పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?


బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.

పాకిస్ధాన్ లోని హక్కాని గ్రూపు స్ధావరాలపై తాను నేరుగా దాడి చేయవలసి ఉంటుందని అమెరికా కొద్ది వారాల క్రితం హెచ్చరించడంతో అనుకోని రీతిలో హక్కానీ గ్రూపుకి చెందిన ప్రముఖ నాయకుడిని పట్టుకున్నట్లు అమెరికా ప్రకటించింది. వాస్తవానికి పాకిస్ధానే అతనిని అప్పగించిందని లొంగిపోయిన హక్కానీ నాయకుడిని పట్టుకున్నామని ప్రకటించిందనీ ఆ తర్వాత ‘మంత్లీ రివ్యూ’ పత్రిక వెల్లడించింది. హక్కానీ గ్రూపుతో సంబంధాలు పెట్టుకున్నామనీ వారితో చర్చలు జరుగుతున్నాయని ఇటీవల హిల్లరీ క్లింటన్ కూడా అంగీకరించింది. తాము పట్టుకున్నామని అమెరికా చెప్పిన హక్కానీ గ్రూపు నాయకుడి ద్వారానే అమెరికా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

అమెరికా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న తాలిబాన్, ఇతర మిలిటెంట్లకు పాకిస్ధాన్ మద్దతు కొనసాగుతున్నదని అమెరికా గట్టిగా భావిస్తున్నది. పాకిస్ధాన్ పాలకులు ఆ ఆరోపణలను చాలా సార్లు తిరస్కరించింది. ఆఫ్ఘనిస్ధాన్ లో జరిగే దాడులకు తమను ఎలా బాధ్యులు చేస్తారని అమెరికాను ప్రశ్నిస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా తన సేనలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ లోగా ఆఫ్ఘన్ లో తమ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పాకిస్ధాన్, భారత్ ల మధ్య పోటీ పెరిగింది. అమెరికా సేనలు వెళ్లిపోయాక ఆఫ్ఘనిస్ధాన్ లో తన ప్రభావం కొనసాగించడానికి పాకిస్ధాన్ హక్కానీ గ్రూపుపైన ఆశలు పెట్టుకున్నదని విశ్లేషకులతో పాటు అమెరికా కూడా భావిస్తోంది.

ఇండియా కూడా కొన్ని సో కాల్డ్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రభావం పెంచుకోవడానికి కృషి చేస్తోంది. పాకిస్ధాన్, టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నదంటూ చెప్పి పాక్ కు అమెరికా మద్దతు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారత్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పాకిస్ధాన్ పైన ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అమెరికా పాకిస్ధాన్ అవసరాన్ని వదులుకోలేకపోతున్నది. దక్షిణాసియాలో తన ప్రయోజనాలను కాపాడుకోవాలంటే పాకిస్ధాన్ మద్దతు తప్పనిసరని అమెరికా భావిస్తుండడంతో పాకిస్ధాన్ కు ఎన్ని హెచ్చరికలు అమెరికా జారీ చేస్తున్నప్పటికీ చివరికి ఏదో ఒక అంశం వద్ద రాజీపడిపోతున్నది. ఇందులో పాకిస్ధాన్ దౌత్య ఎత్తుగడలతో పాటు అమెరికా అవసరం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఈ నేపధ్యంలో పదే పదే ఘర్షణలకు దిగే బదులు, ప్రతిసారీ సమస్యలు తలెత్తకుండా పాకిస్ధాన్ తో మొత్తంగా ఒక ఒప్పందానికి రావాలని అమెరికా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఒప్పందం ద్వారా చీటికీ మాటికీ పాకిస్ధాన్ కి హెచ్చరికలు జారీ చేయవలసిన అవసరం ఉండదు. పాకిస్ధాన్ ఎలాగూ తన ప్రయోజనాల కోసం హక్కానీ లాంటి గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానుకోదు. ఆఫ్ఘనిస్ధాన్ పొరుగునే ఉన్నందున అక్కడ తన ప్రభావం ఉండాలని పాక్ కోరుకోవడాన్ని కాదనలేము. పదే పదే మద్దతు ఇవ్వద్దు, వాళ్లపై యుద్ధం చెయ్యి అని చెప్పేబదులు పాకిస్ధాన్ ప్రయోజనాలను కాపాడే పనికి తామే అంగీకరించి, అంటే పాకిస్ధాన్ కోరుకుంటున్నదానిని తామే ఇచ్చేసి, తమకు కావలసినదానిని పాకిస్ధాన్ నుండి పొందితే ఎలా ఉంటుందన్న ఆలోచన అమెరికా మదిలో ప్రారంభమైంది.

ఆఫ్ఘనిస్ధాన్ లో పాక్ కార్యకలాపాలలో అధిక భాగం ఇండియా ప్రభావాన్ని ఎదుర్కోవడానికే అని అమెరికాతో పాటు విశ్లేషకులు అనేకులు భావిస్తున్నారు. పాక్ జోక్యం అమెరికాకి వ్యతిరేకం కానప్పుడు ఆ విషయంలో పదే పదే పాక్ తో ఘర్షణపడడం దేనికి? ఇది అమెరికా వ్యూహకర్తల ఆలోచన. ఆఫ్ఘనిస్ధాన్‌లో నిరంతరాయంగా అధిక సంఖ్యలో సైన్యాన్ని కొనసాగిస్తూ కష్టాలనూ నష్టాలను ఎదుర్కొనే బదులు, దురాక్రమణ వ్యతిరేక పోరాటవాదులతో పాకిస్ధాన్ కు ఎన్ని సంబంధాలు ఉన్నప్పటికీ, క్షేమకరంగా ఆఫ్ఘనిస్ధాన్ నుండి బైటపడడానికి వీలుగా పాకిస్ధాన్ కోరింది అప్పజెప్పి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవచ్చు కదా అన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో ఇండియా ప్రయోజనాలు నష్టపోయినా అమెరికా లెక్కించదలుచుకోలేదని తెలుస్తోంది.

