కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -1


వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం (ఆకుపై వాల్‌స్ట్రీట్).” ఇప్పుడు అమెరికాలో ప్రజలను, పాలకులను ఆకర్షిస్తున్న ఉద్యమం ఇది. సమస్యలపై అందరి దృష్టినీ ఆకర్షించినందుకు ప్రశంశలనూ, ఒక నాయకుడు గానీ, నిర్ధిష్ట డిమాండ్లు గానీ లేనందుకు విమర్శలను ఈ ఉద్యమం ఎదుర్కొంటోంది. ప్రజలు ఆ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతుండగా, కొందరు పాలకులు సంపన్నులు కూడా ప్రత్యక్ష, పరోక్ మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు తమ మౌనంతో ఉద్యమానికి ప్రచారం రాకుండా ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా సంపన్నులు నోరు తెరిచి ఉద్యమం, అసంతృప్తుల తాత్కాలిక ఆగ్రహం గా కొట్టి పారేస్తున్నారు. ఫాక్స్ న్యూస్ లాంటి సంస్ధలు దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. ప్రభుత్వాధిపతులు, అధికారులు నామ మాత్రపు మద్దతు తెలుపుతూనే అదేమంత తీవ్రమైన విషయం కాదన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్ లో ఈ ఉద్యమానికి సంబంధించి అనేక వెబ్ సైట్లు వెలిశాయి. వెబ్ సైట్లు ఉద్యమవ్యాప్తికి తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లలో కూడా ఈ ఉద్యమవ్యాప్తికి కృషి జరుగుతోంది.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం

వాల్ స్ట్రీట్ లో ఉన్న బడా బడా కంపెనీలు 2008 సంవత్సరంలో తలెత్తిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి తక్షణ కారణంగా నిలిచాయి. అంతకుముందు రెండు, మూడు దశాబ్దాలుగా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యం ఏర్పడుతూ వచ్చింది. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు పెరగడానికి బదులు స్తంభించిపోవడం దీనికి కారణం. వేతనాలు స్తంభించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది. ఫలితంగా ఉత్పత్తులు దండిగా ఉన్నప్పటికీ కొనేవారు లేక అధికోత్పత్తి సంక్షోభం తలెత్తింది. సరుకులు, సేవల రంగాలు రెండింటిలోనూ ఈ సంక్షోభం తీవ్రం కావడంతో వరుసగా ఆసియా టైగర్స్ సంక్షోభం, డాట్ కామ్ సంక్షోభం సంభవించాయి. అమెరికాలో సబ్ ప్రైమరీ సంక్షోభం ఈ పరిణామాలకు ఉత్ప్రేరకంగా తోడయ్యి ప్రపంచ ద్రవ్య వ్యవస్ధలో ఏర్పడిన బుడగ బద్దలయ్యింది. ప్రపంచ ద్రవ్య సంక్షోభం, వెనువెంటనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలయ్యాయి. వాల్ స్ట్రీట్ కంపెనీల అంతులేని డబ్బాశ సబ్ ప్రైమరీ హౌసింగ్ కుంభకోణానికి ప్రధాన కారణంగా ఉంది. తమ వద్ద ఉన్న ద్రవ్య పెట్టుబడులను మరిన్ని రెట్లు చేసుకోవడానికి అనేక అడ్డదిడ్డమైన ద్రవ్య ఉపకరణాలను సృష్టించి చివరికి వాటికే స్వయంగా బలైపోయాయి.

వాల్ స్ట్రీట్ కంపెనీలు తాము సృష్టించిన సంక్షోభంనుండి బైటపడడానికి తమ వల్ల కాక ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. పన్నుల వసూళ్ళు తప్ప మరే కార్యకలాపాలను కూడా ప్రభుత్వం చేపట్టడాన్ని వ్యతిరేకించే ఈ స్వేచ్చా మార్కెట్ కంపెనీలు తమ సంక్షోభ పరిష్కారం కోసం ఆ ప్రభుత్వంపైనే ఆధారపడక తప్పలేదు. ప్రభుత్వాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులుగా తెచ్చి వాల్ స్ట్రీట్ కంపెనీలకు ధారపోశాయి. ఇప్పటివరకూ 17 ట్రిలియన్ డాలర్లు (ఒక డాలరుకు రు.50 చొప్పున 8.5 కోట్ల కోట్ల రూపాయలకు ఇది సమానం) బెయిలౌట్ల క్రింద బడా బడా కంపెనీలకు అమెరికా ప్రభుత్వం సమకూర్చిందని ఒక అంచనా. దీనికి అనేక రెట్లు అంచనా కట్టిన సర్వేలు కూడా ఉన్నాయి. కేవలం అమెరికా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ఆధారంగా అంచనా వేస్తేనే 17 ట్రిలియన్ డాలర్లను తేలింది. ఇదంతా అమెరికా ప్రభుత్వం ఎక్కడినుండి తెచ్చింది? అప్పు చేసి తెచ్చింది. డాలర్ అంతర్జాతీయ మారకద్రవ్యంగా ఉండడం అమెరికాకు బాగా కలిసొచ్చింది. ఇబ్బటిముబ్బడిగా బాండ్లు జారీ చేసి అప్పులు సంపాదించింది. ఆ అప్పులన్నింటినీ బెయిలౌట్లుగా కంపెనీలకు పందేరం పెట్టింది.

