కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -2


అమెరికా అసమానతలు

అక్టోబరు 26 తేదీన కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు (సి.బి.ఒ) అమెరికాలో ఆర్ధిక అంతరాయాలపైన ఒక నివేదికను వెలువరించింది. దాని ప్రకారం అమెరికాలో అత్యంత ధనికులైన ఒక శాతం మంది ఆదాయాలు 1979, 2007 మధ్య మూడు రెట్లు (275 శాతం) పెరగ్గా, జాతీయ సంపదలో వారి వాటా రెట్టింపు (8 శాతం నుండి 17 శాతానికి) పెరిగింది. ఇదే కాలంలో ఆందరికంటె పైన ఉన్న 20 శాతం మంది జాతీయాదాయంలో తమ వాటా పెంచుకోగా, మిగిలినవారందరి వాటాలు విడి విడిగానూ, మొత్తంగానూ తగ్గిపోయాయి. 2007లో పైన ఉన్న 20 శాతం మంది, జాతీయాదాయంలో 53 శాతం వాటాకు సొంతదారులు. అంటే ఆ ఒక్క సంవత్సరం వరకూ మిగిలిన 80 శాతం ఆదాయాన్ని పైన ఉన్న ఇరవై శాతం వారి ఆదాయం దాటిపోయింది. టాప్ ఇరవై శాతంలో మిగిలిన 19 శాతం ఆదాయం 2007 లో 65 శాతం పెరిగాయి. కాని జాతీయాదాయంలో ఐదింట మూడు వంతుల అమెరికన్ల వాటా 2 నుండి 3 శాతం పడిపోయింది. 1979, 2007 మధ్య (30 సంవత్సరాలలో) అత్యంత దిగువన ఉన్న వారి ఆదాయాలు కేవలం 18 శాతం మాత్రమే పెరిగాయి. ఇది పెరుగుదల లాగా కనిపిస్తున్నా, వాస్తవంలో నిజ ఆదాయాలు బాగా పడిపోయాయి. జాతీయాదాయంలో వారి వాటా 7 నుండి 5 శాతానికి పడిపోయింది.

ఉన్నత స్దాయిలో ఆదాయం విపరీతంగా కేంద్రీకృతం కావడానికి ప్రవేటు ఆర్ధిక వ్యవస్ధలొ వచ్చిన మార్పులు, ద్రవ్య రంగం విపరీతంగా పెరగడం, కేపిటల్ గెయిన్స్ ద్వారా సంపన్నుల వాటా పెరగడం, సి.ఇ.ఒ లు ఇతర ఉన్నత స్ధాయి అధికారుల జీత భత్యాలు పెద్ద మొత్తాలకు చేరుకోవడం… కారణాలుగా సి.బి.ఒ పేర్కొన్నది. ఇవి కేపిటలిస్టు పరిశీలకులు గమనించగల కారణాలు కాగా నిజానికి కార్మికులు, ఉద్యోగుల జీత భత్యాలు 1970ల నుండి స్తంభించిడమే కాక నిజ వేతనాలు పడిపోయి పెద్ద మొత్తంలో సంపన్నుల జేబులకు డబ్బు తరలిపోవడం కారణంగా చూడాలి. పారిశ్రామిక ఉత్పత్తుల నుండి పెట్టుబడులు గణనీయ స్ధాయిలో అనుత్పాదక ద్రవ్య వ్యాపారాల్లోకి తరలి వెళ్ళడం వలన ఆమేరకు కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వవలసిన జీత భత్యాలు మొత్తంగా రద్దయ్యి ఆ భాగం కూడా పైన ఉన్న ఒక శాతం వద్ద కేంద్రీకృతమయ్యింది. జీతాల్లో కోత, సదుపాయాల్లో కోతలు పెట్టి ఆ భాగాన్ని టాప్ ఒక శాతం ధనికులకు సబ్సిడీల రూపంలో, పన్నుల రాయితీల రూపంలో తరలించారు. ఈ పరిణామాల వల్ల కింద ఉన్న వారి ఆదాయాలు పడిపోవడమే కాక పైన ఉన్న వారి ఆదాయాలు అలవిగానంత మొత్తంలో పెరిగిపోయి ఆదాయాల అంతరాలు తీవ్రం అయ్యాయి.

