తెలంగాణ డిమాండ్ ను ఎందుకు సమర్ధించాలి?


బ్రిటిష్ వాడికి కోస్తా జిల్లాలనుండి రెవిన్యూ వసూళ్ళు రావడానికి రెండు డ్యాంలు కట్టించాడు. విజయవాడ, ధవళేశ్వరం. కొన్ని కాలవలు తవ్వించాడు. కేవలం వాడి ప్రయోజనాల కోసమే. వాటి ద్వారా కృష్టా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భూస్వాములు వ్యవసాయం చేసి అభివృద్ధి చెందారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేనాటికి వారి వద్ద పెట్టుబడి సమకూరింది. పెట్టుబడి సమకూరాక అది ఊరికే కూర్చోదు. లాభాల కోసం పరుగులు పెడుతుంది. లాభాలకోసం కృ, గుం, ఉ.గో జిల్లాల భూస్వాములు హైద్రాబాద్ వచ్చి పరిశ్రమలు పెట్టారు.

వీళ్ళు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, సామర్లకోట, తుని లాంటి తమ సొంత పట్నాలని వదిలి హైద్రాబాద్ ఎందుకు వచ్చారు? హైద్రాబాద్ ని అభివృద్ధి చేయడానికి వచ్చామని ఇప్పుడంటున్నారు. కాని అది నిజం కాదు. తమ ప్రాంతాలలో కంటె తెలంగాణలో ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు స్ధాపించాలంటె ఏం కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లెదు. ప్రకృతి వనరులు, రోడ్లు, వంతెనలు, రైలు విమాన యాన సౌకర్యాలు మొ.వి. ఇవన్నీ తెలంగాణలో హైద్రాబాద్ చుట్టూతా, హైవేల చుట్టూతా వాటంగా ఉన్నాయి. అందువలన తెలంగాణ ప్రాంతం లాభాల సంపాదనను అనువుగా దొరికింది. దానితో సీమాంధ్రలో ముఖ్యంగా ఆ నాలుగు జిల్లాల భూస్వాములు పెట్టుబడిదారులుగా తెలంగాణకి వచ్చారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలంగాణలో భూస్వాములు పెట్టుబడిదారులుగా 1947 నాటికి అభివృద్ధి చెందలేదు. అక్కడ నీటిపారుదల సౌకర్యాలు లేవు. (ఇప్పటికీ అరకొరగానే ఉన్నాయి) మెరక ప్రాంతం కావడాన, అప్పటికి ఎత్తిపోతల లేనందున తెలంగాణ భూస్వాములు ఆ భూములపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్ధితి కాస్త అటూ ఇటూగా నిన్నమొన్నటివరకూ కొనసాగింది. ఈ లోగానే తెలంగాణ భూస్వాములు కూడా నెమ్మదిగా భూముల ద్వారానే పెట్టుబడులు సమకూర్చుకున్నారు. సరళీకృత ఆర్ధిక విధానాల వలన తెలంగాణ భూస్వాములు కూడా మెల్లగా పెట్టుబడిదారులుగా అవతారం ఎత్తారు. కాని నాలుగు జిల్లాల వారంత ధనికులు కాలేదు. ఈ కారణాల వలన సీమాంధ్రలో కనిపించేటంత పెద్ద ధనికులు తెలంగాణలో కనిపించరు. ఎవరో నామా, కోమటిరెడ్డి లాంటి ఒకరిద్దరు మినహా. అదే సీమాంధ్ర లో చూస్తే పరిశ్రమాధిపతులుగా చాలా మంది ఉన్నారు.

కనుక ఇక్కడ ఏం జరిగింది. ప్రధానంగా నాలుగు జిల్లాల భూస్వాములు, ఇంకా ఇతర కొస్తా జిల్లాలకు కూడా చెందిన రాజులూ, జమీందార్లూ కూడా తమ జిల్లాల్లో భూస్వాములుగా సంపదలని పోగేసుకోవడమే కాక తెలంగాణ జిల్లాల్లో వనరులను కూడా ఉపయోగించుకుని పరిశ్రమలు పెట్టి మరిన్ని సంపదల్ని అర్జించారు.

అయితే పెట్టుబడిదారులు ఏ ప్రాంతం వాడైనా, ఏ రాష్ట్రం వాడైనా తమకు పోటీగా మరొకరు ఎదగడాన్ని సహించరు. తెలంగాణలో కొత్తగా ముందుకొచ్చిన ఆ ప్రాంత పెట్టుబడుదారులు ఎదగకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుపడడం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల పోషకులు ప్రధానంగా వీళ్ళే. వీరి చందాలు లేకుండా పార్టీలు బతికి బట్టకట్టవు. ఈ నలభై, యాభై సంవత్సరాల పాటు ధనికులుగా రాష్ట్ర ప్రభుత్వ నాయకుల్లోనూ, అధికారుల్లోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు పలుకుబడి సంపాదించారు. ఇంకా చెప్పాలంటే ఆధిపత్యం అనడం సరిగ్గా ఉంటుంది. ఎవరిపైన ఆధిక్యత? కొత్తగా ఎదుగుతున్న తెలంగాణ పెట్టుబడిదారులపైన. సీమాంధ్రలోనేమో పత్తి, మిరప, పొగాకు తదితర పంటలు, వ్యాపారాలు అన్నీ వారివిగానే ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ సంపాదించిన పెట్టుబడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వలన ఇక్కడ పరిశ్రమలు, వనరులు కూడా వారి కిందికే ప్రధానంగా వచ్చాయి. ఇది క్రమానుగతంగా జరిగిన పరిణామం.

