లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!


విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ విమానాలుప్రజలకి కష్టాలొచ్చినపుడు ఆదుకోవాలనీ, వారికి బెయిలౌట్ ఇవ్వాలనీ ప్రభుత్వాలు భావించిన దృష్టాంతాలు చరిత్రలో దుర్భిణీ వేసినా వెతకినా కనపడవు. కాని జనాలకి మద్యం తాగబోసి, తెగమేసిన సొమ్ముల్ని బొక్కసంలో కుక్కుకుని, తమ మరో కంపెనీ ‘కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్’ కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్న లిక్కర్ రారాజు విజయ్ మాల్యాకు బెయిలౌట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. ఐ.పి.ఎల్ ఫ్రాంచైజి ల్లో ఒకటయిన పంజాబ్ సూపర్ కింగ్స్ కి సొంతదారు కూడా అయిన విజయ్ మాల్యా తన విమానయాన కంపెనీ నష్టాలను భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

గత కొన్ని వారాలుగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధ వరుసగా తన విమాన సర్వీసులను రద్దు చేసుకుంటోంది. దానివల్ల టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా లెక్క చేయకుండా సర్వీసుల్ని రద్దు చేసుకుంటోంది. దానిక్కారణం ఆ సంస్ధ ఎదుర్కొంటున్న నష్టాలేనట. రన్నింగ్ లో ఉన్న సర్వీసుల్ని రద్దు చేసుకోవడంతో పాటు అసలు మొత్తంగా సర్వీసుల్ని కూడా రద్దు చేసుకుంటోంది. దానితో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధకు విమానాల్ని అద్దెకు ఇచ్చిన విమాన కంపెనీలు తమ విమానాల్ని తమకు ఇచ్చేయ్యమని అడుగుతున్నాయట. పైలట్లు, ఇతర ఉద్యోగులు కింగ్ ఫిషర్ మునిగి పోతున్న పడవ అని భావించి సంస్ధను వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోవడం మామూలేనని విజయ్ మాల్యా నచ్చజెపుతున్నా పరిస్ధితి ఘోరంగా ఉందని రాయిటర్స్ లాంటి కంపెనీల ఫ్రెండ్లీ వార్తా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి.

కింగ్ ఫిషర్ కంపెనీ నష్టాల్లోనుండి బైటికి రావాలంటే దానికి మరింత సొమ్ము కావాలని గతంలోనే ఆడిటర్లు హెచ్చరించారని రాయిటర్స్ తెలిపింది. విమాన సర్వీసుల్ని అదేపనిగా రద్దు చేస్తుండడంతో కంపెనీ షేర్లు ఈ సంవత్సరం ఇప్పటికే 67 శాతం పడిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. కంపెనీ ఇప్పటికె విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందనీ, ఆ అప్పును రీ షెడ్యూల్ లాంటిదేదో చెయ్యాలని కంపెనీల మిత్రులు, స్వేచ్ఛా మార్కెట్ పండితులు పరోక్షంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. త్వరగా ఆదుకోకపోతే కంపెనీ కోలుకోవడం కష్టమని కూడా వీళ్ళు తొందరపెడుతున్నారు.

కోటీశ్వరుడు విజయ్ మాల్యాకు ఇన్ని కష్టాలా అని కేంద్ర మంత్రులు ఇప్పటికే చలించిపోయారు. సివిల్ ఏవియేషన్ మంత్రి వాయలార్ రవి తాను ఆర్ధిక మంత్రితో మాట్లాడి ఏదో ఒకటి మేలు చేసి పెడతానని వాగ్దానం చేశాడు. బ్యాంకుల ద్వారా కింగ్ ఫిషర్ కంపెనీకి సహాయం అందజేయడానికి ఆర్ధిక మంత్రిని ఒప్పించే బాధ్యతను ఆయన నెత్తిన వేసుకున్నాడు. కంపెనీ అప్పు ని పునర్మూల్యాంకనం చెయ్యడంలో ఆటంకాలు ఎదురవుతుండడం వలన ఆర్ధిక మంత్రితో మాట్లాడమని తాను ఇప్పటికే విజయ్ మాల్యాకు చెప్పానని కూడా ఆయన చెబుతున్నాడు.