అమెరికా మాజీ రాయబారులూ, వ్యూహాల సలహాదారులు అయిన తెరిసిటా షాఫర్, హోవర్డ్ షాఫర్ లు రూపొందించిన విధానం ప్రకారం అమెరికా పాకిస్ధాన్ కు ఇవ్వదలుచుకున్న గొప్ప బేరం ఇలా ఉంటుందని ప్రఖ్యాత పత్రిక “ఫారెన్ పాలసీ” వెల్లడించింది. ఆఫ్ఘనిస్ధాన్ లో పాకిస్ధాన్ కి ఏమి కావాలో దానికి అమెరికా అంగీకరిస్తుంది. దానికి రెండు షరతులు విధిస్తుంది. ఒకటి: ఆఫ్ఘనిస్ధాన్ నుండి జరిగే టెర్రరిజాన్ని కట్టడి చేసే బాధ్యతను పాకిస్ధాన్ తీసుకుంటుంది. రెండు: ప్రస్తుత భౌగోళిక సరిహద్దుల ప్రకారం కాశ్మీరు సమస్య పరిష్కారానికి పాకిస్ధాన్ అంగీకరించాలి.

అంటే ఆఫ్ఘనిస్ధాన్ లో పాకిస్ధాన్ ప్రధాన పాత్రను అంగీకరించాలి. పాకిస్ధాన్ ప్రభావానికి గండికొట్టే చర్యలకు ఎవరినీ అనుమతించరాదు. (ఆ విధంగా ఆఫ్ఘనిస్ధాన్ లో ఇండియా మాట పూర్తిగా పడిపోతుంది. ఇండియా ప్రయోజనాలు అంతటితొ సమాప్తమవుతాయి.) కాశ్మీరులో మూడింట ఒక భాగం పాకిస్ధాన్ ఆధీనంలో ఉండగా, రెండో వంతు ఇండియా ఆధీనంలో ఉంది. రెండింటిని విడదీసే రేఖను ‘నియంత్రణ రేఖ’ అని పిలుస్తున్నారు. షాఫర్ ల ద్వయం వ్యూహం ప్రకారం ఇక ఈ నియంత్రణ రేఖే అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించబడుతుంది. దీనికి పాకిస్ధాన్ ఆమోద ముద్ర వేయాలి. కాశ్మీరులో ప్రజాబిప్రాయ సేకరణ జరిపి వారి నిర్ణయం ప్రకారం కాశ్మీరు భవిష్యత్తు నిర్ణయించాలని ప్రస్తుతం పాకిస్ధాన్ డిమాండ్ చెస్తున్నది. ఈ వాదనను పాకిస్ధాన్ ఇక వదులుకోవాలన్నమాట!

ఇలాంటి ఒప్పందం పాకిస్ధాన్ కు బహుమతి వంటిదేనని భారత పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవంలో, వర్తమానంలో ఆఫ్గనిస్ధాన్ లో పాకిస్ధాన్ కు ప్రధమ ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందనీ, అందుకు ప్రతిగా పాకిస్ధాన్ ఇవ్వవలసింది మాత్రం భవిష్యత్తుకి సంబంధించినదనీ, భవిష్యత్తులో తన హామీ పాక్ నెరవేరుతుందో లేదోనన్న నమ్మకం ఏమీ లేదనీ వారు భావిస్తున్నారు. ఒక ప్రయోజనాన్ని పాక్ కు అప్పగించేసి, పాకిస్ధాన్ ఇవ్వవలసిన ప్రయోజనాన్ని భవిష్యత్తుకి వదిలేయడం సరికాదనీ, అది ఆచరణీయం కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య ఒప్పందం జరిగిపోయిందనీ, ఇకనుండి ఇరు పక్షాల సంబంధాలు మెరుగుపడినట్లేనని వార్తలు వస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

ఈ గొప్ప బేరంలో వీళ్ళు కాశ్మీరు గురించి, అక్కడి ప్రజల గురించి, వారి భవిష్యత్తుపై వారికి ఉన్న ఆశల గురించీ పూర్తిగా అమెరికా మర్చిపోయింది. కాశ్మీరు ప్రజలు తమకు ఇండియా, పాక్ లు ఏవీ వద్దు మా స్వాతంత్రం మాకివ్వండి చాలు అని అంటున్నారు. వారి పోరాటం ప్రధాన డిమాండు అదే. వారి టెర్రరిస్టు చర్యలు కూడ ఆ డిమాండ్ పైనే ప్రధానంగా జరుగుతున్నాయి. అలాంటిది వారి డిమాండ్ ను చర్చించకుండా కాశ్మిరును ఇండియా, పాక్ లమధ్య విడగొడితే కాశ్మీరు టెర్రరిజం, వారి పోరాటం సమసిపోతుందని భావించడం సరికాదు. పైగా ఇంకా తీవ్రమవుతుంది. కాశ్మీరు ప్రజల ఆకాంక్షనుండి కాశ్మీరు టెర్రరిజం పుట్టింది. వారి ఆకాంక్షలను పరిశీలించకుండా సమస్యను పరిష్కరించబూనుకోవడం వల్ల ఫలితం ఉండదు.