ఇక్కడ సీమాంధ్ర పెట్టుబడిదారులు మొదటినుండీ తెలంగాణ పెట్టుబడుదారులకు ఎదగకుండా అడ్డుకోవడం జరగలేదు. వాళ్లు ఎప్పుడైతే తమ వ్యాపారాలకు పోటీగా ఎదుగుతున్నారో అప్పుడే అడ్డుకోవడం ప్రారంభించారు. అలాగే తెలంగాణ పెట్టుబడుదారులు మొదటినుండీ తమ ఎదుగుదలకు అడ్డంకులు ఎదుర్కోలేదు. వాళ్ళు ఒక స్ధాయిని దాటి పెద్ద పెద్ద వ్యాపారాల్లో కూడా అడుగుపెట్టడం ఎప్పుడు ప్రారంభం అయ్యిందో అప్పుడే వారు అణచివేతను ఎదుర్కొన్నారు. ఈ క్రమం దాదాపు డెబ్భైలనుండి మొదలయ్యి ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది. సీమాంధ్ర పెట్టుబడిదారులకే ప్రభుత్వం లో కూడా సీమాంధ్ర ధనికుల పలుకుబడే ఉండడం వలన తెలంగాణ ధనికులు ఆం.ప్ర ప్రభుత్వం నుండి తగిన మద్దతు పొందలేకపోయారు. తెలంగాణ రాజకీయ నాయకులు కూడా సీమాంధ్ర ధనికుల ఏలుబడిలోనే ఉండడం వలన వారూ తెలంగాణ ధనికులకు సహాయం చెయ్యలేదు.

సీమాంధ్రలో భూస్వాములు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అక్కడి నీటిపారుదల వలన బడా భూస్వాములతో పాటు ధనికవర్గం, మధ్య తరగతి వర్గాలు కూడా అభివృద్ధి చెందాయి. రైతులు బాగా ఉన్నప్పుడు కూలీలకు కూడ పని దొరికి ఆమేరకు ప్రయోజనం పొందుతారు. వారందరైపైన ఆధారపడి వ్యాపార వర్గం అభివృద్ధి చెందింది. వారి చుట్టూ చిన్నా, చితకా చేతిపనుల వాళ్లు కూడ ఎంతో కొంత అభివృద్ధి సాధించారు. కాని తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చెందకపోవడం వలన ఆ మేరకు ఇతర వర్గాల అభివృద్ధి కూడా జరగలేదు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందక పోవడంవలన తెలంగాణకు, సీమాంధ్రకు చాలా చాలా తేడా ఏర్పడింది. సీమాంధ్రలో భూస్వాముల ఆస్తులు పెరగడం, ఆస్తులతో పరిశ్రమలు పెట్టడం, వారి చుట్టూ ధనికవర్గం, మధ్యతరగతి ఉద్యోగ వర్గం, కూలీలు మొదలైనవర్గాలు అభివృద్ధి సాధించినట్లుగా తెలంగాణలొ జరగలేదు. తెలంగాణలో తాము పెట్టిన పరిశ్రమలకు ఉద్యోగులు, కార్మికులను కూడా సీమాంధ్ర ధనికులు, సీమాంధ్ర నుండే ఎక్కువగా తెచ్చుకున్నారు. దీనికి అనేక కారణాలు పనిచేశాయి. భాష, సంస్కృతి అర్ధం కానిది కాకపోవడం, విద్యా సౌకర్యాలు లేక తగిన పనివాళ్ళు తెలంగాణలో దొరక్కపోవడం, రైతులు కూలీలు ప్రధానంగా భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల్లో ఇరుక్కొనిపోయి బైటికి రాలేక పోవడం ఇవన్నీ పని చేసి సీమాంధ్రుల పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగులు కూడా ప్రధానంగా సీమాంధ్రనుండే వచ్చారు.

