‘తెలంగాణ’ ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా?


ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుపైన ఇంత నటన, రాజకీయం, ఎగతాళి, విద్వేషం అవసరమా?

తెలంగాణ ప్రాంతం వాళ్ళు భారత దేశం నుండి విడిపోతామని కోరుతున్నారా? కేంద్ర ప్రభుత్వ అధికారం తమపై వద్దని నిరాకరిస్తున్నారా? తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతున్నారా? పాకిస్ధానీ ఐ.ఎస్.ఐ కి గూఢచారుల్ని సరఫరా చేస్తున్నారా లేక చైనా ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇస్తున్నారా?

తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నారా వాళ్ళు, లేక తెలంగాణ దేశం అడుగుతున్నారా?

కేవలం రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రజలు అడుగుతున్నది. ఉత్తరఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు మనముందే కదా ఏర్పడింది? మనం చూస్తుండగానే ఎంత ప్రశాంతంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి? దానివలన పాత రాష్ట్రాలకు జరగకూడని నష్టాలేమన్నా జరిగాయా? కొత్త రాష్ట్రాలు ఇండియానుండి విడిపోయాయా? ఏం జరిగిందని, ఏం జరగనున్నదని తెలంగాణ ఏర్పాటుపై ఇంత విద్వేషం?

అవున్నిజమే. డబ్బున్నోళ్ళకి నష్టాలున్నాయి. అంధ్రప్రదేశ్ బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు. కలిసుంటే ఆంధ్ర ప్రాంతపు ధనికులకి ఆ బడ్జెట్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. విడిపోతే సీమాంధ్ర కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నుండి సీమాంధ్ర ప్రాంత ధనికుల వ్యాపారాలకూ, కంపెనీలకూ మద్దతు దొరకదు. తెలంగాణ రాష్ట్ర బడ్జేట్ ను వినియోగించుకుని తెలంగాణ పెట్టుబడిదారులు లాభపడతారు. సందేహమే లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువలన ప్రధానంగా లాభపడేది తెలంగాణ ప్రాంతంలోని పెట్టుబడిదారులే.

కాని వారితో పాటు ఒక మాదిరి ధనికుల దగ్గర్నుండి, మధ్య తరగతి ప్రజలు, పేదలు, రైతులు, కార్మికులు కూడా ఏదో ఒక మేరకు లాభపడతారన్నది కూడా నిజమే.

ఆంధ్రప్రదేశ్ లో లాభపడుతున్నది ఎవరు? పెట్టుబడిదారులు, భూస్వాములే! ఏ ప్రదేశ్ లో తీసుకున్నా లాభపడుతున్నది ప్రధానంగా పెట్టుబడిదారులు, భూస్వాములు, వారి అనుచరగణమే కదా? ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నది ఆ వర్గాలకే కదా? వారి అవసరాల కోసమే కదా ప్రభుత్వ పధకాలు, విధానాలు రూపొందుతున్నది. భూస్వాములు, పెట్టుబడిదారుల ప్రయోజనాలే కదా ఈ దేశంలోని ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. ఇక కొత్తగా ఏర్పడే తెలంగాణలో వీటన్నింటికీ భిన్నంగా కేవలం ప్రజలకు –రైతులకూ, కూలీలకూ, ఉద్యోగులకూ, ఉపాధ్యాయులకూ, ఉద్యోగార్ధులకూ, విద్యార్ధులకూ, కార్మికులకూ– ఉపయోగపడే ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి?

పెట్టుబడిదారులు, భూస్వాముల ప్రయోజనాలకు ప్రభుత్వాలు ప్రధానంగా పని చేస్తున్నా వారి కోసం, వారి వ్యాపారాల కోసం ఏర్పాటయ్యే రోడ్లు, వంతెనలు, డ్యాంలు, ఎత్తిపోతలలు, కాల్వలు, నీటిపారుదల… ఈ సౌకర్యాలన్నీ ఏదో మేరకు ఇతర ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ప్రజలందరినీ లక్ష్యం చేసుకుంటూ ప్రభుత్వాలు చేసిన చర్య ఒక్కటి లేకపోయినా ఆ ధనికులకోసం ఏర్పాటయిన సౌకర్యాలని ఇతరులు ఉపయోగించరాదన్న నిబంధన లేకపోవడం వల్లనే అవి అందరికీ ఉపయోగపడుతున్నాయి. కాని ప్రధానంగా ఉపయోగపడేది ధనికులకే. స్వాతంత్ర వచ్చి అరవై ఏళ్ళకు పైనే అయినా ధనికుల వద్ద మరింత ధనం పోగుపడడం, పేదలు మరింత పేదలు కావడాన్ని బట్టి అది రుజువవుతోంది.

ఇదే పద్ధతిలో తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ బడ్జేట్ వలన ఉపయోగాలుంటాయి. ఏ రాష్ట్రానికయినా తన బడ్జెట్ తనకు ఉంటుంది గనక తెలంగాణ బడ్జెట్ కూడా సీమాంధ్ర ధనికులకు అందుబాటులో లేకుండా, తెలంగాణ ధనికులకు అందుబాటులో ఉంటూ ఎన్నికల కోసం ఇతర ప్రజా సామాన్యానికి కూడా అప్పుడప్పుడూ అందుబాటులోకి వస్తుంది. ఇదే తెలంగాణ ప్రజలకు కావలసింది. ఇంతకంటే ఎక్కువ వస్తుందని అక్కడి ప్రజలు అమాయకంగా భావిస్తే భావించవచ్చు. కాని వారు ఊహించినంత కాకపోయినా ఊహించినదానిలో పదో పరకో వస్తుంది ఆ కొంచెం అయినా వారికి ఇవ్వడానికి సీమాంధ్ర వారికి అభ్యంతరాలు ఎందుకుండాలి?

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడితే సీమాంధ్ర ప్రజలకు ఒక్క వీసమెత్తు నష్టం కూడా ఉండదు. పైగా లాభాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వివిధ జిల్లాలకు దగ్గరగా రాజధాని అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాల్సిన అవసరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పటు ద్వారా తలెత్తుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని హోదాలో మరొక నగరం అభివృద్ధి చెందితే తెలుగువాళ్లం ఎందుకు వద్దనుకోవాలి?

కొత్త రాజధాని ఏర్పడ్డాక దాని చుట్టూ ఉన్న పట్టణాలు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందటం అనివార్యం. తక్కువ దూరం ప్రయాణించి రాజధాని నగరాన్ని చేరుకోనే అవకాశం సామాన్య ప్రజానీకానికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ను రెండు భాగాలు చేసి (తెలంగాణను కొంచెంసేపు పక్కన బెడదాం) ఒక్కోభాగానికి ఒక్కో రాజధాని నిర్మించడం ద్వారా రెండు అభివృద్ధి కేంద్రాలు ఏర్పడితే ఎవరికి లాభం? అది ప్రజలకు గతంలో కంటే ఎక్కువ లాభం. సామాన్య ప్రజానీకం నుండి మధ్యతరగతి, ధనికులు, పెద్ద ధనికుల వరకూ అందరి ఆస్తుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార, వాణిజ్యాలు విస్తృతం అవుతాయి. ఇవేవీ ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆంధ్ర ధనికులకు అవసరం లేదు. ఎందుకంటే వారి ఆస్తులు, అభివృద్ధి అంతా హైద్రాబాద్ లొ భద్రంగా ఉంది. కాని సీమాంధ్ర సామాన్య ప్రజానీకం ఇక అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? వారికి కొత్త రాజధాని ఖచ్చితంగా ప్రయోజనాలను తెస్తుంది.

అసలు హైద్రాబాద్ కి అంతపెద్ద హోదానిచ్చి గౌరవిస్తూ మన పక్కనే ఉన్న గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, కర్నూలు ఇలాంటి నగరాలను చిన్నబుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఏ చిన్న అవకాశం వచ్చినా మన పక్కన చుట్టూరా ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాల్సిన అవసరం ఉండగా అది వదిలిపెట్టి రాబోయే రోజుల్లో కూడా హైద్రాబాద్ చుట్టూనే పెట్టుబడులు వెళ్ళాలి, అభివృద్ధి జరగాలి అనే ధోరణి ఇందులో వ్యక్తం కావడం లేదా?