అమెరికా జాతీయ పన్నుల విధానం, ఈ ముప్ఫై సం. కాలంలో సామాన్య ప్రజానికం కంటే ధనికులకు అనుకూలంగా రూపొందించబడ్డాయని సి.బి.ఓ అంగీకరించింది. ఇలా ధనికుల ఆదాయాలు పెరిగేవైపుగా పన్నుల విధానం మొగ్గు చూపడం అనేది 1979తో పోలిస్తే 2007 ఇంకా పెరిగిందని కూడా సి.బి.ఓ అంగీకరించింది. అంతేకాక చిన్న ఆదాయాలకు అరకొరగా ఇస్తున్న సామాజిక భద్రతా సదుపాయాలు, మెడికేర్, నిరుద్యోగ భృతి లాంటి చెల్లింపులలో కోతలు పెట్టడం కూడా ఆదాయాలు సంపదల అంతరాలు తీవ్రమయ్యాయని నివేదిక పేర్కొంది. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే కార్మికులు ఉద్యోగుల ఆదాయంలో సామాజిక భద్రతా చెల్లింపులు, నిరుద్యోగ భీమా, కార్మిక నష్టపరిహారం, ఇతర ఫెడరల్ సంక్షేమ పధకాలు, రాష్ట్రాల స్ధానిక ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాలు, ఫుడ్ స్టాంప్ లు, పాఠశాల భోజనం, ఇళ్ళు ఇంధనం సహాయాలు, మెడికేర్ మెడి ఎయిడ్ లు మొదలైన అన్నింటిని కలిపి సి.బి.ఒ విశ్లేషణ జరిపింది. ఇవన్నీ నిజానికి వేతనాలలో భాగం కాదు. అందరికీ ఒకే విధంగా అందేవి కూడా కాదు. కనుక ఇవన్నీ మినయాయిస్తే కార్మికులు, ఉద్యోగులు, పాక్షిక ఉద్యోగుల ఆదాయాల స్ధాయి ఇంకా దయనీయంగా ఉంటుంది. పైగా ఈ అధ్యయనం ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ప్రారంభకాలంతో ముగిసింది. సంక్షోభ కాలాన్నీ, సంక్షోభానంతర కాలాన్ని కూడా కలిపితే, ఆదాయాల కోత, తగ్గుదల ఇంకా తీవ్రంగా ఉంటుంది.

రోనాల్డ్ రీగన్ కాలం నుండి అమెరికాలో కార్మికవర్గంపై ఆర్ధిక దాడులు తీవ్రస్ధాయిలో మొదలయ్యాయి. వేతనాల కోత, సమ్మెల విద్రోహం, యూనియన్ల నిర్వీర్యం, కార్మిక వ్యతిరేక చట్టాలు మొదలైనవి క్రమంగా పెరుగుతూ పోయాయి. కార్మిక సంఘాలలో బ్యూరోక్రసీ ధోరణులు ప్రబలడానికి ధనికవర్గాలు వివిధ కోవర్టు పధకాలు అమలు చేసారు. తీవ్ర స్ధాయిలో జరిగిన అనేక కార్మికవర్గ పోరాటాలు ఈ ధోరణులతో విఫలమయ్యాయి లేదా రాజీలతో సరిపుచ్చుకున్నాయి. తద్వారా కార్మికవర్గ మిలిటెంట్ ప్రతిఘటనలను పెట్టుబడిదారీవర్గం బాగా బలహీనపరిచి కార్మిక చైతన్యాన్ని మొద్దుబార్చడంలో సఫలం అయ్యింది. కార్మికులు – మేనేజ్‌మెంట్ భాగస్వామ్యం పేరుతో యూనియన్ల నాయకత్వం కార్పొరేట్ మేనేజ్‌మెంట్ నిర్మాణంలో స్ధానం సంపాదించారు. తద్వారా కేపిటలిస్టు ప్రయోజనాలకు యూనియన్లు బంధింపబడ్డాయి. అసలు కార్మిక యూనియన్లే పెద్ద వ్యాపార సంస్ధలుగా స్ధిరపడిపోయాయి. ఫలితంగా వర్గ పోరాట చైతన్యం అట్టడుగున పడిపోయింది. ఈ క్రమం మూడు దశాబ్దాల పాటు కొనసాగి అమెరికాలో సంపన్నుల వద్ద ద్రవ్యం కొండల లెక్కన పేరుకుపోయి ద్రవ్య రంగం బలపడింది. ఉత్పత్తులు లేని ద్రవ్యరంగం స్పెక్యులేటివ్ వ్యాపారలతో తనను తాను అనేక రెట్లకు పెంచుకుని సంపద కేంద్రీకరణ మరింత పెంచింది. దానితో కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మిగిలిన ఉత్పత్తి కార్యక్రమాలను కూడా చౌక శ్రమ, బలహీన కార్మిక చట్టాలు, అతి తక్కువ వేతనాలు, బలహీన పర్యావరణ చట్టాలు కలిగిన చైనా, ఇండియా లాంటి దేశాలకు సంపన్నవర్గం తరలించింది. అది మళ్ళీ ద్రవ్య మిగులును ఇంకా పెంచింది.

ఈ పరిణామాలు అమెరికాలోని పట్టణాలు, నగరాలలో ధనికులు, పేదల మధ్య అంతరాలను తీవ్రం చేశాయి. పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాల్లో దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా పేరుకుపోయాయి. అక్టోబరు 22 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరాల ప్రకారం 2000, 2010 మధ్య కాలంలో అమెరికా నగరాల శివార్లలో నివసించే పేదల సంఖ్య రెట్టింపుకు పెరిగింది.చరిత్రలో మొదటిసారిగా మెట్రోపాలిటన్ నగరాల పేదలలో సగం మంది కంటే ఎక్కువ ఆ నగరాల శివార్లలో కేంద్రీకృతమయ్యింది” అని బ్రూకింగ్స్ సంస్ధలో పరిశోధకురాలు ఎలిజబెత్ తెలిపిలట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఉదాహరణకి డెట్రాయిట్ నగర పేదలలో 59 శాతం మంది, క్లీవ్ లాండ్ పేదల్లో 57 శాతం మంది శివార్లలో కేంద్రీకృతమయ్యారు. అంటే నగరాలలో సౌకర్యాలతో కూడిన ఆవాసాలన్నీ ధనికుల సొంతం కాగా, పేదలు శివార్లకు నెట్టివేయబడ్డారు. మరోవైపు ద్రవ్యరంగ కంపెనీల అధికారులు ఆదాయాలను పెంచుకుంటూ పోయారు. యు.ఎస్.ఎ టుడే పత్రిక అక్టోబరు 23 ప్రచురించిన వివరాల ప్రకారం ఫార్చూన్ 500 కంపెనీల అధికారుల జీతాలు గతం సంవత్సరంతో పోలిస్తే 2010లో 10 శాతం పెంచుకున్నారు. వారి సగటు నెలసరి ఆదాయం 2010లో 234,000 డాలర్లకు (దాదాపు రు. కోటికి సమానం) చేరుకుంది. వీరు కంపెనీ బోర్దులలో కూర్చుని వారానికి సగటున 4.3 గంటలు పని చేస్తారని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ డైరెక్టర్స్సంస్ధ జరిపిన సర్వే తెలిపింది.