అప్పుల పుణ్యాన వాల్ స్ట్రీట్ కంపెనీలు సంక్షోభం నుండి బైటికి వచ్చాయి. మళ్లీ లాభాలను కళ్ళచూడడం ప్రారంభించాయి. వాటి ఆర్ధిక కార్యకలాపాలన్నీ ఊపందుకున్నాయి. సంస్ధల సి.ఇ.ఓ లు మళ్ళీ మిలియన్ల కొద్దీ డాలర్లను బోనస్ లుగా తీసుకుంటున్నారు. అయితే సంక్షోభం మిగిల్చిన ఒక పని మాత్రం మిగిలిపోయింది. అదే అప్పు తీర్చడం. సంక్షోభంనుండి కంపెనీలను బైటికి లాగడానికి ప్రభుత్వం చేసిన అలవిమాలిన అప్పుని ఎవరు తీర్చాలి? మామూలుగా నైతే మనకు వెంటనే తట్టే ఆలోచన అప్పు ఎవరి కోసం తెచ్చారో వారే తీర్చాలని. బెయిలౌట్లు పొంది లాభాల బాట పట్టాయి కనుక కంపెనీలే ప్రభుత్వ అప్పును తీర్చే భారాన్ని మొయ్యడం న్యాయం. మొత్తం తీర్చకలేకపోతే కనీసం అసలు తీర్చుతామని చెప్పొచ్చు. అసలు అంతా కాకపోతే సగం తీర్చుతామని చెప్పొచ్చు. కానీ అవేవీ జరగలేదు. చిల్లిగవ్వ ఇవ్వడానికి కూడా అవి సిద్ధం కాలేదు. అసలు అదొక సమస్య కానే కాదు. తమకోసం తీసుకున్న అప్పు ప్రభుత్వం తీర్చడానికి సహకరించాలన్న ఆలోచనే సహజమైన ఆలోచన కాదు కంపెనీల దృష్టిలో. అమెరికా ప్రభుత్వం దృష్టిలో కూడా అదే న్యాయం.

ప్రజలపైనే బెయిలౌట్లు, అప్పుల భారం

ఇక మిగిలింది ప్రజలే. నేరుగా ప్రజలపైన భారం వెయ్యకుండా దానికి అడ్డదార్లను ప్రభుత్వాలు ఎన్నుకున్నాయి. అదేమంటే అకస్మాత్తుగా “అయ్యో అప్పు పేరుకుపోతోంది” అని అరవడం ప్రారంభించారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు గోల చెయ్యడం ప్రారంభించాయి. పత్రికలు కూడా ప్రభుత్వాల ప్రచారాన్ని శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే పనిని నెత్తిన వేసుకున్నాయి. పత్రికలు, పెట్టుబడిదారీ విశ్లేషకులు విరామం లేకుండాఅప్పులు కొండలా పేరుకుపోయాయి. దాని వలన దేశాల ఆర్ధిక పరిస్ధితి ప్రమాదంలో పడిపోయింది. తక్షణం ఏదో ఒకటి చేయాలిఅన్న సందేశాన్ని రాయడం, చెప్పడం ప్రారంభించారు. కాని ఆ అప్పులో చాలా భాగం కొత్తదేమీ కాదు. ఆర్ధిక సంక్షోభం సంభవించకముందు కూడా ఆ అప్పు ఉన్నదే. ఇప్పుడున్నంత స్ధాయిలో లేకపోయినా ఆందోళనకర స్ధాయిలోనే ఉంది. అప్పటికే ఆందోళనకర స్ధాయిలో ఉన్న అప్పుకు బెయిలౌట్ల అప్పు కూడా జతకూడి మరింత ఆందోళనకర స్ధాయికి చేరుకుంది తప్ప అకస్మాత్తుగా ప్రభుత్వాలకు తెలియకుండా జరిగింది కాదు. కాని ప్రభుత్వాలు, పత్రికలు, పెట్టుబడిదారీ విశ్లేషకులు అప్పు పేరుకున్న సంగతి అప్పుడే కనిపెట్టినట్లు మాట్లాడ్డం మొదలెట్టాయి. దానికి వెనుక ప్రభుత్వాలు, పత్రికల కుట్ర దాగి ఉంది. గతంలో చేసిన అప్పులతో సహా, బెయిలౌట్లకోసం చేసిన అప్పు భారాన్ని కూడా ప్రజలపై వేయడమే ఆ కుట్ర సారాంశం.