ఇకముందు కూడా హైద్రాబాదే మా రాజధాని అంటే ఇకముందు జరిగే అభివృద్ధి కూడా దాని చుట్టే కేంద్రీకృతమవుతుంది. అలా కాక మా రాజధాని మాకు కావాలి సీమాంధ్రులు కోరితే ఆ అభివృద్ధి వికేంద్రీకృతమవుతుంది. ఉద్యోగాలు వికేంద్రీకృతమవుతాయి. పరిశ్రమలు వికేంద్రీకృతం అవుతాయి. డబ్బు విస్తృతి, ఆదాయం కూడా వికేంద్రీకృతం అవుతాయి. అంతటి అభివృద్ధి విస్తృతిని చేజేతులా దూరం చేసుకోవడమ్ భావ్యమా?

తెలుగువాళ్ళు బెంగుళూరులో ఉద్యోగాలు చెయ్యడం లేదా? వాళ్లక్కడ సెటిల్ అవ్వలేదా? వారక్కడ వ్యాపారాలు చెయ్యడం లేదా? న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాలవాళ్ళూ లేరా? తెలుగువాళ్ళు లేని రాష్ట్ర రాజధానులు భారత దేశంలో ఉన్నాయా? అలాగే రేపు రెండు రాష్ట్రాలయ్యాక కూడా సీమాంధ్రులు హైద్రాబాద్ లో ఉంటారు. సెటిలవుతారు. ఉద్యోగాలు చేస్తారు. ప్రవేటీకరణ, గ్లోబలీకరణ నేపధ్యంలో ఇది రెండొందల శాతం నిజం కదా! రాష్ట్రాల మధ్య జరిగే వలసలని వలసలు అని మనం అంటున్నామా? అనడం లేదు. తెలంగాణనుండి సీమాంధ్రకీ, సీమాంధ్ర నుండి తెలంగాణకీ భవిష్యత్తులో కూడా రాకపోకలు ఉంటాయి. వాటిని ఎవ్వరూ అడ్దుకోలేరు. భారత దేశ చట్టాలు దానికి పూర్తి గ్యారంటీ ఇస్తాయి.

భారత దేశం పాకిస్ధాన్ లు బద్ధశత్రువులను అంటారు. కాని ఇరు దేశాల మధ్య నదీజలాల పంపిణీ ఒప్పందాలు జరిగాయి. మరికొన్ని ఇంకా చర్చలలో ఉన్నాయి. చైనాతో కూడా నదీ జలాల ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ నుండి సీమాంధ్రకు నీళ్ళు రానివ్వరనడం ఒక పెద్ద అభద్ధం. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య. అందులో ఇతర దేశాల కంటే ఎక్కువగా భారత దేశంలో రాష్ట్రాల మధ్య సంబధాలు చాలా లైవ్లీగా ఉంటాయి. కేవలం తెలంగాణ డిమాండ్ వల్ల తలెత్తిన విభేధాలు చాలా త్వరగా సమసి పొతాయి. అందులో అనుమానం లేదు. దానికంటె ముందు మరొక రాష్ట్రంగా సీమాంధ్రలో అనివార్యంగా అభివృద్ధి జరగడం అనివార్యం అని గుర్తించాల్సి ఉంది.

సంయమనంతో నిజా నిజాలను పరిశీలిస్తూ లాభనష్టాలను అంచనా వేసుకునే బదులు పరస్పరం ఆగర్భ శత్రువుల్లా కాట్లాడుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంతో పాటు కొంచెం చీదర కూడా పుడుతోందంటే నన్ను తప్పుగా అనుకోవద్దని మనవి.

21 thoughts on “‘తెలంగాణ’ ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా?

 1. “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువలన ప్రధానంగా లాభపడేది తెలంగాణ ప్రాంతంలోని పెట్టుబడిదారులే. కాని వారితో పాటు ఒక మాదిరి ధనికుల దగ్గర్నుండి, మధ్య తరగతి ప్రజలు, పేదలు, రైతులు, కార్మికులు కూడా ఏదో ఒక మేరకు లాభపడతారన్నది కూడా నిజమే. ఆంధ్రప్రదేశ్ లో లాభపడుతున్నది ఎవరు? పెట్టుబడిదారులు, భూస్వాములే!”

  వాహ్వా! ఏమి విశ్ల్లేషణ?! తెలంగాణ పెట్టుబడిదారుల హక్కుల కోసమే తెలంగాణ అన్నమాట అద్గదీ సంగతి! వెనకటికి పిట్ట రెట్ట వేస్తే నీది, గుడ్డు పెడితే నాది అన్నాడట. సరిగ్గా అలాగే ఉంది యవ్వారం!

 2. ఈ వెటకారమే కదా వద్దని కోరింది? అయినా ఆపుకోలేకపోయారు. ఎందుకంత హేళన? తెలంగాణ ప్రజలంతా ఏదో ఒక రూపంలో కోరుతున్న డిమాండ్ ను వెటకారం చెయ్యడం సరైంది కాదని నా అభిప్రాయం.

  నా విశ్లేషణలో తెలంగాణ వరకే స్వీకరించి హేళన చేసే ముందు అదే విశ్లేషణ ఆంధ్రపదేశ్ కీ, సీమాంధ్రకీ కూడా వర్తిస్తుందన్న సూత్రాన్ని కూడా స్వీకరించారని భావించవచ్చా? లేనట్లయితే మీకు అవసరం అయినంతవరకూ మాత్రమే స్వీకరిస్తారన్న అపప్రధను మీరు మూటకట్టుకోవలసి ఉంటుంది.

  ఇపుడున్న వ్యవస్ధ పరిమితుల్లో పూర్తిగా ప్రజల ప్రయోజనాల కోసమే ఒక డిమాండ్ సాధించడం జరిగేపని కాదు. ప్రజలు సమీకరించబడడానికి అంగీకరిస్తున్న తక్షణ డిమాండ్లపైన పోరాడుతూనే వారి దీర్ఘకాలిక డిమాండ్లపైన వారిని చైతన్యపరిచే అవకాశం పోరాట శక్తులకు ఇటువంటి ఉద్యమాల ద్వారా వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం ఈ ఉద్యమాలలో ఉద్యమకారుల ముఖ్యమైన కర్తవ్యం.

  సమైక్యత కోరేవారు పది జిల్లాల ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ పట్ల ఈ విధంగా హేళనగా మాట్లాడడం ఎలా చేయగలరు? హేళన చేస్తూనే మాతో కలిసి ఉండండి అని ఎలా చెప్పగలరు? మీ వాదన గొప్పదా, మా వాదన గొప్పదా అని మీటింగుల్లో సవాళ్ళు విసురుతూ కలిసి ఉందామని ఎలా అడగ్గలరు? ఆ సవాళ్లు, హేళనలు, వెటకారాలు అన్నీ… తెలంగాణ కావాలన్న వారి డిమాండ్ న్యాయమైనదని తెలియజెప్పడం లేదా?

  సూడాన్ కొద్ది నెలల క్రితం సూడాన్, దక్షిణ సూడాన్ లుగా విడిపోయింది. విడిపోవడానికి ముందు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. విడిపోవాలని కోరుతున్న దక్షిణ సూడాన్ లో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది తప్ప సూడాన్ అంతా జరగలేదు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పద్ధతి అదే. సెపరేట్ దేశంగా విడిపోవడానికే ఆ పద్ధతిని అవలంబిస్తే కేవలం పరిపాలనా పరంగా పాత్రమే విడిపోయే కొత్త రాష్ట్ర ఏర్పాటు కోసం సీమాంధ్రలో కూడా అభిప్రాయ సేకరణ జరగాలన్న నడమంత్రపు డిమాండ్ మనోళ్ళే చేస్తున్నారు.

  తెలంగాణ పెట్టుబడిదారుల హక్కుల కోసమే తెలంగాణ అని నా విశ్లేషణలో ఎక్కడా లేదు. మీరు కావాలని అర్ధం తెచ్చుకుంటే చేసేదేమీ లేదు. కాని నేను చెప్పింది…, ఈ వ్యవస్ధ పరిధిలో అందినంతమేరకు అవకాశాలను దొరకబుచ్చుకుంటూ మొత్తంగా వ్యవస్ధ మార్చుకునే వైపుగా కృషి చేయడం అవసరం అన్నది అర్ధం చేసుకోవాలి.