అమెరికా రాజకీయ పార్టీలు (పాలక, ప్రతిపక్షాలు రెండూ) గానీ, కార్పోరేట్ మీడియా సంస్ధలు గానీ ఆర్ధిక కార్యకలాపాల గురించి చేసే చర్చలలో ప్రధానంగా కొన్ని పరిమిత అంశాలపైనే కేంద్రీకృతమై ఉంటోంది. కార్పొరేషన్లకు, ధనికులకు మరిన్ని పన్నులను ఎలా తగ్గించవచ్చు, కార్మికులు, ఉద్యోగులు ఇతర పేద వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రతా పధకాలలో ఇంకెంత లోతుగా కోతలను అమలు చేయవచ్చు అన్న రెండు అంశాలపైనే వారి చర్చలు కేంద్రీకృతమై ఉంటున్నాయి. దారుణం ఏమిటంటే కార్మికులు, ఉద్యోగులు, పాక్షిక నిరుద్యోగులు, నిరుద్యోగులు, దరిద్రులు, మహిళలు మొదలైన ప్రజానీకం గురించి చర్చించే రాజకీయ పార్టీలు అస్సలు లేవు. రిపబ్లికన్లు, డెమొక్రట్లు ఇద్దరూ ధనికులు, కార్పొరేట్ల గురించి ఒకటే యావ. అమెరికాలో అధికారంలో ఉన్న ఒబామా, ఆయన పార్టీ డెమొక్రట్ పార్టీలు ద్వైపాక్షిక పన్ను సంస్కరణ పేరుతో కార్పొరేట్ పన్నులనూ, ధనికులపై వేస్తున్న పన్నులను బాగా తగ్గించడానికి ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. రిపబ్లికన్లు వారి ప్రతిపాదనలకు సంతృప్తి పడక మరింతగా పన్నుల తగ్గించాలని కోరుతున్నారు. రిపబ్లికన్ల తరుపున 2012 అధ్యక్ష పదవికి పోటీపడాలని ఆశిస్తున్న ముగ్గురూ ధనికులపై వేస్తున్న ఆదాయపన్నును పూర్తిగా రద్దు చేయాలని చెబుతున్నారు. అన్నిటికీ ఒకే పన్ను పేరుతో కార్పొరేషన్లు, ధనికులపై పన్నులను 9 నుండి 20 శాతం వరకు పరిమితి చేయాలని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనల వెనుక కార్మికులు, ఉద్యోగులకు ఇస్తున్న మెడికేర్, మెడిక్ ఎయిడ్ సదుపాయాలను రద్దు చేయాలన్న ఆలోచన ఉంది. రానున్న పది సంవత్సరాలలో 3 ట్రిలియన్ డాలర్ల మేరకు బడ్జెట్ లోటు తగ్గించాలని ఒబామా ప్రతిపాదించగా, అందులో 500 బిలియన్ డాలర్లు (అర ట్రిలియన్) మెడికేర్, మెడిక్ ఎయిడ్ ల కోతల ద్వారా పొదుపు చేయాలని గత ఒప్పందంలో ప్రతిపాదనలను ఇరు పక్షాలు ఆమోదించారు.

విధంగా పొదుపు ఆర్ధిక విధానాలను అమెరికా కూడా అవలంబించడం ప్రారంభించింది. బడ్జెట్ లోటు తగ్గించడంలో, రుణ పరిమితి పెంచడంలో రిపబ్లికన్లకు, డెమొక్రట్లకు మధ్య కుదిరిన రాజీ ఒప్పందం సారాంశం ప్రజలపైన భారాలు వేయడమే. ప్రజలపైన భారం వేయడంతో పాటు కంపెనీలకు లోగడ జార్జి బుష్ ఇచ్చిన పన్ను రాయితీలు తగ్గిద్దామని (రద్దు కూడా కాదు) ఒబామా ప్రతిపాదిస్తే రిపబ్లిన్ల ఆధీనంలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సుతరామూ ఒప్పుకోలేదు. చివరికి భారం మొత్తం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులపైన వేస్తూ దారుణమైన ఒప్పందాన్ని రెండు పార్టీలు కుదుర్చుకుని పొదుపు విధానాలను అమెరికన్లపై అమలు చేస్తున్నాయి ఈ విధంగా అమెరికాలోనూ, యూరప్ లోనూ రుణ సంక్షోభాన్ని సాకుగా చూపి సంక్షోభానికి ఏ మాత్రం సంబంధం లేని ప్రజా సామాన్యంపై భారాలు వేయడంతో ప్రజల్లో అసంతృప్తి నానాటికి ఎక్కువయ్యింది. అమెరికాలో అధికారికంగా నిరుద్యోగం 9.1 ఉందని చెబుతున్నప్పటికీ అది నిజానికి అంతకు రెట్టింపు ఉంటుందని దాదాపు ఆర్ధికవేత్తలంతా అంగీకరిస్తున్నారు.