షాఫర్ లు రూపొందించిన గొప్ప బేరం వల్ల కాశ్మీరు, ఆఫ్ఘన్ సమస్యలు పరిష్కారం కాకపోగా మరింతగా క్లిష్టం అవుతాయి.

14 thoughts on “పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?

 1. ఇండియా కూడా కొన్ని సో కాల్డ్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రభావం పెంచుకోవడానికి కృషి చేస్తోంది.
  ఇవి వార్తలు కాదు, మీ అభిప్రాయాలు కూడా ఉంటాయని చెప్పారు కాబట్టి, ఇది మీ అభిప్రాయమనే అనుకుంటున్నాను. భారత ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నది సో కాల్డు అభివృద్ది అయితే నిజమైన అభివృద్ది ఏమిటనేది మీ ద్రుక్కోణములో వివరించగలరు.

  ఇంకో చిన్న వివరణ, ఎవరో పిట్ట అనే పేరుతో బ్లాగులు రాసే వ్యక్తి మొదట మిమ్మల్ని సపోర్టు చేస్తున్నట్టు నటించి తరువాత మిమ్మల్ని విమర్శించడం చేశారు అని మీరు ఒక వ్యాఖ్యలో రాశారు. మీ దృష్టిలో ఉలికిపిట్ట అనే పేరుతో బ్లాగులు రాసే నేనే అయితే మాత్రం .. మీరు పొరపడినట్టు చెప్పగలను. ఎందుకంటే, కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి నాకు ఇలాంటి కుయుక్తులతో పనిలేదు. వారి ఇజాన్నే నేను డైరెక్టుగా ఎదుర్కోగలను. ఇప్పటి వరకూ అలానే చేశాను కూడా. నేను మీ బ్లాగులో కామెంటింది చాలా తక్కువ, బహుషా దీనితో కలిపి రెండో మూడో ఉంటాయి, అవికూడా నా సొంత పేరుతోనే ఉంటాయి.

 2. వీళ్ళు అప్పుడప్పుడూ మారు పేర్లతో వచ్చి నా మీద జాలి ప్రకటిస్తుంటారు. ఈ జాలి ప్రకటించే వాడే అదేదో పిట్ట పేరుతో బ్లాగు నిర్వహిస్తున్నాడనుకుంటా. ఎవరో చెప్పారు. ఆయన అప్పుడప్పుడూ అలా జాలి ప్రకటిస్తూ తనను తాను సింహాసనం పైన కూర్చుండబెట్టుకుని సంతృప్తి పడుతుంటారు కాబోలు.

  నేను సెంకండు పేరాలో చెప్పింది ఈ వాఖ్యం గురించే.

 3. మొదట సపోర్టు చేసి, తర్వాత తిట్టడం మొదలెట్టిన ఆయనే పిట్ట పేరుతో రాసినట్లు నేను రాయలేదు. పిట్ట పేరు గల్లాయనా, సపోర్టు చేసి తిట్టడం మొదలెట్టినాయన ఒకరు కాదన్నది నా దృష్టిలో ఉంది. మీరే కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. దాన్ని వదిలేద్దాం.

  నా మీద జాలి ప్రకటించిన వ్యక్తుల్లో పిట్ట కూడా ఒకరు. ఏమన్నా ఉంటే విమర్శ చేయాలి. ఆ విమర్శకి పునాది ఉండాలి. వివరణ ఉండాలి. అదేమీ లేకుండా ‘ఈయన్ని చూస్తే జాలేస్తోంది’ అని జాలి ప్రకటించడాన్ని ఏమంటారు? ‘జాలేస్తోంది’ అన్నది విమర్శ అవుతుందా? తమను తాము ఎక్కువగా చూపుకుంటూ ‘జాలేస్తోంది’ అంటే విమర్శను ఎదుర్కొంటున్నవారు ఏం అర్ధం చేసుకోవాలి? పిట్ట తమరే అయితే, ఇక అనుమానం ఎందుకు? ఆ విమర్శ మీ పైనే.

  కమ్యూనిజం ఎలా తప్పో ఎందరో పెద్దలు చెప్పారు అనడం తప్ప స్వయంగా ఎలా తప్పో వివరించడం నేను చూడలేదు. ఎలా తప్పో వివరిస్తే చర్చకు ఆస్కారం ఉంటుంది. పెద్దలని అడ్డం తెచ్చుకుని ఫలానాది తప్పే అంటే అది మూఢనమ్మకం అవుతుంది తప్ప చర్చ ఎలా అవుతుంది? జనానికి ఏ మాత్రం సంబంధం లేని ఆర్ధిక విధానాలకు ప్రతినిధి అయిన స్ట్రాస్ కాన్ ని పట్టుకుని సోషలిస్టు అనడం ఎలా సమర్ధించుకోగలరు? సోషలిస్టు పార్టీ అని పేరు పెట్టుకుంటే సోషలిస్టు అయిపోతారా? ఇంత చిన్న విషయం తమకు తట్టకపోవడం ఏమిటి?

