ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు -రష్యా


ఇరాన్ లో అణు ఇంధన శుద్ధి కర్మాగారాన్ని సందర్శించిన అహ్మది నెజాద్

ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపు ఇవ్వడాన్ని రష్యా తిరస్కరించింది. ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. బుధవారం బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్, ఇరాన్ పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాడు. 2003లో అణ్వాయుధాలు నిర్మించడానికి ఇరాన్ ప్రయత్నించినట్లుగా ఐ.ఎ.ఇ.ఎ ఇటీవల తన నివేదికలో పేర్కొనడాన్ని చూపిస్తూ విలియం హేగ్, ఈ డిమాండ్ చేశాడు. రష్యా తిరస్కరణతో ఇరాన్ పై ఆంక్షలు విధించే వ్యవహారం ముగిసినట్లేనని ‘ది గార్డియన్’ పత్రిక వ్యాఖ్యానించింది. రష్యాతో పాటు చైనా కూడా ఇరాన్ పై ఆంక్షలను గట్టిగా వ్యతిరేకిస్తున్నది

బుధవారం ఇరాన్ కి చెందిన సీనియర్ అధికారి ఆలి బకేరి రష్యా సందర్శించిన సందర్భంగా రష్యా డిప్యుటీ విదేశీ మంత్రి గెన్నడీ గాటిలోవ్ ఈ ప్రకటన చేశాడు. “ఇరాన్ పైన అదనపు ఆంక్షలు  విధిస్తూ తీసుకునే ఏ నిర్ణయమైనా ఇరాన్ లో ప్రభుత్వ మార్పునకు జరిగే ప్రయత్నంగా అంతర్జాతీయ సమాజం చూస్తుంది” అని గెన్నడీ పేర్కొన్నాడు. “అటువంటి చర్యలు మాకు ఆమోదయోగ్యం కావు. రష్యా అటువంటి ప్రతిపాధనలను పరిగణించడానికి పూనుకోదు” అని తెలిపాడు.

బుధవారం, ఇరాన్ విషయమై భద్రతా సమితి సమావేశం జరపాలని ఫ్రాన్సు డిమాండ్ చేసింది. గతంలో అణ్వాయుధ ప్రయత్నాలపై విచారణ చేయడానికి ఇరాన్ సహకరించనట్లయితే, ఆ దేశం పైన ఆంక్షలను మున్నెన్నడూ లేనంత తీవ్ర స్ధాయిలో అమలు చేయాలని ఫ్రాన్సు విదేశీ మంత్రి అలెన్ జుప్పె కోరాడు. మంగళవారం ఇచ్చిన నివేదికలో ఐ.ఎ.ఇ.ఎ (ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజన్సీ), ఇరాన్ 2003లో అణ్వాయుధ డిజైన్లపైన ప్రయోగాలు జరిపిందనడానికి నమ్మకమైన సాక్ష్యాలు దొరికాయని పేర్కొన్నది. ఆ తర్వాత ఆ పనిని తక్కువ స్ధాయిలో కొనసాగించి ఉండవచ్చని నివేదిక పేర్కొన్నది. దానితో కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా బ్రిటన్, ఫ్రాన్సు దేశాల విదేశాంగ మంత్రులు ఇల్లెక్కి అరవడం ప్రారంభించారు.

నివేదికకు బుధవారమే ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ స్పంచించాడు. ఐ.ఎ.ఇ.ఎ కి ఉన్న విశ్వసనీయతపైన ఆయన దాడి చేశాడు. “మతిలేని అమెరికా వాదనలకు ఐ.ఎ.ఇ.ఎ విశ్వసనీయను ఎందుకు బలిపెడుతున్నారు?” అని మధ్య ఇరాన్ లోని ఓ నగరంలో ప్రజలనుద్దేశించి ప్రసంగీస్తూ ఆయన ప్రశ్నించాడు. ఇరాన్ శాంతి ప్రయోజనాలకోసమే అణు విధానం రూపొంచించుకున్నదనీ, అణ్వాయుధాల తయారీ తమ లక్ష్యం కాదని ఇరాన్ అనేకసార్లు తిరస్కరించింది. “తన దారిలో తాను వెళ్తున్న ఇరాన్ ఒక్క అంగుళం కూడా వెనక్కి మళ్ళేది లేదు” అని అహ్మది నెజాద్ చెప్పాడు.

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదనీ, దాని అణ్వాయుధాల వలన ప్రపంచ శాంతికి భంగం కలగనున్నదని అమెరికా, యూరప్ లు అదే పనిగా అనేక సంవత్సరాలనుండి కాకి గోల చేస్తున్నాయి. ఎన్నిసార్లు గోల చేసినప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదనడానికి ఇంతవరకూ వీసమెత్తు సాక్ష్యం కూడా అమెరికా, యూరప్ లు చూపలేకపోయాయి. అయినప్పటికి అవి సిగ్గు లేకుండా ఇరాన్ పైన ఆరోపణలు గుపిస్తుంటాయి. అమెరికా, యూరప్ లలో ఆర్ధిక సంక్షోభాల వలన ప్రజలపై అమానుషమైన పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో ప్రభుత్వాలపైన ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్.జి.ఓ సంస్ధలు తలపెట్టిన ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమానికి పెద్ద ఎత్తున వస్తున్న స్పందనతో తమ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదీ అమెరికా, యూరప్ దేశాల పాలకులు తెలిసి వచ్చింది. దానితో మళ్ళీ ఇరాన్ అణ్వాయుధాల అస్త్రాన్ని మళ్ళీ రంగం పైకి తెచ్చాయి పశ్చిమ దేశాలు.

