అదిగో లిబియాలో కూడా తిరుగుబాటు తలెత్తింది అని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గత ఫిబ్రవరిలో చెప్పాయి. కాని ప్రజలు పాల్గొన్న తిరుగుబాటుపై ఒక్క సాక్ష్యం ఇవ్వలేకపోయాయి. గడ్డాఫీ సైన్యాలు తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేస్తున్నాయి కనుక నో-ఫ్లై జోన్ అమలు చేయాలి అన్నాయి. ఐక్యరాజ్యసమితి చేత మమ అనిపించుకుని నో-ఫ్లై జోన్ అమలు చేస్తూ తీర్మానం చేశాయి. గడ్డాఫీకి ఎవరైనా ఆయుధాలు ఇస్తారేమోనని ఆయుధ సరఫరాపై నిషేధం విధిస్తూ తీర్మానం చేపించాయి.
ఇన్ని చేసినా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ అనే దుష్ట త్రయం నమ్మకాలు పెట్టుకున్న లిబియా తిరుగుబాటుదారులు ముందుకు కదల్లేకపోయాయి. ఈ లోపు గడ్డాఫీ బలగాలు ట్రిపోలి నుండి బయలుదేరి ఒక్కో పట్నాన్ని వశం చేసుకుంటూ వచ్చాయి. ఇక తిరుగుబాటుదారుల కేంద్రం అని చెబుతున్న బెంఘాజీ ని చుట్టుముట్టడం ఖాయం అన్న పరిస్ధితి వచ్చింది.
ఈ దశలో దుష్ట త్రయం మళ్లీ సమాలోచనలు జరిపాయి. తమ సాయం లేనిదే తిరుగుబాటు సున్న అని తేల్చుకున్నాయి. గడ్డాఫీ తన సొంత పౌరుల్ని చంపుతున్నాడని గోల ప్రారంభించాయి. కాని అలా చనిపోయిన ఒక్క పౌరుడి మృతదేహాన్ని కూడా చూపలేకపోయాయి. సాక్ష్యాలు చూపమంటే హత్యాకాండ జరగొచ్చు కనుక అపాలి అన్నాయి. మళ్లీ భద్రతా సమితిని అడ్డు పెట్టుకుని ‘లిబియా పౌరుల రక్షణ కోసం అన్ని చర్యలూ తీసుకోవాలి’ అన్న తీర్మానం ఆమోదింపజేసుకున్నాయి.
నాటో దాడుల్లో లిబియా ప్రజల రక్షణ మాట అటుంచి లిబియా పౌరులే చనిపోతున్నారని ఆఫ్రికన్ యూనియన్, అరబ్ లీగ్ లు గొడవ చేశాయి. కాని పట్టించుకున్నవారు లేరు. ఆ తర్వాత అవి నోరు మూసుకున్నాయి. అప్పటినుండీ లిబియా విధ్వంసం సాగింది. గట్టిగా కనపడిన ప్రతి భవంతినీ బాంబులేసి నాశనం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలున్న భవంతులన్నింటినీ నాశనం చేశాయి. దశాబ్దాల తరబడి నిర్మించుకున్న రోడ్లు వంతెనలను, బ్రిడ్జిలు అన్నీ నాశనం చేశాయి. చివరికి గడ్డాఫీని కూడా చంపేశాయి.
సరే లిబియా పౌరులను చంపేసిన గడ్డాఫీ చనిపోయాడు కదా. ఇక లిబియా పౌరులకు భయం లేదుకదా? ఇక లిబియాలో నాటో బలగాలు ఎందుకు ఉండడం? మేను ఆక్టోబరు 31 కల్లా వెళ్ళిపోతాం అని నాటో ఛీఫ్ ఆండర్స్ ఫాగ్ రాస్ముస్సేన్ చెప్పాడు. అసలు విషయం తెలిసినవారు ఆశ్చర్యపోయారు. అబ్బే అదేం లేదని ఇప్పుడు అమెరికా డిఫెన్స్ కార్యదర్శి లియోన్ పెనెట్టా ప్రకటిస్తున్నాడు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అధికారులు నాటో సైన్యాలు లిబియాలో కొనసాగాలని కోరుతున్నట్లుగా నేనెక్కడో చూశాను. కనుక మరి కొంతకాలం నాటో సైన్యాలు లిబియాలోనే ఉంటాయి అని చెప్పాడు.