  కమ్యూనిజం లేదా మార్క్సిజం లేదా సోషలిజం ని విమర్శించాలనుకుంటే కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కాని ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి. మార్క్సిజం సమాజానికి చెందిన శాస్త్రం కనుక సమాజానికి దానికి పొంతన ఎలా లేదో వివరించాలి. మార్క్సిజం సమాజం గురించి ఏమి చెబుతున్నదో, అది సమాజానికి ఎలా వర్తించకుండా ఉందో వివరించాలి. అలా చేయాలంటే ముందు మార్క్సిజంపైన కనీస అవగాహన ఉండాలి. మార్క్సిజం గురించి తెలుసుకోవడానికి తమరు ఏయే పుస్తకాలు చదివారో తెలియజేయాలి. ఆ విధంగా సొదాహరణంగా సమాజానికీ, మార్క్సిజానికి ఉన్న వైరుధ్యాన్ని వివరించి ఫలానా విషయంలో తప్పు అని చెప్పగలగాలి. అప్పుడు చదివారికి కూడా చర్చ అర్ధవంతంగా ఉంటుంది. మీ వాదన నచ్చితే అవతలివారు తమ అభిప్రాయాలలో తప్పు ఏమన్నా ఉంటే సవరించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

  కాని ఈ చర్చ గెలుపు ఓటముల కోసం కాకుండా మనం తెలుసుకున్నది సరైంది కాదా అన్నది తెలుసుకోవడం కోసం జరిగితేనే దానివలన ఉపయోగం ఉంటుంది. ఈ ఉపయోగం రావడానికి ఒక్కరోజు చాలకపోవచ్చు. కాని ఆ క్రమం మొదలైతే, చర్చలో పాల్గొంటున్నవారందరికీ అదే గొప్ప విజయం.

 4. ఇండియా ఆఫ్ఘనిస్ధాన్ కి ఇప్పటికి రెండు మూడుసార్లు సాయం ప్రకటించింది. ఈ సాయం ఆఫ్ఘన్ ప్రభుత్వం ద్వారా తిరిగి అక్కడ పునర్నిర్మాణంలో కాంట్రాక్టులు పొందిన భారతీయ కాంట్రాక్టర్లకే కేటాయిస్తారు తప్ప అక్కడి ప్రభుత్వం తన అవసరాల రీత్యా తన ఇష్టం వచ్చినపద్ధతిలో వాడుకోవడానికి వీలు ఉండదు. సాయం యొక్క అంతిమ ప్రయోజనం భారత కాంట్రాక్టులదే తప్ప ఆఫ్ఘన్ ప్రజలది కాదు. పునర్నిర్మాణం అన్నది సాధారణంగా ఆయా దేశాల్లో స్ధాపించపదిన కంపెనీల ప్రయోజనానలకు అనుగుణంగానే ఉంటాయి తప్ప ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా జరగవు. కనుక ఇండియా ఆఫ్ఘన్ అభివృద్ధికి చేసే సహాయం ఆఫ్ఘన్ ప్రజలకు అందదు. ప్రజలకు అందని అభివృద్ధి అభివృద్ధి కాదు గనక అది సోకాల్డ్ అభివృద్ధి అన్నాను. ఈ కార్యక్రమాల్లో ఇండియాకి రాజకీయంగా కూడా కొంత లబ్ది జరగవచ్చు. ఆ రాజకీయ లబ్ది మళ్ళీ భారత దేశ రాజకీయ నాయకులు, ధనికులకే ఉపయోగం తప్ప భారత ప్రజలకు కాదు.

  ఆఫ్ఘనిస్ధాన్ లో ఇండియా ప్రయోజనాలంటే ఇండియా ధనికుల ప్రయోజనాలే. అక్కడ పాక్ ప్రయోజనాలన్నా, అమెరికా ప్రయోజనాలన్నా ఆ దేశాల ధనికుల ప్రయోజనాలే. ధనికులు అంటె ఇక్కడ అర్ధం మామాలు ధనికులు కాదు. పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకులు, పరిశ్రమలు నడిపే బిలియనీర్లు అని అర్ధం. ఆ విధంగా ధనికుల ప్రయోజనాల కోసం జరిగే కార్యకలాపాలు ధనికుల అభివృద్ధి కోసం జరిగేవే తప్ప మొత్తంగా దేశ ప్రజల అభివృద్ధి కొసం జరిగేది కాదు. ధనికులకు ప్రయోజనాలు జరిగే సందర్భంలో కొన్ని ఉద్యోగాలు, కొన్ని పనులు సామాన్యులకు దక్కవచ్చు. కాని మరొకరికి ప్రయోజనాలు చేకూర్చుతున్న సందర్భంగా వచ్చే ప్రయోజనాలు వేరు, అసలు ప్రజల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని వారి శ్రమని దేశాభివృద్ధి కోసం వినియోగపరచేలా ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలందరి అభివృద్ధికీ తోడ్పడం వేరు. ఉదాహరణకి భారత్ దేశంలో మిగులు భూములు బోల్డన్ని ఉన్నాయి. పల్లెల్లో భూస్వాములు ఇంకా ఉన్నారు. వీరికి తోడు ఆస్తులు ఇతర రూపాల్లో కంపెనీల చేతుల్లో కేపిటలిస్టుల చేతుల్లో భూములు ఉన్నాయి. నూతన ఆర్ధిక విధానాల తర్వాత భూగరిష్ట పరిమితి చట్టం రద్దు చేసి పరిశ్రమల అవసరాల కొసం అని లక్షల ఎకరాలను విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారులకు ఇచ్చేశారు. అలా ఖాళీగా భూముల్ని గ్రామల్లో ఉద్యోగం లేని నిరక్షరాస్యులకి ఇచ్చినా పంటలు పండించడమే కాకుండా తామూ తిండి తింటారు. కేవలం భూముల్ని సరిగ్గా పంచడం వల్లనే ఈ దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం తగ్గించవచ్చు. వ్యవసాయరంగం అభివృద్ధి చెందితే అది అనివార్యంగా పరిశ్రమలనీ, సేవల రంగాన్నీ, ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. కాని ప్రజల ప్రయోజనాలు పాలకులు దృష్టిలో ఉండవు గనక ఇవేవీ జరగవు,.