తెలంగాణ ధనికులు అభివృద్ధి సాధించాక వ్యాపారాల్లొ అప్పటికే వృద్ధి చెందిన సీమాంధ్ర పెట్టుబడిదారులనుండి అణచివేతను ఎదుర్కొన్నారు. తెలంగాణ పెట్టుబడిదారులపై అణచివేత అంటే ఏమిటి? బూటు కాళ్లతో తొక్కిపెట్టారని అర్దమా? కాదు. సెక్రటేరియట్ లొ ఏ విభాగానికి వెళ్లినా పనులు జరగవు. మంత్రుల చుట్టూ తిరిగినా కాంట్రాక్టులు దక్కవు. ఎంత తక్కువకి కోట్ చేసినా ధన బలిమి వలన సీమాంధ్ర కాంట్రాక్టర్లు అంతకంటే తక్కువ కి కోట్ చేసి కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఒక్కోసారి తమకు అవసరంలేని, తమ స్ధాయికి తగని కాంట్రాక్టులను కూడా సీమాంధ్ర ధనికులు చేజిక్కించుకుని ఆ తర్వాత తమకు నచ్చినవారికి సబ్ కాంట్రాక్టు ఇస్తారు. తద్వారా పోటీగా ఎదుగుతున్నవారికి అవకాశాలు లేకుండా చేస్తారు. ఈ విధమైన రూపాల్లో అణవచివేత కొనసాగింది. ఇవి కాక నిరుద్యోగం, దరిద్రం, ఆకలి మొదలైన సాధారన సమస్యలు కూడా ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఆలోచన వైపుకి ప్రజల్ని నెట్టాయి. ప్రభుత్వాలు, పాలకపార్టీలు కూడా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల సమస్యలకు ఇతర కారణాలను ఎగదోస్తారు. ఆ విధంగా కూడా తెలంగాణ డిమాండ్ పెద్దదయ్యింది.

ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది తెలంగాణ పెట్టుబడిదారులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ పెట్టుబడిదారులకు సొంత బడ్జెట్ వస్తుంది. తమ రాష్ట్ర ప్రభుత్వ మద్దతు తమకే వస్తుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల పోటీ రాష్ట్రాలు విడివడ్డాక కూడా తెలంగాణ పెట్టుబడిదారులకు ఎదురవతుంది. కాని ప్రభుత్వం వారిది కావడం వల్ల ఆ పోటీని పక్కకు నెట్టి లాభం పొందవచ్చు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ పె.దా లు తెలంగాణకీ, సీమాంధ్ర పె.దా లు సీమాంధ్రకీ పరిమితం అవుతారనుకుంటే పొరబాటు. వాళ్ళు ఇక్కడ, వీళ్ళు అక్కడా పోటీలకు దిగుతారు. కాని ప్రాంతీయత అడ్దుపెట్టుకుని ఒకరినొకరు అడ్డుకుంటారు. దానితొ ఎవరి ప్రాంతంలో వారి ఆధిక్యత కొనసాగడానికి అవకాశం లబిస్తుంది. అయినప్పటికీ అక్కడివాళ్ళు ఇక్కడా, ఇక్కడి వాళ్లు అక్కడా వ్యాపారాలు చెయ్యడం ఆగదు. వలసలు ఆగవు. సెటిల్ మెంట్లు ఆగవు. ఇవన్నీ ఒక దేశంలో సహజంగా జరిగే కార్యక్రమాలు. తెలంగాణ వస్తే సీమాంధ్ర వాళ్ళను వెళ్ళగొడతారని చెప్పడం కరెక్టు కాదు. సీమాంధ్ర ధనికులు అవన్నీ చెప్పి రెచ్చగొడుతున్నారు. అలాగే తెలంగాణలో కొంతమంది లేనిపోనివి చెప్పి సీమాంధ్రులు మొత్తం దొపిడీదారులని చెప్పడం అతి తప్ప మరొకటి కాదు.

పెట్టుబడిదారీ వర్గాలు తెలంగాణలో అభివృద్ధి చెందితే వారి కోసం ఏర్పడే రోడ్లు, నీటిపారుదల సౌకర్యాలను అక్కడి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. తద్వారా సీమాంధ్రలో జరిగినట్లుగా వారి చుట్టూ ధనికులు, రైతులు, ఉద్యోగులు తదితర వర్గాలు వృద్ధి చెందుతాయి. ఈ వృద్ధికోసమే తెలంగాణ ప్రజల డిమాండ్ ను సమర్ధించవలసి ఉంది.

ప్రజసమూహాల అసలు సమస్యలు తెలంగాణ లో కూడా కొనసాగుతాయి. కొత్త రాష్ట్రంలో కె.సి.ఆర్ కూడా ప్రజా ఉద్యమాల పట్ల బాబు, వై.ఎస్.ఆర్ లు తీసుకున్న వైఖరినే తీసుకుంటాడు. అది కూడాధనికుల పార్టియే. అప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఉద్యమాలు చేపట్టవలసిందే.