అదీ సంగతి! ఎన్.టి.సి నిజంగా నాటో సైన్యాలని లిబియాలో కొనసాగాలని కోరిందీ లేనిదీ కూడా పెనెట్టాకు తెలియదు. అయినా ధైర్యంగా నాటో సైన్యలు కొనసాగుతాయని చెప్పగలిగాడంటే లిబియా తిరుగుబాటు ప్రభుత్వం అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల చేతిలో ఏ విధంగా కీలుబొమ్మగా ఉండేదీ తెలుస్తోంది. “లిబియా నాయకత్వంలోని కొంతమంది నాటో బలగాలు మధ్యంతర కాలం వరకూ కొనసాగాలని వ్యాఖ్యానించినట్లుగా నేను ఎక్కడో నోటీస్ చేసాను. వారి పాలనలో కొంత భాగాన్ని స్ధాపించాల్సి ఉన్నందున వారు అలా కోరుతున్నారు” అని పెనెట్టాను ఉటంకిస్తూ సి.ఎన్.ఎన్ తెలిపింది. నాటోయే ఈ విషయం నిర్ణయిస్తుందని కూడా పెనెట్టా చెప్పాడు. లిబియాలో సైన్యం ఉండేదీ లేనిదీ లిబియా ప్రభుత్వం కాకుండా నాటో నిర్ణయిస్తుందట?
లిబియా ప్రజల జీవితాలను లిబియాకి చెందిన పశ్చిమ దేశాల తొత్తులు అమెరికా, యూరప్ లకు తాకట్టు పెట్టారు. గడ్డాఫీ పాలనలో అందిన సౌకర్యాలన్నీ లిబియా ప్రజలు క్రమంగా కోల్పోక తప్పదు. ప్రజలందరికీ ఉచితంగా ఆయిల్ సంపదలను ఉపయోగపెడుతున్న గడ్డాఫితో రీగన్ తనతో చేయికలపమన్నాడు. జనాలకి ఎందుకు సంపందలని ఇస్తున్నావ్, ఇద్దరం కలిసి దోచేద్దాం, సంపన్నులమవుదాం అని కోరాడు. గడ్డాఫీ ససేమిరా అన్నాడు. సొంతానికి సంపాదించుకోకుండా ప్రజలకు సంపదల్ని ఇస్తానంటున్న గడ్డాఫీ రీగన్ కి పిచ్చోడిలా కన్పించాడు. అందుకే కసిగా, మర్యాద లేకుండా, తాను ఓ దేశానికి అధ్యక్షుడినని కూడా మరిచి గడ్డాఫీని మేడ్ డాగ్ అని తిట్టిపోశాడు. అవున్నిజమే. దేశ సంపదలని సొంతానికి వాడుకుంటూ స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరవకుండా, దేశ ప్రజలందరికీ ఇస్తానని చెబితే అటువంటి రాజకీయ నాయకుడ్ని ఇండియాలో కూడా పిచ్చోడి లెక్కన జమకడతారు కదా!

అబధ్ధాలు చెప్పకుండా అమెరికా బ్రతికేదెలా
యుధ్ధాలు చేయకుండా అమెరికా బ్రతికేదెలా
ప్రపంచం శాంతంగా ఉంటే అమెరికా బ్రతికేదెలా
ప్రపంచాన్ని దోచుకోకుండా అమెరికా బ్రతికేదెలా