  ప్రజలకు ఉపయోగపడేదీ, వారికి పని కల్పించేదీ, వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేదే నిజమైన అభివృద్ధి. పెట్టుబడిదారుడు తన పెట్టుబడితో ఓ పరిశ్రమ పెట్టి కొంతమంది కార్మికుల్ని నియమించుకుని ఉత్పత్తి తీసేది తన లాభాల కోసం తప్ప ప్రజల కొసమో, దేశం కోసమో కాదు. అలా లాభాలు సంపాదించడం ద్వారా తన పెట్టుబడిని మరింత పెంచుకోవడానికి పెట్టుబడిదారుడు ప్రయత్నిస్తున్న సందర్భంలో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఆ కొన్ని ఉద్యోగాలను అభివృద్ధి అని పేర్కొనడం సరైంది కాదు. ఎవరినైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వారినే నేరుగా ఉద్దేశించి కార్యక్రమాలు జరిపితేనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది.

 5. హ హా.. నేనే ఆ పిట్టనన్న మాట. పోనీలెండి. నేను మీ బ్లాగుకు వచ్చి జాలి చూపించాను అని అంటున్నారేమో అనుకున్నాను. నా బ్లాగులో నేను కమ్యూనిస్టుల మీద విసిరిన విసుర్లను గురించి మీరు అలా రాశారని అనికుని వుంటే నవ్వుకుని వదిలేసుండే వాడిని.

  ఇక కమ్యూనిజం అనేది బ్రహ్మ పదార్థం కాదు కదండీ, అర్థం చేసుకోలేక పోవడానికీ, మేధావుల దగ్గరికి వచ్చి వివరణలు కోరడనికి? కమ్యూనిజాన్ని విమర్శించడానికి సొంత బుర్ర చాలు. పెద్దలు చెప్పిన దాన్ని పట్టుకుని వేలాడే అలవాటు నాకు ఎలానూ లేదు. ఒక వేల దేన్నైనా సపోర్టూ చేసినా నా వరకూ నేను విశ్లేశించుకున్న తరువాతనే ఆపనిచేస్తాను.

  జనానికి ఏ మాత్రం సంబంధం లేని ఆర్ధిక విధానాలకు ప్రతినిధి అయిన స్ట్రాస్ కాన్ ని పట్టుకుని సోషలిస్టు అనడం ఎలా సమర్ధించుకోగలరు? సోషలిస్టు పార్టీ అని పేరు పెట్టుకుంటే సోషలిస్టు అయిపోతారా? ఇంత చిన్న విషయం తమకు తట్టకపోవడం ఏమిటి?

  నన్ను మీరు అడిగిన ప్రశ్నలు నిజానికి మిమ్మల్ని మీరు వేసుకోవలసినవి. ఒక సోషలిస్టు పార్టీ మెంబరు, అందునా ప్రెసిదేంటు క్యాండిడేటు అయిన వ్యక్తి సోషలిస్టు కాదు కానీ, IMF చీఫుగా పనిచేస్తే మాత్రం అతను క్యాపలిస్టు అయిపోతాడూ, అతని చేసిన వెధవపనులన్నీ క్యాపటలిజం కారణంగా జరిగినవి అయిపోతాయి కదండీ!!?? WOW.

  నేను రాసింది, అతను క్యాపిటలిస్టుకన్నా సోషలిస్టూ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాటికి కావలసిన లింకులు కూడా ఇవ్వడం జరిగింది.

  సోషలిజాన్ని గురించి అందులోని మూఢవిశ్వాసాల గురించి చెప్పడానికి పుస్తకాలు చదవడం ఒక పద్దతైతే, ఈ అంతర్జాల యుగములో అంతర్జాలము మీద ఆధార పడడం మరొక పద్దతి. నేను ఎక్కువగా రెండో పద్దితినే ఉపయోగిస్తాను. (పుస్తకాలు కొని చదవడం, అదే పనిగా లైబ్రరీకి వెల్లి చదవడం అనేవి ఇప్పుడు కొంచెం కష్టమే, అది కూడా సోషలిజం గురించి తెలుసుకోవడానికి అయితే శుద్ద దండగ).

  చివరగా ఒక మాట, మార్క్సిజాన్ని విమర్శించే వారు అవగాహన లేకే చేస్తున్నారు అన్న అపోహ నుండి మీరు ఎంత త్వరగా బయటకి వస్తే అంత మంచిది. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి.

 6. అక్కడ భారత దేశం చేస్తున్న పనులను గురించి తెలుసుకోవడానికి కనీసం ఇప్పుడైనా గూగులించండి, మీ అపోహలలో నుండి బయట పడే అవకాశముంది. ఉదాహరణకి అక్కడ రోడ్లు వేయడం, హాస్పిటల్లు నిర్మించడం వంటివి అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగ పడతాయి అన్నది కాదనగలరా? సొంత లాభం ఎంతో కొంత లేకుండా మనదేశం ఆపనిచేస్తున్నదని ఎవ్వరూ అనరు.

 7. నా బ్లాగుకి వచ్చి కూడా జాలి ప్రకటించారొకరు, అదీ తమరే అని మిత్రులు చెప్పారు. ‘హ..హ.. హ’ లాంటివి ఇంటర్నెట్ లో మర్యాదకి ఆమడదూరంగా కనిపిస్తాయి నాకు. అవి లేకుండా రాయగలిగితే సంతోషిస్తాను.