ఈ నేపధ్యంలో మీ వ్యాఖ్యను చూడవలసి ఉంటుంది. అటూ, ఇటూ, సవాలక్షా వాదనలు దొర్లు తుంటాయి. అవి ప్రధానం కాదు. ఉద్యమం చేస్తున్న డిమాండ్ ఏమిటి? అది న్యాయమైందా కాదా? ఇవే ప్రధానంగా చూడాలి. కె.సి.ఆర్, కె.టి.ఆర్, కె.కె. కాకా ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు, సవాల్లు, ప్రతి సవాళ్లు అన్నీ తెలంగాణ ఉద్యమం నుండి వేరు చేసి చూడాలి. ఉద్యమం అన్నాక అనేక ధోరణులు కనిపిస్తుంటాయి. ప్రజా మద్దతు ఉన్న ఉద్యమాల్లో మరిన్ని అపసవ్య ధోరణులు తలెత్తుతాయి. వాటిని పక్కనబెట్టి ప్రధాన డిమాండ్ పైన దృష్టి పెట్టాలి.

శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు లో పేరుకి శ్రీకృష్ణ అధిపతి అయినా ఆయనపాత్ర నామమాత్రం. ఆయన పేరును వాడుకున్నారంతే. దుగ్గల్ ప్రధాన పాత్రధారి. ఆయన సీమాంధ్రుల ఏలుబడిలోనే తన పని ముగించాడు. అందులో అనుమానం లేదు. సీమాంధ్ర ధనికుల డబ్బుకి ఆ శక్తి ఉంది. తెలంగాణ పేరు చెప్పి బాగుపడ్డవాళ్ళలో ఆ కమిటీ సబ్యులు కూడా ఉన్నారు.

నేను రాసిన వివరణలో పరిశ్రమల అభివృద్ధి తెలంగాణలోనే జరిగిందని చెప్పాను. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది ఇదే. కాని ఆ అభివృద్ధి ఎవరిది అన్నది ప్రధాన ప్రశ్న. ఆ అభివృద్ధితో తెలంగాణ ప్రజలు కనెక్ట్ అయి లేరు. ఎందుకంటే అందులో వారి శ్రమ పాత్ర నామమాత్రం. ఆ అభివృద్ధి వల్ల వారు లాభపడ్డది నామమాత్రం. అంటే తెలంగాణలో సాధించిన అభివృద్ధి కూడా సిమాంద్రులదే అన్న కీలక విషయాన్ని ఇక్కడ విస్మరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందినమాట వాస్తవమే కాని ఆ అభివృద్ధి సీమాంధ్ర పెట్టుబడిదారులకూ, అక్కడి ఉద్యోగులకూ, కార్మికులకూ ప్రధానంగా చెందినది అన్నది గుర్తించాలి. అస్సలు పూర్తిగా తెలంగాణ వారి పాత్ర లేదని నేను అనడం లేదు. ప్రధానంగా వారిదే అని చెబుతున్నాను.

తెలంగాణవాళ్లు దొపిడీదారులని నిందిస్తున్నది సీమాంధ్ర ప్రజలను కాదు. దోపిడీదారులనే అలా పిలుస్తున్నారు. ఆ పిలుస్తున్నవారిలో తెలంగాణలో దోపిడీ చేస్తున్నవారు కూడా ఉండడమే విషాధం. ప్రాంతీయ తగువులో పడి, వారి దొపిడి (సాపేక్షికంగా చిన్న దోపిడి) కనపడకుండా పోతొంది. రాష్ట్రం వచ్చాక ఉద్యమాలకు వారే టార్గెట్ అవుతారు. తెలంగాణవాదులు అనగానే కె.సి.ఆర్, విజయశాంతి, కె.టి.ఆర్, అతని చెల్లి, కె.కె, కోమటి రెడ్ది, ఇంకో రెడ్డి వీళ్ళు కాదు. ఉద్యమాన్ని విశ్లేషించేటప్పుడు మనం ప్రధానంగా చూడవలసింది ప్రజలు, వారి పాత్రను మాత్రమే.

తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఉన్నారు. అందుకోసమే తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకోవడం.

12 thoughts on “తెలంగాణ డిమాండ్ ను ఎందుకు సమర్ధించాలి?

 1. “శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు లో పేరుకి శ్రీకృష్ణ అధిపతి అయినా ఆయనపాత్ర నామమాత్రం. ఆయన పేరును వాడుకున్నారంతే. దుగ్గల్ ప్రధాన పాత్రధారి. ఆయన సీమాంధ్రుల ఏలుబడిలోనే తన పని ముగించాడు. అందులో అనుమానం లేదు. సీమాంధ్ర ధనికుల డబ్బుకి ఆ శక్తి ఉంది. తెలంగాణ పేరు చెప్పి బాగుపడ్డవాళ్ళలో ఆ కమిటీ సబ్యులు కూడా ఉన్నారు.”

  విశేఖర్ గారూ,
  మీరు పై కంక్లూజన్ కి ఎలా వచ్చారో, కాస్త ఆధారాలేమైనా ఉంటే వాటి ద్వారా చెప్తారా..? “మా డిమాండు సరైనదేనని మేము బలంగా నమ్ముతున్నాం, ఐనా మాకు అణుకూలంగా రిపోర్టు ఇవ్వలేదు కాబట్టి” అనో, సీమాంధ్ర నాయకుల దగ్గర డబ్బుంది కాబట్టి అనో అంటే.. అదంత లాజికల్గా లేదనిపిస్తుంది.

