3 రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ దురాక్రమణ సైనికుల హతం


ఆఫ్ఘనిస్ధాన్ లో పాశ్చ్యాత్య దురాక్రమణ సైన్యం చావు దెబ్బలు తినడం కొనసాగుతోంది. గత శనివారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ వద్ద జరిగిన భూతల దాడిలో 17 మంది సైనికులు చనిపోగా, దక్షిణ ఆఫ్ఘనిస్ధన్ లో ఆఫ్ఘనిస్ధాన్ సైనికాధికారి ఒకరు తిరగబడి ఆస్ట్రేలియా సైనికులను ముగ్గురిని కాల్చి చంపాడు. ఈ రోజు సోమవారం 4గురు విదేశీ సైనికులను కాందహార్ వద్ద తాలిబాన్ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ నలుగురితో కలుపుకుని గత మూడు రోజుల్లోనే 24 మంది దురాక్రమణ సైనికులను తాలిబాన్ చంపేసినట్లయ్యింది.

శనివారం ఆఫ్ఘన్ రాజధాని శివార్లలో మిలట్రీ కాన్వాయ్ కాపలాగా విదేశీ సైనికులను తీసుకెళ్తున్న బస్సు పైన తాలిబాన్ మిలిటెంట్లు కారు బాంబుతో దాడి చేసారు. మిలట్రీ వాహనమైన రైనో బస్సులోనే భారీ ఆయుధాలతో కూడిన భద్రతా ఏర్పాట్లు ఉండగా, బస్సు వెనకా ముందూ కూడా మిలట్రీ వాహనాలతో ట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకున్నప్పటికీ తాలిబాన్ జరిపిన దాడిలో విదేశీ సైన్యాలు తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. గత దశాబ్ద కాలంగా సాగుతున్న ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో శనివారం జరిపిన దాడి అత్యంత పెద్ద దాడిగా పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అభివర్ణిస్తున్నాయి.

తాలిబాన్ మిలిటెంటు, తాను ప్రయాణిస్తున్న టొయోటా కొరొలా కారు నిండా పేలుడు పదార్ధాలు నింపుకుని మిలిటరీ కాన్వాయ్ డీకొట్టడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో, పేలుడులో విదేశీ సైనికులు శలభాల్లా మాడిపోయారు. 700 కి.గ్రా పేలుడు పదార్ధాలను కారులో నింపుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. తాలిబాన్ తానే ఈ దాడికి బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో ఐదుగురు అమెరికా సైనికులు, మరో ఐదుగురు అమెరికా పౌరులు (సి.ఐ.ఎ గూఢచారులకు ఇదొక ప్రస్తావన) చనిపోయారని గార్డియన్ పత్రిక తెలిపింది. ఒక ఆస్ట్రేలియన్ సైనికుడు, ఒక కెనడా సైనికుడుతో పాటు బ్రిటన్ పౌరులు ఇద్దరు (కాంట్రాక్టర్లు), కొసావో సైనికుడు ఒకరు చనిపోయినవారిలో ఉన్నారు. మిగిలినవారు ఆఫ్ఘన్ సైనికులుగా తెలుస్తోంది.

పేలుడు ధాటికి అర కిలోమీటరు పరిధిలోని భవనాల కిటికీలు సైతం పగిలిపోయాయి. దురాక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో పునర్నిర్మాణం కాంట్రాక్టులు సంపాదించిన బ్రిటిష్ కాంట్రాక్టు సంస్ధ ఫ్లౌర్ కంపెనీ తరపున బ్రిటిష్ పౌరులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్ధ ఆఫ్ఘనిస్ధాన్ లో ఓ పక్క దురాక్రమణ యుద్ధం సాగుతుండగానే మరోవైపు ‘శవాలపై పైసలు ఏరుకోవడానికి’ సిద్ధపడి ఆఫ్ఘనిస్ధాన్ లో విస్తృతంగా కాంట్రాక్టులు పొందింది. ఒకవైపు వినాశనం జరుగుతుండగానే మరొకవైపు పునర్నిర్మాణం అన్నమాట! పునార్నిర్మాణాలు నాశనమైతే మరిన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు దురాక్రమణ యుద్ధాలు కూడా వ్యాపారంలో భాగమే.

కాబూల్ లో ‘కేంప్ జులియన్’ వద్ద తిరుగుబాటు వ్యతిరేక శిక్షణా పాఠశాల నుండి సదరు బస్సు బయలుదేరినట్లు తెలుస్తున్నది. ఈ పాఠశాలను నాటో నిర్వహిస్తున్నదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేంప్ జులియన్ నుండి ‘కేంప్ ఫీనిక్స్’ లో ఆఫ్ఘన్ పోలీసులకు, సైనికుల శిక్షణ ఇవ్వడానికి నెలకొల్పిన సైనికాశ్రయానికి బస్సు వెళ్తుండగా తాలిబాన్ దాడి జరిగింది.

సోమవారం ఆఫ్ఘనిస్ధాన్ దక్షీణ భాగంలో పెద్ద నగరమైన కాందహార్ వద్ద తాలిబాన్ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో కూడా కారు బాంబుతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి శరణార్ధుల దౌత్యకార్యాలయం (యు.ఎన్.హెచ్.సి.ఆర్), ‘ఇంటర్నేషనల్ రిలిఫ్ డెవలప్‌మెంట్’ అనే ఎన్జీఓ సంస్ధలు ఉన్న చోటుకి సమీపంలో ఈ దాడి జరిగింది. పేలుడు అనంతరం ఇతర మిలిటెంట్లు దూసుకు వచ్చి అక్కడ ఉన్న జంతువుల ఆసుపత్రిని స్వాధీనం చేసుకుని కాల్పులు కొనసాగిస్తున్నారు. నాటో, ఆఫ్ఘన్ భద్రతా బలగాలు మిలిటెంట్లతో కాల్పులు కొనసాగిస్తున్నారని కాందహార్ పోలీసు అధికారి పత్రికలకు తెలిపాడు. దాడివార్తను యు.ఎన్.హెచ్.సి.ఆర్ ధృవీకరించింది. సోమవారం దాడికి కూడా ఆఫ్ఘన్ తాలిబాన్ తానే బాధ్యురాలునని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్ ను మిలిటెంట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ సంస్ధ తెలిపింది.

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించినప్పటినుండీ దురాక్రమణ సైన్యాల మరణాల సంఖ్య అధికం కావడంతో అమెరికా వ్యూహకర్తలకు ఎటూ పాలుపోవడం లేదు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్ధాన్ పైన నెపం మోపుతోంది. మిలిటెంట్లపై యుద్ధం చేసి చంపాలని పాకిస్ధాన్ పై అమెరికా తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. దానితో ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా తయారయ్యాయి. అయినప్పటికీ పాకిస్ధాన్ ను వదులుకోలేని దయనీయ పరిస్ధితిలో అమెరికా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s