 3. విశేఖర్ గారూ,
  నేను సమైక్యవాదిని కాదని బ్లాగులోకమంతా ఎరిగిన సత్యమే! అసలు నేనేనాడూ సమైక్యవాదాన్ని బలపరచింది లేదు కనీసం సమైక్యవాదం వినిపించేవారి బ్లాగుల్లో సైతం.

  సరే నా వ్యాఖ్యకు, మీ స్పందనకు నా వివరణ
  1. ఆంధ్రోల్లు దొంగలు, దోపిడీదారులు ఇలాంటివన్నీ మీకు న్యాయబద్ధంగానే అనిపించాయా?
  2. నల్లగొండ సజీవ దహనాలు మీ కళ్ళకు అసలు కనబడవా?
  3. తెరాస వారు పొగిడి పునీతయ్యే నిజాం దొర గారు బతిమాలితేనే గదా ఆంధ్రోల్లు నిజామాబాదు గడప తొక్కింది?
  4. ఒక రాష్ట్ర రాజధాని నగరముపై అసలు మిగిలిన ప్రాంతాలకు హక్కులే ఉండవా?
  5. ప్రజాస్వామ్యమో అని గొంతు చించుకునే మీలాంటి వారు తెలంగాణలో సమైక్యవాదులపై దాడులు అసలు కనపడవా?
  6. విడిపోయిన దక్షిణ సూడాన్‌లో కూడా దేశం సమైక్యంగానే ఉండాలని ప్రచారం చేసుకునేవారు చేసుకున్నారే మరి తెలంగాణలో పరకాలపై దాడులెందుకు? సమైక్యవాదులవల్ల మెజారిటీలు తగ్గాయని ఏడుపులెందుకు?
  7. డిమాండ్లదేముంది తెలంగాణకన్నా ముందు నుండీ కాశ్మీరు అంశం అలాగే పడి మూలుగుతున్నది. ఆ లెక్కన భారతీయులందరూ కాశ్మీరీ ద్రోహులే కదా మీతోసహా?
  8. విభజన అంశంపై అసలు సీమాంధ్ర ప్రాంత అభిప్రాయాలే అనవసరం అని అభిప్రాయమా?

  వీటిక్కాస్త సమాధానాలు వెతుక్కోండి…. నాది వెటకారమో కడుపుమంటో అర్థమవుతుంది.

 4. మళ్ళీ నేను చెప్పని విషయాలను నాకు అంటగట్టారు.
  ఒకటి: తెలంగాణ డిమాండ్ మాత్రమే న్యాయబద్ధం. ఆ పేరుతో జరుతున్న అరాచకం వసూల్ రాజాల వ్యవహారం తప్ప ప్రజలు దానికి బాధ్యులు కాదు.
  రెండు: నా కళ్ళకు కనపడకపోవడం ఏమిటి? మీ కళ్లకి కనపడడం ఏమిటి? విషయం ఏమిటో చెప్పొచ్చు కదా. తప్పు ఎవరు చేసిన తప్పే తెలంగాణ పేరుతో చేసినవన్నీ ఒప్పులు కాదు. మరొక సారి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ దొర్లదని ఆశిస్తున్నాను.
  మూడు: నిజాం బతిమాలితే ఆంధ్రోళ్ళు వచ్చారా? నేను ఈ పోస్టులోనే చెప్పినట్టు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చెయ్యడం, స్ధిరపడ్డం తప్పు కానేకాదు. సామాజిక, ఆర్ధిక కార్యకలాపాల్లో అదొక సహజ ప్రక్రియ. అందులో ఒకరు ఎక్కువా కాదు. మరొకరు తక్కువా కాదు. నాగరికత అభివృద్ధి కాకముందు ప్రజా సమూహాలు ఖండాంతరాలకు కూడా వలసపోయారు. అది కూడా తవ్వి తీసి గొప్పలు నిర్ణయిద్ధామా? అది సాధ్యం కూడా కాదు. గతంనుండి అనుకూలాంశాలను తీసుకుంటూ, ప్రతికూలాంశాలను తిరస్కరిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం తెలివిగలవారు, బాధ్యతగలవారు చెయ్యదగిన పని. ఎవరూ మరొకరి కంటే గొప్పాకాదు. తక్కువా కాదు. ఆ సత్యాన్ని గుర్తించగలిగితే ఈ తక్కువ, ఎక్కువల చర్చకు చోటు ఉండదు. ఇక నిజాంను తెరాస అధ్యక్షుడు పొగడ్డంతోనే గొప్పోడెట్లా అవుతాడు? తెలంగాణ ఉద్యమంలో కె.సి.ఆర్ ఒక రాజకీయ నాయకుడు. అతని వాదనలు ఆటోమేటిగ్గా తెలంగాణవాదులందరి వాదనలుగా పరిగణించడం సరైంది కాదు.
  నాలుగు: నా పోస్టు మళ్ళీ ఒక్కసారి చదవండి. పూర్తిగా చదవకుండానే మీరు ప్రశ్నలు వేసినట్లు కనిపిస్తోంది. రాజధాని నగరమే కాదు ఇతర నగరాలకు, పట్నాలకు కూడా వలసలుగా చెప్పబడుతున్నవి ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో అదొక సహజ ప్రక్రియ.
  ఐదు: ఎక్కడ గొంతు చించుకుంది? టోన్ సవరించుకొండి దయచేసి. దాడులు ఎవరు చేసినా తప్పే. అందులో అనుమానం లేదు. ఇదిగో మీరు మీ వ్యాఖ్యల్లో చేస్తున్నట్లు వెటకారం, అవహేళన చేస్తున్నపుడే చర్చలు శృతిమించి దాడుల్లోకి దిగుతుంటాయి. ఎవరు చేసినా అంతా వ్యతిరేకించవలసిన ధోరణులవి.
  ఆరు:పరకాల ఉపన్యాసాన్ని నేను టీ.వి ఛానెల్లో విన్నాను. ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నవాడిగా ఆయన మాటలు లేవు. మీ వ్యాఖ్యలకు మల్లేనే వెటకారం, అవహేళన, సవాళ్ళు లాంటివి ఆయన ఉపన్యాసం నిండా ఉన్నాయి. వీటన్నంటికి కె.సి.ఆర్, కె.టి.ఆర్ లాంటి నోటి దురద గాళ్ళను అడ్డం పెట్టుకుంటే పరకాల కూడా నోటి దురద గా’ ‘ అని అంగీకరించాల్సి ఉంటుంది. ప్రజల్లొ తెలంగాణ డిమాండ్ పట్ల ఉన్న ఆదరణ వల్ల కె.సి.ఆర్, కె.టి.ఆర్ లు తమ అప్రజాస్వామిక ధోరణులను కొనసాగించగలుగుతున్నారు. అది లేనట్లయితే వారికంత కరెన్సీ ఉండదు. ఇతర పార్టీలన్నీ రెండు ధోరణులతో చీలిపోగా ఆ పార్టీ ఒక్కటే తెలంగాణ కోరికకు ప్రతినిధిగా ఉంది. అందుకే దానికంత ఆదరణ. తెలంగాణ వచ్చాక ఇతర పార్టీలు కూడా తెలంగాణలో స్ధిరపడ్డాక తెరాస కూడా గుంపులో గోవింద అవుతుంది. తెలంగాణ పట్ల ఆదరణ వల్ల తెరాస, కె.సి.ఆర్ లు బతుకుతున్నారు. అది లేకుండా వారు సున్న.
  దక్షిణ సూడాన్ లో అలాంటి ప్రచారం జరగలేదు. అసలా వాతావరణమే లేదక్కడ తెలంగాణ కంటె మరింత తీవ్రమైన సెంటిమెంట్లను పశ్చిమ దేశాలు రెచ్చగొట్టి పెట్టాయి. ఉత్తర, దక్షిణ సూడాన్ లు నాలుగు దశాబ్దాలుగుగా సాయుధ ఘర్షణలో మునిగి తేలుతున్నాయి. ఆయిల్ వనరులున్న దక్షీణ ప్రాంతంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ వనరులు లేని ఉత్తర ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ. పనిగట్టుకుని పశ్చిమ దేశాలు విభేధాలు పెంచి ఆయుధాలు అమ్ముకుని క్రిస్టియన్ మెజారిటీ గల ఆయిల్ వనరుల దక్షిణ ప్రాంతాన్ని వేరు చెయగలిగారు. ఎవరు రెచ్చగొట్టినా దక్షిణ సూడాన్ ప్రజలు దేశాన్ని కోరుకున్నారు. వారికి పశ్చిమ దేశాల మద్దతు ఉన్నందున ప్రజాభిప్రాయ సేకరణ, విడిపోవడం సాధ్యపడింది. లేనట్లయితే సాధ్యపడేది కాదు. మీ వాదన విషయానికి వస్తే ఆ అవకాశమే దక్షీణ సూడాన్ లో లేదు. లేని విషయాన్ని మీరు సృష్టిస్తున్నారు.
  ఏడు: అసలు నా ఆర్టికల్ చదివారా? కాశ్మీరు ప్రజలు దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు రాష్ట్రం కావాలని మాత్రమే కోరుతున్నారు. రెండింటినీ పోల్చలేము. అసలు ద్రోహులని నేనెక్కడైనా ఎవరినైనా అన్నానా? ఇంకెక్కడైనా రాయాల్సిన కామెంటు ఇక్కడ రాశారా ఏమిటి? చెప్పనిదాన్ని నాకు అంటగట్టడం ఏమిటి?
  ఎనిమిది: అవును సీమాంధ్ర ప్రజల అభిప్రాయం అనవసరం. అది ప్రజాస్వామిక నియమాలకు విరుద్ధం. ఒక ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఆ ప్రాంత ప్రజలకే ఉంటుంది తప్ప బైటివారికి ఉండదు. ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లో ఒకరు కలిసుందాం, మరొక విడిపోదాం అంటే పెద్ద మనుషులు ఏం నిర్ణయిస్తారు? కలవను అంటున్నవాడిని బలవంతంగా కలపగలరా? విడిపోవాలని కోరుతున్నవారిని బలవంతంగా కలిపి ఉంచాలనడం ప్రజాస్వామిక నియమం కాదు. ఈ అంశానికి సంబంధించి దేశంలో, ప్రపంచంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏ నియమం అయినా, ప్రజాస్వామిక సూత్రం ఐనా చరిత్ర అందించిన పాఠాల ద్వారా నేర్చుకున్నవే. అటువంటి పాఠాలన్నీ ఆ విషయమే చెబుతున్నాయి.
  “వెతుక్కోండి…?” మళ్ళీ వెటకారం? కడుపు మంట ఎవరిపైన? నాలుగు కోట్ల మంది నివసిస్తున్న ఒక ప్రాంతం భవిష్యత్తు ఏ ఒక్కరి కడుపు మంటపైనా ఆధారపడు ఉండదు. ఏ ఒక్కరి కోరికలపైనా, ఇష్టా ఇష్టాలపైన అధారపడి ఉండదు. అది మళ్ళీ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధం. తెలంగాణ గానీ సీమాంధ్ర గానీ ఏ ఒక్కరి పెరటి దొడ్డీ కాదు, లేక వంటిల్లూ కాదు. వ్యక్తుల కడుపు మంటల్నీ, కాలి నొప్పుల్నీ పట్టించుకోవడానికి. ఏ ప్రాంతానికైనా రాజకీయ, ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలు ఉంటాయి. అవే ఆ ప్రాంతాల భవిష్యత్తుని నిర్ణయించాలి. నాయకుల వ్యక్తిగత యిష్టా యిష్టాల్ని గొప్ప ప్రజాస్వామిక విలువలుగా నమ్మడం అలవాటవడం వలన వ్యక్తుల ఇష్టా యిష్టాలన తమ నెత్తిపైన వేసుకోవడం అనుచరగణానికి నచ్చుతుందేమో గాని ప్రజలకు నచ్చదు, నప్పదు.

