
అత్యంత ఆధునికమైన జెట్ ఫైటర్ విమానాలను ఇండియాకు అమ్మడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో అమెరికా-ఇండియాల రక్షణ రంగ సహకారం గురించి వివరిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇండియా ఆసక్తి కనపరిచినట్లయితే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసే ‘ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్’ ను అమ్మడానికి అమెరికా సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది.
ఆరు నెలల క్రితమే అమెరికా అమ్మ జూపిన ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానాలను ఇండియా తిరస్కరించింది. ఇండియా 126 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు టెండర్ పిలవగా అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్ కంపెనీలు పోటీ పడ్డాయి. అందులో ఇండియా అమెరికా విమానాలను తిరస్కరిస్తూ ఫ్రాన్సుతో పాటు మరొక నాలుగు దేశాల కన్సార్టియం నిర్మించే ఫైటర్ జెట్ ను షార్ట్ లిస్టు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియా నిర్ణయంతో అమెరికా ఇండియా ల సహకారం, వ్యాహాత్మక భాగస్వామ్యం చిక్కుల్లో పడుతుందని విశ్లేషకులు అంచనా వేసారు.
కానీ అది జరగలేదు. పైగా పోటీలో నెగ్గడానికి అమెరికా మరొక అత్యాధునికమైన ఫైటర్ జెట్ విమానాన్ని రంగం మీదికి తెచ్చింది. తద్వారా ఇండియా అందిస్తున్న 11 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత ప్రభుత్వం ఎఫ్-35 గురించి మరిన్ని వివరాలు కోరినట్లయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దక్షిణాసియా డిఫెన్స్ డెప్యుటి అసిస్టెంట్ సెక్రటరీ రాబర్డ్ షెర్ తెలిపాడు.
ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానం అమెరికా రక్షణ విభాగం నిర్మిస్తున్న అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విమానానికి శత్రు దేశాల రాడార్లకు దొరకకుండా ఉండడానికి తగిన టెక్నాలజీ కలిగి ఉందని తెలుస్తోంది. మొత్తం ఎనిమిది అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఈ విమానం అబివృద్ధి చేస్తున్నారు. అమెరికా మిలట్రీ అవసరాలకు 2447 ఫైటర్ జెట్లను తయారు చేయడానికి 382 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఇండియా గతంలో ఈ విమానం పట్ల అంతగా ఆసక్తి కనబరచలేదు. విమానం అభివృద్ధిలో ఇండియా కూడా భాగస్వామ్యం వహించాలని అమెరికా కోరినప్పటికీ దాని ఖరీదు దృష్ట్యా ఇండియా ఆసక్తి చూపలేదు. ఖరీదే కాకుండా ఇండియా తానే స్వయంగా దేశీయంగా ఫైటర్ జెట్ విమానాలను అభివృద్ధి చేయాలని తలపెట్టడం వలన కూడా అమెరికా ప్రాజెక్టుపైన ఇండియా ఆసక్తి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా ఆసక్తి ఉన్నట్లుగా ఇండియా చెప్పలేదనీ అయినా ఇండియా పట్ల ఉన్న గౌరవం, ఇండియాతో భాగస్వామ్యం పట్ల ఉన్న ఆసక్తి రీత్యా ఈ ప్రతిపాదన చేస్తున్నామని షెర్ తెలిపాడు.
ఇండియా ఇప్పటికే రష్యాతో కలిసి సుఖోయ్/హెచ్.ఎ.ఎల్ ఐదవ జనరేషన్ ఫైటర్ విమానాలను అభివృద్ధి చేయడంలో తలమునకలై ఉంది. అది కూడా రాడార్ కు దొరకకుండా తప్పించుకోగలదని తెలుస్తోంది. ఈ అంశాన్ని అమెరికా రక్షణ విభాగ నివేదిక కూడా ప్రస్తావించింది. “ఇండియాతో శాస్త్ర-సాంకేతిక రంగంలో సహకారం అందించడానికి గల అవకాశాలను మరిన్ని దొరకబుచ్చుకోవాలని అమెరికా కోరుకుంటున్నది. ఆ అవకాశాల ఆధారంగా ఇండియా భాగస్వామ్యంతో ఉమ్మడిగా అభివృద్ధి చేసే అవకాశాలు పొందాలని అమెరికా కోరుతోంది” అని నివేదిక తెలిపింది.
ఉపఖండంలో ఆయుధ పోటీ అంతిమంగా అమెరికా, యూరప్, రష్యా లాంటి ఆయుధ బేహారులకే లాభం తప్ప భారత ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఇండియాకి ఆయుధాలు అమ్మకం జరిగాక ఇండియాను చూపి పాకిస్ధాన్ కి కూడా ఆయుధ వ్యాపారులు తమ ఆయుధాలను అమ్మజూపుతారు. ఆ విధంగా ఉపఖండంలో ఆయుధ పోటీని పెంచడం ద్వారా లబ్డి పొందడానికి ఆయుధ వ్యాపార కంపెనీలు పధకాలు పన్నుతున్నాయి.
