యూరప్ దేశాల్లో రేడియేషన్ ఆనవాళ్లు, ఫుకుషిమా కారణం కాదన్న ఐ.ఎ.ఇ.ఎ


యూరప్ లో అనేక చోట్ల వాతావరణంలో రేడియో ధార్మికత కనుగొన్నట్లుగా ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐ.ఎ.ఇ.ఎ) సంస్ధ శుక్రవారం వెల్లడించింది. 11.11.11 తేదీన ప్రపంచ ప్రజలందరికీ శుభం జరుగుతుందని కాలజ్ఞానులు చెబుతున్న నేపధ్యంలో ఈ వార్త వెలువడడం గమనార్హం. రేడియో యాక్టివ్ అయోడిన్ – 131 మూలకానికి సంబంధించిన రేడియేషన్ తక్కువ స్ధాయిలో చెక్ రిపబ్లిక్ వాతావరణంలో కనిపించిందని ఐ.ఎ.ఇ.ఎ తెలిపింది. చెక్ రిపబ్లిక్కే కాక యూరప్ లోనే అనేక దేశాల్లో ఈ రేడియేషన్ కనిపించిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే రేడియేషన్ కనిపించిన ఇతర దేశాలు ఏవో చెప్పడానికి అది నిరాకరించింది. అణు కర్మాగారాలు, అణు కర్మాగారాల రేడియేషన్ విడుదలకు సంబంధించి ఐ.ఎ.ఇ.ఎ తో సహా, ప్రభుత్వాలు దాపరికం పాటిస్తున్నాయనడానికి ఇదొక మచ్చు తునక.

తక్కువ స్ధాయిలో ఉన్న రేడియేషన్ విడుదల వల్ల మనుషులు ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ లేదని ఐ.ఎ.ఇ.ఎ భరోసా ఇచ్చింది. రేడియేషన్ ఎక్కడినుండి వచ్చిందీ పరిశోధిస్తున్నామనీ, అది ఫుకుషిమా అణు ప్రమాదం నుండి వ్యాపించిన రేడియేషన్ మాత్రం కాదని ముందే భుజాలు తడుముకొంది. వాతావరణ కాలుష్యంపై చైతన్యం పెరిగిన నేపధ్యంలో అణు విద్యుత్ కేంద్రాలకు డిమాండ్ పెంచుకుందామని ఆశిస్తున్న అణు రియాక్టర్ల తయారీదారులకు ఫుకుషిమా ప్రమాదం పెద్ద ఆటంకంగా మారింది. అప్పటివరకూ అణు విద్యుత్ కేంద్రాలపై మిన్నకున్న ప్రజానీకం ఫుకుషిమా ప్రమాదం అనంతరం అణు విద్యుత్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోలనలు నిర్వహిస్తున్నారు. దానితో ఫుకుషిమా ప్రమాదం వల్ల ఏర్పడిన ప్రభావాలను సాధ్యమైనంత తక్కువ చేసి చూపడానికి ఐ.ఎ.ఇ.ఎ తో పాటు ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కనుక యూరప్ దేశాలలో కనిపిస్తున్న రేడియేషన్ ఫుకుషిమా వల్ల వచ్చిన రేడియేషన్ కాదని చెప్పడాన్ని నమ్మడానికి వీల్లేదు. అదీ కాక దాదాపు యూరప్ అంతటా కనిపిస్తున్న రేడియేషన్ కు ఏదో చిన్న సంఘటన కారణంగా చెప్పడాన్ని కూడా నమ్మలేము.

అయోడిన్ – 131 అధిక డోసుల్లో విడుదలయిన పక్షంలో అది సోకిన మనుషులకు కాన్సర్ వ్యాధి సంభవిస్తుంది. పాలు, కూరగాయలు విషతుల్యంగా మారతాయి. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో విడుదల అయిన రేడియేషన్ అయోడిన్ కి చెందినది కావడం గమనార్హం. ఫుకుషిమా అణు విధ్యుత్ కేంద్రం వద్ద రేడియేషన్ లీకేజి ఇంకా అరికట్టలేదు. అయోడిన్-131 రేడియేషన్ లీకేజి అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫుకుషిమా కర్మాగారాన్ని పూర్తిగా శుభ్రపరచి ప్రమాద రహితంగా చేయడానికి ఇంకా ముప్ఫై సంవత్సరాలు పడుతుందని కొద్ది రోజుల క్రితం జపాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో యూరోప్ లో చాలా చోట్ల రేడియేషన్ కనిపించిందని ఐ.ఎ.ఇ.ఎ ప్రకటించడం నిస్సందేహంగా ఆందోళనకరమైన విషయం.

చెక్ రిపబ్లిక్ కి చెందిన అణు భద్రతా సంస్ధ తమ దేశం లోని వాతావరణంలో అయోడిన్ రేడియేషన్ కనుగొన్నట్లుగా ఐ.ఎ.ఇ.ఎ కి సమాచారం అందించడంతో కలకలం ప్రారంభమయ్యింది. “యూరప్ వ్యాపితంగా మరి కొన్ని చోట్ల అయోడిన్ రేడియేషన్ ని ఐ.ఎ.ఇ.ఎ కనిపెట్టింది” అని ఐ.ఎ.ఇ.ఎ ప్రకటన పేర్కొంది. ఇతర వివరాలేవీ అది చెప్పలేదు. “ఇప్పుడు నమోదవుతున్న రేడియేషన్ స్ధాయి ప్రజారోగ్యానికి ప్రమాదకరం కాదని ఐ.ఎ.ఇ.ఎ నమ్ముతోంది. అలాగే ఫుకుషిమా దాయిచి కర్మాగారం నుండి విడుదలైన రేడియేషన్ కూడా కాదని నమ్ముతోంది. ఆయా దేశాల అణు భద్రతా సంస్ధలతో కలిసి ఐ.ఎ.ఇ.ఎ, రేడియేషన్ కి కారణాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నది” అని ఐ.ఎ.ఇ.ఎ ప్రకటన తెలిపింది.