  మీ వెబ్ సైట్ చూశాను. అందులో వ్యాఖ్యాతలకు మీరిచ్చిన సూచనలకు పూర్తి విరుద్ధంగా మీరుంచిన ఇక్కడి వ్యాఖ్యలు ఉన్నాయి. గమనించారా? చెప్పడానికి, ఆచరించడానికి మధ్య తేడా చూపే కోటిన్నొక్కమందిలో మీరు ఒకరా?

 5. తెలంగాణ ఏర్పాటుపై ఇంత విద్వేషం అవసరమా అంటున్నారు. మీరు ‘సీమాంధ్ర’ పేరుతో ప్రస్తావించిన ప్రాంతం వాళ్ళు తెలగాణా పట్ల విద్వేషం కక్కుతూ యేమన్నా ప్రవర్తించారా? లేదా తెలంగాణాలోని నాయకులు ఆ సీమాంధ్ర పట్ల విద్వేషం కక్కుతూ మాట్లాడుతున్నారా? సీమాంధ్రనుండి యెవరేం మాట్లాడటానికి చూసినా దానిని తెలంగాణా నాయకులు రెచ్చగొట్టడం అంటూ విరుచుకు పడతారు. వారు మాత్రం అవమానకరమైన ప్రకటనలు చేస్తూ మాట్లాడతారు నిత్యం. ఊభయవాదనలవారికి శాంతియుతంగా తమ భావాలు ప్రచారంచేసుకునే అవకాశం ఉండాలి. అది లేని నాడు యేవిధమైన న్యాయాన్ని ప్రజలు ఆశించవచ్చునో మీరే చెప్పండి.

 6. విశేఖర్ గారూ,

  సీమాంధ్రుల దోపిడీని, తెలంగాణా వెనుకబాటు తనాన్ని కారణంగా చూపి మొదట తెలంగాణా కావాలన్నారు. అలాంటివేవీ లేవని ఇవతలి పక్షం వారు వాదించారు. సరే ఇద్దరి మాటల్ని మనం వదిలేద్దాం. ఈ వివాదం తేల్చడానికి తటస్థులతో( ఈ ఇరు ప్రాంతాల్లో దేనికీ చెందని వారితో) ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వారు ఏడాది పాటు ఇద్దరి వాదనల్ని విని దోపిడీ అనేది వట్టిమాటేనని, సమైక్య రాష్ట్రం ఏర్పడిన సమయానికీ, ఇప్పటికీ సాపేక్ష వృద్ధి రేటు తెలంగాణాలోనే ఎక్కువగా ఉందనీ గణాంకాలతో సహా నిర్థారించి, సమస్య పరిష్కారనికి వారు ఇచ్చిన ఆరు ఆప్షన్స్ లో రాష్ట్రాన్ని యధాతదంగా కొనసాగించడమే ఇద్దరికీ మేలనే దాన్ని మొదటి ఆప్షంగా చెప్పారు. అప్పటికే అసత్యాల్ని బాగా ప్రచుర్యంలోకి తెచ్చిన తె.వాదులు శ్రీక్రిష్ణ కమిటీ సీమాంధ్రులకి అమ్ముడుపోయి రిపోర్టుని తయారు చేసిందనే కొత్త వాదనని తలకెత్తుకున్నారు. కానీ, దానికి తగ్గ ఏ ఆధారాన్ని వారు చూపలేదు. అధ్బుతమైన విష్లేశణా సామర్థ్యం గల మీ లాంటి రచయితలైనా,- “మన వాదనని సమర్థించనంత మాత్రాన ఆధారాల్లేకుండా తీర్పు చెప్పిన పెద్దమనుషులమీద ఎలా నిందలేస్తారని” తె.వాదుల్ని నిలదీయలేదు. ఇలా అడిగే వారు ఎవరూ లేకపోవటం వల్ల, శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు అటకెక్కింది. ఇప్పుడు తెలంగాణా వాదుల విధానం ఎలా ఉందంటే, మేము చెప్పిందానికి సరే అన్నోడు మంచోడు, కాదన్నోడు ఎవరైనే సరే వాడు తెలంగాణా ద్రోహి,సీమాంధ్రులకి అమ్ముడుపోయినట్లే, దీనికి వేరే ఆధారాలు అవసరం లేదు. ఇదే ఉద్యమ విధానం. కాదనగలరా..?