కింగ్ ఫిషర్ సంస్ధకు 60 బిలియన్ రూపాయలు (రు.6000 కోట్లు) అప్పు ఉందని తెలుస్తోంది. ఈ అప్పులో పెద్ద మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులే ఇచ్చాయని తెలుస్తోంది. గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వ, ప్రవేటు బ్యాంకులు రెండూ ఒక విడత కింగ్‌ఫిషర్ కి అప్పుల విషయంలో సహాయం చేశాయి. 12 బిలియన్ రూపాయలు లేదా  రు.1200 కోట్ల రూపాయల అప్పుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు రెండూ అప్పుగా రద్దు చేసుకుని ఈక్విటీ షేర్లు కింద మార్చుకున్నాయట.అంటే బ్యాంకులకు అప్పు ఉన్నంతమేరకు కింగ్ ఫిషర్ షేర్లను బ్యాంకుల ఖాతాకు కంపెనీ మార్చిందన్నమాట. ఇప్పుడిక వడ్డీ చెల్లింపుల బదులు షేర్లపైన లాభాలని వడ్డీ చెల్లింపులుగా బ్యాంకులు భావించాలన్నమాట.

ఇది బ్యాంకులకి నిజానికి నష్టం తెచ్చే చర్య. ఎందుకంటే అప్పు పైన వడ్డీ అనేది ఖచ్చితంగా వసూలవుతుంది. కాని అదే సొమ్ముని కింగ్ ఫిషర్ కంపెనీలో ఈక్విటీల కిందికి మార్చినపుడు ఆ ఈక్విటీలపైన లాభాలు వస్తేనే బ్యాంకులకు ఉపయోగం. ఈక్విటీలపైన లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువే. కింగ్ ఫిషర్ షేర్ ధర ఈ సంవత్సరం 67 శాతం పడిపోయింది. కనుక బ్యాంకుల అప్పులు షేర్ల కిందికి మార్చినందుకు గాను వాటికి వడ్డీ దక్కకపోగా, అసలు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఒకవేళ లాభాలు వచ్చినా అవి వడ్డీ రేటుకి సరిపోయినంత లేకపోవచ్చు. 2005 సం. నుండి నష్టాలు తప్ప కింగ్‌ఫిషర్ కి లాభాలే లేవని రాయిటర్స్ సంస్ద చెప్పుకొచ్చింది. అటువంటి కంపెనీ షేర్లు బ్యాంకులు అప్పుల స్ధానంలో కొనుగోలు చేయడం వలన లాభపడింది విజయ్ మాల్యా యే కాని బ్యాంకులు కాదు.

ప్రభుత్వరంగ బ్యాంకులంటే కేంద్ర మంత్రులకు వారి జేబు సంస్ధలే. ప్రజలనుండి డిపాజిట్లు సేకరించి ఆ సొమ్ముని విజయ్ మాల్యాలాంటి బిలియనీర్లకి అప్పులుగా ఇప్పించడానికి మంత్రులు, ప్రభుత్వాలు ఇష్టపడతాయి కాని సామాన్య జనానికి అప్పులిచ్చి ఆదుకోవడానికి సుతరామూ ఇష్టపడవు. కంపెనీలపైనా, వాటి యజమానులైన మిలియనీర్లు, బిలియనీర్లపైనా ఉన్నంత ప్రేమ భారత పాలకులకు భారత ప్రజలపైన లేదని వారి అరవై ఏళ్ల పాలన చెబుతోంది. దానికి ఈ విజయ్ మాల్యా వ్యవహారం తాజా తార్కాణం.