  కమ్యూనిజం అర్ధం కాదని ఎవరన్నారు? మీరు మీ బ్లాగ్ లోనే కమ్యూనిజం ఎందుకు సరైంది కాదో పెద్దలు చాలామంది రాశారు కనక ఫ్రెష్ గా చెప్పనవసరం లేదని రాయగా నేను చదివాను. ఒక్క కమ్యూనిజమే కాదు అనేక సిద్ధాంతాలు మేధావుల్ని అడిగి వివరణలు కోరవలసిన అవసరం చాలా ఉంటుంది, మీరై మేధావులైతే తప్ప. నేనైతే మేధావిని కాను. నేను అర్ధం చేసుకున్నదే పరిపూర్ణమని నేనెన్నడూ అనుకోలేదు. అది కరెక్టు కూడా కాదు. ఇక మనకి అంతా అర్ధం అయింది అనుకున్నాక నేర్చుకోవడానికేమీ మిగల్దు. అర్ధంకానిది ఇంకా ఏమైనా ఉందేమో అని శోధన మొదలు పెడితే అర్ధం కానిది అనంతం ఉందని మనకే తెలుస్తుంది. మేధావులతో జరిగే చర్చలు మాత్రమే కాకుండా సామాన్యులతో జరిగే చర్చల ద్వారా కూడా మనకు తెలియని విషయాలు చాలా అర్ధం అవుతాయని నా అనుభవంలో తెలిసిన నిజం. సొంత బుర్ర ఎంత గొప్పదైనా దానినే నమ్ముకుంటే మన బుర్రలో ఉండే లోపాలు ఎన్నటికీ తెలియవు. చుట్టూ ఉన్న పరిస్ధితులతోటీ, మనుషులతోటీ, ఇంకా అనేక రకాల వ్యక్తుల తోటీ నిరంతరం సంభాషిస్తూ (నోటితోనే కానవసరం లేదు), ఘర్షణ (పోట్లాట, కొట్లాటలే కానవసరం లేదు) జరుగుతుంటెనే మన బుర్రలు రిఫ్రెస్ అవుతుంటాయి. చదవడం, రాయడం, చర్చించడం, తెలుసనుకోవడం లాంటి విషయాలకు సంబంధించి నా అభిప్రాయలు ఇవి.

  ఐ.ఎం.ఎఫ్ ఛీఫ్ గా పని చేసినోడు కేపిటలిస్టు కాదా? మరే అర్ధిక సిద్ధాంతాలని ఆయన ప్రతిబింబిస్తున్నాడు? కేపిటలిస్టు ఆర్ధిక సిద్ధాంతాలని అంగీకరించని వారికి ఐ.ఎం.ఎఫ్ పదవి వరిస్తుందని భావించడం సాధ్యమేనా? స్ట్రాస్ కానే అనేకసార్లు పెట్టుబడిదారీ సూత్రాలు వల్లె వేశాడు. ఐ.ఎం.ఎఫ్ నివేదికలు చెబుతాయి, అతను ఏ యిస్టు అన్నది. ప్రతి జి7 సమావేశంలో కూడా స్వేచ్ఛామార్కెట్ ఆర్ధిక విధానం గురించి అమెరికా లెక్చర్లు ఇస్తుంది. ఐ.ఎం.ఎఫ్ ఛీఫ్ నే కేపిటలిస్టు ఆర్ధికవేత్త కాదంటున్న మీరు కేపిటలిజానికి ఏమని అర్ధం ఇస్తారో అర్ధం కాకుండా ఉంది.

  వ్యక్తుల సామాజిక ప్రవర్తనలు వారు నివసిస్తున్న సమాజంతో సంబంధం కలిగి ఉండవా? సామాజిక వ్యవస్ధకు పునాదిగా పని చేసే ఆర్ధిక వ్యవస్ధ ప్రభావాలే సామాజిక వ్యవస్ధపై పడతాయన్నది సోషియాలజీ సూత్రం. ఇంతకీ వ్యక్తుల ప్రవర్తనలు, భావాలు ఎలా రూపొందుతాయని మీరు భావిస్తున్నారు. భావాలు సమాజం నుండి పుడతాయి తప్ప మెదడు నుండి కాదని సోషియాలజీ చెపుతుంది. సమాజం, ప్రకృతి గురించిన జ్ఞానం మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా అతని మెదడుపై ప్రతిబింబించడం నుండే భావాలు పుడతాయని జీవ శాస్త్రం చెబుతుంది. కొన్ని తత్వ శాస్త్రాలు కూడా ఆ విషయాన్ని బోధిస్తాయి. ఆ నేపధ్యంలోనే స్ట్రాస్ కాన్ హోదాకీ, ఆయన ప్రవర్తనకూ సంబంధం ఏర్పడుతుంది.

  స్ట్రాస్ కాన్ సోషలిస్టు కాదు. ఆయన సోషలిస్టు అని చెప్పడానికి మీరు ఏ అంశాలని చూపుతారు? సోషలిజం మూఢ సిద్ధాంతం అని ఎలా అంటున్నారు? మీ అవగాహన చెప్పండి.

  మీకూ ఒక మాట. స్ట్రాస్ కాన్ సోషలిస్టు అని మీరు ఘంటాపధంగా చెప్పగలగడాన్ని బట్టి మీకు మార్క్సిజంపై సరైన అవగాహన లేదని అర్ధం అవుతోంది. ముందు ఆ విషయంలో మనం ఒక స్పష్టతకు వస్తే బైటికి రావలసింది ఎవరో నిర్ణయించుకుందాం. మార్క్సిజాన్ని అవగాహన లేకుండా విమర్శిస్తున్నవారు బోల్డంతమంది. అందులో మీరున్నారో లేదో చర్చించుకుందాం. ముందు స్ట్రాస్ కాన్ సోషలిస్టు ఎలా అయ్యాడో చెప్పండి.

