ఇరాక్‌లో అమెరికా దురాక్రమణ యుద్ధం పూర్తయ్యిందట!


ఇరాక్ లో అమెరికా యుద్ధం పూర్తయ్యిందట. అలా అని అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల క్రితం ప్రకటించాడు. ఇరాక్ లో అమెరికా పని పూర్తయినందున ఈ సంవత్సరాంతానికి అక్కడనుండి అమెరికా సైన్యాలన్ని వెనక్కి వస్తాయి అని ఆయన ప్రకటించాడు. “అమెరికా సైనికులు తల ఎత్తుకుని, తమ విజయాన్ని చూసి గర్వపడుతూ, సైన్యానికి మద్దతు ఇవ్వడం కోసం అమెరికా ప్రజలంతా సమైక్యంగా నిలబడి ఉన్నారన్న సంగతిని గుర్తెరిగి ఇరాక్ ని వదిలి ఇళ్ళకు చేరుకుంటారు” అని ఒబామా ప్రకటించాడు.

మిధ్యా అనుకరణను కూడా మిధ్యగా మార్చగలిగిన సత్తా ఒబామాకి ఉన్నదని ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చెప్పవచ్చు. సామూహిక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటివల్ల అమెరికా ప్రజలకు ప్రమాదం ఉన్నదనీ ఇరాక్ పైన అమెరికా దాడి చేసింది. ఆ సామూహిక మారణాయుధాలను ధ్వంసం చేసే లక్ష్యమే ఒక మిధ్య. మిధ్యా పూరితమైన ఆ లక్ష్యం నెరవేరిందనడం మిధ్యానుకరణ. నెరవేరని మిధ్యా లక్స్యాన్ని చూసి అమెరికా ప్రజలు సమైక్యంగా నిలపడి స్వాగతాలు చెప్పడం మరొక మిధ్య. ఈ అన్ని మిధ్యలని ఒబామా ఒక్క ప్రకటనతో నిజం చేసేశాడు.

అమెరికా సైన్యాలన్నీ ఉపసంహరించుకుంటారు సరే, మరి ప్రత్యేక సైన్యాలను ఏం చేయనున్నట్లు? ప్రత్యేక బలగాలను సైన్యంగానే చూడరు కనుక వారి ఉపసంహరణ ప్రసక్తే ఉండదు కాబోలు. పోరాడడానికి వినియోగించని ‘పోరాట సైనికులను’ ఉపసంహరించారనుకున్నా, అమెరికా ఎంబసీ వద్ద కపాలా ఉన్న మెరైన్ సైనికులను లెక్కించకపోయినా, ఇంకా 5000 మంది అమెరికా కిరాయి బలగాలు శాశ్వతంగా ఇరాక్ లో ఉండబోతున్నాయి. రక్షణ శాఖకు బదులు విదేశాంగ శాఖ వారికి బాధ్యతవహించబోతున్నది. కాని చంపడానికి అద్దెకు తీసుకున్న హంతకులు దౌత్యాధికారులుగా ఎలా మారతారన్నదే అసలు ప్రశ్న!

తొమ్మిది సంవత్సరాల పాటు ఇరాక్ లో హత్యాకాండ నిర్వహించిన సంగతిని ‘అమెరికా సైనికులు విజయగర్వంగా తిరిగి వస్తున్నారు’ అనీ ‘వారికి స్వాగతం పలకడానికి అమెరికన్లు సమైక్యం నిలబడి ఉన్నారు’ అనీ అభివర్ణిస్తూ దాచిపెట్టాలని ఒబామా ప్రయత్నిస్తున్నాడు. కాని తొమ్మిది సంవత్సరాల యుద్ధాన్ని ఎవరూ ప్రశ్నించరా? 800 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి సాధించేమిటని ఎవరూ నిలదీయరా?