ఆర్ధిక సంక్షోభానికి ముందూ, సంక్షోభం సందర్భంగా కూడా ప్రభుత్వాలు చేసిన అప్పులన్నీ బడా కంపెనీల ప్రయోజనాల కోసమే. ప్రజల వద్దనుండి వసూలు చేసే పన్నులు ప్రజలను పోషించడానికీ, సంక్షేమ సదుపాయాలకీ శుభ్రంగా సరిపోగా ఇంకా మిగులు కూడా ఉంటుంది. కాని కంపెనీలకు ఇచ్చే వడ్డీ మినయాంపులు, పన్నుల రాయితీలు, పెద్ద మొత్తంలో ఇచ్చే సబ్సిడీలు అన్ని కలిసి ప్రజలకిచ్చే సదుపాయాల కంటే అనేక రెట్లు భారాన్ని ప్రభుత్వాలపై మోపుతాయి. వీటికి బెయిలౌట్ల భారం కూడా తోడవడంతో యూరప్, అమెరికా దేశాలపైన ఆయా దేశాల జిడిపిలతో సమానంగా అప్పులు పేరుకుపోయాయి. సంక్షోభానికి కారణమైనందుకు బడా కంపెనీలను శిక్షించవలసి ఉంది. పెనాల్టీలు పెద్ద మొత్తంలో వసూలు చేయవలసి ఉంది. ఆ మేరకు అబివృద్ధి చెందిన దేశాలు, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు జి20 గ్రూపు సమావేశాల సందర్భంగా తీర్మానాలు కూడా చేశాయి. సంక్షోభ పరిష్కారానికి ఫిస్కల్ చర్యలు (బెయిలౌట్లు పంచడం) చేపట్టాలన్న తీర్మానాన్ని అమలు చేయడంలో చూపిన ఆసక్తిని, ప్రభుత్వాలు అక్రమ వ్యాపార పద్ధతులకు, మోసాలకు పాల్పడిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్న తీర్మానం అమలు పట్ల కొంచెం కూడా చూపలేదు. ప్రభుత్వాల పగ్గాలు బడా కంపెనీల చేతుల్లో ఉన్నపుడు ప్రభుత్వాలు ఆ కంపెనీలపై చర్య తీసుకుంటాయని భావించడం అత్యాశే కాగలదు. ఫలితంగానే అప్పులను ప్రజలనుండే వసూలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి. అప్పుల భారాన్ని ప్రజలపై వేసి వాల్ స్ట్రీట్ కంపెనీలకు మరిన్ని పన్ను రాయితీలు, సబ్సిడీలు పంచడం ప్రారంభించాయి ప్రభుత్వాలు.

రాజకీయార్ధిక పగ్గాలు వాల్ స్ట్రీట్ కంపెనీల చేతుల్లోనే

వాల్ స్ట్రీట్ అన్నది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ వీధి పేరు. పేరుకు ఒక వీధి అని చెప్పుకున్నా అది వాస్తవానికి ఒకటే వీధి కాదు. అనేక వీధుల సమాహారం వాల్ స్ట్రీట్. అమెరికాకి ఇది వాణిజ్య రాజధాని. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు అమెరికా కేంద్రం కనుక, అమెరికా ఆర్ధిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న వాల్ స్ట్రీట్, ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాలకు కూడా కేంద్రంగా చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రజలు తమకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసే బజార్లను మెయిన్ స్ట్రీట్ గా పిలుస్తారు. వాల్ స్ట్రీట్ లో ప్రధానంగా ద్రవ్య (ఫైనాన్స్) కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. ప్రపంచవ్యాపితంగా ఉండే అనేక పెద్ద పెద్ద కంపెనీలకు, పరిశ్రమలకు, బ్యాంకులకు, ఇన్సూరెన్సు కంపెనీలకు ఇవి పనులు చేసి పెడతాయి. పనులు చేసినందుకుగాను ఫీజులు వసూలు చేస్తాయి. ఫీజులు కొన్ని వందల లేదా వేల కోట్ల లో ఉంటాయి.

ప్రపంచవ్యాపితంగా ప్రజలు తమ తమ దేశాల్లోని బడా బడా కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కస్టమర్లుగా ఉంటే, ఆ కంపెనీలు, బ్యాంకులన్నీ కూడా వాల్ స్ట్రీట్ లోని బడా బడా ద్రవ్య కంపెనీలకు కస్టమర్లుగా ఉంటాయి. ఆయిల్, గ్యాస్ కంపెనీల నుండి మైనింగ్ పరిశ్రమలవరకూ, పెద్ద పెద్ద కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీలనుండి సాఫ్ట్ వేర్ కంపెనీలవరకూ, బడా ఎలక్ట్రిక్ కంపెనీలనుండి ఎలక్ట్రానిక్ కంపెనీల వరకూ తమ మేక్రో కార్యకలాపాలకు వాల్ స్ట్రీట్ ద్రవ్య కంపెనీలపై ఆధారపడతాయి. రెండు ఆయిల్ కంపెనీలు విలీనం అవుతున్నా, రెండు మైనింగ్ కంపెనీలు తమ వాటాలలో కొంత భాగాన్ని అమ్ముకోవాలన్నా, ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ తమ వాటాలను విస్తృతం చేసుకోవాలన్నా అన్నింటికీ కొన్ని పద్ధతులను పాటించాలి. ప్రభుత్వ చట్టాలను పాటిస్తూ, తమ తమ దేశాలలోని స్టాక్ మార్కెట్ నియంత్రణా సంస్ధల (ఉదా: సెబి) కు జవాబుదారీగా ఉంటూ ఆయా కార్యకలాపాలను పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ కంపెనీలకు సాధ్యం కాదు. సదరు నియమ నిబంధనలపై పట్టు కలిగి ఉన్న ద్రవ్య సంస్ధలను తమపని చేసి పెట్టడానికి నియమించుకుని అందుకుగాను ఫీజులు చెల్లిస్తాయి.

వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎంతవరకు తమ పని చేసి పెట్టాలన్నది కస్టమర్ కంపెనీలు నిర్ణయించుకుని ఆ మేరకు పనులను జరిపించుకుంటాయి. కొన్ని కంపెనీలు సలహా ఇవ్వడం వరకు నియమించుకుంటాయి. మరికొన్ని మొదటి నుండి చివరి వరకూ అన్నీ చేసిపెట్టమని కోరుతాయి. తమ కస్టమర్లకు లాభం కలిగేలా వాల్ స్ట్రీట్ కంపెనీలు వ్యవహారాలు చక్కబెడతాయి. ఈ పనులను చేసి పెట్టే ద్రవ్య కంపెనీలను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులనీ, ఇన్సూరెన్సు సంస్ధలనీ అంటారు. ఆ సంస్ధల పేర్లను బట్టి వాటి కార్యకలాపాలను అంచనా వేయలేము. బ్యాంకులుగా పేరు పెట్టుకున్న సంస్ధలు ఇన్సూరెన్సు కార్యకలాపాలు కూడా నిర్వహిస్తాయి. అలాగే ఇన్సూరెన్సు సంస్ధలు బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహించవచ్చు. వాల్ స్ట్రీట్ లో ఉండే అనేక బడా ద్రవ్య కంపెనీలు సాధారణంగా సమస్త ద్రవ్య కార్యకలాపాలని నిర్వహిస్తుంటాయి. అవి చేయవు అన్న ద్రవ్య సంబంధిత పని ఏదీ ఉండదు.

గోల్డ్ మేన్ సాచ్ వీటన్నింటిలో అతి పెద్ద ఇన్వెస్ట్ బ్యాంకు. తనకు కస్టమర్లుగా ఉన్న అనేక కంపెనీలనూ, బ్యాంకులనూ, ఇన్సూరెన్సు కంపెనీలనూ, ప్రభుత్వాలనూ, వ్యక్తిగత మదుపుదారులనూ మోసం చేసిన సంస్ధ. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో కూరుకు పోవడానికి దారితీసిన కార్యకలాపాలన్నింటినీ ఇది దశాబ్దాలపాటు నిర్వహిస్తూ వచ్చింది. 2008 ఎన్నికల్లో బారక్ ఒబామాకు అందరికంటే ఎక్కువగా ఎన్నికల నిధులను ఈ కంపెనీ సమకూర్చింది. వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలకు కూడా ఇదే ఒబామాకు నిధులివ్వడంలో ముందుంది. ఈ సంస్ధకు సి.ఇ.ఓలుగా పని చేసినవాళ్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీగా, ఫెడరల్ రిజర్వ్ టాప్ ఉద్యోగులుగా పని చేస్తుండడం కద్దు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించినప్పుడు ట్రెజరీ సెక్రటరీగా ఉన్న హెన్రీ పాల్సన్ గతంలో గోల్డ్ మేన్ సాచ్స్ సి.ఇ.ఒ గా పని చేశాడు. ఇదొక్కటే కాదు. జె.పి.మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, క్రెడిట్ సుశీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, నొమూరా సెక్యూరిటీస్, యు.బి.ఎస్. వెల్స్ ఫార్గో, బి.ఎన్.పి పరిబాస్… ఇవన్నీ వాల్ స్ట్రీట్ సంస్ధలుగా ప్రసిద్ధి చెందాయి. వాల్ స్ట్రీట్ కంపెనీలన్నింటికీ వాల్ స్ట్రీట్ లో ఆఫిసులు ఉండవలసిన అవసరం లేదు. అనేక యూరప్, జపాన్ కంపెనీలు కూడా వాల్ స్ట్రీట్ కంపెనీలతో సమానంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నవి ఉన్నాయి. వాటిని కూడా వాల్ స్ట్రీట్ కంపెనీల కింద ఒక్కోసారి పరిగణిస్తారు. ఆ కంపెనీల కార్యకలాపాలు వాల్ స్ట్రీట్ కంపెనీల కార్యకలాపల లాగానే ఉంటాయి. అటువంటి ద్రవ్య, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో ఉన్న బడా బడా కంపెనీలన్నీ అలంకార ప్రాయంగా వాల్ స్ట్రీట్ కంపెనీలుగా పిలవొచ్చు. ప్రపంచ ఆర్ధిక, ద్రవ్య వ్యవస్ధల నాడీ మండలం మొత్తం ఈ కంపెనీల చేతుల్లో ఉంటుంది.