దేశానికి అన్నం పెట్టే రైతు ప్రకృతి వైపరీత్యాల వల్లనో, తెగుళ్ళు సోకడం వల్లనో, గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వల్లనో ఆదాయం లేక అప్పు చెల్లించలేకపోతే, అది మాఫీ చేయడానికి సవా లక్ష కారణాలు రంగం మీదికి వస్తాయి. అయ్యో బడ్జేట్ లోటు పెరిగిపోతుంది అని అహ్లూవాలియా పరుగెత్తుకొస్తాడు. ‘ఎగుమతిదారులకి, దిగుమతిదారులకి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది, రైతులకిస్తే మరి వారికో’ అంటూ వాణిజ్యమంత్రి ఆనంద్ శర్మ ‘అబ్జెక్షన్’ అని అరుస్తాడు. రైతుల రుణాలు మాఫీ చెస్తే బ్యాంకుల లిక్విడిటీ దెబ్బతింటుందనీ, బ్యాంకుల్లో పెట్టుబడులు తగ్గిపోతాయనీ ఆర్.బి.ఐ గవర్నర్ చెవి మెలి పెట్టవచ్చు. ఇక ప్రధాని మన్మోహన్ అయితే “ఇక్కడేమన్నా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా?” అని బ్రహ్మాస్త్రం లెవెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తాడు.

వీళ్లంతా ఇప్పుడు విజయ్ మాల్యాకి అప్పుల భారం దిగిపోయేలా బెయిలౌట్ మంజూరు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ధనికులకు, కంపెనీలకి బెయిలౌట్లు ఇవ్వడం భారత ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కాకపోతే అలా బెయిలౌట్ ఇచ్చాక అందులో కమిషన్ దగ్గరే ఏమన్నా ఉంటే  పేచి వస్తుంది. వాయిలార్ రవి కింగ్ ఫిషర్ కి సహాయం చెయ్యమని ఆర్ధిక మంత్రికి సిఫారసు చేస్తానని చెప్పిన తర్వాత బి.జె.పి అగ్ర నాయకుడు అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదని ప్రకటన ఇచ్చాడు. నిజానికాయన రధ యాత్రలో ఉన్నాడు. అది కూడా అవినీతికి వ్యతిరేకంగా రధ యాత్ర్ర చేస్తున్నాడు. అటువంటి పెద్దాయన తన పని మర్చిపోయి ఆఫ్ట్రాల్ ఓ ప్రవేటు కంపెనీ వ్యవహారంపైన అర్జెంటుగా ప్రకటన ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. ఎందుకంటే ఆద్వాని ప్రకటన చదివి విజయ్ మాల్యా పరిగెత్తుకుని బి.జె.పివారిని కలవాలి. కలిసి తన కష్టాలను చెప్పుకుని “తగిన రీతిలో” వారిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడిక అద్వానీకి కింగ్ ఫిషర్ బెయిలౌట్ విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చు. కావలిస్తే ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద మాట సాయం చేసిన చెయ్యవచ్చు.

5 thoughts on “లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!

