పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా


పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు భావిస్తున్నారు. టెర్రరిస్టు దాడుల పేరు చెప్పి ఇండీయా సందర్శనపట్ల భయం పెంచడం సరికాదని వారు భావిస్తున్నారు.

“విదేశీ మంత్రిత్వ శాఖతో నేను ఈ అంశంపై చర్చించాను. ఇండియా సందర్శించవద్దని చెప్పిన దేశాలకు నచ్చజెప్పి వారి సలహాలను వెంటనే ఉపసంహరించమని కోరవలసిందిగా వారితో చెప్పాను” అని టూరిజం శాఖ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. “భయపెట్టడం తప్ప మరొకటి కాదిది. ఇతర ప్రాంతాల సంగతి అలా ఉంచండి జమ్ము&కాశ్మీరు రాష్ట్రం నుండే 100 శాతం బుకింగ్ జరుగుతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. సాధారణ పరిస్ధితులు నెలకొని ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటె రుజువేంకావాలి? సాధారణ పరిస్ధితి ఇది కాక మరొకటేంటి?” అని ఆయన ప్రశ్నించాడు.

ఐదు దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీ వలన కనీసం 10 నుండి 15 శాతం వరకూ బుకింగులు రద్దవుతాయని టూరిజం పరిశ్రమకు చెందినవారు భావిస్తున్నారు. ఇటువంటి అడ్వైజరీల వలన రిస్కు పెరుగుతుందన్న భావన కలగడం వలన ట్రావెల్ ఇన్సూరెన్సు ధరలు కూడా పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఇండియా రావడానికి బదులు అనేకమంది టూరిస్టులు ధాయిలాండ్, శ్రీలంక, చైనా దేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపుతారని వారు చెబుతున్నారు.

హోటల్ పరిశ్రమకు చెందినవారు, ట్రావెల్ ఏజెంట్లు, రెస్టారెంట్ అధిపతులు కేంద్రమంత్రి సుభోధ్ కాంత్ సహాయ్ ను కలిసినట్లు తెలుస్తోంది. విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో చర్చించడంతో పాటు ఆయన ఈ అంశాన్ని ఫ్రాన్సులో జరుగుతున్న జి20 టూరిజం మంత్రుల సమావేశంలో కూడా సోమవారం ప్రస్తావించాడు. ఇండియా టూరిజం పరిశ్రమ అభివృద్ధికి ఆటంకాలు కలిగించడం పట్ల సమావేశాల్లో తన అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశాడు.

జనవరి – ఆగస్టు 2011 నెలల మధ్య కాలంలో ఇండియా సందర్శించే విదేశీ టూరిస్టుల సంఖ్య 10 శాతం పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే ఈ కాలంలో గత సంవత్సరం 3.4 మంది విదేశీయులు భారత్ సందర్శించగా, ఈ సంవత్సరం అది 3.8 మిలియన్లకు పెరిగింది. అయినప్పటికీ ధాయిలాండ్ దేశాలతో పోలిస్తే టూరిస్టులను ఆకర్షించడంలో ఇండియా వెనకబడే ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రపంచం మొత్తం మీద టూరిస్టులలో ఇండియా వస్తున్న టూరిస్టుల సంఖ్య 0.59 శాతం మాత్రమే ఉండగా, ధాయిలాండ్ కు 1.62 శాతం మంది, చైనాకు 5.8 శాతం మంది టూరిస్టులు వెళ్తున్నారు. ఇండియాలో అత్యంత పాపులర్ బీచ్ కు సంవత్సరానికి 2.7 మిలియన్ల మంది విదేశీ టూరిస్టులు వస్తుండగా, ధాయిలాండ్ లోని ఫుకెట్ బీచ్ కి సంవత్సరానికి 5 మిలియన్ల మంది వస్తున్నారు. తాజ్ మహల్ సందర్శనకు సంవత్సరానికి 3.1 మిలియన్లు టూరిస్టులు వస్తుండగా, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శనకు 10 మిలియన్ల మంది వస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియాకు ఆకర్షితులయ్యే విదేశీ టూరిస్టుల సంఖ్య ఇంకా పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయనీ, ఆ శక్తి ఇండియాకు ఉన్నదనీ భారత దేశ టూరిజం పరిశ్రమల యజమానులు భావిస్తుండగా, ఐదు దేశాలు దానికి వ్యతిరేకంగా సలహా ఇవ్వడం వారిని నిరాశపరిచింది. ఈ ప్రభావం ఇతర దేశాల టూరిస్టులపై కూడా పడుతుందని వారు భయపడుతున్నారు. అధిక సంఖ్యలో టూరిస్టులు రాగల అమెరికా, ఇంగ్లండ్ దేశాలే ప్రతికూల సలహాలు ఇచ్చినందున పరిశ్రమకు గణనీయ నష్టం వస్తుందని హోటల యజమానుల సంఘం తెలిపింది. ట్రావెల్ ఏజంట్ల సంఘం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

