం కలిగించదు” అని జిన్‌హువా పత్రిక పేర్కొంది. ఆస్ట్రేలియాతో అమెరికా ఒప్పందం కొన్ని ప్రమాదాలతో కూడుకుని ఉన్నదని ఇండోనేషియా వ్యాఖ్యానించింది. ‘ఉద్రిక్తతలను పెంచడం, స్పందన ప్రతిస్పందనలు ప్రోత్సాహం పొందడం లాంటివి జరగకూడదని కోరుతున్నాం’ అని ఇండోనేషియా మంత్రి ప్రకటించాడు.
అమెరికా ఆర్ధిక భవిష్యత్తు కోసమే ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంపైన అమెరికా దృష్టి కేంద్రీకరించిందని ఒబామా అసలు విషయాన్ని చెప్పనే చెప్పాడు. “ప్రపంచంలో ఇది వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో సగం ఇక్కడ ఉంది. అమెరికా ప్రజలకు ఉద్యోగాలు సృష్టించడం, అవకాశాలు పెంచడం నావరకు మొదటి ప్రాధామ్యం ఇస్తున్నా. అందుకోసం ఆసియా పసిఫిక్ ప్రాంతం కీలకమైనదిగా నేను గుర్తిస్తున్నాను” అని ఒబామా అసలు గుట్టు విప్పాడు.
విశేఖర్ గారు ప్రజాపంతలో కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమంపేరుతో ప్రచురితమైన వ్యాసం మీదేనా…ఆ వ్యాసం చాలా బాగుంది….ఆపోరాటంలో జరుగుతున్న వాస్తవాలను విపులంగా వివరించారు. కాకపోతే చాలా లెంతిగా ఉంది….
డేవిడ్ గారూ అది నాదే. ఇక్కడ బ్లాగ్ లో రాసిందే అది. వాస్తవానికి చిన్న బుక్‌లెట్ గా తీసే ఉద్దేశ్యంతో అది రాసాను. బహుశా ప్రజా పంధా వాళ్ళు తమ పత్రికలో పూర్తిగా వచ్చాక బుక్ లెట్ తీస్తారేమో తెలియదు. ప్రజా పంధాలో వచ్చినది కేవలం కొద్ది భాగం మాత్రమే ఇంకా మూడింతల భాగం ప్రచురితం కాలేదు. ప్రజాపంధాలో తదుపరి సంచికల వరకూ ఆగే అవసరం లేకుండా ఉండాలని ఇక్కడ బ్లాగ్ లో ప్రచురించాను. ప్రజాపంధావారి అనుమతి తీసుకుని బ్లాగ్ లో ప్రచురించాను. మిగిలిన భాగాల్లో ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నయి. ఇక్కడ బ్లాగ్ లో చూడండి మీకు అర్ధం అవుతుంది.
విశేఖర్ గారు ఇందాకే మీ ఆర్టికల్ మొత్తం ప్రింట్ తిసుకోని చదివాను చాలా బాగుంది….మీకు విలైతే మా పత్రికకు కూడా రాస్తూ ఉండండి మీకు అభ్యంతర లేకపోతే..
డేవిడ్ గారు, అభ్యంతరం ఏమీ లేదు.
సాధారణంగా మీకు ఎ 4 పేజీలో ఎన్ని పేజీలయితే వీలుగా ఉంటుందో నాకు ఇ.మెయిల్ ఇవ్వండి. నా వీలు చూసుకుని రాస్తాను.