కావడానికి ఐ.ఎ.ఇ.ఎ ఐక్యరాజ్యసమితి సంస్ధ ఐనప్పటికీ అది పూర్తిగా అమెరికా, యూరప్ ల జేబు సంస్ధ. దానికి అధిపతిగా పని చేసిన ఈజిప్టు అధికారి మహమ్మద్ ఎల్ బరాది, ఇరాక్ లో సామూహిక విధ్వంసక మారణాయుధాలున్నాయన్న అమెరికా వాదనకు వత్తాసు పలుకుతూ అనేక సంవత్సరాల పాటు ఇరాక్ లొ తనిఖీలు నిర్వహించాడు. తనిఖీల్లో అమెరికా ఆరోపణలకు సాక్ష్యాలను ఒక్కటి కూడా వారు చూపలేకపోయారు. అయినప్పటికీ లేని మారణాయుధాలను సాకుగా చూపుతూ ఇరాక్ పైన అమెరికా దాడి చేసి ఆ దేశ ప్రజలకు నరక ప్రాయమైన కష్టాలను తెచ్చిపెట్టింది. ఇరాక్ లో ప్రజాస్వామ్యం స్ధాపిస్ధానన్న అమెరికా కనీసం అది కూడా చేతకాక మిలిటెంట్ల చేతుల్లో చావు దెబ్బలు తిని ఖాళీ చేయడానికి సిద్ధపడుతోంది.

ఐ.ఎ.ఇ.ఎ అమెరికా, యూరప్ లకు వంతపాడడం, తమ యజమానుల తరపున ఇరాన్ ను వేధించడాన్ని కొనసాగిస్తూనే ఉంది. అరబ్ దేశాల్లో నియంతలపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని హైజాక్ చేస్తూ బూటకపు ఉద్యమాలను ప్రోత్సహించిన అమెరికా యూరప్ లు ఇరాన్ లో కూడా అటువంటి ప్రయత్నాలను అనేకం చేసినప్పటికీ ఇరాన్ ను ఏమీ చేయలేకపోయాయి. అణ్వాయుధాల పేరుతో ఇరాన్ పైన నాలుగుసార్లు ఆంక్షలు విధించాయి. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ చివరికి అమెరికా కంపెనీలు సైతం దొంగచాటుగా ఇరాన్ తో వ్యాపారాలు నిర్వహించడాన్ని కూడా అమెరికా అడ్డుకోలేకపోయింది. పశ్చిమ దేశాల ఆంక్షలను ‘వాడిపారేసిన రుమాలు’ గా అహ్మది నెజాద్ కొట్టి పారేసి, వాటి పరువును ఎండగట్టినా సిగ్గూ, ఎగ్గూ లేకుండా పాత చింతకాయ పచ్చడి ఆరోపణలనే తిరిగి తిరిగి వల్లె వేయడం కొనసాగిస్తున్నాయి.

మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ రౌడీయిజానికి ఎదురు లేకుండా చేయడమ్ అమెరికా, యూరప్ ల ప్రధమ కర్తవ్యం. ఆ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలు నెరవేరుస్తున్నందున ఇజ్రాయెల్ చేసే ప్రతి వెధవ పనికీ అమెరికా మద్దతు వస్తుంది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసినట్లయితే అవి ఇజ్రాయెల్ పైనే ఎక్కుపెట్టబడతాయని ఆ దేశం భయం. పైగా ఇరాన్ అణ్వస్త్రాలు మధ్య ప్రాచ్యంలో ఆయుధ సమతూకాన్ని దెబ్బతీస్తుంది. అంటే ప్రపంచ ఆధిపత్య రాజకీయాల్లో అమెరికాకి వ్యతిరేకమైన మొగ్గు మధ్య ప్రాచ్యంలో తలెత్తుతుంది. ఏ ప్రాంతంలోనైనా ఉంటే సమతూకంగా ఉండాలి లేదా తన వైపైనా మొగ్గు ఉండాలి అని అమెరికా కోరుకుంటుంది. దానితో ఇరాన్ అణ్వాయుధాలంటే  అమెరికాకి కిందినుండి మీది దాకా వణుకు పుడుతుంది. ఫలితంగానే ఇరాన్ అణ్వాయుధలు తయారు చేస్తున్నదనడానికి సాక్ష్యాలు లేకపోయినా భద్రతా సమితిని ఉపయోగించుకుని ఇరాన్ ను తన దారికి తెచ్చుకోవాలనీ, ఇరాన్ అణు కార్యక్రమాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనీ అమెరికా ప్రయత్నిస్తోంది.

ప్రపంచాధిపత్యానికి అమెరికా చేసే దారుణ కార్యాల్లో ఒక భాగమే ఇరాన్ పైన అది చేసే మతి లేని ఆరోపణలు

2 thoughts on “ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు -రష్యా

  1. అసలు సిసలు రౌడీ, యీ ప్రపంచంలో యేకైక రౌడీ రాజ్యం కూడా అమెరికా దేశమే!
    వారికి ‘సై’ అనని వాళ్ళంతా వారి దృష్టిలో రౌడీలే మరి.

వ్యాఖ్యానించండి