అర్ధిక, ద్రవ్య వ్యవస్ధలతో పాటు రాజకీయ వ్యవస్ధల పగ్గాలు కూడా ఇవి తమ చేతుల్లో పెట్టుకుని ప్రపంచ రాజకీయ పరిణామాలను శాసిస్తుంటాయి. యుద్ధాలను ప్రారంభింపజేస్తాయి, విరమింపజేస్తాయి. టెర్రరిస్టు సంస్ధలను పోషిస్తాయి, అవే టెర్రరిస్టు సంస్ధలను నిర్మూలించడానికి యుద్ధాలను నడిపేలా దేశాలను శాసిస్తాయి. ప్రపంచవ్యాపితంగా తిరుగుబాట్లను పోషించడానికి కూడా ప్రత్యేక బ్యాంకులను నెలకొల్పగల పలుకుబడి వీరికి ఉంటుంది. తిరుగుబాట్లు ఎంతకాలం నడపవలసిందీ, ఏ స్ధాయిలో నడపవలసిందీ కూడా శాసించగల స్ధాయిలో కొన్నిసార్లు ఈ సంస్ధలు ఉంటాయి. మొదట తిరుగుబాట్లు మొదలై ఆ తర్వాత బ్యాంకులు వారికి స్పాన్సర్లుగా వ్యవహరించవచ్చు. లేదా బ్యాంకులే పూనుకుని తమ అవసరాల మేరకు తిరుగుబాట్లకు జన్మనివ్వవచ్చు.

తమ కార్యకలాపాలు నిరంతరం కొనసాతూ ఉండడానికి ఈ సంస్ధలకు కస్టమర్లు కావాలి. కస్టమర్లకు కరువు ఏర్పడితే ఈ సంస్ధల ఉత్పత్తులు అమ్మకంలోకి రావు. అమ్మకం జరగకపోతే వాల్ స్ట్రీట్ కంపెనీల ఉత్పత్తులు ఆగిపోతాయి. ఆ విధంగా వాల్ స్ట్రీట్ కంపెనీలలో అధికోత్పత్తి సంక్షోభం ఏర్పడి మాంద్యానికి (రిసెషన్) దారి తీయవచ్చు. కనుక ఏ ఆఫ్రికాలోనో, లాటిన్ అమెరికాలోనో జరిగే సైనిక కుట్రలు, తిరుగుబాట్లు ఈ సంస్ధల చేతిలో లేకుండా పోతే వాల్ స్ట్రీట్ కార్యకలాపాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వాల్ స్ట్రీట్ అన్నది ప్రపంచ వాణిజ్య కేంద్ర మాత్రమే కాదు. అదొక కుట్రల ఫ్యాక్టరీ. అనేక దేశాల ప్రభుత్వాలకు యజమాని (బాస్). అనేకమంది నియంతలు వాల్ స్ట్రీట్ కు కస్టమర్లు. గతంలో ప్రభుత్వాల కనుసన్నల్లో ఉన్న ఈ కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలకు చెందిన చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలనే కాదు ఇవి శాసిస్తున్నది. ప్రపంచ పోలీసు, అగ్రరాజ్యం అయిన అమెరికా రాజకీయ వ్యవస్ధ సైతం వాల్ స్ట్రీట్ కంపెనీల చేతుల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సహజంగా ఏర్పడే సంక్షోభ పరిస్ధితులకు సబ్ ప్రైమరీ సంక్షోభం, ఆఫ్ఘన్ ఇరాక్ దురాక్రమణ యుద్ధాలు ఉత్ప్రేరకాలుగా పని చేయడంతో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ముందుకు జరిగింది. అంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నిజానికి ఆపగలిగేది కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో జరిగే ఆర్ధిక, రాజకీయ పరిణామాలు అనివార్యంగా చిన్న, పెద్ద సంక్షోభాలకు కారణంగా నిలుస్తాయి. అయితే సామ్రాజ్యవాద దేశాలు మార్కెట్ల పునఃపంపిణీ కోసం పోటీపడుతూ తీసుకునే చర్యల వలన సంక్షోభ పరిస్ధితులు మరింత వేగంగా రూపుదిద్దుకుంటాయి. అమెరికా, దాని మిత్ర దేశాలు సాగించిన రెండు దురాక్రమణ యుద్ధాలు, ఆర్ధిక పరంగా అమెరికా, యూరప్ ల ద్రవ్య కంపెనీలు అక్రమాలకు పాల్పడడం వలన ఏర్పడిన సబ్ ప్రైమరీ సంక్షోభం అన్నీ కలిసి ఆర్ధిక వ్యవస్ధ పతనాన్ని వేగవంతం చేశాయి.