 1. శిక్ష పడింది సరే!
  ఇంకా యెంత తతంగం ఉంది.
  ఈ శిక్షపై రకరకాల అప్పీళ్ళు చేస్తారు ముద్దాయి తరపువారు.
  సుప్రీం కోర్టు దాకా అప్పీళ్ళు సడుస్తాయి.
  మరణ శిక్ష క్రూరాతిక్రూరం అని మానవహక్కుల సంఘాల వాళ్ళు నానా యాగీ చేస్తారు.
  దేశవ్యాప్తంగా చర్చ రేగుతుంది.
  అసలు మరణ శిక్షను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచే తొలగించి తీరాలని మేధావి వర్గాలు గోలగోల చేస్తారు.
  ఈ లోపల ముద్దాయి పైన కుట్ర జరిగిందనీ అతడూ సాక్షాత్తూ గౌతమబుధ్ధుడికే గురుత్వం వహించగల మహాత్ముడనీ ప్రచారం ఊపందుకుంటుంది.
  సామాన్యులలో కూడా తగినంత సానుభూతి కలిగేలా మీడియా అతి కూడా తోడ్పడుతుంది.
  చివరకు యెన్నో యేళ్ళ తరువాత మరణశిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేస్తుంది.
  మళ్ళా యాగీ మొదలవుతుంది మరణశిక్ష మానవత్వానికే కళంకం అని.
  ఘనత వహించిన ముద్దాయిగారు చేసేది లేక న్యాయవాదుల సలహా మేరకు రాష్ట్రపతికి ‘క్షమాభిక్ష’ కోసం విజ్ఞప్తి చేసుకుంటాడు.
  పది యేళ్ళకో పాతికేళ్ళకో అది తిరస్కరించబడుతుంది.
  మరొక నాలుగైదు యేళ్ళకి ఉరికి తేదీ ఖరారు చేయబడుతుంది.
  ఒకవేళ ఇంకా అప్పటికి ముద్దాయి వయఃప్రభావం కారణంగా సహజమరణం పొందకపోతే అతడిని ఉరతీయవచ్చు.
  వచ్చు అనటం యెందుకంటే అతడు సంపూర్ణారోగయంతో ఉండాలిగా మరి అతడిని ఉరి తీయాలంటే!
  అదీ సంగతి.
  ముద్దాయి మరణశిక్ష నిలిచి పోయే మరో దారి కూడా ఉంది.
  అతడు భయంకరమైన తీవ్రవాది అని ఋజువైతే అతడిని పెళ్ళికొడుకులా యావజ్జీవం మేపడం తప్ప మన ప్రభుత్వం చచ్చినా ఉరితీసే సాహసం చేయదు.

 2. శ్యామలరావు గారూ మీ ఆవేదన న్యాయమైనది.
  మరణ శిక్ష వేశాక, అది తప్పని తేలితే, సరిదిద్దు కోవడానికి వీలుండదన్నది మానవ హక్కుల సంఘాల వాదన.
  అదీ కాక శిక్ష అన్నది నిందుతులను లేదా దోషులను సంస్కరించేదిగా ఉండాలి తప్ప దోషుల్ని నిర్మూలించేదిగా ఉండకూడదన్నది వారి వాదన.
  నిజం కూడా అదేనేమో కదా?
  న్యాయ వ్యవస్ధల లక్ష్యాన్ని (సంఘ సంస్కరణ) బట్టి చూసినా అది మరణ శిక్ష వలన చేకూరదు.
  వందకు పైగా దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయని విన్నాను.
  మీరు చెప్పింది మన న్యాయవ్యవస్ధ వైఫల్యం తప్ప మొత్తంగా న్యాయ వ్యవస్ధ వైఫల్యం కాదు కదా.
  మన న్యాయ వ్యవస్ధ వైఫల్యం వేరు, మరణ శిక్షలను రద్దు చేయాలన్న వాదనలు వేరు.
  రెండింటినీ వేరు వేరుగా చర్చించాల్సిన విషయాలని నాకనిపిస్తోంది.

 3. మీ పేరు బహుశః వి.శేఖర్ గారు అనుకుంటాను. మీ ప్రతిస్పందనలో కూడా ఆలోచించదగిన విషయాలున్నాయి. మరణశిక్ష పొరపాటని తేలితే దిద్దుకోవటానికి వీలు దొరకదు. చాలా నిజం. ఒప్పుకోవలసిందే.