  సరే, కలిసుండాలా, విడిపోవాలా అనేది ఇద్దరూ మూచువల్గా తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకరు విడిపోతామంటున్నప్పుడు, కలిసుండాల్సిందేనని పట్టుపట్టడం అవివేకమే గాక, అన్యాయం కూడా అది దేశమైనా, రాష్ట్రమైనా.. కాకపోతే, నువ్వు దొంగవి కాబట్టి నీతో నేను కలిసుండను అంటే, దానికి ఒప్పుకొనేంత విశాల హృదయం ఇక్కడ ఎవరికీ లేదు. చేతనైతే ‘దొంగతనం ‘ నిరూపించి( కేంద్రంలోని పెద్దలముందు) తెలంగాణా తెచ్చుకోమనండి. ఇక విద్వేషం, ఎగతాళి అంటారా.. పేడ బిర్యాని, రాక్షస సంతతి, సంక్రాంతికి ఇంటికి వెల్లిన వారు తిరిగి రాజధానికి రాలేరు లాంటివి మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా..

 7. విశేఖర్ గారూ,
  నా టోన్, నేను అంటగట్టిన విషయాలూ కాసేపు పక్కన బెడితే నాకు కావాల్సిన సమాధానం మీవద్ద నుండి వచ్చేసింది. ఇక తేల్చాల్సింది జనమే వారికేది కావాలనుకుంటున్నారో!

 8. శ్రీ విశేఖర్ గారికి, నమస్కారములు.

  మీ వ్యాసం, దానిపై వచ్చిన వ్యాఖ్యలను చదివాను. ప్రత్యేక ఆంధ్ర; ప్రత్యేక తెలంగాణ; సమైక్య ఆంధ్ర కావాలి అనే విషయాన్ని కొంతసేపు ప్రక్కన పెడితే, కొన్ని ముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. మన దేశంలో, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఇది బెంగాల్ రాష్ట్రం, బెంగాలీ మాట్లాడే వారంతా ఇక్కడికివచ్చి వుండండి; ఇది ఆంధ్ర రాష్ట్రం, తెలుగు మాట్లాడేవారంతా ఇక్కడికివచ్చి వుండండి అని భారత ప్రభుత్వం చెప్పలేదు. సహజంగానే ఒక భాష మాట్లాడే వారంతా ఒక ప్రదేశంలో వుండటంతో, ఆ భూభాగానికి ఆ భాష పేరుతో ఇది బెంగాల్; ఇది ఆంధ్ర; ఇది గుజరాత్ అంటూ నామకరణం చేసి,సరిహద్దులను ఏర్పాటుచేశారు. దీనినే భాషాప్రయుక్త రాష్ట్రాలు అని అంటారు. అంతేకానీ, భారతదేశంలోని ప్రజలు ఈ భూభాగం మాది, దీనిని మా రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అని అంటానికి ఎవరికీ హక్కులేదు. — మరి, నిజాం ప్రభుత్వం వున్నప్పుడు వున్న మా తెలంగాణా జిల్లాల్ని ఇప్పుడు మాకు ఇచ్చి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యండి అని అంటానికి ; అట్లాగే మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యండి అని అంటానికి ఎవరికీ హక్కులేదు. అసలు తెలంగానా అంటేనే, తెలుగు భాషని మాట్లాడే వారుండే ప్రదేశము అని అర్ధం.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 9. సీమాంధ్రలో తెలంగాణా పట్ల విద్వేషం లేదనడం మీ అమాయకత్వమో, తుంటరితనమో అర్థం కావడం లేదు. నాయకులే కాదు, అంతర్జాల రచయితలల్లో కూడా వెటకారం, విద్వేషం & చిన్న చూపు కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు అనంత వెంకటరామిరెడ్డి తెలంగాణా వారిని ఖాలిస్తానీయులుగా వర్ణించినప్పుడు ఆంద్ర వారు ఎవరూ ఆయనను తప్పు పట్టలేదు. ఆచంగ, ఆకాశరామన్న లాంటి బ్లాగర్లు చీటికి మాటికి వాడే “తెలబాను” పదంలో విద్వేషం లేదా? “వీర్పాటువాదం” బిరుదులతో తెలంగాణవాదులను సంబోధించడం అవసరమా? తెలంగాణా కోసం బలిదానాలు చేసుకున్న వారిని అనుమానించడం ఎందుకు? డిసెంబర్ 9 రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించిన నాయకులను ఎందుకు నిలదీయడం లేదు?

  “ఊభయవాదనలవారికి శాంతియుతంగా తమ భావాలు ప్రచారంచేసుకునే అవకాశం ఉండాలి”: ఈ అవకాశం బెజవాడలో ఉందా? ఉంటే సామాజిక ఆంద్ర వారి సభను అడ్డు కోవడం ఎందుకు? విశాఖలో ఉందా? ఉంటేనారాయణ మూర్తిపై, బండారు దత్తాత్రేయపై దాడులు ఎందుకు? విడిపోవాలని అన్నవాడు చేసాడే అనుకున్నా, కలిసి ఉందామని శ్రీరంగనీతులు చెప్పేవాడు చేసే పనులేనా ఇవి?

 10. “విడిపోవాలని అన్నవాడు చేసాడే అనుకున్నా, కలిసి ఉందామని శ్రీరంగనీతులు చెప్పేవాడు చేసే పనులేనా ఇవి?”

  మరి నా భాషలో ఏమి తప్పు కనబడిందో?! అందుకే మా దిగువలో ఓ సామెతుంది….. రాజు చేస్తే శృంగారము, చాకలోడు చేసేది రంకు అని. సీమాంధ్ర జనం అంతా సాధు ………..ఊరుకోవటానికి. ఇటువైపువారి సహనానికీ ఓ హద్దుంటుందని తాము ఇకనైనా ఎరిగి మాకు విభజన కావాలి, ఆ విభజన జరగాలంటే మీకేమి కావాలనే ధోరణిలో చర్చలకు సిద్ధపడితే ప్రయోజనం ఉంటుంది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి తేల్చి చెప్పింది అదే. లేదంటారా మేమూ …………………..ఎక్కువే మరి!

  ఇంకోముక్క జై గారూ, డిశెంబరు 9 ముందు తె,వాదులు చేసిందే డిశెంబరు 23 వరకూ సీమాంధ్రలోనూ జరిగింది. అయినా నా పిచ్చిగానీ కళ్ళకు గంతలు కట్టేసుకుని నా తెలంగాణ అన్యాయమైపోయిందో అని ఆధారరహిత వాదనలు చేస్తూ కూర్చునేవారి మనసు రంజింపటం బ్రహ్మతమైనా కాదు!

  (విషయం పక్కకు పోయే అవకాశం ఉన్నందున కొన్ని పదాలు తొలగించాను. భావం చెదరకుండా ఎడిట్ చేశాను -విశేఖర్)

 11. శ్యామలరావు గారూ, జై గారు మీకవసరమైన సమాచారం ఇచ్చారు.
  కొద్ది రోజూల క్రితం పరకాల ఉపన్యాసం విద్వేషంతోనే ఉంది.

 12. చీకటి గారూ,
  సీమాంధ్రుల దోపిడీ అంటే సీమాంధ్ర ప్రజలంతా కాదని గమనించాలి. ముందొక విషయం వివరిస్తాను.
  బ్రిటిష్ వాడికి కోస్తా జిల్లాలనుండి రెవిన్యూ వసూళ్ళు రావడానికి రెండు డ్యాంలు కట్టించాడు. విజయవాడ, ధవళేశ్వరం. కొన్ని కాలవలు తవ్వించాడు. కేవలం వాడి ప్రయోజనాల కోసమే. వాటి ద్వారా కృష్టా, గుంటూరు, కోస్తా జిల్లాల్లో భూస్వాములు వ్యవసాయం చేసి అభివృద్ధి చెందారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేనాటికి వారి వద్ద పెట్టుబడి సమకూరింది. పెట్టుబడి సమకూరాక అది ఊరికే కూర్చోదు. లాభాల కోసం పరుగులు పెడుతుంది. లాభాలకోసం కృ, గుం, ఉ.గో జిల్లాల భూస్వాములు హైద్రాబాద్ వచ్చి పరిశ్రమలు పెట్టారు.