 8. ఎదుటివారు చెప్పేవన్నీ అపోహల వల్లనే చెబుతున్నారు అన్న అపోహలనుండి మీరు బైటికి రావాలసిన అవసరం చాలా కనిపిస్తోంది.

  చర్చ జరగాలంటే అవతలి వ్యక్తి చెబుతున్న విషయాలను కనీసం గౌరవించడం నేర్చుకొవాలి. అది జరగకపోతే చర్చ సజావుగా సాగదు. ఎదుటివారివి అన్నీ అపోహలే అని భావించాక వాటిని గౌరవించాలని అనిపించదు. పైగా వాటిపైనా మనకి ఆధిక్యత వచ్ఛేస్తుంది. ఆ అధిక్యతా భావంలో నిజాలు చూడడం అస్సలు కుదరదు. ఒక్కోసారి ఆ ఆధిక్యత ఎదుటివారిని ఇంకా అవమానించడం వరకూ దారి తీస్తుంది. అందువలన నేను చెప్పేవన్నీ అపోహలు అనడం మాని గౌరవపూర్వకంగా మాట్లాడుకుందాం

  నేను చెప్పిన అంశంలో విషయ సారాన్ని చూడండి. ఆసుపత్రులు, రోడ్లు ప్రజలకు ఉపయోగపడవు అని ఎవరూ అనరు. కాని నేను చెప్పిందేమిటి? ప్రజలనే నేరుగా లక్ష్యంగా చేసుకుని విధానాలు రూపొందించుకుని, వాటిని చిత్త శుద్ధిగా అమలు చేస్తేనే ప్రజల అభివృద్ధికి దోహదపడతాయి. అలా కాక ధనికుల ప్రయోజనాల కొసం చేసే పనుల వల్ల ప్రధాన లబ్ది ధనికులకే లభిస్తుంది. అవి ప్రజలకు కూడా కొంతమేరకు ఉపయోగపడతాయి. ధనికులకోసమే రోడ్లు వెయ్యడం ప్రస్తుత వ్యవస్ధల్లో సాధ్యం కాదు. (ఇజ్రాయెల్ లో తప్ప. అక్కడ యూదుల రోడ్లపైన పాలస్తీనీయులను నడవనివ్వరు) కనుక ఆ మేరకు ప్రజలకు ఉపయోగపడతాయి. కాని అభివృద్ధి పేరిట తీసుకుంటున్న చర్యల ఉద్దేశం ప్రధానంగా ధనికులు. అది ముందు గుర్తించాలి. ప్రజాభివృద్ధి లక్ష్యం అయితే చర్యల స్వభావం పూర్తిగా మారుతుంది.

  జరుగుతున్న చర్యలవలన కొద్దిగా ప్రజలు లాభపడవచ్చు. కాని ప్రజల కోసం చర్యలు రూపొందిస్తే అవి పూర్తిగా ప్రజాభివృద్ధికి దోహదపడతాయి. ప్రజలకోసం ప్రభుత్వం ఏయేచర్యలు చేపట్టాలి అనే విషయంలో కూడా ప్రభుత్వాల స్వభావాన్ని బట్టి నిర్ణయమవుతాయి. ప్రభుత్వాలు ధనికులతో నిర్మితమయ్యి ధనికుల కోసమే పని చేస్తున్నపుడు వారి విధానాలు ప్రధానంగా ధనికులకే ఉపయోగపడతాయి. కొంత ఇతర ప్రజానీకానికీ ఉపయోగపడతాయి. ఆ ‘కొంత’ ను చూపి విధానాలన్ని ప్రజల కోసమే అనడం సరైంది కాదు. ఇక విధానాలు ప్రజల కోసం కాదు, ధనికుల కోసం అని తెలుసుకున్నాక, ప్రజల కోసం విధానాలు ఎప్పుడన్నా రూపొందిస్తున్నాయా ప్రభుత్వాలు అని శోధిస్తే మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి.

  ఆఫ్ఘనిస్ధాన్ లో కాంట్రాక్టులు పొందిన భారత కాంట్రాక్టుల కోసం ఇండియా ప్రధాన లక్ష్యంగా చేసుకుని సహాయం చేసింది. ఆ పనుల వలన ఆఫ్గన్ ప్రజలు కొంతమేరకు లబ్ది పొందితే పొందవచ్చు. అలా కాకుండా భారత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, కేవలం ఆఫ్ఘన్ ప్రజలనే దృస్టిలో పెట్టుకుని పనులు చేస్తే ఆ పనులు ఆఫ్ఘన్లకు కొంత ఉపయోగపడం కాకుండా పూర్తిగా ఉపయోగపడతాయి.

  ఈ చర్చ అంతా నేను ఇండియాను వ్యతిరేకిస్తున్నట్లు, తమరు కష్టపడి సపోర్టు చేస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చాంశం సరిగ్గా లేకపోవడం దీనికి కారణం. భారత పాలకులను భారత ప్రజలనుండి వేరు చేయాలి ఇక్కడ. ఇద్దరి ప్రయోజనాలు వేరు కావని ప్రభుత్వాలే నిరూపిస్తున్నాయి. కనుక భారత ప్రజల ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం పేరుతో భారత కాంట్రాక్ట్రర్ల ప్రయోజనాల కోసం ఆఫ్ఘనిస్ధాన్ కు సహాయం చేస్తున్న భారత పాలకుల విధానాలను నేను ఇక్కడ వ్యతిరేకిస్తున్నాను అని ఇక్కడ గుర్తించాలి.

  గూగులించినప్పుడు అసలు సరుకుతో పాటు తాలు తప్ప అనేకం వస్తాయి. ఏరు కోవాల్సి ఉంటుంది.