  చేయని నేరాలకు కారాగారంలో మగ్గుతున్న అమాయకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వారి ప్రాణాలు పోలేదు. కాని వారి పరువు ప్రతిష్టలు పోయాయి. వారి విలువైన వృత్తివ్యాపారాలు పోయాయి. వారి అమూల్యమైన జీవనకాలం బలంతంగా వ్యర్ధం చేయబడింది. నిజానికి వారి ఉనికి వారికే అసహ్యం అనిపింవే పరిస్థితిలో ప్రాణమున్న బొమ్మల్లాగానో, మానవమృగాల్లాగానో బ్రతికించి ఉంచబడ్డారు. పైగా ఆ కాలం అంతా వారి మాటకు యేమీ విలువ యివ్వకుండా వారిని యధాశక్తి సంస్కరించే కార్యక్రమం కూడా క్రూరంగా అమలు జరిగింది. సరే, యిటుంవంటి ఒక వ్యక్తి నిర్దోషి అని అదృష్టవశాత్తు నిరూపించబడితే, అప్పుడు నాశనమైన అతని జీవనసర్వస్వం తిరిగి వెనక్కు వచ్చేస్తున్నదా?

  అలాగు జైలుశిక్షకూడా పొరపాటని తేలితే దిద్దుకోవటానికి వీలు దొరకని శిక్ష అని తేలటంలేదా? సారీ చెప్పి (పోనీ కాస్త నష్టపరిహారంకూడా యిచ్చి) నరప్రపంచంలోకి వదిలేస్తే ఆ మానవమాత్రప్రాణికి గౌరవనీయమైన జీవితం దొరుకుతుందా? ప్రభుత్వాలూ, కోర్టులూ అటువంటి యేర్పాటు చేయగలవా? జైలు శిక్షకూ ఉరిశిక్షకూ వేరువేరు వాదనలెందుకు? పొరబాటున జైలుశిక్ష అవకాశం కన్నా పొరబాటున ఉరిశిక్ష అవకాశం స్వల్పాతిస్వల్పం.

  పిచ్చికుక్కలాంటి ప్రమాదకరవ్యక్తుల మానవహక్కులగురించి కలవరించటంలో సవ్యత నాకు కనిపించటంలేదు. అటువంటివారికి నిజానికి యే యావజ్జీవమో అని ఒక శిక్షవేసి దానిని 14 సంవత్సరాలతో సరిపుచ్చి (అలా 14సం. రూలు యేమీలేదని సుప్రీంకోర్టువారి తీర్పు ఒకటుందని గుర్తు) ఆ పైన యేవో పైరవీల పుణ్యమా అని హఠాత్తుగా సత్ప్రవర్తన అనే అసహ్యకరమైన మిషమీద యే గాంధీజయంతికో ఆగష్టు పదహేను పండక్కో వదిలేస్తుంటే సమాజం పరస్థితి యేమిటి? ఇక కుటుంబాన్నో, పదికుటుంబాలనో భీకరంగా నరికిచంపిన వీరుడికి మరణశిక్ష వేయరాదన్న గొప్ప కారణంగా యావజ్జీవ శిక్ష వేసి చివరికి నాలుగైదు యేళ్ళకి వాడిని పూలదండలువేసి వదిలిపెట్టితే అతడు సమాజానికి మరెంత హాని చేస్తాడో తట్టదా యెవరికీ? అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన పాపఅనికి స్వస్తిశ్రీ కోర్టువారు, స్వస్తిశ్రీ దొరతనంవారు కలిసి క్రూరమరణశిక్ష విధిస్తున్నట్లు తేలటంలేదా? మానవహక్కుల గురించి గోల పెట్టేవారికి మాత్రం యీ ప్రమాదకర వ్యక్తుల హక్కుల పవిత్రత యితర సామాన్యజనానికి కూడా మానవహక్కులున్నాయన్న విషయం పూర్తిగా విస్మరించేంత గొప్పవి!

