యూరప్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, ముందుంది మొసళ్ళ పండగ


గురువారం అర్ధరాత్రి దాటాక కూడా జరిగిన తీవ్ర చర్చల అనంతరం యూరోప్ దేశాలు తమ రుణ సంక్షోభం పరిష్కారం దిశలో ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. ప్రస్తుత సంక్షోభం గ్రీసు తన రుణాలు చెల్లించలేకపోవడం చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో గ్రీసు రుణంలో కోతకు అంగీకరించినట్లుగా యూరప్ సమావేశం ప్రకటించింది. బుధవారం నుండి జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం గ్రీసు రుణ సంక్షోభమే ప్రధాన ఎజెండగా జరిగింది. అనేక తర్జన భర్జనలు, చర్చోప చర్చల అనంతరం ఒప్పందం కుదిరినట్లు శుక్రవారం తెల్లవారుఝామున ప్రకటించారు.

ఒప్పందం ప్రకారం గ్రీసు రుణ భారంలో సగాన్ని రద్దు చేస్తారు. సంక్షోభంలో ఉన్న యూరోజోన్ దేశాలకు బెయిలౌట్ రుణాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన 440 బిలియన్ యూరోల ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ (యూరోపియన్ ఫైనాన్షియల్ స్టబిలిటీ ఫండ్) నిధులను ఒక ట్రిలియన్ యూరోలకు పెంచుతారు. యూరోజోన్ దేశాలలోని బ్యాంకులను రీ క్యాపిటలైజ్ చేస్తారు. ఈ మూడు చర్యలలో చివరి చర్య ఇప్పటికే పూర్తయ్యింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చేపట్టిన స్ట్రెస్ పరీక్షల దరిమిలా ఏ దేశంలో ఏయే బ్యాంకుకు ఎంత పెట్టుబడి అవసరం అన్నదీ ఇప్పటికే నిర్ణయించారు. ఆ పెట్టుబడి సమూర్చుకోవడానికి తగిన చర్యలను కూడా రూపొంచిందుకోవడంతో ఆ చర్య పూర్తయ్యిందని భావిస్తున్నారు.

గ్రీసుకి రుణం ఇచ్చిన ప్రవేటు రుణ దాతలు సైతం తమ రుణంలో సగ భాగాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించడం ఒప్పందంలో ప్రధాన అంశం. దీని ప్రకారం ప్రవేటు రుణ దాతలు, అంటే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, ప్రవేటు బ్యాంకులు, కంపెనీలు తాము గ్రీసుకు ఇచ్చిన రుణంలో సగ భాగాన్ని రద్దు చేసుకుంటారు. అయితే ఇది తప్పరిసరి షరతుగా ఉంచకుండా స్వచ్ఛందంగా చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రవేటు పాత్రధారులు అంగీకరింపజేయడంలో నికొలస్ సర్కోజి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సగ భాగం అప్పుని రద్దు చేసుకోని పక్షంలో గ్రీసు పూర్తిగా దివాళా తీస్తుందనీ, అపుడైతే పూర్తి సొమ్ము అసలు కూడా రాదని సర్కోజి హెచ్చరించడంతో ప్రవేటు కంపెనీలు దారికొచ్చినట్లు తెలుస్తోంది.

ఇ.ఎఫ్.ఎస్.ఫ్ నిధులను ఒక ట్రిలియన్ (వెయ్యి బిలియన్లు) యూరోల మేరకు పెంచడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ పెంపులో యూరోపియన్ దేశాలపైన భారం పడకుండా ఒక పధకాన్ని రూపొందించు కున్నారు. ఈ పధకం ఖచ్చితంగా అమలవుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. పెద్ద ఎత్తిన విదేశీమార్క ద్రవ్య నిల్వలను ఉంచుకున్న ఎమర్జింగ్ ఎకానమీ దేశాలు చైనా, బ్రెజిల్ దేశాల్ను ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ నిధుల పెంపుకోసం అడుక్కోవాలని యూరప్ దేశాలు నిర్ణయించాయి. అంటే ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ నిధుల పెంపుదల కోసం ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ సంస్ధ బాండ్లను జారీ చేస్తుంది. ఆ బాండ్లను కొనుగొలు చేయడానికి బ్రెజిల్, చైనాలను బ్రతిమాలు కోవాలన్నమాట!