యూరప్ రుణ సంక్షోభం

సంక్షోభాల పరిష్కారం కోసం అప్పులు తెచ్చి బడా కంపెనీలకు బెయిలౌట్లు ఇచ్చారని చూశాం. బెయిలౌట్ల కోసం తెచ్చిన అప్పులను ప్రజలనుండి వసూలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడ్డాయని చూశాం. బెయిలౌట్ల కోసం అప్పులు తెచ్చిన సంగతిని పక్కను నెట్టిన ప్రభుత్వాలు దేశాలపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్ధిక వ్యవస్ధ పూనుకోవాలన్న అవగాహనను ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో వ్యాప్తి చేయడానికి పూనుకున్నాయి. ఈ క్రమంలో గ్రీసు రుణ సంక్షోభం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధకు బాగా కలిసి వచ్చింది. గ్రీసు రుణ సంక్షోభం కూడా అకస్మాత్తుగా ప్రపంచ ఆర్ధిక రంగం మీదికి వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలంటే తీసుకురాబడింది.

2010లో గ్రీసులో సోషలిస్టుల నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జార్జి పపాండ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం పాత ప్రభుత్వం మీదికి నేరం మోపుతూ ఒక విషయాన్ని వెల్లడించింది. గ్రీసు బడ్జేట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) పాత ప్రభుత్వం చెప్పినట్లుగా జిడిపిలో 5 శాతం కాదనీ,  11 శాతం పైనే ఉందనీ పపాండ్రూ ప్రభుత్వం వెల్లడించింది. దానితో గ్రీసుకి అప్పు ఇవ్వడానికి మార్కెట్లు వెనకంజ వేస్తున్నాయని పత్రికలు రాయడం ప్రారంభించాయి. గ్రీసు, యూరోజోన్ లో సభ్యురాలు. అంటే యూరో ను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించిన 17 దేశాల్లో గ్రీసు కూడా ఒకటి. ఈ 17 దేశాలను కలిపియూరో జోన్అంటారు. యూరోజోన్ లో సభ్యత్వం ఉన్న దేశాలు కొన్ని క్రమశిక్షణలను పాటించవలసి ఉంటుంది. బడ్జెట్ లోటు తమ తమ జిడిపిలలో 3 శాతం కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన షరతు. బడ్జెట్ లోటు ఎక్కువగా ఉందంటే దానర్ధం పన్నులు, ఇతర వసూళ్ల ద్వారా సమకూడే ఆదాయం కంటే ఆ ప్రభుత్వం ఎక్కువగా బడ్జేట్ రూపొందించుకుని ఖర్చులు చేస్తున్నదని అర్ధం. ఆదాయం  చూసుకోకుండా పరిమితికి మించి ఖర్చులు పెట్టేవారిని దుబారా గాళ్ళని ముద్రవేస్తాం. అదే పద్ధతి దేశాలకు కూడా వర్తిస్తుంది.

గ్రీసు యూరో జోన్ దేశంగా మూడు శాతం మాత్రమే బడ్జెట్ లోటు ఉండేలా చూడవలసి ఉంది. కాని ఆదాయానికి మించి క్రమశిక్షణ లేకుండా పదకొండు శాతం బడ్జెట్ లోటు ఉండేలా ఖర్చు పెట్టిందనీ, దానిని బైట పెట్టకుండా దొంగలెక్కలు వేసి ఐదు శాతం మాత్రమే బడ్జెట్ లోటు ఉందని అబద్ధాలు చెప్పిందన్న విషయం పెద్ద వార్తగా ప్రచారం అయ్యింది. ప్రచారం చేశారు అనడం కరెక్టుగా ఉంటుంది. దానివలన గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ బలహీనంగా ఉన్నదని విస్తృతంగా ప్రచారం అయింది. బలహీన ఆర్ధీక వ్యవస్ధ ఉన్న దేశాలకు అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. కనుక గ్రీసుకు అప్పు ఇవ్వడం అంటే రిస్కు తీసుకున్నట్లు అర్ధం. రిస్కు తీసుకుని ఇచ్చే అప్పులకు సహజంగానే వడ్డీ ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఆ విధంగా గ్రీసుకి అప్పు ఇవ్వాలంటే వడ్డీ (ఆర్ధిక పరిభాషలో దీనిని యీల్డ్ అంటారు) ఎక్కువగా డిమాండ్ చేయడం ప్రారంభించారు. అంటే అప్పు సేకరణ కోసం గ్రీసు అమ్మజూపే సావరిన్ డెట్ బాండ్లపైన మదుపుదారులు అధిక వడ్డీ డిమాండ్ చేయడం ప్రారంభించారు.