ఆర్ధిక సంక్షోభం నుండి రికవరీ సాధించడం అంటే అందులో ఉద్యోగాల కల్పన కూడా సహజంగానే కలిసి ఉంటుంది. కానీ ఈ సారి రికవరీలో ఇంతవరకూ ఉద్యోగాలు సృష్టి జరగకపోగా ఇంకా ఉద్యోగాలను కంపెనీలు రద్దు చేస్తూనే ఉన్నాయి. బెయిలౌట్లు పొందిన కంపెనీలు ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యతను పూర్తిగా వదిలిపెట్టాయి. స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలో ఉద్యోగాలను ప్రవేటు కంపెనీలే కల్పించవలసి ఉంటుంది. ప్రభుత్వాలు కంపెనీలు పెట్టి ఉద్యోగాలిస్తే ఈ ప్రవేటు కంపెనీలు, వారి ఆర్ధిక వేత్తలు ఇంతెత్తున లేచి విమర్శిస్తాయి. కాని తమ బాధ్యతను నిర్వర్తించడానికి మాత్రం ఏ మాత్రం ముందుకు రావు. తమ కంపెనీలు నడవడం కోసం, లాభాల కోసం ఇచ్చే కాసిన్ని ఉద్యోగాలనే గొప్ప దేశ భక్తి కార్యక్రమంగా అవి ప్రచారం చేసుకుంటాయి. ఇప్పుడైతే ఆ కాసిన్ని ఉద్యోగాలను కూడా అవి ఇవ్వకుండా మొఖం చాటేశాయి. దానితో అమెరికా సాధించిన రికవరీని జాబ్ లెస్ రికవరీగా పేర్కొంటున్నారు. జాబ్ లెస్ రికవరీ అనడం కంటే అసలు రికవరీ సాధించలేదనడమే కరెక్టుగా ఉంటుంది.

ప్రపంచస్ధాయిలో అసమానతలు

అమెరికా, యూరప్ ల బహుశజాతి కంపెనీలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడం అన్నది ప్రపంచవ్యాపితంగా కొనసాగుతున్నది. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేయించడం ద్వారా ప్రపంచవ్యాపితంగా ఇవి తమ దోపిడీ హస్తాలను చాచి సంపదల కేంద్రీకరణను ప్రపంచ స్ధాయిలోనే అమలు చేయగలుగుతున్నాయి. ఎమర్జింగ్ దేశాలతో పాటు పేద, అతి పేద దేశాల పాలకవర్గాలు ఆ విధానాలకు పూర్తి అండదండలు అందిస్తూ తాము కూడా సంపదల కేంద్రీకరణను పెంచే విధానాలను అమలు చేస్తున్నారు. ప్రపంచ స్ధాయి బహుళజాతి సంస్ధలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఫలితంగా ఎమర్జింగ్, పేద, అతిపేద దేశాలపై దాడి మరింత తీవ్రమైంది.

క్రెడిట్ సుశీ (స్విడ్జర్లాండ్ ఆధారంగా పని చేసే బహుళజతి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు) సంస్ధ ప్రపంచ స్ధాయిలో సంపదల అంతరాలపైనా, సంపదల కేంద్రీకరణపైనా అక్టోబర్ 19 తేదీన వెలువరించిన “ప్రపంచ సంపదల నివేదిక” వివరాలను వాల్ స్ట్రీట్ జర్నల్పత్రిక ప్రచురించింది. నివేదిక ప్రకారం ప్రపంచ మిలియనీర్లు, బిలియనీర్లు ప్రపంచంలోని మొత్తం సంపదలో 38.5 శాతాన్ని నియంత్రిస్తున్నారు. ప్రపంచ జనాభా ఏడు బిలియన్లు కాగా అందులో 0.4 శాతంగా ఉన్న 29.7 మిలియన్ల మంది (2.97 కోట్లు) కనీస సంపద 1 మిలియన్ డాలర్లు కాగా వీరి చేతుల్లో 89 ట్రిలియన్ల డాలర్ల సంపద (38.5 శాతం) కేందీకృతమై ఉంది (అమెరికా వార్షిక జిడిపి $15 ట్రిలియన్లకు ఇది ఆరు రెట్లు). 2010 లో ప్రపంచ సంపదలో వీరి వాటా 35.6 శాతం కాగా అది గత తొమ్మిది నెలల్లో 38.5 శాతానికి పెరిగింది. అంటే వారి సంపద తొమ్మిది నేలల్లో $20 ట్రిలియన్ల మేరకు పెరిగింది. మిలియనీర్ల సంపద ఈ కాలంలో 29 శాతం పెరగగా అది ప్రపంచ సంపదలో పెరుగుదల రేటు కంటె రెట్టింపు. ప్రపంచ సంపద ఇప్పుడు 231 ట్రిలియన్లు అని క్రెడిట్ సుశీ నివేదిక తెలిపింది.