 2. చీకటిగారూ, నేను రాసిన ఆర్టికల్ మొత్తంలో ఆ ఒక్క వాక్యమే మీకు కనిపించిందా? ఇతర అంశాలపై కూడా స్పందించండి. ఇతర అంశాలను మీరు గ్రహించిన తీరు మీ పై ప్రశ్నకు సమాధానం ఇవ్వగలదు.

 3. విశేఖర్ గారూ,
  రెండు ప్రాజెక్టుల నుండి మొదలెట్టి, చరిత్రను మీకు నచ్చిన/తెలిసిన కోణంలో విశ్లేషిస్తూ చాలా పెద్ద వ్యాసమే రాశారు. అదే చరిత్రని మరో కోణంలో విశ్లేషించి రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణాకు ఎంత లాభం జరిగింది, విడిపోవడం వల్ల అటు తెలంగాణాకు, ఇటు సీమాంధ్రాకు ఎంత నష్టం జరగబోతుంది అని వివరిస్తూ మరో పెద్ద వ్యాసం రాయడం అంత కష్టమైన పనేం కాదు. దానికి ఓ ఇద్దరో, ముగ్గురో సీమాంధ్రులు – “ఆహా,ఓహో, సూపర్,ఇరగదీసావ్” అంటూ కామెంట్లు కూడా రాస్తారు. ఇది ఆల్రెడీ చాలా బ్లాగుల్లో( ఒకప్పుడు నా బ్లాగుతో సహా) జరిగిన విషయమే. కాబట్టి తెలంగాణాకు అనుకూలంగా తెలంగాణా వారి విశ్లేషనలు, వ్యతిరేకంగా సీమాంధ్రుల విశ్లేషనల మీద నాకు ఆసక్తి లేదు.
  అందుకే ఇరు ప్రాంతాలతో సంబంధంలేని ఓ తటస్థుల కమిటీ రిపోర్టు ఎలా మరుగునపడి పోయింది అనేది కీలకాంశం. పాపం అప్పటిదాకా అంతో,ఇంతో నిజాయితీ పరుడిగా, సమర్థుడిగా దేశ వ్యాప్తంగా పేరున్న జస్టిస్ శ్రీక్రిష్ణ( ముంబై అల్లర్ల లాంటి సంక్లిష్ట కేసును అనేక ఒత్తిడులను అధిగమించి విచారించి రిపోర్టును సమర్పించాడు కాబట్టి, పైగా ఆ రిపోర్టు అందరూ భయపడే శివసేన నాయకులకి వ్యతిరేకంగా వుంది కాబట్టే, దానిని ఇంప్లిమెంట్ చేసే సాహసం ఏ ప్రభుత్వమూ చేయడంలేదనేది మరో అంశం.), తెలంగాణా పై అభిప్రాయం వెలిబుచ్చిన పాపానికి ఎలా చేతకానివాడుగానో/అవినీతిపరుడిగానో/ఓ ప్రాంత ద్రోహి గానో చిత్రించబడ్డాడు అనేది తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో మరో
  కీలకాంశం. ఈ ధోరణికి భయపడే అటు కాంగ్రెస్ కానీ, ఇటు తెలుగుదేశం కానీ తెలంగాణాపై అభిప్రాయం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయ్. మంచి,చెడులు సాపేక్ష విషయాలు కాబట్టి వాటిని కాసేపు పక్కన పెడితే, KCR టాలెంట్ ని మాత్రం మెచ్చుకోక తప్పదు..

  మీ బ్లాగ్లో విషయం ఉంది అనే నమ్మకం ఉండబట్టే ఈ విషయం మీద ఇంత సమయం కేటాయించాను. ఇక సెలవు.

 4. ఈ మధ్య తెలంగాణ ప్రాంత వామపక్ష వాదులపై నాకో సందేహం కలుగుతుంది. ప్రాంతీయ ద్వెషాలను రెచ్చగొట్టడం వలన ప్రజలలో వచ్చిన ఈ చైతన్యాన్ని రేపు విప్లవ పంథాలో జనులను నడిపించగలరన్న నమ్మకంతోనే ఈ తెలంగాణా ఉధ్యమాన్ని కొనసాగిస్తున్నారా? మీకు చెప్పవలసినదేమీలేదు… బడా పెట్టుబడిదారులు యిప్పటికి ప్రాంతాలకతీతంగా కలిసి మెలిసి వ్యాపారాలు చేసున్నారు యుంత ప్రజా ఉధ్యమాలు జరుగూన్నా. మరి బడుగుజీవులు మధ్య తరగతి ప్రజలే సముధులవుతున్నారు ఈ విభజన గోడవలలో.. మరి నేను ఇలా అనడంలో తప్పులేదనుకుంటా..
  ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