కాని అధిక వడ్డీకి అప్పులు తీసుకునే పరిస్ధితి గ్రీసుకు లేదు. కనుక గ్రీసుకి మార్కెట్లో అప్పు దొరకడం దుర్లభంగా మారిపోయింది. కాని రోజువారి ఖర్చులన్నింటినీ ప్రభుత్వాలు అప్పులతో నెట్టుకొస్తుంటాయి. బాండ్లు జారీ చేసి అప్పులు తీసుకుంటూ పన్నుల వసూళ్ళను బాండ్ల చెల్లింపులకు తరలిస్తూ ఉంటాయి. బలహీన ఆర్ధిక వ్యవస్ధ వలన పన్నుల వసూళ్లు తగ్గిపోవడం, మరో పక్క అప్పులపైన అధిక వడ్డీ డిమాండ్ చేయడం, రోజు వారి ఖర్చులకు డబ్బు చేతిలో లేకపోవడం… ఈ పరిస్ధితులు గ్రీసు రుణ సంక్షోభం లో కూరుకుపోయినట్లుగా నిర్ధారించాయి. 2010 మే నెలకల్లా గ్రీసు ప్రభుత్వం అప్పటికే చేసిన అప్పులపైన చెల్లింపులు చేయవలసి ఉంది. చెల్లింపులకు అప్పులు సేకరించాలి. సాధారణ అప్పులు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. జర్మనీ బాండ్లకు 3 శాతం వడ్డీ మాత్రమే కోరుతున్న రుణదాతలు గ్రీసుకి వచ్చేసరికి 12 శాతం వరకూ వడ్డీ డిమాండ్ చేశారు. అంటే గ్రీసుకి అప్పు దొరకదని తేలిపోయింది. మరి అప్పు లేకుండా ఖర్చులు నడిపేదెట్లా. మే నెలలో   అప్పు చెల్లింపులు చేయకపోతే అది దివాలా (డిఫాల్ట్) కిందికి వస్తుంది.

పొదుపు ఆర్ధిక విధానాలు

దశలో రక్షకులుగా ఫోజు పెడుతూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు రంగంలోకి దిగాయి. గ్రీసు కరెన్సీ యూరో అయినందున, అది రుణ సంక్షోభంలో ఉంటే దాని ప్రభావం యూరోపైన పడుతుంది. అంటే యూరో విలువ పతనమవుతుంది. యూరో పతనం అయితే దాన్ని కరెన్సీగా చేసుకున్న ఇతర 16 దేశాల కరెన్సీ నిల్వల విలువ పడిపోతుంది. తద్వారా ఆ దేశాల ఆర్ధిక పరిస్ధితి కూడా చిన్నాభిన్నమవుతుంది. ఆ పరిస్ధితిని నివారించడానికి ఇతర యూరో దేశాలు రంగంలోకి దిగడం అనివార్యం అన్న అవగాహన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం కాదు. ఈ కారణంతో పాటు గ్రీసును ఆదుకోవడానికి యూరోజోన్, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు రంగంలోకి దిగడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది.

గ్రీసుకి అప్పు ఇచ్చినవారిలో ప్రవేటు వ్యక్తులు, సంస్ధలే కాక యూరప్ దేశాల ప్రభుత్వాలు, బ్యాంకులు కూడా ఉన్నాయి. అంటే జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, హాలండ్, బెల్జియం లాంటి ఇతర ఇ.యు దేశాల ప్రభుత్వాలు, ఆ దేశాలలోని బ్యాంకులు కూడా గ్రీసుకు అప్పు ఇచ్చాయి. కనుక గ్రీసు రుణ సంక్షోభంలో పడినందువలన అప్పు చెల్లింపులు చేయలేకపోతే దాని ప్రభావం ఇతర యూరప్ దేశాలపైనా, అక్కడి బ్యాంకులపైనా పడుతుంది. కనుక గ్రీసుకి అర్జెంటుగా కావలసిన అప్పులని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇవ్వడానికి సిద్ధపడ్దాయి. దాని కోసం అనేక సమావేశాలు, చర్చలు జరిగాక 110 బిలియన్ యూరోల రుణ ప్యాకేజిని గ్రీసుకి ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఐ.ఎం.ఎఫ్ కొంత భాగం సమకూర్చుతుంది. గ్రీసుతోనే సంక్షోభం ఆగదనీ ఇతర బలహీన దేశాలయిన ఐర్లండు, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలకు కూడా పాకుతుందన్న ఆందోళనతోనే గ్రీసుకు ప్యాకేజి ప్రకటిస్తున్నట్లు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఒక అవగాహనను పత్రికల ద్వారా ప్రజల మీదికి వదిలాయి.