గత 18 నెలల్లో అమెరికాయే అతి పెద్ద సంపద సృష్టి కర్త. ప్రపంచ సంపదకు అది $4.6 ట్రిలియన్లు కలిపింది. చైనా $4 ట్రిలియన్లు జత చేయగా జపాన్ $3.8, బ్రెజిల్ $1.87, ఆస్ట్రేలియా $1.85 ట్రిలియన్లు సంపదను జత చేశాయి. ప్రపంచవ్యాపితంగా 84,700 మంది చేతుల్లో $50 మిలియన్లు అంతకంటే ఎక్కువ సంపద ఉంది. వారిలో 35,400 మంది (42%) అమెరికాలో ఉన్నారు. ఇక 29,000 మంది చేతుల్లో $100 మిలియన్లు అంతకు ఎక్కువ సంపద ఉండగా,  2,700 మంది చేతుల్లో $500 మిలియన్లు అంతకు ఎక్కువ సంపద ఉంది. చైనాలో ప్రస్తుతం ఒక  మిలియన్ మిలియనీర్లు ఉన్నారు.

ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం

ప్రస్తుతం ప్రపంచవ్యాపితంగా వ్యాపించాయంటున్న ఆకుపైఉద్యమానికి పైన వివరించిన పరిస్ధితులే దోహదకారిగా పని చేశాయని గ్రహించాలి. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన సామ్రాజ్యవాద కంపెనీలు కోలుకోవడానికి బెయిలౌట్లు మంజూరు చేసిన అమెరికా, యూరప్ ల ప్రభుత్వాలు ఆ బెయిలౌట్ల భారాన్ని నేరుగా ప్రజలపైనే మోపడానికి సిద్ధం అయ్యాయి. ప్రజలపై భారం మోపడంలో భాగంగా పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్నాయి. ఆ విధానాలలో భాగంగా యువకులకు చదువు ఖరీదైన వ్యవహారంగా మార్చివేశాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దేశాల్లో చదువు మోయలేని భారం అయ్యింది. యూనివర్సిటీ చదువులు పూర్తిగా దుర్లభంగా మారాయి. హైస్కూలు, డిగ్రీ విద్యలు చదువుకుని ఇక చదవలేక బైటికి వచ్చినవారికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఆర్ధిక సంక్షోభ పరిస్దితుల వలన యువతలో తిరుగుబాటు ప్రతిస్పందనలు రాకుండా ఉండడానికి అనేక సాంఘిక సమస్యలను ప్రభుత్వాలు ముందుకు తెస్తున్నాయి. యూరప్ లో మల్టీ కల్చరలిజం విఫలమయ్యిందంటూ యూరప్ దేశాల ప్రభుత్వాధినేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ప్రజలమధ్య విభేధాలు సృష్టిస్తున్నారు. తద్వారా వివిధ జాతుల మధ్య, భిన్న సమూహాలకు చెందిన ప్రజల మధ్య తగాదాలను రెచ్చగొడుతూ వారి ఆగ్రహాగ్ని ప్రభుత్వాలమీదికి రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

జర్మనీలో ముస్లింలు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాల కోసమే వలస వస్తున్నారనీ, దేశాభివృద్ధిలో వారు పాల్గొనడం లేదనీ విమర్శిస్తూ జర్మనీ సెంట్రల్ బ్యాంకు అధికారి ఒకరు బహిరంగంగా నోరు చేసుకున్నాడు. ఆయన అభిప్రాయాన్ని వంతపాడుతూ జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ జర్మనీలో మల్టీ కల్టీ విఫలం అయిందనివ్యాఖ్యానించడంతో అక్కడ ముస్లింలపై ద్వేషభావం పెచ్చరిల్లింది. ఫ్రాన్సు అధ్యక్షుదు నికొలస్ సర్కోజి అయితే మరింత క్రూరమైన అవతారం ఎత్తాడు. యూరప్ అంతటా వ్యాపించి ఉన్న హిప్పీలు లేదా రోమా లను దేశం నుండి తరిమి కొట్టాడు. ఇతర దేశాలు విమర్శిస్తున్నప్పటికి పట్టించుకోకుండా రాక్షసత్వంతో ప్రవర్తించాడు. ఇలా ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ప్రభుత్వాలు అంతిమంగా భారం వహించాల్సిందేనన్న తెలివిడి ప్రజల్లో పూర్తిగా పోని ఫలితంగానే వారి ఆగ్రహం “ఆకుపై వాల్ స్ట్రీట్” ఉద్యమం వైపుకి ఆకర్షితమయ్యింది. ఎక్కడో న్యూయార్క్ నగరంలో రెండువేలమంది ప్రారంభించిన ఆకుపై వాల్ స్ట్రీట్ఉద్యమం నెమ్మదిగా ఇతర అమెరికా నగరాలకు వ్యాపించి, అనంతరం ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, యూరప్ ల వరకు ఆకుపై వాల్ స్ట్రీట్ఉద్యమం వ్యాపించడానికి కావలసిన పరిస్ధితులు అక్కడ ఏర్పడి ఉండడంతో ఉద్యమ తీవ్రత అక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపించినప్పటికి అది నామ మాత్రంగానే ఉన్నది.