  వీళ్ళు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, సామర్లకోట, తుని లాంటి తమ సొంత పట్నాలని వదిలి హైద్రాబాద్ ఎందుకు వచ్చారు? హైద్రాబాద్ ని అభివృద్ధి చేయడానికి వచ్చామని ఇప్పుడంటున్నారు. కాని అది నిజం కాదు. తమ ప్రాంతాలలో కంటె తెలంగాణలో ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు స్ధాపించాలంటె ఏం కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లెదు. ప్రకృతి వనరులు, రోడ్లు, వంతెనలు, రైలు విమాన యాన సౌకర్యాలు మొ.వి. ఇవన్నీ తెలంగాణలో హైద్రాబాద్ చుట్టూతా, హైవేల చుట్టూతా వాటంగా ఉన్నాయి. అందువలన తెలంగాణ ప్రాంతం లాభాల సంపాదనను అనువుగా దొరికింది. దానితో సీమాంధ్రలో ముఖ్యంగా ఆ నాలుగు జిల్లాల భూస్వాములు పెట్టుబడిదారులుగా తెలంగాణకి వచ్చారు.

  ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలంగాణలో భూస్వాములు పెట్టుబడిదారులుగా 1947 నాటికి అభివృద్ధి చెందలేదు. అక్కడ నీటిపారుదల సౌకర్యాలు లేవు. (ఇప్పటికీ అరకొరగానే ఉన్నాయి) మెరక ప్రాంతం కావడాన, అప్పటికి ఎత్తిపోతల లేనందున తెలంగాణ భూస్వాములు ఆ భూములపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్ధితి కాస్త అటూ ఇటూగా నిన్నమొన్నటివరకూ కొనసాగింది. ఈ లోగానే తెలంగాణ భూస్వాములు కూడా నెమ్మదిగా భూముల ద్వారానే పెట్టుబడులు సమకూర్చుకున్నారు. సరళీకృత ఆర్ధిక విధానాల వలన తెలంగాణ భూస్వాములు కూడా మెల్లగా పెట్టుబడిదారులుగా అవతారం ఎత్తారు. కాని నాలుగు జిల్లాల వారంత ధనికులు కాలేదు. ఈ కారణాల వలన సీమాంధ్రలో కనిపించేటంత పెద్ద ధనికులు తెలంగాణలో కనిపించరు. ఎవరో నామా, కోమటిరెడ్డి లాంటి ఒకరిద్దరు మినహా. అదే సీమాంధ్ర లో చూస్తే పరిశ్రమాధిపతులుగా చాలా మంది ఉన్నారు.

  కనుక ఇక్కడ ఏం జరిగింది. ప్రధానంగా నాలుగు జిల్లాల భూస్వాములు, ఇంకా ఇతర కొస్తా జిల్లాలకు కూడా చెందిన రాజులూ, జమీందార్లూ కూడా తమ జిల్లాల్లో భూస్వాములుగా సంపదలని పోగేసుకోవడమే కాక తెలంగాణ జిల్లాల్లో వనరులను కూడా ఉపయోగించుకుని పరిశ్రమలు పెట్టి మరిన్ని సంపదల్ని అర్జించారు.

  అయితే పెట్టుబడిదారులు ఏ ప్రాంతం వాడైనా, ఏ రాష్ట్రం వాడైనా తమకు పోటీగా మరొకరు ఎదగడాన్ని సహించరు. తెలంగాణలో కొత్తగా ముందుకొచ్చిన ఆ ప్రాంత పెట్టుబడుదారులు ఎదగకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుపడడం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల పోషకులు ప్రధానంగా వీళ్ళే. వీరి చందాలు లేకుండా పార్టీలు బతికి బట్టకట్టవు. ఈ నలభై, యాభై సంవత్సరాల పాటు ధనికులుగా రాష్ట్ర ప్రభుత్వ నాయకుల్లోనూ, అధికారుల్లోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు పలుకుబడి సంపాదించారు. ఇంకా చెప్పాలంటే ఆధిపత్యం అనడం సరిగ్గా ఉంటుంది. ఎవరిపైన ఆధిక్యత? కొత్తగా ఎదుగుతున్న తెలంగాణ పెట్టుబడిదారులపైన. సీమాంధ్రలోనేమో పత్తి, మిరప, పొగాకు తదితర పంటలు, వ్యాపారాలు అన్నీ వారివిగానే ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ సంపాదించిన పెట్టుబడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వలన ఇక్కడ పరిశ్రమలు, వనరులు కూడా వారి కిందికే ప్రధానంగా వచ్చాయి. ఇది క్రమానుగతంగా జరిగిన పరిణామం.

  ఇక్కడ సీమాంధ్ర పెట్టుబడిదారులు మొదటినుండీ తెలంగాణ పెట్టుబడుదారులకు ఎదగకుండా అడ్డుకోవడం జరగలేదు. వాళ్లు ఎప్పుడైతే తమ వ్యాపారాలకు పోటీగా ఎదుగుతున్నారో అప్పుడే అడ్డుకోవడం ప్రారంభించారు. అలాగే తెలంగాణ పెట్టుబడుదారులు మొదటినుండీ తమ ఎదుగుదలకు అడ్డంకులు ఎదుర్కోలేదు. వాళ్ళు ఒక స్ధాయిని దాటి పెద్ద పెద్ద వ్యాపారాల్లో కూడా అడుగుపెట్టడం ఎప్పుడు ప్రారంభం అయ్యిందో అప్పుడే వారు అణచివేతను ఎదుర్కొన్నారు. ఈ క్రమం దాదాపు డెబ్భైలనుండి మొదలయ్యి ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది. సీమాంధ్ర పెట్టుబడిదారులకే ప్రభుత్వం లో కూడా సీమాంధ్ర ధనికుల పలుకుబడే ఉండడం వలన తెలంగాణ ధనికులు ఆం.ప్ర ప్రభుత్వం నుండి తగిన మద్దతు పొందలేకపోయారు. తెలంగాణ రాజకీయ నాయకులు కూడా సీమాంధ్ర ధనికుల ఏలుబడిలోనే ఉండడం వలన వారూ తెలంగాణ ధనికులకు సహాయం చెయ్యలేదు.

  సీమాంధ్రలో భూస్వాములు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అక్కడి నీటిపారుదల వలన బడా భూస్వాములతో పాటు ధనికవర్గం, మధ్య తరగతి వర్గాలు కూడా అభివృద్ధి చెందాయి. రైతులు బాగా ఉన్నప్పుడు కూలీలకు కూడ పని దొరికి ఆమేరకు ప్రయోజనం పొందుతారు. వారందరైపైన ఆధారపడి వ్యాపార వర్గం అభివృద్ధి చెందింది. వారి చుట్టూ చిన్నా, చితకా చేతిపనుల వాళ్లు కూడ ఎంతో కొంత అభివృద్ధి సాధించారు. కాని తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చెందకపోవడం వలన ఆ మేరకు ఇతర వర్గాల అభివృద్ధి కూడా జరగలేదు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందక పోవడంవలన తెలంగాణకు, సీమాంధ్రకు చాలా చాలా తేడా ఏర్పడింది. సీమాంధ్రలో భూస్వాముల ఆస్తులు పెరగడం, ఆస్తులతో పరిశ్రమలు పెట్టడం, వారి చుట్టూ ధనికవర్గం, మధ్యతరగతి ఉద్యోగ వర్గం, కూలీలు మొదలైనవర్గాలు అభివృద్ధి సాధించినట్లుగా తెలంగాణలొ జరగలేదు. తెలంగాణలో తాము పెట్టిన పరిశ్రమలకు ఉద్యోగులు, కార్మికులను కూడా సీమాంధ్ర ధనికులు, సీమాంధ్ర నుండే ఎక్కువగా తెచ్చుకున్నారు. దీనికి అనేక కారణాలు పనిచేశాయి. భాష, సంస్కృతి అర్ధం కానిది కాకపోవడం, విద్యా సౌకర్యాలు లేక తగిన పనివాళ్ళు తెలంగాణలో దొరక్కపోవడం, రైతులు కూలీలు ప్రధానంగా భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల్లో ఇరుక్కొనిపోయి బైటికి రాలేక పోవడం ఇవన్నీ పని చేసి సీమాంధ్రుల పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగులు కూడా ప్రధానంగా సీమాంధ్రనుండే వచ్చారు.

