ఆపరేషన్ ‘ఇటలీ’ -కార్టూన్


యూరప్ రుణ సంక్షోభం కేంద్ర స్ధానం ఇప్పుడు గ్రీసు నుండి ఇటలీకి మారింది. ఇటలీ సావరిన్ రుణ బాండ్లపైన వడ్డీ రేట్లు బాగా పెరగడంతో ఆ దేశానికి రుణ సేకరణ కష్టంగా మారింది. అంటే ఇటలీకి అప్పు పుట్టడం కష్టంగా మారింది. ఈ పరిస్ధితి కొనసాగితే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు బెయిలౌట్ రుణ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇటలీ, యూరప్ లొ మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కావడంతో దానికి బెయిలౌట్ ఇచ్చే పరిస్ధితి యూరప్ కు లేదు. అందుకే ఇటలీ రుణ సంక్షోభం మరింత ముదరక ముందే చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఇటలీప్ ప్రధాని బెర్లుస్కోని రాజీనామా చేయడం, అతని స్ధానంలో ప్రతిపక్షలకు కూడా ఆమోదయోగ్యుడైన వ్యక్తి ప్రధానిగా ఎన్నుకోవడానికి రంగం సిద్ధమయ్యింది. దానికి షరతుగా బెర్లుస్కోని విధించిన పొదుపు చర్యలతో కూడిన సంస్కరణల బిల్లుకి పార్లమెంటు ఆమోదం లభించింది. ఇక ఇటలీ ప్రజలు కూడా గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ బాధితుల సరసన చేరనున్నారు. వారి జీత భత్యాలలో తీవ్రమైన కోతలు ఎదురుకానున్నాయి. రోగానికి మందు వేయడానికి బదులు అవయవాన్నే కోసివేయడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ వైద్యులు నిర్ణయించారు.

Operation 'Italy'

4 thoughts on “ఆపరేషన్ ‘ఇటలీ’ -కార్టూన్

 1. రోగానికి మందు వెయ్యడం అంటే మీ ఉద్దేశ్యం లో ఇంకేదైనా మంచి మార్గం ఉందా. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఏమి చేస్తే బావుంటుంది అని మీ ఉద్దేశ్యం.?

 2. యూరో కరెన్సీ అన్నది పూర్తిగా జర్మనీ, ఫ్రాన్సు లకు మాత్రమే ఉపయోగం అది కూడా ఆ దేశాల్లోని ధనిక వర్గాలకే ఉపయోగం. యూరో జోన్ నుండి మిగతా దేశాలు బైటికి వస్తే అవి తమ సొంత ద్రవ్య విధానాన్ని రూపొందించుకోగలుగుతాయి. తమ కరెన్సీ పైన తమకే అధికారం, పట్టూ ఉంటాయి. తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ అవసరాల ప్రకారం కరెన్సీ విలువను నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. సొంత కరెన్సీలో దేశీయంగా ఎంతైనా అప్పు తెచ్చుకోగల సౌకర్యం ఉంటుంది. యూరోను ఉమ్మడి కరెన్సీగా నిరాకరించడం సంక్షుభిత దేశాలు చేయవలసిన మొదటి చర్య.

