
అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) గత పదహారు సంవత్సరాలలో భారత దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నదీ రాష్ట్రాలవారీగా, సంవత్సరాల వారీగా లెక్కలు సేకరించి నివేదిక వెలువరించింది. ఇక ఏ రాజకీయ పార్టీ కూడా మా హయాంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోలేదని బొంకడానికి వీల్లేదు. అధికారికంగానే రైతులూ ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వానికి చెందిన విభాగం ఒకటి నివేదిక రూపొందించినందున వారికి ఆత్మహత్యలకు కారణాలు వెతుక్కోవాల్సిందే.
ఎన్.సి.ఆర్.బి నివేదిక ప్రకారం 1995 నుండి 2010 వరకూ 16 సంవత్సరాల కాలంలో 2,56,913 మంది రైతులు భారత దేశం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించింది. అంటే పావు మిలియన్ మంది రైతులన్నమాట! ఈ సంస్ధ ఆత్మహత్యల సంఖ్యని రికార్డు చేయడం ప్రారంభించింది 1995 నుండే కనుక అంతకు ముందు, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుందీ తెలిసే అవకాశం లేదు. బహుశా మానవజాతి చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకున్న దౌర్భాగ్యం బహుశా ఇండియాలోనే జరిగి ఉండవచ్చు. అది కూడా దేశానికి అన్నం పెట్టే రైతు, దేశానికి వెన్నెముకగా రాజకీయ నాయకులు ఇష్టంగా పేర్కొనే రైతు, ప్రాధమిక ఉత్పత్తిదారు అయిన రైతు ఆత్మ హత్య చేసుకోవడం అంటే… ఈ దేశంలో బతకడానికి తావు లేనట్లే.
మహా రాష్ట్ర రైతు ఆత్మహత్యలలో అగ్ర స్ధానంలో నిలిచింది. దేశంలో సంపన్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రైతు ఆత్మహత్యలలో కూడా అంతే సంపన్నంగా ఉండడం యాదృచ్ఛికం కానే కాదు. భారత దేశంలో అలవిగాలినంతగా ధనాన్ని సంపాదించడానికీ, రైతులు లాంటి ప్రాధమిక ఉత్పత్తిదారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి నేరుగా సంబంధం ఉన్నందునే మహారాష్ట్రకు ఆ ఖ్యాతి దక్కింది. ఇంకా చెప్పాలంటే మొత్తం ఆత్మ హత్యలలో మూడింట రెండవ వంతు ఐదు రాష్ట్రాలలోనే జరిగాయి. మహా రాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘర్ రాష్ట్రాలు ఆ పేరు దక్కించుకున్నాయి. వీటిలో చత్తిస్ ఘర్ మినహా మిగతా నాలుగూ సంపన్న రాష్ట్రాలే కావడం గమనార్హం.
అంకెలను పరిశీలిస్తే మొదటి ఎనిమిది సంవత్సరాల కంటే చివరి ఎనిమిది సంవత్సరాల్లోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. 1995-2002 కాలంలో 1,21,157 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2003-2010 కాలంలో 1,35,756 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటును చూస్తే మొదటి ఎనిమిద సంవత్సరాలతో పోలిస్తే తర్వాత ఎనిమిది సంవత్సరాలలో సంవత్సరానికి 1825 రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. వ్యవసాయరంగం పైన ఆధారపడిన రైతుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న నేపధ్యంలో ఈ తేడా ఆందోళనకర అంశంగా పరిగణించాల్సి ఉంటుంది.