అయితే గ్రీసుకి ప్యాకేజి ఇవ్వడం వెనక తమ బ్యాంకులు గ్రీసు కి ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవాలన్న ఎత్తుగడతో పాటు శవాలపై పైసలు ఏరుకోవడంసమానంగా చూడగల మరొక ఎత్తుగడను కూడా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బుర్రల్లో ఉంది. సంక్షోభంలో ఉన్న గ్రీసును ఆదుకునే పేరుతో మంజూరు చేసిన బెయిలౌట్ పధకం అనేక షరతులతో అవి మంజూరు చేశాయి. ఆ షరతుల ఫలితమే పొదుపు ఆర్ధిక విధానాలు. గ్రీసు ప్రభుత్వం అతిగా ఖర్చు చేసి బడ్జెట్ లోటు పెరగడానికి కారణభూతమై అప్పులు దొరకని పరిస్ధితికి చేరుకుంది కనుక అది అతి ఖర్చులను మితం చేసుకోవాలని షరతు విధించాయి. అంటే ఖర్చులని మితం చేసుకుని పొదుపు పాటించాలన్నమాట. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చిన రుణ ప్యాకేజి నిజానికి గ్రీసు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే అదంతా ఇతర యూరప్ దేశాలు ఇచ్చిన అప్పులపై వడ్డీలు చెల్లించడానికి మెచ్యూర్ అయిన అప్పులు చెల్లించడానికి ప్రధానంగా ఖర్చు చేయాలి.

పొదుపు షరతుల్లో భాగంగా కార్మికుల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం, పెన్షన్ల కొత, ఉద్యోగుల సదుపాయాల రద్దు, వివిధ అలవెన్సుల్లో కోత, ప్రభుత్వరంగ ఉద్యోగాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రవేటు వాళ్లకి అతి తక్కువ రేట్లకు అప్పజెప్పడం, ప్రజలపైనా, ఉద్యోగుల పైనా చేసే ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం ఇవన్నీ వివిధ రూపాల్లో, వివిధ వర్ణనల మాటున అమలు చేయాలి. ఈ చర్యలన్నీ నేరుగా గ్రీసు ప్రజలపైన ప్రభావితం చూపేవే. ఒక్క విడత విధానాలతో గ్రీసు ప్రభుత్వం ఊరుకోలేదు. ఇప్పటికి నాలుగైదు సార్లు జీతాల్లో కోత పెట్టింది. ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మేసింది. అదనపు పన్నులు వేసింది. కంపెనీలకు మరిన్ని పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చింది. ఆ భారాన్ని మళ్లీ కోతలతో వసూలు చేసింది. ఇంకా మరిన్ని విడతలు ఇలాంటి చర్యలు చేపట్టాలని సందర్భం వచ్చినప్పుడల్లా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గుర్తు చేస్తుంటాయి. ఈ విధానాలు గ్రీసు ప్రజల ఆర్ధిక స్ధితిని తీవ్రంగా దెబ్బతీసాయి. పొదుపు విధానాలకు వ్యతిరేకంగా గ్రీసు ప్రజలు రెండు సంవత్సరాలుగా సమ్మెలు, ఆందోళనలు చేస్తున్నా వాటిని అణచివేసి పొదుపు చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. ఇన్ని చేసినా గ్రీసు బడ్జెట్ లోటు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించిన స్ధాయికి తగ్గించడం లో విఫలమయ్యిందని చెబుతూ మరిన్ని పొదుపు చర్యలను ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధిస్తున్నాయి.

ఇదే విధంగా ఐర్లండు రుణ సంక్షోభం పేరుతో ఆ దేశానికి కూడా ప్యాకేజి ఇచ్చి షరతులు అమలు చేస్తున్నాయి. అలాగే పోర్చుగల్ కి కూడా రుణ ప్యాకేజి ప్రకటించి ఆ దేశ ప్రజలపైన పొదుపు ఆర్దిక విధానాలను రుద్దుతున్నాయి. ఈ జాబితాలో తదుపరి వంతు స్పెయిన్ గానీ, ఇటలీ గానీ అని భావిస్తున్నారు. ఒక దశలో ఫ్రాన్సు కూడా రుణ సంక్షోభం లోకి వెళ్తుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలను సాకుగా చూపుతూ ఇతర యూరప్ దేశాలు, జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లండులతో సహా తమవైన పొదుపు విధానాలను అమలు చేయడం ప్రారంభించాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధలలో, అందునా స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు ఉన్న దేశాల్లో పొదుపు అంటే ప్రజలపై చేసే ఖర్చులు తగ్గించుకోవడమే తప్ప ప్రజలతో పాటు కంపెనీలు, వ్యాపారాలపైన చేస్తున్న ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చన్న అవగాహన ఉండదు. అసలా ఆలోచనే పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. గోళ్ళూడగొట్టయినా ప్రజలనుండి వసూలు చేయాలి తప్ప వ్యాపారాలు, కంపెనీలపైన పన్నులు పెంచడం, సబ్సిడీలు తగ్గించడం లాంటివి అసలు చేయరాదు. అది అభివృద్ధికి విఘాతంగా చూస్తారు. ప్రజలపై భారం వేయడం వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి కంపెనీల సరుకుల అమ్మకాలు పడిపోయి అధికోత్పత్తి సంక్షోభం మరింతగా పెరిగి ఆర్ధిక సంక్షోభం తీవ్రమవుతుందన్న ఆలోచన ఏకోశానా ప్రభుత్వాల వద్దగానీ, ఆర్ధిక పండితుల వద్దగానీ కనిపించదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s