టూరిస్టులను ఆకర్షించడానికి ప్రయత్నించడంలో భారత దేశం ఎన్ని చర్యలైనా తీసుకోవచ్చు గానీ ధాయిలాండ్ లాంటి దేశాలతో పోటీపడే విషయంలో కాస్త వెనకాముందూ ఆలోచించడం అవసరం. ధాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లాంటి నగరాలు సెక్స్ టూరిజానికి పేరెన్నికగన్న నగరాలు. పశ్చిమ దేశాలనుండి దిగుమతి చేసుకున్న విష సంస్కృతితో సెక్స్ టూరిజాన్ని అభివృద్ధి చేసుకున్న వారితో ఇండియా పోటీపడకపోతేనే నయం. సహజ సిద్ధమైన భారత ప్రదేశాలాను, భారత దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో ఉన్న వివిధ సంస్కృతులను మరింత అభివృద్ధి చేసుకోవడం ద్వారా టూరిజం ఆకర్షించగలిగితే అది కలకాలం నిలుస్తుందని మన పాలకులు గ్రహించవలసిన అవసరం ఉంది.

2 thoughts on “పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

  1. పండగమాట, టెర్రరిస్టుల మాట దేవుడు ఎరుగు. అసలు ఈ అయిదు దేశాలలో పౌరులకి భద్రత ఎంత వున్నది. బయటకు వెళ్ళేటప్పుడు దొంగలకోసం కాసిని డబ్బులు జేబులో వేసుకొని వెళ్ళక పోతే ప్రణాలకే ముప్పు వున్న ఈ దేశాల అతి చూస్తే గురివింద సామెత గుర్తుకు రాక మానదు.

    ప్రపంచంలో కల్లా తామే అన్ని విధాల అభివృధి చెదామన్న దేశాలలో ప్రజలు కూడా ఎంత గొప్పవారో అమెరికాలో తుఫాను వచ్చినప్పుడు బయటపడింది; సహాయం చెయ్యక పోగా రేపులు, దొంగతనాలు చేశారు. అదే మన దేశంలో ముంబైలో వరదలు వచ్చినప్పుడు స్లంస్ లో ప్రజలు ప్రమాదంలో వున్న వారిని కాపాడటమేగాక, చాలామెందికి తినటానికి ఉప్మా తదితరాలు ఇచ్చి సహాయ పడ్డారు.

    ఈ తెల్ల దేశాలలో వున్న అభద్రతా భావాన్ని అందరికీ అంటగడుతున్నారు. వీరి అతి పిచ్చి వాదనలకి మన దేశం ఏమీ ప్రతిస్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ దేశాల కుళ్ళు తనం చరిత్ర చెపుతోనే వున్నది కదా!!!

  2. అవును, బాగా చెప్పారు. ఆ తెల్లదేశాలకి వలస వెళ్ళిన మనవాళ్ళు, వాళ్లని నెత్తిన పెట్టుకుని ఇక్కడి వాళ్ళని దూషించడానికి కూడా వెనకాడ్డం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s