వాల్ స్ట్రీట్ కంపెనీలు, ఇతర బడా కంపెనీలు, సంస్ధల అధిపతులు జనాభాలో కేవలం ఒక్క శాతం ఉండగా వారే దేశ సంపదలో అత్యధికభాగాన్ని నియంత్రిస్తున్నారని వాల్ స్ట్రీట్ ఆక్రమిద్ధాంఉద్యమం భావిస్తున్నట్లుగా వారి ప్లెకార్డులు చెబుతున్నాయి. వాల్ స్ట్రీట్ కంపెనీలు దేశ రాజకీయాలను శాసిస్తున్నారని కూడా ఉద్యమం చెబుతున్నది. రాజకీయాలకు, డబ్బుకు ఉన్న సంబంధం తెంచాలని ఉద్యమకారులు కోరుతున్నారు. 99 శాతంగా ఉన్న ప్రజానీకాన్ని వారి వారి స్దానాలనుండి తరిమి వేసి ఒక్క శాతం ధనికులు ఆక్రమించి పెత్తనం చెలాయిస్తున్నారనీ కనుక 99 శాతం మంది తమ స్ధానాలను తిరిగి ఆక్రమించుకోవాలనీ ఆకుపై వాల్ స్ట్రీట్ఉద్యమ ప్రధాన ఉద్దేశ్యంగా వ్యక్తమవుతున్నది. వాల్ స్ట్రీట్ లో ఉన్న సంపద ప్రజలదే కనుక ప్రజలు వాల్ స్ట్రీట్ ను ఆక్రమించుకుని తమ సంపదను తిరిగి తమ సొంతం చేసుకోవాలనీ ఉద్యమం ప్రధానంగా చెబుతున్నది. ఈ అవగాహనలో భాగంగానే వుయ్ ఆర్ 99%’ (మేము 99 శాతం మందిమి) అన్న నినాదం పుట్టింది. వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాంనినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమెరికాలోని ఇతర నగరాలలో ఆయా నగరాలను ఆక్రమిద్దాంఅన్న నినాదంతో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకి బోస్టన్ నగరంలో ఆకుపై బోస్టన్ఉద్యమంగానూ, లాస్ ఏంజిలిస్ నగరంలో ఆకుపై లాస్ ఏంజిలిస్ఉద్యమంగానూ నిరసనకారులు పేర్లు పెట్టుకున్నారు. ఈ ఉద్యమం ప్రస్తుతం అంటే అక్టోబరు 28 నాటికి ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలో గల 2355 నగరాలు, పట్టణాలకు వ్యాపించిందని ఉద్యమ నిర్వాహకులు తాము నెలకొల్పిన వెబ్ సైట్ లో తెలిపారు.

ఆరంభం, విస్తృతి

ఉద్యమానికి మొదటి ఆలోచన స్పెయిన్ లో జన్మించింది. ఇండిగ్నిటోస్ అన్న పేరుతో స్పెయిన్ ప్రభుత్వం అనుసరిస్తున్న పొదుపు విధానాలను ఇంటర్నెట్ ద్వారా వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈజిప్టు రాజధాని కైరో నగరంలో అనేక రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక ప్రజా తిరుగుబాటును వీరు స్ఫూర్తిగా తీసుకోవడం గమనార్హం. స్పెయిన్ కి చెందిన డెమొక్రసియా రియల్ యాఅనే సంస్ధ ఈజిప్టు ప్రజా ఆందోళనలను స్ఫూర్తిగా తీసుకుంటూ అక్టోబరు 15 తేదీన ప్రపంచవ్యాపితంగా అలాంటి ప్రదర్శనలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. జులై వరకూ ఈ పిలుపు పుట్టిన చోటే ఉండిపోయింది. కెనడాకు చెందిన యాడ్ బస్టర్స్ మీడియా ఫౌండేషన్అనే సంస్ధ దీన్ని ఆధారం చేసుకుని మరో ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ సంస్ధ వినియోగదారీ వాదానికి వ్యతిరేకంగా పని చేస్తుంది. ప్రకటనలతో కంపెనీలు తమ సరుకులు కొనాలంటూ మోసపూరిత ప్రచారం చేస్తున్నాయని కనుక ప్రకటనలను నిషేధించాలన్నది ఈ సంస్ధ వాదన. ప్రకటనలు లేకుండా ఒక పత్రికను ఇది నిర్వహిస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్ధలపైన కార్పొరేట్ కంపెనీలు ప్రభావం చూపడాన్ని నిరసిస్తూ, తీవ్రమవుతున్న సంపదలు ఆదాయాల అంతరాలను నిరసిస్తూ, ఆర్ధిక సంక్షోభానికి కారణమైన కంపెనీలపై చట్ట పరమైన చర్యలు తీసుకోనందుకు నిరసిస్తూ శాంతియుతంగా వాల్ స్ట్రీట్ ను ఆక్రమిద్దాం అని ఆ సంస్ధ ప్రతిపాదిస్తూ తమ వద్ద ఉన్న ఈ మెయిల్ చిరునామాలకు మెయిల్ పంపింది. ఇందులో అన్నింటిపైన నిరసనలు ఉన్నాయే తప్ప ఆ నిరసనలనుండి డిమాండ్లు రూపొందడం జరగలేదు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా లేదా అన్నది తర్వాత చూద్దాం. రాజకీయాలనుండి డబ్బును వేరు చేయాలన్న డిమాండ్ ను అది ప్రస్తావించినా అది నిర్ధిష్ట డిమాండ్‌గా పరిగణించడానికి వీలు కాదు. ఆ ప్రతిపాదనే ఒకరి నుండి ఒకరికి పాకి విస్తరించింది. వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ అస్సాంజ్ కు మద్దతుగా నిలిచిన అజ్ఞాత హ్యాకర్ల బృందం ఎనోనిమస్కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడంతో అది కార్యాచరణగా మారింది. ఈ ఎనోనిమస్బృందం ఈజిప్టు ప్రజాస్వామిక తిరుగుబాటుకి కూడా పూర్తి మద్దతు ఇచ్చింది.

