వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు పెంచాక అది తగ్గకుండానే వడ్డీ రేట్లు పెంచే ద్రవ్య విధానాన్ని మార్చినట్లయితే ప్రతికూల ప్రభావాలను కలుగుచేస్తుందని చెప్పాడు. మైక్రో ఫైనాన్స్ రంగంలో ఎన్.బి.ఎఫ్.సి-ఎం.ఎఫ్ఐ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ – మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్) లను నెలకొల్పడానికి ఆర్.బి.ఐ అనుమతి నిచ్చింది.

తాజా ద్రవ్య విధానం సమీక్ష సందర్భంగా ఆర్.బి.ఐ మరొక ముఖ్య నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ బేంక్ ఎకౌంట్ల డిపాజిట్లపై వడ్డీ రేటును డీ రెగ్యులేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇక బ్యాంకులు తమ సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్లకు ఎంత వడ్డీ రేటు ఇవ్వవలసిందీ తామే నిర్ణయించవచ్చు. అయితే ఇందులో లక్ష రూపాయల పరిమితి పెడుతున్నట్లుగా సుబ్బారావు తెలిపాడు. లక్ష రూపాయల డిపాజిట్లవరకూ బ్యాంకులన్నీ ఒకే వడ్డీ రేటు చెల్లించాలనీ, లక్ష రూ.లు దాటిన డిపాజిట్లపైనే తమకు అనువైన వడ్డీ రేటు ఇవ్వవచ్చనీ తెలిపాడు. డిపాజిట్ల సేకరణ కోసం అధిక వడ్డీ రేట్లు చెల్లించడానికి బ్యాంకులు అనారోగ్యకర పద్ధతిలో పోటీపడే అవకాశం ఉన్నందున ఈ నిబంధన విధించారని భావించవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు ఇప్పుడు 4 శాతం వార్షిక వడ్డీ ఇస్తున్నారు.

ద్రవ్యోల్బణం డిసెంబరు నుండి తగ్గడం మొదలవుతుందని ఆర్.బి.ఐ గవర్నర్ హామీ ఇచ్చాడు. మార్చి నాటికల్లా ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆయన ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.72 శాతంగా ఉంది. మార్చి 2010 నుండి ఇప్పటివరకు పెంచిన మొత్తాన్ని చూసినట్లయితే 525 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటును ఆర్.బి.ఐ పెంచింది. అంటే మార్చి 2010 లో 3.25 శాతం ఉన్న వడ్డీ రేటును పదమూడు సార్లు 5.25 శాతం మేరకు పెంచడం వలన ప్రస్తుతం ఐది 8.5 శాతానికి చేరుకుంది. డిసెంబరులో మళ్ళీ ద్రవ్య విధానాన్ని సమీక్షించేటప్పుడు వడ్డీ రేటు పెంచే అవకాశాలు “సాపేక్షికంగా తక్కువ”గా ఉన్నాయని ఆర్.బి.ఐ తెలిపింది. దీనితో షేర్ మార్కెట్లు స్వల్పంగా లాభాలను చవిచూశాయి.

రివర్స్ రెపో రేటు, కేష్ రిజర్వ రేషియో లను పెంచకుండా ఆర్.బి.ఐ అట్టే పెట్టింది. ఇవి రెండూ ప్రస్తుతం 6 శాతంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించడం, దేశీయంగా అధిక ద్రవ్యోల్బణం వెంటాడుతుండడం వలన ఈ సంవత్సరం జిడిపి వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుందని తాజా సమీక్షలో ఆర్.బి.ఐ అంచనా వేసింది. గత సమీక్షలో ఇది 8 శాతం ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడని 7.6 శాతానికి తగ్గడం గమనార్హం. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్, ఆర్ధిక మంత్రి ప్రణబ్ లు మాత్రం ఇండియా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెబుతున్నారు.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మేక్రో ఎకానమీ పరిస్ధితులు, కమోడిటీల ధరలు, ప్రభుత్వ ఖర్చులు పెరగడం వల్ల కూడా జిడిపి వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ద్రవ్య విధాన సమీక్ష తెలిపింది. ప్రభుత్వ ఖర్చులు పెరగడం వలన ప్రవేటు పెట్టుబడులు తగ్గిపోతాయని సమీక్ష అభిప్రాయపడింది. ఇది కూడా జిడిపి పై ప్రభావితం చూపుతుందని సమీక్ష తెలిపింది. టైర్ 2 నగరాల్లో కమర్షియల్ బ్యాంకులు కొత్త బ్రాంచిలు నెలకొల్పడానికి ఇకనుండి ఆర్.బి.ఐ అనుమతి తీసుకోనవసరం లేదు. సి.డి.ఎస్ (క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్) విషయంలో అంతిమ మార్గదర్శక సూత్రాలను నవంబరు ఆఖరుకల్లా జారీ చేస్తారని ఆర్.బి.ఐ తెలిపింది. బేసెల్-III ఫ్రేమ్ వర్క్ లోకి బ్యాంకులు మారవలసి ఉన్నందున సంబంధిత మార్గదర్శక సూత్రాలను కూడా డిసెంబరు ఆఖరుకల్లా రూపొందిస్తామని సమీక్షలో ఆర్.బి.ఐ తెలిపింది.

గత సమీక్షలలో తీసుకున్న నిర్ణయాల ఫలితం ఇంకా పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధపై ప్రతిఫలించలేదనీ కనుక ద్రవ్యోల్బణం కట్టడి చేసే విధానం వీడలేమనీ సుబ్బారావు సమీక్షలో పేర్కొన్నాడు. ద్రవ్యోల్బణంపై దృష్టి కేంద్రీకరించడం ఆర్.బి.ఐ కొనసాగిస్తుందనీ తెలిపాడు. ప్రపంచ స్ధాయిలో చూస్తే ఇండియాయే అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. బ్రిక్ దేశాల కూటమిలో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) కూడా ఇండియాలోనే అధిక ద్రవ్యోల్బణం ఉంది. బ్రెజిల్, ఇండోనేషియా, సింగపూర్ లాంటి దేశాల్లోనైతే వడ్డీ రేట్లను తగ్గించడం కూడా ప్రారంభమైంది.

భారత దేశ ద్రవ్యోల్బణం ప్రధానంగా అధిక ఆహార ధరలు, ప్రపంచస్ధాయిలో కమోడిటీల ధరలు పెరగడం, డిమాండ్ పెంచడానికి అనుకూలమైన కోశాగార విధానాలను అనుసరించడం కారణాల వలన పెరుగుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఆర్.బి.ఐ రూపొందించే మానిటరీ పాలసీకి అతీతమైనవి గనక ఆర్.బి.ఐ తీసుకునే చర్యలకు ద్రవ్యోల్బణం ప్రభావితం కావడం జరగదనీ కనుక అదేపనిగా వడ్డీ రేట్లు పెంచుతూ పోవడాన్ని ఆర్.బి.ఐ కట్టిపెట్టాలనీ వారు చెబుతున్నారు. ఇవన్నీ కాక హవాలా మార్గాల్లో దేశంలోకి వచ్చిపడుతున్న నల్లధనం, ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.డి.ఐ ల పేరుతో కూడా భారతీయుల నల్లధనం ఇండియాలోకి వెల్లువెత్తుతుండడం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం అసాధ్యం చేస్తున్నాయి. నల్లధనం కట్టడి ప్రభుత్వాల ఎజెండాలో లేదు కనక ఆ మేరకు ప్రజలు ద్రవ్యోల్బణం భారాన్ని మోస్తూనే ఉండాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s