  రెండోది, కంపెనీలకు బెయిలౌట్లు ఇవ్వడం ఆపి ప్రజలకు అంటే వినియోగదారులకి బెయిలౌట్ ఇవ్వాలి. అంటే ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించే కార్యక్రం చేపట్టాలి. దానికి ప్రభుత్వమే ప్రభుత్వరంగాన్ని విస్తరించి ఉద్యోగాలు సృష్టించినట్లయితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. చేతిలో నాలుగు డబ్బులుంటెనే వినియోగదారులు సరుకులు కొంటారు. అంటే అమ్మకాలు పెరుగుతాయి. అది ఉత్పత్తిని పెంచుతుంది. కొనుగోళ్ళు పెరిగి ఉత్పత్తి పెరగడం అంటే కంపెనీలకు అమ్మకాలు పెరిగి లాభాలు పెరగడమే. తద్వారా కంపెనీల దగ్గర పెట్టుబడి సమకూరుతుంది. లాభాల ద్వారా పెట్టుబడిదారుల వద్ద పెట్టుబడి సమకూరే ప్రక్రియలో ఉద్యోగాలు సృష్టించబడతాయి. కొనుగోలు శక్తి పెరగడం ఉంటుంది. కాని ప్రభుత్వాలు కంపెనీలకి బెయిలౌట్ల పేరుతో నేరుగా పెట్టుబడిని సమకూర్చిపెడుతున్నాయి. అంటే అవి ఉత్పత్తి కార్యక్రమంలోకి వెళ్లకుండానే ప్రభుత్వం నుండి పెట్టుబడిని పొందుతున్నాయి. ఆ పెట్టుబడిని కూడా కంపెనీలు ఉత్పత్తి కార్యక్రమంలోకి పెట్టకుండా ద్రవ్య మార్కెట్ లో పెడుతున్నారు. షేర్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఇలా అన్నమాట. దానితో సొమ్మంతా ధనికుల చుట్టూనె తిరుగుతోంది తప్ప అది ఇతర వర్గాల ప్రజల వద్దకు రావడం లేదు. అందువలన డబ్బు అంతకంతకూ ధనికుల చుట్టూనే తిరుగుతూ వాళ్ళ వద్దే కేంద్రీకృతం అవుతోంది.

  మొదటి చర్య వల్ల ప్రభుత్వాలకి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. తమ ఫిస్కల్ విధానాలని తామే రూపొందించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇక రెండో దాని వల్ల ఆర్ధిక వ్యవస్ధలో చురుకుదనం వస్తుంది. అన్ని వర్గాల పార్టిసిపేషన్ పెరిగి నలుగురూ డబ్బు కళ్ళ జూస్తారు. ఆర్ధిక వ్యవస్ధ అనే యంత్రం పని చేసి అందరికీ ఉపయోగం చేకూరుతుంది.

  మొదటిది జరగవచ్చేమో కాని రెండవది జరిగే అవకాశం లేదు. ఉన్నా చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఆర్ధిక వ్యవస్ధలన్నీ ధనిక వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళే ప్రభుత్వాలని నడిపిస్తున్నారు. ఫైనాన్స్ పెట్టుబడి ప్రభుత్వాలనీ, అర్ధికవ్యవస్ధలనీ ఇలాగే నడిపిస్తుంది. ఫైనాన్స్ పెట్టుబడే ఇప్పుడు అన్నింటిని శాసిస్తోంది. యూరప్ లో అన్ని దేశాల్లోనూ కొద్దిమంది ధనికులు, కంపెనీలు, ద్రవ్య సంస్ధలు పెత్తనం చేస్తున్నారు. రాజకీయాధికారాలు కూడా వారి వద్దే ఉన్నాయి. కనుక నేను చెప్పిన రెండో పరిష్కారం అమలు కావడం కష్టం. ప్రజలే తెగించి తమకు కావలసింది సాధించుకునే వరకూ ఈ పరిస్ధితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

  నేను రాసిన సమాధానాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంటూ ఆ అవగాహన నుండి మరిన్ని ప్రశ్నలు వేసినట్లయితే మళ్లీ సమాధానం చెప్పగలను. అలా కాకుండా సమాధానంలో ఒక ముక్కను తీసుకుని దాని అర్ధాన్నే తీసుకుంటూ ఆ అర్ధంపైనె ఆధారపడి మరొక ప్రశ్న అడిగితే విషయం పక్కకు వెళ్తుంది. ఇది షరతు కాదని గమనించగలరు. చర్చ అర్ధవంతంగా జరగడానికి ఒక సూచన.

 3. @యూరో జోన్ నుండి మిగతా దేశాలు బైటికి వస్తే

  యూరో జోన్ నుండి ఆ దేశాలు ఇంకా బయటికి రాకపోవడానికి వారి కున్న అభ్యంతరాలు ఏమిటో చెప్పగలరా.అంటే వారికి యూరప్ దేశాలు ను ఎదిరించి మన గలిగే శక్తి లేకనా ?