ఎనోనిమస్ సంస్ధ తమ అనుచరులను ఆకుపై వాల్ స్ట్రీట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తూ దిగువ మన్ హట్టన్ ను ముంచెత్తండి, గుడారాలు తెచ్చుకొండి, వంటగదులు కూడా ఏర్పాటు చెయ్యండి, శాంతియుతంగా బారికేడ్లను లేపండిఅని పిలుపునిచ్చింది. సెప్టెంబరు 17 తేదీన వెయ్యిమంది (కొందరు రెండువేలని అంటున్నారు) వరకూ యువకులు ఊరేగింపుగా వెళ్ళి వాల్ స్ట్రీట్ కు సమీపాన గల ప్రవేటు పార్కు (జుకొట్టి పార్కు) లో తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. వంద నుండి రెండొందలవరకూ ఆ రోజు రాత్రికి అక్కడే బస చేశారు. ఆ బస ఇప్పటివరకూ కొనసాగుతూనె ఉంది. సెప్టెంబరు 19 తేదీన ట్రాఫిక్ కి ఆటంకం కలిగిస్తున్నారన్న నేరంతో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పార్కులో ఉన్నవారు ప్రారంభంలో డ్రమ్ములు బాదుతూ నినాదాలు ఇస్తూ ఆట పాటలతో కాలం గడిపారు. క్రమంగా పార్కులో దీర్ఘకాలం కొనసాగడానికి వీలుగా కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుని ఆచరించడం ప్రారంభించారు. న్యూయార్క్ లో ప్రదర్శన జరిగాక అమెరికాలోని ఇతర నగరాలలో కూడా మెల్లగా ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభ దినాల్లో ప్రదర్శనలు జరిగిన నగరాలనుండి కార్యకర్తలు ఇతర నగరాలకు వెళ్లి ప్రదర్శనలు ప్రారంభం కావడానికి దోహదం చేశారని వారు పత్రికలతో మాట్లాడిన దాన్ని బట్టి అర్ధమవుతోంది.

సెప్టెంబరు 24 నాటికి అరెస్టుల సంఖ్య 82 కు చేరుకుంది. ట్రాఫిక్ కి ఆటంకం కలిగించడం, రోడ్లపై ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, అరెస్టులను ప్రతిఘటించడం లాంటి నేరాలని వారిపైన మోపారు. పోలీసులు ప్రదర్శనలలోకి జొరబడి తాళ్ళతో అల్లిన వలలను ఉపయోగించి కొద్దిమందిని గ్రూపులు గ్రూపులుగా ప్రదర్శననుండి వేరు చేసి నినాదాలకు ప్రతిస్పందన లేకుండా చేశే ఎత్తుగడలను అమలు చేసారు.  ప్రదర్శనలో పాల్గొంటున్న మహిళలు, విద్యార్ధినిలను అలాగే తాళ్ళతో వేరు చేశాక పోలీసు అధికారి ఒకరు చాటుగా వచ్చి వారిపై పెప్పర్ జల్లిన దృశ్యం ఇంటర్నెట్ లో విస్తృతంగా ప్రచారం చేయబడింది. వీడియో ద్వారా పోలీసు అధికారి పేరు ఏంధోని బొలోగ్నా గా అందరూ గుర్తించారు. మొదట పోలీసులు, న్యూయార్క్ నగర మేయర్ అతని చర్యను వెనకేసుకొచ్చినా, నిరసన పెరగడంతో  అంతర్గత విచారణకి ఆదేశించక తప్పలేదు. జిల్లా న్యాయ విభాగం అధికారులు కూడా సొంత విచారణని చేపట్టారు.

