సంక్షోభ పరిష్కారంలో జి20 వైఫల్యం, మరో మాంద్యానికి చేరువలో ప్రపంచం?


యూరో జోన్ రుణ సంక్షోభం రీత్యా సంక్షుభిత దేశాలకు సహాయం చేయడానికి జి20 దేశాలు ఏ చర్యా ప్రకటించలేదు. దానితో యూరప్ సంక్షోభ పరిష్కారానికి ఎమర్జింగ్ దేశాలు గానీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు గానీ సహాయం చేయడానికి సిద్ధంగా లేవన్న సంగతి ధృవపడింది. ఫలితంగా మరోసారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యం (రిసెషన్) లోకి జారుకుంటుందన్న అంచనాలు జోరందుకున్నాయి.

గ్రీసులో రాజకీయ సంక్షోభం కొద్దిలో తప్పిపోయింది. వారం రోజుల క్రితం గ్రీసు కోసం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అంగీకరించిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్ పధకంపైన గ్రీసు ప్రజల్లో రిఫరెండం నిర్వహిస్తానని ప్రధాని పపాండ్రూ ప్రకటించడంతో గ్రీసులో రాజకీయ సంక్షోభానికి తెరలేచింది. రిఫరెండం కు అంగీకరించేది లేదని గ్రీసు ఆర్ధిక మంత్రి ఎవాంజిలోస్ వెనిజెలోస్ ప్రకటించడంతో సంక్షోభ చిక్కనయ్యింది. ఇద్దరు పాలక పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ రిఫరెండంను సమర్ధించబోమని చెప్పడంతో శుక్రవారం విశ్వాస పరీక్ష అనంతరం ప్రభుత్వం కూలిపోవచ్చన్న అనుమానాలు తలెత్తాయి.

అయితే శుక్రవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో పపాండ్రూ విజయం సాధించగలిగాడు. ఆ విజయం తేలికగా రాలేదు. తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తాననీ, త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాననీ, ఈలోగా అధికారం పంచుకోవడానికి అంగీకరిస్తున్నానీ పపాండ్రూ ప్రకటించాక మాత్రమే ఆయన విజయం సాధ్యమయ్యింది. 300 మంది సభ్యులు గల సభలో 153-145 ఓట్లతొ విశ్వాస తీర్మానం నెగ్గాడు. మరి కొద్ది రోజుల్లో గ్రీసు ప్రధాని రాజీనామా చేయడం, అనంతరం ఏర్పడే జాతీయ ప్రభుత్వానికి ఆర్ధిక మంత్రి ఎవాంజిలో వెనెజులో ప్రధానిగా నాయకత్వం వహించనున్నాడు. శనివారం పపాండ్రూ అధ్యక్షుడిని కలిసి ప్రతిపక్షాలతో అధికారం పంచుకునే చర్చలు జరుపుతాడు.

గ్రీసు తర్వాత ప్రస్తుతం ఇటలీ సంక్షోభం అంచున ఉంది. ఇటలీ సావరిన్ బాండ్లపైన వడ్డీలను పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుండడంతో రుణ సంక్షోభం తీవ్రమయ్యి, దానికి కూడా ఐ.ఎం.ఎఫ్ ల సహాయం అవసరం అవుతుందని అనుమానిస్తున్నారు. కేన్స్ లో జి20 సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదర్లేదన్న వార్త వెల్లడి కావడంతో ఫైనాన్షియల్ షేర్లు బాగా నష్టపోయాయి. ఇ.యులో సభ్యత్వం కలిగిన ఇంగ్లండు కూడా యూరో జోన్ సంక్షోభాన్ని యూరోజోన్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, బైటినుండి సహాయం కోరడం తగదనీ హెచ్చరించాడు.

బ్రిటన్ ఛాన్సలర్ జార్జి ఆస్బోర్న్, తాము యూరో జోన్ కుప్పకూలితే ఏర్పడగల పరిస్ధితులకు సిద్ధపడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అంగీకరించాడు. ప్రస్తుత పరిస్ధితి ప్రపంచ సంక్షోభంలో ఒక దశ మాత్రమే నని మునుముందు ఇంకా గడ్డు పరిస్ధితులు రానున్నాయని బ్రిటన్ ప్రధాని కామెరూన్ హెచ్చరించాడు.

జి20 సమావేశాల నేపధ్యంలో ఆ గ్రూపు దేశాలు యూరోజోన్ సంక్షోభ పరిష్కారానికి సహాయంచేస్తాయన్న నమ్మకంతో మార్కెట్లు ఎదురు చూశాయి. అదేమీ లేకపోవడంతో శుక్రవారం షేర్లు లాభాలనుంది నష్టాల బాట పడ్డాయి. ఐ.ఎం.ఎఫ్ వనరులను మరో 250 బిలియన్ డాలర్లు పెంచడానికి జి20 దేశాలు అంగీకరిస్తాయని ఒక అంచానా వేసుకున్నారు. అయితే అటువంటి పెట్టుబడి పెంపుదల నిర్మాణం, సైజు, చెల్లింపుదారులు మున్నగు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జి20 గ్రూపు చేతులెత్తేసింది. తదుపరి జి20 ఆర్ధికమంత్రుల సమావేశం వచ్చే ఫిబ్రవరి నెలలో జరపాలని నిర్ణయించి సెలవు తీసుకున్నారు.

ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ కొంచెం ప్రయత్నం చేసినా కుదర్లేదని తెలుస్తోంది. అమెరికా కూడా కాంగ్రెస్ ఒత్తిడితో ఐ.ఎం.ఎఫ్ కు మరిన్ని నిధులు ఇవ్వడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. యూరో సంక్షోభం ఒక కొలిక్కి  వస్తుందన్న నమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. యూరోపియన్ ఫైనాన్షియల్ స్టబిలిటీ ఫెసిలిటీ (ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్) లో మరిన్ని నిధులివ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తేల్చిచెప్పింది.

ఇటలీ రుణ సంక్షోభం తీవ్రమవుతున్న నేపధ్యంలో ఇటలీ ప్రధాని బెర్లుస్కోని తో అమెరికా అధ్యక్షుడు ఒబామా, జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు, నికొలస్ సర్కోజి, ఐ.ఎం.ఎఫ్ డైరెక్టర్ జనరల్ క్రిస్టీన్ లాగార్డే లు ప్రత్యేకంగా సమావేశం జరిపారు. ఇటలీ ఆర్ధిక వ్యవస్ధను ఇకనుండి ఐ.ఎం.ఎఫ్ పర్యవేక్షిస్తుందని వారు బెర్లుస్కోనికి స్పష్టం చేశారు. అందుకు ఇటలీ ప్రధాని కూడా అంగీకరించాడు. ఐ.ఎం.ఎఫ్ చేతులో పడ్డారు కనుక ఇటలీ ప్రజలు మరిన్ని కష్టాలను ఎదుర్కోవడం ఖాయం.

ఇటలీ నెత్తిన 1.9 ట్రిలియన్ యూరోల అప్పు ఉంది. ఇది ఇటలీ జిడిపిలో 120 శాతంతో సమానం. ఇంతపెద్ద ఆర్ధిక వ్యవస్ధ గల ఇటలీకి బెయిలౌట్ అవసరం వచ్చినా, లేదా డిఫాల్ట్ అయినా ఆ ప్రభావం యూరప్ ఆర్ధిక వ్యవస్ధపైనా తద్వారా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధపైన అపారంగా ఉంటుంది. అప్పు చెల్లింపులు చేయడానికి ఇటలీ నవంబరులో 30.5 బిలియన్ యూరోలు, డిసెంబరులో 22.5 బిలియన్ యూరోలు అప్పును సేకరించవలసి ఉంది. అంటే అంత మొత్తంలో చెల్లింపులు చేయవలసి ఉన్నదని అర్ధం. ఆ చెల్లింపులు చేయలేని పక్షంలో ఇటలీ డిఫాల్ట్ అవడం జరుగుతుంది. ఇటలీని డిఫాల్ట్ కాకుండా కాపాడాలంటె ఇ.యు, ఐ.ఎంఎఫ్ లు బెయిలౌట్ రుణం ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న ఆర్ధిక వ్యవస్ధ ఉన్న గ్రీసు సంక్షోభం తట్టుకోలేకనే ఆదేశాన్ని యూరోజోన్ నుండి సాగనంపుతుండగా ఇటలీ సంక్షోభం పరిష్కరించుకునే సామర్ధ్యం ఇ.యు కు ఎక్కడినుండి వస్తుంది?

ఇటలీ ఆర్ధిక వ్యవస్ధను పర్యవేక్షించడానికి ఐ.ఎం.ఎఫ్ ను అనుమతించడం ఇటలీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యూరప్ దేశాలు, అమెరికా కుట్ర చేస్తున్నాయని ఇటలీ ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. పాలక పక్షం నుండే సభ్యులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆరోపణలను సర్కోజి తిరస్కరించినా, యూరోప్ లో ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించక తప్పదనీ, లేకుంటే యూరప్ నుంది మినహాయింపబడతారనీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇటలీ ప్రధాని బెర్లుస్కోని తాము ఫ్రాన్సు, యు.కె కంటే బలంగానే ఉన్నామని బింకం ప్రదర్శిస్తున్నాడు.

ఇటలీలో ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలనున్నదన్న భయాలు ప్రపంచ దేశాల నాయకులకు ఉన్నాయన్న విషయాన్ని బ్రిటిష్ అధికారులు పరోక్షంగా ప్రవేటు సంభాషణలలో అంగీకరిస్తున్నట్లు ‘ది గార్దియన్’ తెలిపింది. ఆగష్టు నుండి ఇటలీ బాండ్లను యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేస్తూ బాండ్లపై వడ్డీ రేటు పెరగకుండా జాగ్రత్త వహిస్తోంది. ఇది ఎంతోకాల కొనసాగే అవకాశం లేకపోవచ్చు. మొత్తం మీద యూరోపియన్ రుణ సంక్షోభం మరొక్కసారి ప్రపంచాన్ని మాంద్యం లోకి తీసుకెళ్తున్న ప్రమాదం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s