  @ఆ పెట్టుబడిని కూడా కంపెనీలు ఉత్పత్తి కార్యక్రమంలోకి పెట్టకుండా ద్రవ్య మార్కెట్ లో పెడుతున్నారు. షేర్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు
  యూరో జోన్ విచ్చిన్నం అయి ఈ మార్కెట్ లు కుప్ప కూలి పోవడం వల్ల మళ్లీ వాళ్ళకిచ్చే బెయిల్ అవుట్లు భారం పన్నులపై పడుతుంది. కాబట్టి ఏ విధం గా చుసిన సామాన్యుడి పరస్థితి లో మాత్రం మార్పు లేదు .కదా

 4. యూరోజోన్ లోని ఇతర దేశాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ధనికులు, కంపెనీలు, బ్యాంకులు లాంటి బడా ద్రవ్య సంస్ధలు… మొదలైన వాటికి సేవ చేసేవే. అవి ప్రజల పక్షం ఆలోచించేవైతే నేను చూపిన రెండో పరిష్కారం వైపుకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాని దాదాపు ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలన్నీ తమ, తమ దేశాల్లోని ధనికులతో పాటు ప్రపంచ స్ధాయిలో బడా కంపెనీలు, సంస్ధలకు సేవ చేసేవే.

  ధనిక దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు లేదా పరిపక్వ (మెచ్యూర్డ్) పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు ఒక రింగ్ లాగా ఏర్పడి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో పరిణామాలని శాసిస్తున్నాయి. ప్రభుత్వాలు రింగులాగా ఏర్పడడం అంటే ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు కాదు. ఆ ప్రభుత్వాలను నడుపుతున్న లేదా స్పాన్సర్ చేస్తున్న బడా కంపెనీలు (ఎం.ఎన్.సిలు, టి.ఎన్.సి లు…) గా గుర్తించాలి. కుర్చీల్లో ఎవరు కూర్చున్నా వారు అనుసరించవలసింది ఈ బడా కంపెనీల ఆజ్ఞలనే. అప్పుడప్పుడూ కుర్చీల్లో మనుషుల్ని మార్చి ఏదో మార్పు వస్తున్న అభిప్రాయాన్ని కలిస్తాయి. కాని అవే ఆర్ధిక విధానాలని అన్ని పార్టీలూ కొనసాగించడం మనం చూడవచ్చు. అది అమెరికా కావచ్చు, ఫ్రాన్సు జర్మనీలు కావచ్చు, ఇండియా కూడా కావచ్చు.

  ఉదాహరణకి గ్రీసు తీసుకుందాం. గ్రీసుకి మార్కెట్లో అప్పు దొరకలేదు. అంటే గ్రీసు ప్రభుత్వ బాండ్లను మార్కేట్లో అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నందున ప్రభుత్వం ఇవ్వలేక బాండ్లు అమ్మలేదు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి బెయిలౌట్ ప్యాకేజీ అందించాయి. అంటే మార్కెట్లో డిమాండ్ చేస్తున్న వడ్డీ కంటే తక్కువ వడ్డీకీ అప్పు ఇచ్చాయి. కాని ఆ అప్పు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ గ్రీసుకి లేదు. గ్రీసు ప్రభుత్వానికి జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చి ఉన్నాయి. గ్రీసు దివాలా తీస్తే అవి కూడా దెబ్బతింటాయి. కనుక ఉదారంగా గ్రీసుకి అప్పులిచ్చి ఆ సొమ్ముని తమ బ్యాంకులకే చెల్లించేలా షరతు పెట్టాయి. ఈ షరతు బైటికి రాదు. అసలు ఇది చర్చాంశం కూడా కాదు. అది జరిగిపోతుందంతే. అంటే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చే బెయిలౌట్ తమకు కానీ రాకపోయినా గ్రీసు ప్రభుత్వం ఒప్పుకుంది. బెయిలౌట్ తో పాటు ఇంకా కొన్ని షరతుల్ని అవి విధించాయి. పబ్లిక్ కంపెనీల్ని ప్రవేట్ కంపెనీలకి చౌకగా అమ్మెయ్యడం, కంట్రోల్స్ ఎత్తెయ్యడం, కంపెనీలపైన పన్నులు తగ్గించడం, అవి కాక ప్రజల జీతాల కోత, ఉద్యోగాల రద్దు, సదుపాయాల రద్దు ఇవన్నీ మామూలె. వీటన్నింటినీ గ్రీసు ప్రభుత్వం అంగీకరించి ప్రజలు ఆందోళనలు చేస్తే పోలీసుల్ని దింపి అణిచివేసింది. ఇప్పటికీ ఆ పరిస్ధితి, అందోళనలు, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని షరతులు విధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే గ్రీసు ప్రభుత్వం కూడా ఈ కంపెనీలకి వత్తాసు పలికే ప్రభుత్వమే. చర్చలన్నీ కూడా ఎలా అమలు చేయాలన్నదే తప్ప అమలు చేయాలా వద్దా అన్నది కాదు. గ్రీసు ప్రధానిని మార్చి కొత్త షరతుల్ని ఆమోదింపజేసుకున్నారు. ఇటలీ ప్రధానిని మార్చి కొత్త సంస్కరణలని ఆమోదింపజేసుకున్నారు. ఎవరు? బహుళజాతి కంపెనీలు.