అక్టోబరు 1 తేదీన ఆకుపై వాల్ స్ట్రీట్ ఆందోళనకారులు బ్రూక్లిన్ బ్రిడ్జి పైన ప్రదర్శన చేపట్టారు. బ్రిడ్జిపైకి వెళ్ళాక పోలీసులు వందలమందిని అరెస్టు చేశారు. ఆందోళనకారులు బ్రిడ్జి పైకి వెళ్లే ఆలోచన లేకపోయినప్పటికీ పోలీసులు తెలివిగా వ్యవహరించి వారిని బ్రిడ్జిపైకి నడిపి వేరే మార్గం లేకుండా చేశారనీ, తద్వారా అరెస్టుకు పధకం వేశారని ఆరోపణలు వచ్చినా తర్వాత సమసి పోయాయి. బ్రూక్లిన్ బ్రిడ్జిపైన ట్రాఫిక్ అవరోధం కలిగించారంటూ 200 మందికి పైగా అరెస్టు చేశారు. అరెస్టు చేసినవారిని స్టేషన్లకు తరలించడానికి సిటీ బస్సులను పోలీసులు బలవంతంగా తరలించడం మరొక వివాదంగా మారింది. పోలీసుల ఆదేశాల మేరకు ప్రదర్శనకారులను తరలించినప్పటికీ ఆ తర్వాత రోజు ట్రాన్స్ పోర్టు సంఘం వాళ్లు పోలీసుల పైన కోర్టులో కేసు దాఖలు చేశారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా బస్సును తరలించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బ్రూక్లిన్ బ్రిడ్జిపై అరెస్టుల దృశ్యం, మహిళలపై పోలీసులు పెప్పర్ చల్లిన దృశ్యం బాగా ప్రచారం పొందడంతో మరిన్ని కొత్త నగరాలు ఆందోళనలలో జతకలిశాయని పత్రికలు, ఛానెళ్ళు తెలిపాయి. టి.విలలో, పత్రికలలో ఆందోళనల వార్తలను గానీ, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారన్న వార్తలను గాని చదివి కొత్తగా ప్రేరణ పొంది ఆందోళనలలో చేరడం సాధ్యమయ్యే పనేనా అన్న ఆలోచన ఇప్పటికే ఉద్యమ సంఘాలు నడుపుతున్నవారికి వస్తుంది తప్ప ఇతరులకు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఉద్యమ సంఘాలలో పని చేస్తున్నవారికి కూడా ఈ అనుమానాలు రాని ఉదంతాలు అనేకం.

అక్టోబరు 5 తేదీన కొన్ని కార్మిక యూనియన్లు ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. యూనియన్ సభ్యులు, విద్యార్ధులు, నిరుద్యోగులతో పాటు అనేకమంది ఉద్యోగులు కూడా ఆందోళనలో చేరడం అంతకంతకూ పెరిగింది. అక్టోబరు 5 న్యూయార్క్ లో జరిగిన ప్రదర్శనలో మొత్తం 15,000 మంది ప్రదర్శనలో పాల్గొన్నారని అంచనా వేశారు. న్యూయార్క్ నగరంలో ఈ ప్రదర్శనలు ఇలా కొనసాగుతుండగానే ఇతర నగరాల్లో కూడా ప్రదర్శనలు జరగడం మామూలు దినచర్యగా మారింది. అయితే చిన్న నగరాల్లో ప్రదర్శనలలో పదుల సంఖ్యలో పాల్గొంటే, ఒక మాదిరి నగరాల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. అట్లాంటా, బోస్టన్, ఆస్టిన్, బఫెలో, చికాగో, డల్లాస్, యూజీన్, హోస్టన్, ఓక్లాండ్, ఫిలడెల్ఫియా, సాన్ జోస్, సియాటిల్ మొదలైన నగరాలలొ ప్రదర్శనలు జరిగాయి. అక్టోబరు 9 తేదీన దాదాపు 25 దేశాలకు ప్రదర్శనల జ్వరం పాకింది. పాతిక దేశాలనుండి అక్టోబరు 15 తేదీన ప్రపంచవ్యాపిత ప్రదర్శనలు జరపాలన్న పిలుపుకు మద్దతు లభించింది. ఈ అక్టోబరు 15 పిలుపు స్పెయిన్ లోని ఇండిగ్నిటోస్ సంస్ధ ఇచ్చిన పిలుపుగా ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి.

అక్టోబరు 15 తేదీనాడు అనుకున్నట్లుగానే అనేక దేశాల్లో, అమెరికా, యూరప్ లలోని అనేక నగరాలలో ప్రదర్శనలు జరిగాయి.  దాదాపు 82 దేశాలలో, 951 పట్టణాలు, నగరాలలో ప్రదర్శనలు జరగాలని ఆయా ప్రాంతాల వారు ప్రకటించగా అంతకంటె అధిక సంఖ్యలోనే పట్టణాలలో ప్రదర్శనలు జరిగినట్లు నివేదికలు అందాయి. న్యూజిలాండ్, సిడ్నీ, హాంగ్ కాంగ్, తైపీ, టోక్యో, సావొపోలో, ప్యారిస్, మేడ్రిడ్, బెర్లిన్ హ్యాంబర్గ్, లీప్ జిగ్ మొదలైన ప్రఖ్యాత నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఎదుట 5000 మంది ప్రదర్శన నిర్వహించారు. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి దశలో ప్రదర్శన కొంత హింసాత్మకంగా మారింది. షాపులు, వాహనాలు ధ్వంసం చేయడం జరిగినా తర్వాత కొద్దిసేపటికే అదుపులోకి వచ్చింది. ఇటలీ లోని బెర్లుస్కోని ప్రభుత్వం అప్పటికే రెండు విడతలుగా పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయడంతో అక్కడ ప్రదర్శనకు ఎక్కువగా మద్దతు లభించింది. అదే తేదీన అమెరికాలోని పలు నగరాల్లో అరెస్టులు జరిగిన వార్తలొచ్చాయి. ట్రాఫిక్ కు ఆటంకం కలిగించిన కేసులే ప్రధానంగా మోపినట్లు నివేదికలు అందాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s