1991 జనాభా లెక్కలతో పోలిస్తే 2001 జనాభా లెక్కలలో 7 మిలియన్ల మంది రైతులు (70 లక్షల మంది) వ్యవసాయం నుండి పక్కకు తప్పుకున్నారని తేలింది. వీరంతా వ్యవసాయంలో ప్రధాన పని చేసేవారన్నది గుర్తెరగాలి. ప్రధాన పని చేసే రైతు చుట్టూ అనేక అనుబంధ పనులు చేసుకునే వారు ఉంటారన్నది గమనిస్తే మొత్తంగా వ్యవసాయ రంగం నుండి తప్పుకున్నవారి సంఖ్య దానికి అనేక రెట్లు ఉంటుంది. 2011 జనాభా లెక్కలు ఇంకా బైటికి రావలసి ఉంది. అవి కూడా రైతుల సంఖ్యను మరింత క్షీణించిన సంగతిని చూపుతాయనడంలో సందేహం లేదు. గత పది సంవత్సరాల కాలంలో రైతులనుండి అనేక లక్షల ఎకరాలను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమల పేరుతో, సెజ్ ల పేరుతో ధనికులకు అప్పజెప్పింది. అది కాక పట్టణాభివృద్ధి, ఇతర అభివృద్ధిల పేరుతో కూడా లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అతి తక్కువ ధరలకు కట్టబెట్టింది. ఈ నేపధ్యంలో రైతుల సంఖ్య మరింతగా పడిపోయి, సేద్యం భూములు మరింతగా తగ్గిపోయాయి. కనుక భారత దేశంలో వ్యవసాయ సంక్షోభం పెరుగుతున్న కొద్దీ రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్ధాయిలో పెరుగుతున్నాయని తెలుస్తోంది.
2009 తో పోలిస్తే 2010 లో రైతుల ఆత్మహత్యలు 1404 మేరకు తగ్గాయి. అయితే ఇది సంతోషించదగ్గ విషయం కాదని ‘ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం’ లో ఆర్ధికవేత్తగా పని చేస్తున్న ప్రొఫెసర్ కె.నాగరాజ్ చెబుతున్నాడు. 2008 లో కూడా ఇదే విధమైన తగ్గుదల కనిపించినప్పటికీ 2009 సంవత్సరం వచ్చేటప్పటికి గత ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేనన్ని ఆత్మహత్యలు జరిగాయి. ప్రొ. నాగరాజ్ ఒక దశాబ్దకాలం పాటు రైతుల ఆత్మహత్యలను అధ్యయనం చేసి 2007లో ఒక నివేదికను వెలువరించారు. “ఒక సంవత్సరంలో ఇలా ఆత్మహత్యలు తగ్గడంలో సానుకూల అంశం ఏదీ లేదు. చత్తీస్ ఘర్, మధ్య ప్రదేశ్ లలో ఒక్కసారి ఆత్మహత్యలు తగ్గడం వల్ల ఈ తగ్గుదల సంభవించింది. ఐదు పెద్ద (ఆత్మ హత్యల్లో) రాష్ట్రాల లెక్కలు చూసినట్లయితే అక్కడ వ్యవసాయ సంక్షోభం బాగా తీవ్రమయ్యింది. అవి తమ భాగాన్ని పెంచుకున్నాయే తప్ప తగ్గలేదని మనం చూడవచ్చు” అని నాగరాజ్ అన్నాడు.
రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడం భారత ప్రధాని మన్మోహన్ కు గానీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ అహ్లూవాలియాకు గానీ లేదా హోం మంత్రి పి.చిదంబరంకు గానీ అస్సలు ఇష్టం ఉండదు. దేశం ఆర్ధిక వృద్ధిలో అతివేగంగా దూసుకు పోతుంటే ఈ చిన్న చిన్న విషయాలు లెక్కలోకి రాకూడదన్నది వారి అవగాహన. కాని ఉత్పత్తిరంగంలో ఉన్న దాదాపు అన్ని రంగాలకూ వ్యవసాయ ఉత్పత్తులే మూలాధారం అన్నది గమనిస్తే రైతుల పట్ల ఎంతటి చిన్న చూపు ప్రభుత్వం చూపుతున్నదో, ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నదో అర్ధం అవుతుంది.

మాంటెక్ సింగ్ అహ్లువాలియా పక్కా గ్లోబలైజేష్వాది. అతని దృష్టిలో సామ్రాజ్యవాదుల కింద దళారులుగా పని చేసే MNC మేనేజర్లు మాత్రమే మనిషులు, మిగిలినవాళ్ళు ఎవరూ మనుషులు కారు.