  ప్రభుత్వాలన్నీ కంపెనీల పక్షమే అయినప్పుడు ఇతర యూరోజోన్ దేశాలు బైటికి వచ్చే పరిస్ధితి తలెత్తదు. గ్రీసు నుండి జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ తదితర దేశాల బ్యాంకులు పిండుకోవలసినంత పిండుకున్నాయి. ఇక వచ్చేది లేదు. అందుకని గ్రీసు యూరోజోన్ నుండి వెళ్ళిపోయినా సాగనంపడానికి యూరోజోన్ లో పెద్ద దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ మధ్య గ్రీసు వెళ్ళిపోవచ్చు అని జర్మనీ ఫ్రాన్సు నాయకులు పరోక్షంగా సూచిస్తున్నారు.

  బహుళజాతి కంపెనీలు మార్కెట్ కోసం తమలో తాము కాట్లాడుకుంటాయి గానీ ప్రజల వద్దకు వచ్చేసరికి ఒక్కటవుతాయి. తమకు కావలసిన విధానాలను అమలు చేయించుకోవడానికి ఒక్కటవుతాయి. ఈ లెక్కన అమెరికా ప్రభుత్వానికి కూడా స్వాతంత్రం లేదు. అవి అమెరికా లో పెద్ద కంపెనీలు చెప్పినట్టు చేయవలసిందే. లేకుంటే డొనేషన్లు రావు. ప్రచారానికి డబ్బులుండవు. అనేక కుట్రలు అమలవుతాయి. చంపుతారు కూడా. ఇతర దేశాల ప్రభుత్వాధినేతలను చంపి ప్రభుత్వాలనే కూల్చుతున్నపుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవారు తమకు వ్యతిరేకంగా పని చేస్తాడని తెలిస్తే, అతడు గెలుస్తాడని అనుమానం వస్తే సింపుల్ గా అడ్డు తొలగించుకుంటాయి. అది పెద్ద సమస్య కాదు.

  యూరో జోన్ నుండి బైటికి వచ్చాక ప్రజలకు బెయిలౌట్లు ఇవ్వాలని చెప్పాను. ప్రజలకి ఇచ్చే బెయిలౌట్లు ప్రజలకి భారం కాదు. అది మళ్ళీ సరుకుల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికీ, కంపెనీలకీ వచ్చి చేరుతుంది. బెయిలౌట్లు ప్రజలకి ఇవ్వడం అంటే కేష్ తెచ్చి ఇవ్వడం కాదు. ప్రజల దగ్గర మిగులు ఉండేలా విధానాల్ని అమలుచేయడం. ఉదా: అప్పులు రద్దు చేసి కొత్త అప్పులు ఇవ్వవచ్చు. కొత్త ఉద్యోగాలు ఇవ్వొచ్చు. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ దానికి తగిన సహాయం చెయ్యవచ్చు. మొత్తం మీద ప్రజల ఆదాయాలు పెరిగే విధానాలు అమలు చేస్తే అదే పెద్ద బెయిలౌట్. ప్రజలకి అంతకంటే కావలసింది ఏమీ లేదు.