 9. తమరు అనే పదం వ్యంగ్యంగా ఉపయోగించేది. దాన్ని గౌరవ సూచకంగా ఉపయోగించడం మాని చాలా కాలమయ్యింది. మీరు నన్ను తమరు తమరు అంటూ వ్యంగ్య బాణాలు వేస్తుంటే నేను వేయడములో తప్పులేదు కదా..?

  మీరు అడిగిన వాటన్నింటికీ నాదగ్గర సమాధానముంది. కానీ వాటిని కామెంట్లలో కన్నా పోస్టూలలో రాస్తేనే ఉపయోగముంటుంది. కాబట్టీ నాబ్లాగులో తప్పకుండా రాస్తాను. రాసినప్పుడు లింకులు ఇక్కడ పోస్టు చేస్తాను వాటిని అనుమతించండి. (అఫ్ కోర్స్, అది మీ ఇష్టం). కాకపోతే, ఇక మీదట కెలుకుడు టపాలు రాయను అని చెప్పేశాను. రాస్తే విశ్లేశంట్మకంగా ఉండే వ్యాసాలు, పరిశోధనాత్మకంగా ఉండేవి రాస్తానన్నాను. కాబట్టి కొంత సమయం పడుతుంది అవి రాయడానికి. నేను రాయబోయే మొదటి టపా..

 10. మీరు, తమరు రెండూ వాడాను నేను. దాన్ని బట్టీ ‘తమరు’ ను కూడా గౌరవంగా వాడానని గమనించవలసింది.

  మీ పోస్టు కోసం చూస్తుంటాను. లింక్ ఎందుకు? నేను రాశాను అని చెప్పండి చాలు నేనే మీ బ్లాగ్ కి వచ్చి చదువుతాను. చర్చ, విషయం వరకే పరిమితం అవుతుందని ఆశిస్తున్నాను. అంతేకాదు. మీరు రాసే పోస్టులకు అసభ్యంగా, వ్యంగ్యంగా, ద్వేషిస్తూ రాసేవాళ్ళు కామెంట్లు ఉండకుండా చూడగలరని ఆశిస్తాను. ఎవరైనా అలా రాస్తే, అటువంటి కామెంటు మీరు ప్రచురిస్తే, నేను కొనసాగించలేనని గమనించగలరు. ఇది షరతు కాదు. నా పరిస్ధితి అదే.

 11. కత్రినాకైఫ్ లాంటి పెళ్ళాం ఒకవైపు,, సీతాదేవి లాంటి తల్లి ఒకవైపు, లేడీ గాగా లాంటి కూతురో అకాన్ లాంటి కొడుకో ఒకవైపు ఉండగా , ఇది చాలదన్నట్లు మొమైత్ ఖాన్ లాంటి గర్ల్ ప్రండ్ ని సెట్ చేసిమరీ అందించే స్నేహితుల్ని ఉంచుకుని, ఇంకా భారమైన నిట్టూర్పులు…అదిరిందయ్యా రామయ్యా !!!!

  ఎంతసేపూ మసాజ్ లు చేయించుకుందామని , కాళ్ళు పట్టించుకుందామనే కానీ పెళ్ళానికీ కోరికలు ఉంటాయనీ వాటిని కాస్త పట్టించుకుందామనీ,బర్మా సుయ్ సుయ్ లాగా ఏళ్ళకు ఏళ్ళు , కుట్లు కుట్టీ కుట్టీ అలసిపోయింది, అసలే కార్తీక మాసం అలసిన దేవేరికి అభ్యంగన స్నానమొనరించి, కాస్త గంధం పూద్దాము, నుదుటున కాస్త తిలకం దిద్దుదాం,బుగ్గన కాస్త చుక్క పెడదాం, కూసింత లేపనం పూస్తే ఉప్పెనంత “ప్రేమ” ని అందిస్తుందన్న అన్న ఆలోచనే లేదు.

  మనస్థత్వ శాస్త్రం చదివి “పనిలేక” పోతే చేతులూరుకోవుగా !!!!

  గోరంక కెందుకే కొండంత అలక… అలకలో ఏముందో తెలుసుకో చిలకా… అని మేడం గారిని (బ్రతుకమ్మని) అడుగుదామనుకున్నా …. సమ్మె విరామం ప్రకటించమని ప్రభుత్వం ఆర్డర్….. శిరసావహించక తప్పుతుందా ???

  http://www.dishant.com/jukebox.php?songid=37544

 12. ‘…’అంత సమయమూ దృశ్యమూ ఎక్కడున్నాయి లేండి. తెలుగు బ్లాగుల్ని రచ్చించాలి, తెలుగు బ్లాగుల్లో ప్రజస్వామ్య పరిరచ్చన చేయాలి. ఎర్రబ్లాగర్లకి ఉరేసుకోనీకి పురికోసలుకట్టాలి. కెలకాలి, కెలకబడాలి, పదిమందిని తిట్టాలి తిట్టించుకోవాలి. మళ్ళీ అప్పుడప్పుడూ ‘…’కొచ్చిన 43 యేళ్లని మురిపెంగా చూసుకోవాలి. చీ ఈ యదవబతుక్కి పుట్టిన్రోజు కూడా అవసరమా అని ఎవడన్నా ఙ్ఞానోదయం చేయాలనిపిస్తే వాడిబారి నుంచీ తెలుగుబ్లాగుల్ని రక్షించాలి.

 13. శేఖర్ గారు,
  పై రెండు కామెంట్లు (KARIHANI మరియూ కీరా దోసకాయ) స్పాం అండి.
  నాక్కూడా వేరే పేరుతో వచ్చాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s