‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్’ సంస్ధ భారత దేశ బ్యాంకింగ్ వ్యవస్ధ రేటింగ్ తగ్గించింది. ‘స్ధిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) రేటింగ్ కు తగ్గించింది. భారత దేశ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, ఆస్తుల క్వాలిటీ విదేశాల్లో దెబ్బతినడం, బ్యాంకుల పెట్టుబడీకరణ, లాభదాయకత దెబ్బతినడం రేటింగ్ తగ్గించడానికి కారణాలుగా మూడీస్ పేర్కొంది.
ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకోవడం, ప్రభుత్వం అధికంగా అప్పులు తెచ్చుకోవడం వల్ల ప్రవేట్ క్రెడిట్ మార్కెట్ లో నిధుల లభ్యతను తగ్గించివేస్తుందనీ దానివల్ల ప్రవేట్ అప్పు మదుపు దారులకు, పెట్టుబడిదారులకు అందకుండా పోతోందని మూడీస్ విశ్లేషించింది. “ద్రవ్య విధానం బిగుతుగా ఉన్న నేపధ్యంలో, ఆస్తుల క్వాలిటీ రానున్న పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లో మరింత క్షీణిస్తుందని మేము అంచనా వేస్తున్నాము. దానివల్ల 2012, 2013 ఫిస్కల్ సంవత్సరాలలో ప్రొవిజనింగ్ అవసరాలు పెరుగుతాయి” అని మూడీస్ పేర్కొంది.
‘ప్రతికూలం’ రేటింగ్ ను మూడీస్, అనిర్ధిష్టత గానూ, అస్ధిర పరిస్ధితులతో కూడినది గానూ వర్ణిస్తుంది. రేటింగ్ తగ్గింపుతో బ్యాంకింగ్ సూచి కొద్దిగా క్షీణించింది. ద్రవ్య విధానం కఠినంగా ఉండడం, ఆర్ధిక వృద్ధి క్షీణించడం వల్ల బ్యాంకు అప్పుల్లో పెరుగుదలలో కోత విధిస్తుందని ఆ సంస్ధ పేర్కొంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీ రేట్లను సరళీకరించడం పట్ల మూడీస్ ఒక ఏడుపు ఏడ్చింది. దానివల్ల బ్యాంకుల లాభాలు తగ్గుతాయని బాధపడింది.
అక్టోబర్ నెలలో ఎస్.బి.ఐ రేటింగ్ ను మూడిస్ తగ్గించింది. ‘సి మైనస్’ నుండి ‘డి ప్లస్’ కు తగ్గించింది. దానితో ఎస్.బి.ఐ షేర్లు అక్టోబర్ లొ బాగా తగ్గాయి. బుధవారం బ్యాంకిగ్ డౌన్ గ్రేడ్ వల్ల కూడా ఎస్.బి.ఐ షేరు పడిపోయింది.
భారత ప్రభుత్వం మూడీస్ డౌన్ గ్రేడింగ్ ను కొట్టి పారేసింది. ప్రపంచంలో ఇతర బ్యాంకుల కంటె భారత బ్యాంకుల పరిస్ధితి బాగానే ఉందని తెలిపింది. “మనకేం బాధలేదు. దీనివల్ల మనపై ప్రభావం పడదు. ప్రపంచ స్ధాయిలో బ్యాంకుల పరిస్ధితి చూస్తే మన బ్యాంకులు శక్తివంతంగా ఉన్నాయని అర్ధం అవుతుంది” అని ద్రవ్య సేవల కార్యదర్శి డి.కె.మిట్టల్ పి.టి.ఐ తో అన్నాడు. “డొన్ గ్రేడ్ కి కారణం నాకేమీ కనబడ్డం లేదు. మన బ్యాంకుల వద్ద పూర్తి పెట్టుబడి ఉంది. ప్రభుత్వం బ్యాంకులకు పెట్టుబడి అందిస్తూనే ఉంటుంది” అని మిట్టల్ అన్నాడు.
“ఇతర ప్రపంచ బ్యాంకులతో పోల్చితే మన బ్యాంకుల ఎన్.పి.ఎ (నాన్ పెర్ఫార్మింగ్ అస్సెట్స్ – నిరర్ధక ఆస్తులు) లు కూడా బాగానే ఉన్నాయి. భారత ఆర్ధిక వ్యవస్ధ ఎనిమిది శాతంతో పెరుగుతోంది. కనుక మూడీస్ చెబుతున్న ఒత్తిడి ఇండియా బైటిదే కాని లోపలిది కాదు. మన క్రెడిట్ వృద్ధి కూడా బాగానే ఉంటుంది” అని మిట్టల్ భరోసా పలికాడు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన అప్పులలో గణనీయ భాగం ఎగవేతకు గురవుతాయన్నది బహిరంగ రహస్యం. ఎలా ఎగవేసిన అప్పులే నిరర్ధక ఆస్తులుగా బ్యాంకుల గుండెలపైన కుంపటిగా కూర్చుంటాయి.
ఎగవేసిన అప్పులు బ్యాంకులకు పెద్ద భారంగా ఏమీ లేవని కొద్ది రోజుల క్రితం ఆర్.బి.ఐ కూడా ప్రకటించింది. అంటే కార్పొరేట్ కంపెనీలు అప్పులు ఎగ్గొట్టినా ఫర్వాలేదని ఆర్.బి.ఐ ప్రకటించిందన్నమాట. స్వయం ఉపాధిదారులు, రైతులు, గ్రామీణులు తీసుకున్న అప్పులు వసూలు చేయడానికి బ్యాంకులు ఇంట్లో ఉన్నవన్ని పట్టుకుపోయి వేలం వేస్తారు కానీ కార్పొరేట్లు ఎగవేసిన అప్పులను మాత్రం ఎప్పటికప్పుడు రద్దు చేస్తూ వాటికి స్వాంతన కలిగిస్తాయి. అప్పులు రద్దు చేశాక కంపెనీలకు మళ్ళీ రుణ పరిపతిని కల్పించే పనికి బ్యాంకులు పూనుకుంటాయి. ప్రభుత్వ ఆదేశాలతోనే ఇది జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.