  వీలయతే నా బ్లాగులో రాసిన నా సందేహాలను నివృత్తి చేయ ప్రార్థన…

 5. చీకటిగారూ, గతంలో మీరు ఈ బ్లాగ్ లో ఉంచిన వ్యాఖ్యలను బట్టి మీరు ఇటువంటి వ్యాఖ్యానం చేస్తారని అనుకోలేదు.
  ఎవరికి ఎంత సమయం కేటాయించాలన్నది పూర్తిగా మీ ఇష్టమే కదా.
  నా విశ్లేషణలో గానీ, నేను ఉల్లేఖించిన చరిత్రలో గానీ మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా?
  పెద్ద వ్యాసం రాయాలని నేనిది రాయలేదు. జరిగిన చరిత్రను కొంత ప్రస్తావించుకున్నట్లయితే ఆ వెలుగులో చూసే టప్పుడు పాత దృక్పధంతో అప్పటివరకూ చూసిన అంశాలు కొత్త అర్ధంతో కనిపిస్తాయి. అందుకోసం చరిత్ర ప్రస్తావించాను. ఆ వెలుగులో నా వాదనను చూస్తారని భావిస్తూ అది రాశాను.

  ఇప్పుడు మీరేమంటున్నారంటే, నేను చెప్పిన చరిత్ర నాకు నచ్చినదేననీ, అది నిజానికి చరిత్ర కాదని అంటున్నారు. చరిత్ర వేరే ఉందనీ అంటున్నారు. అదే నిజమైతే గనక నేను మీ నుండి తెలుసుకోవలసింది చాలా ఉన్నదని నేను భావిస్తున్నాను. నాకు తెలియని, మీకు తెలిసిన ఆ చరిత్ర అంశాల్ని రేఖామాత్రంగానైనా మీరు చెప్పగలరా? లేదా నేను రాసిన చరిత్రలో చరిత్ర కాని అంశాలను మీరు చూపించినా నాకు ఏదోమేరకు ఉపయోగమే.

  దయచేసి అర్ధం చేసుకోండి. పొగడ్తల కోసం, ఆహా, ఓహో ల కోసం నేను బ్లాగింగ్ చెయ్యడం లేదు. కేవలం నాకు తెలిసిన అంశాలను ఇతరులకు చెప్పి, వారి నుండి నాకు తెలియని అంశాలను తెలుసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే నేను బ్లాగింగ్ చేస్తున్నాను. రోజులో ఐదు గంటలకు పైగా నేను బ్లాగింగ్ కోసం కేటాయిస్తున్నాను. అది మంచికి ఉపయోగపడాలనే కోరుకుంటున్నాను.

  శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత ‘ఛాప్టర్ 8’ తోనే మట్టిగొట్టుకు పోయింది. ఏ కమిషన్ అయినా, స్వతంత్ర భారత దేశంలో ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో సూచించిన సందర్భాలు లేవు. భారత దేశమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దేనిలోనైనా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సూచనలిచ్చిన కమిషన్ ఉందా అన్నది నాకు అనుమానమే. ప్రభుత్వాలు గూడచారులను నియమించుకుని ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తగిన సమాచారం తెప్పించుకుంటాయి అది వేరే సంగతి. కాని ప్రధాని భాషలోనే చెప్పాలంటె ఒక ‘జాతీయ సమస్య’ గా ముందుకొచ్చిన సమస్య పైన నివేదిక ఇస్తున్నపుడు ఏ మాజీ/ న్యాయమూర్తి అయినా అటువంటి నివేదికను ఇవ్వజాలడు. అటువంటి క్రెడిట్ శ్రీకృష్ణ కమిటీ దక్కించుకుంది.

  ఇరు ప్రాంతాల మధ్య తీవ్రమైన వ్యతిరేకతలు ప్రబలి ఉన్న కాలంలో సమస్య పరిష్కారం కోసం నియమించబడిన కమిటీ సభ్యులు ఎలా మసలుకోవాలి? ఇరు ప్రాంతాల మధ్య ఏ వైపూ మొగ్గు చూపడం లేదని తమ కదలికలలో కూడా చూపాలి. కానీ పర్యటనలు ముగిశాయి. సేకరణ ముగిసింది ఇక నివేదిక తయారు చేస్తున్నాం అన్న కాలంలోనే వారు సీమాంద్ర ధనికులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. సీమాంధ్రలో ఎవరైతే దోపిడిదారులుగా పేరుపడ్డారో, విదేశీ వ్యాపారాల్లో దొంగలుగా ముద్ర పడ్డారో వాళ్ళ ఇళ్లకు కమిటీ సభ్యులు విందులకు వెళ్లడం ఎలా అర్ధం చేసుకోవాలి. వారికి మరొక ఉద్దేశ్యం లేకపోయినా అటువంటి వాటిని ఖచ్చితంగా జరగకుండా చూసుకోవాలి. కనీసం ఆ మర్యాదను, ఆ నిబంధనను కూడా కమిషన్ సభ్యులు పాటించలేదు. వాళ్ళసలు అటువంటి అంశాలను పట్టించుకునే స్ధితిలో కూడా లేరు.