  తెలంగాణ ధనికులు అభివృద్ధి సాధించాక వ్యాపారాల్లొ అప్పటికే వృద్ధి చెందిన సీమాంధ్ర పెట్టుబడిదారులనుండి అణచివేతను ఎదుర్కొన్నారు. తెలంగాణ పెట్టుబడిదారులపై అణచివేత అంటే ఏమిటి? బూటు కాళ్లతో తొక్కిపెట్టారని అర్దమా? కాదు. సెక్రటేరియట్ లొ ఏ విభాగానికి వెళ్లినా పనులు జరగవు. మంత్రుల చుట్టూ తిరిగినా కాంట్రాక్టులు దక్కవు. ఎంత తక్కువకి కోట్ చేసినా ధన బలిమి వలన సీమాంధ్ర కాంట్రాక్టర్లు అంతకంటే తక్కువ కి కోట్ చేసి కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఒక్కోసారి తమకు అవసరంలేని, తమ స్ధాయికి తగని కాంట్రాక్టులను కూడా సీమాంధ్ర ధనికులు చేజిక్కించుకుని ఆ తర్వాత తమకు నచ్చినవారికి సబ్ కాంట్రాక్టు ఇస్తారు. తద్వారా పోటీగా ఎదుగుతున్నవారికి అవకాశాలు లేకుండా చేస్తారు. ఈ విధమైన రూపాల్లో అణవచివేత కొనసాగింది. ఇవి కాక నిరుద్యోగం, దరిద్రం, ఆకలి మొదలైన సాధారన సమస్యలు కూడా ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఆలోచన వైపుకి ప్రజల్ని నెట్టాయి. ప్రభుత్వాలు, పాలకపార్టీలు కూడా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల సమస్యలకు ఇతర కారణాలను ఎగదోస్తారు. ఆ విధంగా కూడా తెలంగాణ డిమాండ్ పెద్దదయ్యింది.

  ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది తెలంగాణ పెట్టుబడిదారులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ పెట్టుబడిదారులకు సొంత బడ్జెట్ వస్తుంది. తమ రాష్ట్ర ప్రభుత్వ మద్దతు తమకే వస్తుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల పోటీ రాష్ట్రాలు విడివడ్డాక కూడా తెలంగాణ పెట్టుబడిదారులకు ఎదురవతుంది. కాని ప్రభుత్వం వారిది కావడం వల్ల ఆ పోటీని పక్కకు నెట్టి లాభం పొందవచ్చు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ పె.దా లు తెలంగాణకీ, సీమాంధ్ర పె.దా లు సీమాంధ్రకీ పరిమితం అవుతారనుకుంటే పొరబాటు. వాళ్ళు ఇక్కడ, వీళ్ళు అక్కడా పోటీలకు దిగుతారు. కాని ప్రాంతీయత అడ్దుపెట్టుకుని ఒకరినొకరు అడ్డుకుంటారు. దానితొ ఎవరి ప్రాంతంలో వారి ఆధిక్యత కొనసాగడానికి అవకాశం లబిస్తుంది. అయినప్పటికీ అక్కడివాళ్ళు ఇక్కడా, ఇక్కడి వాళ్లు అక్కడా వ్యాపారాలు చెయ్యడం ఆగదు. వలసలు ఆగవు. సెటిల్ మెంట్లు ఆగవు. ఇవన్నీ ఒక దేశంలో సహజంగా జరిగే కార్యక్రమాలు. తెలంగాణ వస్తే సీమాంధ్ర వాళ్ళను వెళ్ళగొడతారని చెప్పడం కరెక్టు కాదు. సీమాంధ్ర ధనికులు అవన్నీ చెప్పి రెచ్చగొడుతున్నారు. అలాగే తెలంగాణలో కొంతమంది లేనిపోనివి చెప్పి సీమాంధ్రులు మొత్తం దొపిడీదారులని చెప్పడం అతి తప్ప మరొకటి కాదు.

  పెట్టుబడిదారీ వర్గాలు తెలంగాణలో అభివృద్ధి చెందితే వారి కోసం ఏర్పడే రోడ్లు, నీటిపారుదల సౌకర్యాలను అక్కడి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. తద్వారా సీమాంధ్రలో జరిగినట్లుగా వారి చుట్టూ ధనికులు, రైతులు, ఉద్యోగులు తదితర వర్గాలు వృద్ధి చెందుతాయి. ఈ వృద్ధికోసమే తెలంగాణ ప్రజల డిమాండ్ ను సమర్ధించవలసి ఉంది.

  ప్రజసమూహాల అసలు సమస్యలు తెలంగాణ లో కూడా కొనసాగుతాయి. కొత్త రాష్ట్రంలో కె.సి.ఆర్ కూడా ప్రజా ఉద్యమాల పట్ల బాబు, వై.ఎస్.ఆర్ లు తీసుకున్న వైఖరినే తీసుకుంటాడు. అది కూడాధనికుల పార్టియే. అప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఉద్యమాలు చేపట్టవలసిందే.

  ఈ నేపధ్యంలో మీ వ్యాఖ్యను చూడవలసి ఉంటుంది. అటూ, ఇటూ, సవాలక్షా వాదనలు దొర్లు తుంటాయి. అవి ప్రధానం కాదు. ఉద్యమం చేస్తున్న డిమాండ్ ఏమిటి? అది న్యాయమైందా కాదా? ఇవే ప్రధానంగా చూడాలి. కె.సి.ఆర్, కె.టి.ఆర్, కె.కె. కాకా ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు, సవాల్లు, ప్రతి సవాళ్లు అన్నీ తెలంగాణ ఉద్యమం నుండి వేరు చేసి చూడాలి. ఉద్యమం అన్నాక అనేక ధోరణులు కనిపిస్తుంటాయి. ప్రజా మద్దతు ఉన్న ఉద్యమాల్లో మరిన్ని అపసవ్య ధోరణులు తలెత్తుతాయి. వాటిని పక్కనబెట్టి ప్రధాన డిమాండ్ పైన దృష్టి పెట్టాలి.

  శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు లో పేరుకి శ్రీకృష్ణ అధిపతి అయినా ఆయనపాత్ర నామమాత్రం. ఆయన పేరును వాడుకున్నారంతే. దుగ్గల్ ప్రధాన పాత్రధారి. ఆయన సీమాంధ్రుల ఏలుబడిలోనే తన పని ముగించాడు. అందులో అనుమానం లేదు. సీమాంధ్ర ధనికుల డబ్బుకి ఆ శక్తి ఉంది. తెలంగాణ పేరు చెప్పి బాగుపడ్డవాళ్ళలో ఆ కమిటీ సబ్యులు కూడా ఉన్నారు.

  నేను రాసిన వివరణలో పరిశ్రమల అభివృద్ధి తెలంగాణలోనే జరిగిందని చెప్పాను. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది ఇదే. కాని ఆ అభివృద్ధి ఎవరిది అన్నది ప్రధాన ప్రశ్న. ఆ అభివృద్ధితో తెలంగాణ ప్రజలు కనెక్ట్ అయి లేరు. ఎందుకంటే అందులో వారి శ్రమ పాత్ర నామమాత్రం. ఆ అభివృద్ధి వల్ల వారు లాభపడ్డది నామమాత్రం. అంటే తెలంగాణలో సాధించిన అభివృద్ధి కూడా సిమాంద్రులదే అన్న కీలక విషయాన్ని ఇక్కడ విస్మరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందినమాట వాస్తవమే కాని ఆ అభివృద్ధి సీమాంధ్ర పెట్టుబడిదారులకూ, అక్కడి ఉద్యోగులకూ, కార్మికులకూ ప్రధానంగా చెందినది అన్నది గుర్తించాలి. అస్సలు పూర్తిగా తెలంగాణ వారి పాత్ర లేదని నేను అనడం లేదు. ప్రధానంగా వారిదే అని చెబుతున్నాను.