  ఇదంతా మన న్యాయవ్యవస్థ వైఫల్యం మాత్రమేకాదు. మన రాజకీయ వ్యవస్థ వైఫల్యం కూడా కదా? అందుకే నిస్సిగ్గుగా హంతకులను పరామర్శించటానికి రాజకీయనాయకులు జైళ్ళని పావనం చేస్తుంటారు! దొరతనం తమవారి చేతులో ఉంటే హాయిగా విడిపించుతూ ఉంటారు లొసుగుల ఆధారంగా!

  ప్రజలమానప్రాణాలకు రక్ష ఉండాలంటే మరణశిక్షలు తప్పకుండా ఉండాలి. అమలు చేయాలి కూడా.

  మరణశిక్షను రద్దుచేసిన అనేక దేశాల్లో వ్వవస్థ బలంగా ఉందా లేదా? ఈ శిక్ష పడ్డవాళ్ళు కూడా సులభాతి సలభంగా నాగరిక ప్రపంచంలోకి రొమ్ములు విరుచుకుంటూ వచ్చేయగలుగుతున్నారా?

  శిక్షల ఉద్దేశ్యం సంస్కరించటం ఒక్కటే కాదు. సమాజాన్ని ప్రమాదకరమైన నేరాలు నేరస్థలునుండి రక్షించటం కూడా? కాదంటారా?

 4. నేరాలు, శిక్షలు గురించి మాట్లాడుకుంటున్నాం గనక న్యాయ వ్యవస్ధ వైఫల్యం అన్నాను గానీ, నిజానికి మీరన్నట్లు, ప్రస్తుతం ఉన్న రాజకీయ, సామాజికార్ధిక వ్యవస్ధ నేరస్ధుల పుట్టుకను గ్యారంటీ చేస్తోంది.
  వ్యవస్ధ నేరాలకు ప్రాణం పోస్తున్నపుడు కేవలం వ్యక్తులని నేరాలకు ఏకైక భాధ్యులుగా చేయలేం. అందుకే సంస్కరణల గురించి మాట్లాడుకోవడం.
  మీరన్నట్లు వ్యవస్ధ బలంగా ఉంటే నేరాలకు అవకాశం తగ్గుతుంది. అంటే వ్యవస్ధలోని ప్రతి ఒక్కరి జీవనానికి, అది కూడా గౌరవపూరితమైన జీవనానికి అవకాశం ఉన్నపుడు నేరాలు తగ్గుతాయి.
  వ్యవస్ధ లోని వివిధ అంగాలు, విద్య దగ్గర్నుండి సంస్కృతి వరకూ, ఆరోగ్యకరంగా ఉన్నపుడు నేరాల అవకాశం తగ్గుతుంది.
  ఇవన్నీ అమలు చేయవలసింది, రాజకీయ వ్యవస్ధ.
  కాని రాజకీయ వ్యవస్ధ నేరస్ధులతో నిండిపోవడంతో వారు నేరాలు జరగకుండా విద్యా, సాంస్కృతిక రంగాలను తీర్చిదిద్దడం జరగని పని.
  నిజాయితిగా చెప్పుకుంటే, వ్యవస్ధ మార్చుకోవడం ఒకటే మనకు కనిపిస్తున్న పరిష్కారం. అది మళ్ళీ ప్రజల చేతుల్లోనే ఉంది.

 5. శ్యామలరావుగారు, ఏం జరిగిందో తెలియదు గానీ, సౌమ్య కేసు పై రాసిన పోస్టు స్ధానంలో విజయ్ మాల్యా పోస్టు వచ్చి చేరింది. అంటే పాత పోస్టు స్ధానంలో కొత్త పోస్టు అప్ డేట్ అయ్యింది. కాని మీ, నా వ్యాఖ్య లు అలానే ఉండిపోయాయి.

  సౌమ్య పోస్టుని వెతికి పట్టుకుని మళ్ళీ కొత్త పోస్టుగా వేశాను. ఈ వ్యాఖ్యలను కూడా అక్కడికి మార్చడానికి కుదురుతుందో లేదో ప్రయత్నిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s