  శ్రీకృష్ణ కమిటి నిజానికి చేయవలసిన పని చేయలేదని నా ఆరోపణ. సమస్య మూలాలను పరిశీలించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎంతవరకూ అవసరమో అంత వెనక్కూ చరిత్రలో వెళ్ళి పరిశీలనలు జరపాలి. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, వ్యవస్ధాగత చరిత్రలను పరిశీలించాలి. జరిగిన అభివృద్ధికీ, జరగని అభివృద్ధికీ కారణాలు వెతకాలి. ఆ కారణాలకు ప్రజలకు ఉన్న సంబంధాలను పరిశీలించాలి. అభివృద్ధి అని చెబుతున్న దాని పర్యవసానాలను పరిశీలించాలి. జరిగిన అభివృద్ధి ఎవరికి ఉపయోగపడిందో పరిశీలించాలి.

  ఇవేవీ చేయకుండా అటూ ఇటూ వివిధ పార్టీలూ, సంఘాలూ, సంస్ధలు ఇచ్చిన నివేదికలు తీసుకుని అందులో విషయాలను క్రోడీకరించింది. ప్రజలనుండి తెలుసుకుంటున్నామన్న పేరుతో యాంత్రికంగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వాటిని ప్రాతిపదికగా తీసుకుంది. అది సరైందేనా? ప్రజలకు తమ చరిత్ర పట్లా, తమ వెనుకబాటుతనం పట్లా, తమ అభివృద్ధి పట్లా ఏమన్నా అవగాన ఉంటుందా? రోజువారీ జీవనలంలో రేపు ఎలా అన్నదే ప్రశ్నగా మిగులుతున్నపుడు తమ గతం, వర్తమానం, భవిష్యత్తులపైన సమగ్రమైన అవగాహన ఏర్పరచుకోగల అవకాశం ప్రజలకు ఉంటుందా? ఉంటుందని శ్రీకృష్ణకమిటీ భావించినట్లుగా దాని పని తీరు తెలిపింది.

  సీమాంధ్ర కంటే తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది అని చెప్పిందే గానీ ఆ అభివృద్ధి తెలంగాణ ప్రజల వరకూ కనీసం తెలంగాణ పెట్టుబడిదారులవరకూ వచ్చిందా అన్న అసలు విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ పట్టించుకోలేదు. ఏ అంశాలైతే తెలంగాణ డిమాండ్ ను మళ్ళీ మళ్ళీ రగల్చడానికి కారణంగా నిలుస్తున్నాయో ఆ అంశాలనను వేటినీ శ్రీకృష్ణ కమిటీ పట్టించుకోలేదు.

  శ్రీకృష్ణకు ఉన్న విశ్వసనీయతను బట్టే ఆయనకు కమిటి నివేదిక తయారిలో ఉన్న భాగస్వామ్యం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తప్ప ఆయన విశ్వసనీయను అనుమానించడానికి నాకైతే సరదా కాదు. తెలంగాణ విషయంలో ఎవరైనా ముందు గుర్తించవలసింది ప్రజల్లో తెలంగాణ పట్ల ఉన్న ఆశలు, ఆకాంక్షలు. వాటిని ఎవరూ విస్మరించరాదు. ప్రజలను విస్మరిస్తూ ఏ కమిటీ నివేదిక ఇచ్చినా దానికి విలువ ఉండదు. కమిటీకి శ్రీకృష్ణ నాయకుడే తప్ప ఆయన అభిప్రాయాలె అక్కడ చెల్లుతాయనీ లేదని కూడా గుర్తించాలి.

  తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేవాళ్లంతా ఏదో ఒక విధంగా, అబద్ధాలనో నిజాలనో చెప్పి వాదిస్తారు అని మీ అభిప్రాయం. అందరూ అలాగే వాదిస్తారు అని మీరు భావిస్తే అది మీ ఇష్టం. కాని అది నిజం కాదని నేను చెప్పదలిచాను. చారిత్రక వాస్తవాలు అనుకూలంగా ఉన్నవారికీ, ప్రతికూలంగా ఉన్నవారికీ కూడా ఒక్కటే. వాస్తవాలను తెలుసుకోవడంలో, తెలుసుకున్న వాటిని సక్రమంగ అర్ధం చేసుకోవడంలో అనేక తేడాలు ఉంటాయి. అక్కడే వాదనల మధ్య, అభిప్రాయల మధ్య విభేధాలు తలెత్తుతాయి. దృక్పధంలో తప్పున్నా, తామువాస్తవాలనుకున్నవాటిలో తప్పులున్నా సవరించుకోవడానికి ఎవరైనా సిద్దంగా ఉండాలి. అప్పుడే ఒక మంచి దృక్పధాన్ని, అభిప్రాయాన్నీ, అవగాహననూ నిలపగలుగుతాం. నిలిపి అంతా గెలవగలుగుతాం.