ఇరాక్ యుద్ధం ముగిసిందా? లేక ముగించవలసి వచ్చిందా? ఇలానే అబద్ధాలనే వల్లించడానికి అమెరికా అధ్యక్షుడికి అనుమతిస్తే నిజం ఎప్పటికి తెలిసేను? నిజానికి ఈ సంవత్సరాంతమే కాదు, ఇంకా మరిన్ని దశాబ్ధాలు కూడా అమెరికా సైన్యాలు ఇరాక్ లో ఉండాలనే అమెరికా పాలకవర్గాలు కోరుకున్నాయి. కాని ఇరాక్ ప్రజలు అందుకు ఒప్పుకోలేదు. ఇరాక్ ప్రజల నిరసనలతో ఇరాక్ ప్రభుత్వం పార్లమెంటు ద్వారానే ఒక నిర్ణయం చేసింది. “రానున్న జనవరి 1 తర్వాత ఇరాక్ లో నేరాలకు పాల్పడిన విదేశీ సైన్యాలను ఇరాకీ కోర్టుల్లో విచారించి శిక్షలు వేస్తాము” అన్నదే ఆ నిర్ణయం. అంటే జనవరి 1 తర్వాత ఇరాక్ లో కొనసాగే అమెరికా సైన్యాలు గతంలో ఎన్నడైనా ఇరాక్ లో నేరాలకు పాల్పడి ఉన్నట్లయితే వారిని విచారిస్తామని పార్లమెంటు నిర్ణయించింది. ఇరాక్ పై దురాక్రమణ చేయడమే పెద్ద నేరం. ఇరాక్ లోకి వచ్చాక అమెరికా సైన్యాలు చేయని నేరం ఏముంది గనక? అందుకే అనివార్యంగా ఇరాక్ నుండి అమెరికా సైన్యాలను ఉపసంహరించుకుంటున్నామని తమ ప్రజలకు చెప్పగల ధైర్యం ఒబామాకి ఉన్నదా?

ఇరాక్ యుద్ధంలో 4000 మంది అమెరికా సైనికులు మరణించారు. పదుల వేలమంది గాయపడి అవయవాలు పోగొట్టుకుని వికలాంగులుగా మారారు. కొన్ని వందల వేలమంది యుద్ధం మిగిల్చిన మానసిక గాయలతో తీసుకుంటూ అనేక మానక సమస్యలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. వీరందరికీ నిజానికి ఇరాక్ యుద్ధం ముగిసినట్లేనా? ఇరాక్ యుద్ధంలో పని చేసి రిటైరైన మాట్ సౌత్ వర్త్ అనే ఆయన (వెటరన్స్ ఫర్ పీస్ సంస్ధ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా పని చేస్తున్నాడీయన) యుద్ధం గురించి ఇలా అంటున్నాడు, “ఇరాక్ లో అమెరికా చేస్తున్న యుద్ధంలో నా మొదటి స్నేహితుడు ఐ.ఇ.డి బాంబు వల్ల ఫిబ్రవరి 2004లో చనిపోయాడు. ఇటీవల చనిపోయిన నా మిత్రుడు సెప్టెంబరు 2011 లో చనిపోయాడు. నా విషయంలో యుద్ధం ఎన్నటికీ అంతం కాదు. యుద్ధం మిగిల్చిన గాయాల మాసికలతో, మానసిక దౌర్భల్యంతో నేను నా జీవితమంతా బతకవలసి ఉంటుంది. అది నాకు ఇష్టం ఉన్నా లేకున్నా తప్పదు. ఈ యుద్ధం, నాకు, నాలాంటి ఇంకా ఎంతో మందికి జీవితం అంతా ఉంటుంది.” అమెరికన్లకు కూడా ఇరాక్ యుద్ధం నిజంగానే ముగిసిందా?