  తెలంగాణవాళ్లు దొపిడీదారులని నిందిస్తున్నది సీమాంధ్ర ప్రజలను కాదు. దోపిడీదారులనే అలా పిలుస్తున్నారు. ఆ పిలుస్తున్నవారిలో తెలంగాణలో దోపిడీ చేస్తున్నవారు కూడా ఉండడమే విషాధం. ప్రాంతీయ తగువులో పడి, వారి దొపిడి (సాపేక్షికంగా చిన్న దోపిడి) కనపడకుండా పోతొంది. రాష్ట్రం వచ్చాక ఉద్యమాలకు వారే టార్గెట్ అవుతారు. తెలంగాణవాదులు అనగానే కె.సి.ఆర్, విజయశాంతి, కె.టి.ఆర్, అతని చెల్లి, కె.కె, కోమటి రెడ్ది, ఇంకో రెడ్డి వీళ్ళు కాదు. ఉద్యమాన్ని విశ్లేషించేటప్పుడు మనం ప్రధానంగా చూడవలసింది ప్రజలు, వారి పాత్రను మాత్రమే.

  తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఉన్నారు. అందుకోసమే తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకోవడం.

 13. శ్రీ మాధవరావుగారికి నమస్కారములు
  భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని మీరు చెప్పింది సరైంది కాదనుకుంటా. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండడమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మూల సిద్ధాంతం.
  “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అన్న ప్రాతిపదికన మాత్రమే హిందీ భాషకు అన్ని రాష్ట్రాలు ఉండడాన్ని అర్ధం చేసుకోగలం.
  “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అంటే ఒక రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడెవారు ఉండకూడదన్నదే అర్ధం తప్ప ఒకే భాష మాట్లాడేవారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండకూడదని అర్ధం కాదు.
  హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఒకటి కంటె ఎక్కువ ఉన్నాయి. కాని ఆ రాష్ట్రాల్లో హిందీ తప్ప మరొక భాష మాట్లాడేవారు లేకుండా చూశారు.
  అలాగే ప్రస్తుతం తమిళం మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి. ఈ రెండు రాష్ట్రాల్లో తమిళం పట్ల వేరే భాష మాట్లాడేవారు లేరు, వలస వెళ్ళి స్ధిరపడ్డవారు తప్ప.
  అలాగే ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ అది ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు.
  ఎందుకంటె విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ తెలుగు భాష మాట్లాడేవారు మాత్రమే ఉంటారు.
  కనుక ఆంధ్రప్రదేశ్ విభజన భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని చక్కగా కాపాడుతుంది.

  —————–

  అవును. మీరన్నది నిజం. ప్రభుత్వాలు చెప్పడం వలన రాష్ట్రాలు ఏర్పడలెదు. ఒకే భాష ఉన్నవారు ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల ప్రభుత్వాలు ప్రజలనుండి వ్యతిరేకత లేకుండ రాష్ట్రాలను ఏర్పరిచాయి.
  కాని ప్రజల డిమాండ్లతో కూడా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరా ఖండ్, చత్తీస్ ఘడ్, జార్ఖంఢ్ అలా ఏర్పడ్డవే.
  ప్రజలు తమ జీవనాన్ని సుఖమయం చేసుకోవడానికి, హక్కులు కాపాడుకోవడానికి వీలుగా ఏ డిమాండ్ నయినా ముందుకు తెచ్చే హక్కుని కలిగి ఉంటారు. ప్రజాస్వామ్య దేశంలో అది సహజమైన హక్కు. ఒకరు ఇచ్చేది కాదు మరొకరు పుచ్చుకునేది కాదు.
  రాష్ట్రాలను డిమాండ్ చేసే హక్కు ప్రజలకు లేదనడం సత్యదూరం. కాకుంటే సరైన పునాది లేకుండా రాష్ట్రాలను డిమాండ్ చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తారు.
  తెలంగాణ ఒక రాష్ట్రంగా ఐదేళ్ళు ఉంది. దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు నిజాం పాలనలో ఆంధ్ర సంస్కృతికి దూరంగా, తెలుగు భాషా వికాసానికి దూరంగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అందువల్లనే వారు సీమాంధ్ర భాషా, సంస్కృతులతో తమను తాము ఐడెంటిఫై కాలేకపోతున్నారు.
  ఇంకా ఇతర సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాల రీత్యా తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర ప్రాంతానికి భిన్నమైన అస్తిత్వం ఉంది.
  ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను న్యాయబద్ధం చేస్తున్నాయి.
  నమ్మస్సులతో
  విశేఖర్

 14. ఈ మధ్య తెలంగాణ ప్రాంత వామపక్ష వాదులపై నాకో సందేహం కలుగుతుంది. ప్రాంతీయ ద్వెషాలను రెచ్చగొట్టడం వలన ప్రజలలో వచ్చిన ఈ చైతన్యాన్ని రేపు విప్లవ పంథాలో జనులను నడిపించగలరన్న నమ్మకంతోనే ఈ తెలంగాణా ఉధ్యమాన్ని కొనసాగిస్తున్నారా? మీకు చెప్పవలసినదేమీలేదు… బడా పెట్టుబడిదారులు యిప్పటికి ప్రాంతాలకతీతంగా కలిసి మెలిసి వ్యాపారాలు చేసున్నారు యుంత ప్రజా ఉధ్యమాలు జరుగూన్నా. మరి బడుగుజీవులు మధ్య తరగతి ప్రజలే సముధులవుతున్నారు ఈ విభజన గోడవలలో.. మరి నేను ఇలా అనడంలో తప్పులేదనుకుంటా.. ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

  వీలయతే నా బ్లాగులో రాసిన నా సందేహాలను నివృత్తి చేయ ప్రార్థన…

 15. ప్రాంతీయ అస్తిత్వవాదంతో సంబంధం లేని మతం పేరు చెప్పి అబద్దపు రిపోర్టులు వ్రాసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక నమ్మావంటే అది నీ అమాయకత్వమే.

 16. రాజశేఖరరెడ్డి నిజాంని బహిరంగంగా పొగిడినప్పుడు మీ సమైక్యవాదులు ఏమయ్యారు? రాజశేఖరరెడ్డి సమైక్యవాది కాబట్టి అతను నిజాంని పొగిడినా, నాజీలని పొగిడినా ఏమీ అనకూడదు అనుకున్నారు కదా.

 17. ఇక్కడ నేనన్న విషయం మీరు అర్థం చేసుకోలేదు. కలిసి ఉందామనే వాడు ఆవేశం చూపించడం అర్థరహితం, కాదంటారా? బెదిరించో భయపెట్టో కాపురం చేయగలమా?

  Remember Shahrukh could not win his girl through “Darr”

 18. విశేఖర్ గారూ,
  నేను ఒకసారి వ్యాఖ్యానించాక నా భావం ఎక్కువశాతం రచయితను ఉద్దేశించినదే అయిఉంటుంది. కనుక మీరా వ్యాఖ్యను ఏమి చేసినా నాకనవసరం. అలాగే వివరణలు అంతకన్నా అనవసరం. పైగా నేనుపయోగించిన పదం అర్థం ఇక్కడ (http://www.andhrabharati.com/dictionary/) అర్థవివరణలతో ఉంది. దానిలో మీకు తప్పులేమి అగుపడ్డాయో అర్థం కాలేదు. సరే అయినా ఇబ్బంది లేదు.

  జైగారూ,
  విషయం అర్థం కాకపోవటం ఏమీ లేదు. మనోభావాలనేవి కలిసి ఉందాం అనుకునేవారికీ ఉంటాయి. విభజనవాదులు/వేర్పాటువాదులు (ఈ పదం బ్రౌన్ నిఘంటువు ప్రకారం తెలుగులో వాడదగ్గపదమే) సమైక్యవాదులకు వారి భావాలను ప్రచారం చేసుకునే హక్కునిస్తే, సమైక్యవాదులూ విభజన/వేర్పాటువాదులకు అలాంటి అవకాశాన్నే ఇస్తారు. చరిత్రలో పేజీలను ముందువెనుకలు చెయ్యలేము. కాస్త విషయ పరిఙ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది ఏది ముందు ఏది వెనుకా అని. కాకపోతే అన్నింటికన్నా విషాదం ఏమిటంటే అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలోనూ అమలవుతున్నది ఒకటే రాజ్యాంగం ‘బలవంతునిదే రాజ్యం’. దీనికి తెలంగాణవారికి ప్రర్యేక మినహాయింపులేమీ లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s