అయితే ఐ.ఎ.ఇ.ఎ దీనితో పాటు ఇంకా చాలా విషయాలని నమ్ముతోంది. అందులో ఇరాన్ దేశం అణ్వాయుధాలను తయారు చేస్తున్నదన్న అనుమానం కూడా ఉంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదన్న అనుమానంతో ఇప్పటికి అమెరికా, యూరప్ లు నాలుగు సార్లు ఆంక్షలు విధించాయి. ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే పరిస్ధితిలో లేదనీ, మరో ఐదు సంవత్సరాల వరకూ ఇరాన్ కి ఆ శక్తి రాదని సి.ఐ.ఎ తో పాటు ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ కూడా తేల్చి చెప్పాయి. ఇప్పుడు ఇరాన్ కి ఆ శక్తి లేదంటే గతంలో కూడా లేదన్నదే అర్ధం. కాని 2003లో ఇరాన్ అణ్వస్త్రాల డిజైన్లు పరిశీలించిందనడానికి సాక్ష్యలు దొరికాయని కొద్ది రోజులక్రితం ఐ.ఎ.ఇ.ఎ ప్రకటించింది. దాన్ని పట్టుకుని అమెరికా, యూరప్ లు ఇరాన్ పైన మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా, యూరప్ ల జేబు సంస్ధగా వ్యవహరించే ఐ.ఎ.ఇ.ఎ లో ఇరాన్ కూడా సభ్యురాలే అయినప్పటికీ, ఇరాన్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఐ.ఎ.ఇ.ఎ అనేక తీర్మానాలు చేసి, అనేక చర్యలు తీసుకుంది. అటువంటి దగుల్బాజీ సంస్ధ ఐ.ఎ.ఇ.ఎ ఇప్పుడు యూరప్ లో కనిపిస్తున్న రేడియేషన్ ఫుకుషిమా నుంచి వెలువడినది కాదని చెబితే నమ్మడం చాలా కష్టం.

అణు విద్యుత్ రియాక్టర్లు, అణు ఇంధనం, అణు పరికారాలు తయారు చేసే కంపెనీలు చెప్పింది ఐ.ఎ.ఇ.ఎ తు.చ తప్పకుండా పాటిస్తుంది. ఆ కంపెనీల వ్యాపారాల్ని పెంచడం కోసమే ఆ సంస్ధ పాటుపడుతుంది. దానికి ప్రజారోగ్యంతో అసలు అవసరమే లేదు. ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత ఉన్న సంస్ధే అయితే అది అమెరికా, యూరప్ లు చెప్పినట్లల్లా ఆడుతూ ఇరాన్ పైన కత్తి గట్టినట్లు వ్యవహరించదు. నాలుగు సార్లు ఇరాన్ ప్రజల జీవనానికి హాని కలిగేలా ఆంక్షలు విధించడానికి సహకరించదు. కనుక ఐ.ఎ.ఇ.ఎ నమ్మకాలు, ప్రజలకు ఉపయోగపడేవి కావు. ఈ నేపధ్యంలో ఐ.ఎ.ఇ.ఎ ఏదైతే కాదన్నదో అదే నిజమవడానికి అస్కారం ఉంది. అంటే యూరప్ దేశాల్లో కనపడుతున్న రేడియేషన్ ఫుకుషిమా దాయిచీ కర్మాగారం నుండి లీకవుతున్న రేడియేషన్ కావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి.

ఫుకుషిమా ప్రమాదం జరిగిన కొన్ని వారాల తర్వాత యూరప్ లోనూ, ఐస్ లాండ్ లోను, అమెరికాలోనూ కూడా రేడియేషన్ ప్రవహించింది. అదంతా ఫుకుషిమా నుండి వెలువడిన రేడియేషనే నని చాలా రోజుల తర్వాత గాని అంగీకరించలేదు. అప్పట్లో కూడా అయోడిన్ – 131 రేడియేషనే యూరప్, అమెరికా ఖండాలకు వ్యాపించింది. రేడియేషన్ విడుదల చెక్ దేశం లోపలిది కాదని బైటినుండే వస్తున్నదని చెక్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రొమేనియా, స్పెయిన్, యుక్రెయిన్ లు కూడ రేడియేషన్ తమది కాదని చెప్పాయి. రేడియేషన్ కనిపిస్తున్న ఇతర దేశాలేవిటో ఆ దేశాల పేర్లను ఐ.ఎ.ఇ.ఎ రహస్యంగా ఎందుకు ఉంచుతున్నదో కూడా ఐ.ఎ.ఇ.ఎ చెప్పవలసి ఉంది.

తమిళనాడు కుదంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన సకారణమేనని మరొకసారి రుజువయ్యింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s