  తటస్ధుల కమిటీ తాము తటస్ధులమని తెలంగాణ వారిని నమ్మించలేకపోయింది. ‘ఛాప్టర్ 8’ ద్వారా తెలంగాణ వారి ఆగ్రహాన్ని సంపాదించింది.

 6. విశేఖర్ గారూ,
  నేను అనని విషయాల్ని అన్నట్లుగా రాశారు. మీరు రాసింది చరిత్ర కాదని నేనెక్కడా రాయలేదు, అసలు ఆ వుద్ధేశ్యం వచ్చే విధంగా ఏ ఒక్క వాక్యం కూడా నా కామెంట్ లో లేదు కదా.. నేనన్నదేంటంటే.. చరిత్రని చూసే విధానాన్ని బట్టి ఎన్ని రకాలుగానైనా విశ్లేషించుకోవచ్చు. ఉదాహరణకి, మన కల్ల ముందే తిరిగి,పాలించి చనిపోయిన YSR గురించి మన తరంలోనే ఏ ఇద్దరికీ ఒకే అభిప్రాయం లేకపోవడాన్ని గమనించొచ్చు. ఇక మనం చూడని కొన్ని వందల ఏల్ల చరిత్ర విషయంలో, ఎన్ని రోజులు వాదించుకున్నా ఒకే అభిప్రాయానికి వచ్చే అవకాశం లేదు అని. అంతెందుకు, మన తెలుగు బ్లాగుల్లోనే ఈ అంశం మీద అటు సీమాంధ్రుల నుండి( ఆల్మోస్ట్ అందరూ తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తూ), ఇటు తెలంగాణా వారినుండి( ఆల్మొస్ట్ అందరూ తెలంగాణా ఏర్పాటును సమర్థిస్తూ) పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు వచ్చాయి. వాటి మీద ఇరు వర్గాలనుండి అనేక రోజుల పాటు చర్చలూ జరిగాయి. వీరి వాదనల్ని వారూ, వారివాదనల్ని వీరు ఖండించుకుని/పొగుడుకుని, అలిసిపోయి సైలెంటై పోయారు గానీ, చర్చల ఫలితంగా కనీసం ఏ ఒక్కరైనా అభిప్రాయం మార్చుకున్నట్లు నాకు తెలిసినంత వరకైతే లేదు.

  ఇక శ్రీక్రిష్ణ కమిటీ విశ్వసనీయత గురించి మీరు రాసిన దాంట్లో.., వారు సీమాంధ్రా నేతల విందుకి వెల్లడం వల్ల వారి తటస్థత ప్రశ్నార్థకం అనేది కొంతవరకూ లాజికల్గానే ఉంది. తెలంగాణా నాయకులు తమ ఇంటి ఫంక్షన్లకు శ్రీక్రిష్ణ కమిటీ మెంబర్లను ఆహ్వానించలేదో, ఆహ్వానించినా వీరు వెల్లడానికి నిరాకరించారో తెలీదు. ఒకవేళ వారు ఆహ్వానించినా వెల్లకుండా, సీమాంధ్రా వారి విందులకే వెల్లి ఉంటే మాత్రం, కశ్చితంగా అది తప్పే, అట్టి వారి రిపోర్టును ఇగ్నోర్ చేయవలసిందే. ఇక మీరు రాసిన మిగతా విషయాల మీద చర్చించడానికి నాకు ఆసక్తి లేదు.. కాబట్టి నో కామెంట్..

 7. చీకటి గారికి
  “చరిత్రను మీకు నచ్చిన/తెలిసిన కోణంలో విశ్లేషిస్తూ చాలా పెద్ద వ్యాసమే రాశారు. అదే చరిత్రని మరో కోణంలో విశ్లేషించి రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణాకు ఎంత లాభం జరిగింది, విడిపోవడం వల్ల అటు తెలంగాణాకు, ఇటు సీమాంధ్రాకు ఎంత నష్టం జరగబోతుంది అని వివరిస్తూ మరో పెద్ద వ్యాసం రాయడం అంత కష్టమైన పనేం కాదు.”

  పైన ఉటంకించిన భాగం నుండి నేను చెబుతున్నది చరిత్ర కాదని మీరు భావిస్తున్నట్లుగా అర్ధం ఛేసుకున్నాను. అది కాదని మీరు చెబుతున్నారు గనక ఆ అంశంపై నా స్పందనను మీకు సమాధానంగా ఉపసంహరించుకుంటున్నాను.

 8. చీకటి గారు, నివేదికలు వ్రాసేవాళ్ళకి నిబద్ధత ఉండాలి. మహాభారతంలో కౌరవులు శల్యునికి మందునీ, వేశ్యలనీ అందించి తమవైపు ఎలా తిప్పుకున్నారో, సీమాంధ్ర ప్రభుత్వం కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి ఖరీదైన హొటెల్స్‌లో బస కల్పించి, కావాల్సినవన్నీ అందించి, ఇలాగే తమకి అనుకూలంగా తిప్పుకుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s