  యూరోజోన్ విచ్ఛిన్నం అనేది కంపెనీలకి లాసే గాని ప్రజలకూ, ప్రభుత్వాలకీ కాదు. యూరోజోన్ నుండి బైటికి వచ్చాక కంపెనీలకు కూడా అప్పులివ్వవచ్చు. అప్పుల ద్వార పెట్టుబడి ఇచ్చి ఉత్పత్తి కార్యక్రమంలోకి దింపితే అవి ఉద్యోగాలు కూడా ఇస్తాయి. నియంత్రణ ప్రభుత్వం చేతిలోకి వచ్చాక ప్రభుత్వం చాలా చెయ్యగలుతుంది. కాని అది దేశ భవిష్యత్తు ఆలోచించాలి. కంపెనీల పక్షమే కాకుండా ప్రజల పక్షం కూడా ఆలోచించాలి. అప్పుడే ఆర్ధిక వ్యవస్ధ గాడిన పడుతుంది.

  అమెరికా ఇన్నాళ్లూ అగ్ర రాజ్యంగా మనగలగడానికి కారణం అక్కడ ఉన్న మధ్య తరగతి వలన. 1970ల వరకూ అమెరికా ప్రభుత్వం ఉద్యోగులకు, కార్మికులకి సదుపాయాలు కల్పించింది. ప్రభుత్వరంగ ఉద్యోగాలు కావచ్చు, మెడి కేర్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇంకా అలాంటివి. వీటి ద్వారా విస్తారమైన మధ్య తరగతి ఏర్పడింది. వారిలో అమెరికా ప్రభుత్వం వినియోగదారీ సంస్కృతి పెంచడంతో వారు పొదుపు మర్చిపోయి సరుకులు కొన్నారు. 1970 ల చివరినుండీ వారి వేతనాలు పెరగడం ఆగిపోయింది. కాని అప్పటివరకూ వారు పొందిన సదుపాయాలు మరో రెండు దశాబ్దాల వరకూ పని చేసింది. ఆ తర్వాత కూడా వేతనాలు పెరగడం బదులు నిజ వేతనాలు తగ్గడం వల్ల వారి కొనుగోలు శక్తి పడిపోతూ వచ్చింది. పైగా సదుపాయాలు కూడా ఒక్కొక్కటీ రద్దు చేస్తూ వచ్చారు. కొనుగోలు శక్తి మరింత పడిపోయింది. దాని ఫలితమే ప్రస్తుత సంక్షోభం.

  పత్రికలు చెబుతున్నట్లు అసలు సంక్షోభం అప్పుల్లో లేదు. బడ్జేట్ లోటుల్లో లేదు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం లోనే ఉంది. అది పెరిగితే అప్పులు, లోటు లెక్కలోకి రావు. ప్రజలను బాదడానికి అప్పులు, లోట్లు బూచిగా చూపి బాదుతున్నారు.

  నేను చూపిన పరిష్కారం తాత్కాలికమైనది మాత్రమే. తక్షణం…, అంటే రెండు మూడేళ్లలో సంక్షోభం నుండి బైటికి రావచ్చు. శాశ్వత పరిష్కారం కావాలంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న అంతర్గత వైరుధ్యలు పరిష్కారం కావాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న వైరుధ్యాలు నిర్ణయాత్మకంగా పరిష్కారం కావడం అంటే సోషలిస్టు విప్లవం సంభవించడం అనర్ధం.

  మీరడిగే ప్రశ్నలు ఇలా కొద్ది వివరణతో సమాధానపెట్టగలవి కావు. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ మూలాలు, దాని ఫలితాలు గురించే మీరు ప్రశ్నలు వేస్తున్నారు. వీలయినంత తక్కువగా సమాధానం ఇచ్చాను. ఇంకా అనుమానాలు రాగల ఆస్కారం పూర్తిగా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s