అమెరికన్ల పరిస్ధితి నిజంగా దారుణమే. మరి పన్నెండు సంవత్సరాల పాటు అమెరికా తదితర పశ్చిమ దేశాలు విధించిన అమానుషమైన ఆంక్షలను ఇరాకీయులు భరించారు. పసి పిల్లలకు ఇవ్వాల్సిన పాలడబ్బాల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించి ఐదు లక్షల మంది ఇరాక్ పిల్లల ఉసురు పోసుకున్నారు. ఆ తర్వాత మరో తొమ్మిది సంవత్సరాల పాటు సామూహిక మారణాయుధాలను తలదన్నే సామూహిక హత్యాకాండలను ఇరాక్ ప్రజలపై మోపారు. రెండు దశాబ్దాల యుద్ధం మిగిల్చిన అనంత గాయాల్ని, దుఃఖాన్నీ, వేదననూ, దరిద్రాన్నీ, అనాధరికాన్నీ ఇరాకీయులు మోశారు. వారికి ఈ యుద్ధం ఎన్నటికి ముగిసేను? ఒక తరంతో ముగిసే దుఃఖమా అది? ఒక తరంతో తీరే కష్టమా అది? వారికి ఒబామా చెప్పదలుచుకున్నదేమిటి?

ఇరాకీయులు భరించిన కష్టాలను, నష్టాలనూ అమెరికా లోకి తర్జుమా చేస్తే ఎలా ఉంటుంది? ఇరాక్ పైన జరిగిన యుద్ధం అమెరికాపైనే జరిగి అక్కడ జరిగిన నష్టమే ఇక్కడా జరిగిందని భావిస్తే ఊహించగలమా? యునిసెఫ్, ఐక్యరాజ్యసమితి లే కాక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు బ్రిటిష్ మెడికల్ పత్రిక లాన్సెట్ లో ప్రచురించిన దాని ప్రకారం అదెలా ఉంటుందో చూస్తే:


 • అట్లాంటా, డెన్వర్, బోస్టన్, సియాటెల్, మిల్వాకీ, ఫోర్ట్ వర్త్, బాల్టిమోర్, సాన్ ఫ్రాన్సిస్కో, డల్లాస్, ఫిలడెల్ఫియా నగరాలలో ప్రతి ఒక్క వ్యక్తి చనిపోయినట్లే.
 • వెర్మోంట్, డెలావేర్, హవాయ్, ఇదాహో, నెబ్రాస్కా, నెవాడా, కాన్సాస్, మిస్సిసిపి, లోవా, ఒరెగాన్, సౌత్ కరోలినా, కొలరాడో నగరాల్లో ప్రతి ఒక్క వ్యక్తీ గాయపడినట్లే.
 • ఓహియో, న్యూ జెర్సీ రాష్ట్రాల్లో ఉన్న జనాభా అంతా ఇళ్ళు లేకుండా పోయినట్లే. ఏ స్నేహితుల ఇళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో లేదా ఏ బ్రిడ్జి కిందో తలదాచుకుంటున్నట్లే.
 • మిచిగాన్, ఇండియానా, కెంటకీ రాష్ట్రాల జనాభా మొత్తం తమ ఇళ్లు వదిలిపెట్టి కెనడా, మెక్సికోలకు పారిపోయినట్లే.
 • గత మూడు సంవత్సరాలలోనే ప్రతి నలుగురు అమెరికన్ డాక్టర్లలో ఒకరు దేశం వదిలి వెళ్లిపోయినట్లే. గత ఒక్క సంవత్సరంలోనే 3000 మంది డాక్టర్లు కిడ్నాప్ కు గురికాగా, మరో 800 మంది హత్య చేయబడినట్లు.
 • ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికన్లను రక్షించడానికి ఎవరూ లేరన్నమాటే. నరకంలో జీవిస్తున్నట్లే.


ఇరాకీయులు ఈ కష్టాల్ని భరించారు. ఇంకా భరిస్తున్నారు. ఇరాకీయులు స్ధానంలో అమెరికన్లు అని ప్రతిక్షేపించుకుంటే పై ఫలితాలు వస్తాయి.