కాని బ్రెజిల్ ఇప్పటికె తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ దేశాలు తమ సమస్యలకు పరిష్కారాన్ని అంతర్గతంగా ఎదుర్కొని తామే పరిష్కరించుకోవాలి తప్ప బైటి దేశాల మీద ఆధారపడడం తగదు అని బ్రెజిల్ ప్రకటించింది. దానితో బ్రెజిల్ దారి మూసుకు పోయింది. ఇక మిగిలింది ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్. ఒప్పందం కుదిరిన వెంటనే ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ అధిపతి క్లాస్ రెగ్లింగ్ చైనా బయలుదేరి వెళ్ళాడు. అడుక్కోవడానికి చిప్ప చేతులో పట్టుకుని రెగ్లింగ్ చైనాకు చేరుకున్నట్లుగా ‘గార్డియన్’ పత్రిక రాసింది. అయితే చైనా ఎంతవరకూ సహకరిస్తుందన్నదీ అనుమానాలు బాగానే ఉన్నాయి.

చైనా వద్ద పెద్ద మొత్తంలో, 3.2 ట్రిలియన్ డాలర్ల మేరకు, విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని భావిస్తున్నారు. అందులో పాతిక భాగం యూరోలలో పెట్టుబడులు పెట్టినట్లుగా భావిస్తున్నారు. అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తున్న నేపధ్యంలో విదేశీమారక ద్రవ్య నిల్వలను ఒకే కరెన్సీలో కాకుండా వివిధ కరెన్సీలలో విస్తృతంగా వివిధీకరించాలని చైనా గతంలో నిర్ణయించుకుంది. అందులో భాగంగా యూరోలలో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టాలని (ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ బాండ్లు కొనుగోలు చేయాలని) ఇ.యు, చైనాను అర్ధిస్తోంది. ఇ.యుకి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందనీ, సంక్షోభ పరిష్కారం కోసం అది తీసుకునే చర్యలకు తన మద్దతు ఉంటుందనీ చైనా రెండ్రోజుల క్రితం కూడా ప్రకటించింది.

కాని చైనా ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ బాండ్ల కొనుగోలుకు అంగీకరిస్తుందా లేదా అన్నది అనుమానంగా మిగిలింది. ఉమ్మడి చర్యలకు ప్రతిస్పందించడం కంటే ఇ.యు దేశాలు వ్యక్తిగతంగా తీసుకునే చర్యలకు ప్రతిస్పందించడం మేలని చైనా భావిస్తోంది. అంటే ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ బాండ్ల కంటే ఇ.యు దేశాలు స్వంతగా జారి చేసే బాండ్లలో పెట్టుబడులు పెట్టడం మేలని భావిస్తోంది. అయితే ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ లో జర్మనీ, ఫ్రాన్సు లాంటి బలమైన దేశాలు కూడా ఉన్నందున ఆ బలిమిపై ఆధారపడి ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ లోనే పెట్టుబడులు పెట్టే అవకాశాలు లేకపోలేదు. చైనా కోసం రాయితీలు ఇస్తున్నారా అన్న ప్రశ్నకు రెగ్లింగ్ లేదని సమాధానం చెప్పాడు.

మొత్తం మీద చూస్తే ఇ.యు దేశాలు చర్చించుకుని కుదుర్చుకున్న ఒప్పందం పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ ఆ ఒప్పందాన్ని ఎలా నెరవేరుస్తారన్న ఖచ్చితమైన వివరాలు ఇంతవరకూ లేవు. కేవలం చైనాపై ఆధారపడి ఎన్ని నిధుల్ని సమకూర్చుకుంటారన్నదీ అనుమానమే. బ్రెజిల్ తన వల్ల కాదని తేల్చేసింది. అదీ కాక చైనా నుండి ఒక్కరోజులో హామీ వస్తుందని ఆశలు పెట్టుకోవద్దని రెగ్లింగ్ ప్రకటించాడు. కనుక ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ నిధుల కోసం మళ్లీ మార్కెట్ల వద్దకు వెళ్లవలసిందే. గ్రీకు రుణం సగం తగ్గించినా ఆ సగం కూడా ఎలా తీరుతుందన్నది నమ్మకాలు కుదరడం లేదు. దానితో ఒప్పందం కుదిరిన వెంటనే ప్రపంచవ్యాపితంగా స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున లాభాలు పొందినప్పటికీ రెండో రోజుకల్లా ర్యాలి జోరు తగ్గిపోయింది. ఇల్లు అలకగనే పండగ కాదన్నట్లుగా ఇంది ప్రస్తుత ఇ.యు ఒప్పంద పరిస్ధితి. ముందుంది మొసళ్ల పండుగ అని మార్కేట్లు జాగ్రత్తగా పరికిస్తున్నాయి.

మార్కెట్లపై ఆధారపడితే దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఎంత ‘ఓడు’ గా మారిపోతాయో యూరప్, అమెరికాల సంక్షోభాలు నేర్పుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s