ఇరాకీలకు నష్టాన్ని తిరిగి చెల్లించదలిస్తే అమెరికా ఏం చేయవలసి ఉంటుంది? ఇరాక్ యుద్ధాన్ని ఈ కష్టాలతో, నష్టాలతో ఇరాకీయులను వదిలేయకుండా ఇరాక్ యుద్ధం ఇంకా ముగియకుండా ఉండాలంటే అమెరికా ఏం చేయాలి? ఇరాక్ లో అమెరికా సర్వనాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని తిరిగి బతికించి పూర్వ స్ధాయికి తేవాలి. విధ్వంసం కావించిన మౌలిక నిర్మాణాలను, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ నిర్మించి ఇవ్వాలి. యురేనియం ఆయుధాలు వాడడం వలన బాల్యంలోనే కేన్సర్ బారిన పడుతున్నవారి కోసం, వికలాంగుల కోసం పెద్ద నిధిని ఏర్పాటు చేయాలి.

రెండు దశాబ్దాల క్రితం నికరాగువాలో మొత్తం జనాభానే భయభ్రాంతులను చేసింది అమెరికా. అక్కడి జనాన్ని సమాజానికి వ్యర్ధంగా మార్చివేశారు. వారి కరెన్సీ వ్యవస్ధను నిలువునా పాతరేశాం. అన్ని చేసి చివరికి సింపుల్ గా బైటికి వచ్చేశారు. “ఆ యుద్ధం ముగిసింది” అని జాలీగా చెప్పుకుంటారు అమెరికన్ పాలకులు. మరో అధ్యక్షుడు మారాక మరో దేశం. ఆ తర్వాత ఇంకో దేశానికి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అమెరికా. ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. చేసిందంతా మర్చిపోయి మరొక దేశంపై దాడి, ఆ తర్వాత ఇంకొక దేశం, దాని తర్వాత ఇంకా… ఇంకా ఎన్ని? సిరియా? ఇరాన్? వెనిజులా?… ఎన్నెన్ని?

ప్రపంచ ప్రజ అనంతకాలం చూస్తూ ఉంటుందని భావించడం భ్రమగా మిగులుతుంది. ఇరాక్ ఇప్పటికే చాచి కొట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో కన్ను లొట్టపోవడమే కాదు, చావూ తప్పదేమో. ప్రపంచ ప్రజానీకం ఆ యుద్ధమేదో అమెరికాకే తెచ్చేవరకూ అమెరికా ఇంతేనా? అమెరికా ప్రజలే నిర్ణయించుకోవాలి.

One thought on “ఇరాక్‌లో అమెరికా దురాక్రమణ యుద్ధం పూర్తయ్యిందట!

 1. ప్రపంచ దేశాలకు, ఐరాసాకు సరే, కనీసం ఆమెరికా తనదేశ సెనెట్‌కైనా కనీసం ఇరాక్ పై యుద్ధం(దురాక్రమణ) ఎందుకు చేయవలసివచ్చిందో సక్రమమైన /ఖచ్చితమైన కారణం చెప్పిందా? యింకా (దాదాపు పది సంవత్సరాల నుండి) కారణం కోసం వెతుకుతూనే వుందనుకుంట ;-(

  కాని సాఫ్ట్‌వేర్ డాలర్ల బిచ్చగాళ్ళు మాత్రం ఇరాక్ దగ్గర బయో వెపన్స్ వుండటం వలననే ఆమెరికా యుద్ధంచేయవలసి వచ్చిందని, సధ్దాంని చంపి ప్రపంచానికి మేలు చేసిందని వాదించడానికి నాకు తెలిసిన కారణాలు..
  ౧. ఆమెరికా పెత్తందారీ తనానికి గులాంగిరికి మానసికంగా సిద్ధపడటం
  ౨. స్వమతాభిమానంతో ముస్లింజాతిపై ద్వేషం
  ౩. ఆమెరికా చల్లగా వుంటేనే వీరికి పూటగడిసేది. ఆందుకే ఏ సంధర్బంలోనైనా అమెరికా ఏంచెబితే అదే నిజం అదే వేదం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s