మీ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి -యూరప్ తో చైనా


యూరప్ దేశాలు తమ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం చైనా హెచ్చరిక లాంటి కోరిక కోరింది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గ్రీసుకు గత సంవత్సరం బెయిలౌట్ పేరుతో ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా రుణ ప్యాకేజి ప్రకటించి దశలవారీగా ఇస్తున్నాయి. ఈ లోపు గ్రీసు దేశంపైన విషమ షరతులను విధించింది. ఒక్కో రుణ వాయిదా అందుకోవడానికి కొన్ని షరతులు విధించి అవి అమలు చేస్తేనే ఒక్కొక్క వాయిదా విడుదల చేస్తున్నాయి. ప్రతి వాయిదాకీ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు చెల్లిస్తాయా లేదా అన్న అనుమానాలూ, టెన్షన్ తప్పడం లేదు. షరతులు పూర్తి చేయడంలో గ్రీసు వెనకబడుతుండడమే దానికి కారణమని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు పరోక్షంగా చెబుతున్నాయి.

అయితే, షరతులు అమలు చేయడం అంటే గ్రీసు ప్రజలపైన మరిన్ని మోయలేని భారాలను మోపడమే. ప్రభుత్వ రంగం మొత్తాన్ని ఈ వంకతో ప్రవేటు కంపెనీలకు చౌకగా అమ్మేలా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుపై ఒత్తిడి చేస్తున్నాయి. కార్మికుల ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో రద్దు చేయడంతో పాటు ఉన్న కార్మికులకు వేతనాల కోత, సదుపాయాల రద్దు విధిస్తున్నాయి. ఇప్పటికే గ్రీసు ప్రభుత్వం 20 శాతం వేతనాల కోత విధించినప్పటికీ, మరో 20 శాతం కోత విధించాలని అవి ఒత్తిడి చేస్తున్నాయి. షరతులకు తలొగ్గిన గ్రీసు ప్రభుత్వం ఆమేరకు వేతనాల కోత, సంక్షేమ సదుపాయాల కోత, పన్నుల పెంపు తదితర చర్యలతో కూడిన పొదుపు విధానాలను రూపొందించి పార్లమెంటు చేత ఆమోదింపజేసుకుంది. ఇన్ని చేస్తున్నప్పటికీ మరుసటి వాయిదాకు మరిన్ని షరతులను ఐ.ఎం.ఎఫ్, ఇ.యు లు విధిస్తున్నాయి. దానితో గ్రీసు ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారు.

ఈ పరిస్ధితుల్లో చైనా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అనేక మార్లు యూరప్‌ను ఆదుకుంటానని ప్రకటించింది. రుణ సంక్షోభం నుండి యూరప్ బైటపడడానికి అవసరమైన సహాయం చేస్తానని గతంలో వాగ్దానాలు చేసింది. యూరోపియన్ యూనియన్ నాయకులు సైతం సాయం చేయవలసిందిగా చైనాను కోరారు. ముఖ్యంగా యూరో జోన్ దేశాల రుణ బాండ్లను కొనుగోలు చేయాలని (అంటే అప్పు ఇమ్మని కోరడమే) కోరారు. ఆ మేరకు చైనా కూడా హామీ ఇచ్చింది. సాయం చేస్తానని హామీ ఇచ్చిన చైనా, ఇపుడు యూరోప్ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలనీ, సంక్షోభం ఇతర దేశాలకు పాకకముందే జాగ్రత్త వహించాలని కోరడాన్ని బట్టి యూరప్ రుణ సంక్షోభం (లేదా గ్రీసు రుణ సంక్షోభం) పట్ల చైనా కూడా ఆందోళన పడుతున్నదని అర్ధం చేసుకోవచ్చు.

చైనా తన విదేశీమారక ద్రవ్య నిల్వలను ప్రధానంగా డాలర్లలో పెట్టుబడి పెట్టినప్పటికీ యూరోలలో సైతం గణనీయంగానే పెట్టుబడి పెట్టింది. చైనా వద్ద దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలున్నాయని అంచనా (చైనా తన విదేశీమారక ద్రవ్య నిల్వలు ఎక్కడెక్కడ ఉంచిందీ వివరాలు బైటికి చెప్పదు. వివిధ వ్యాపారాను బట్టి విశ్లేషకులే అంచనా వేస్తుంటారు) వేస్తుండగా అందులో 600 బిలియన్ యూరోలు, అంటే దాదాపు 25 శాతం, యూరోలలో పెట్టుబడులు పెట్టింది. అంటే అంతమేరకు యూరోజోన్ దేశాలకు చైనా రుణాలిచ్చింది. కనుక చైనా యూరో జోన్ రుణ సంక్షోభం పట్ల ఆందోళన చెందడం సహజమే. సంక్షోభం వలన యూరో విలువ తగ్గినట్లయితే చైనా విదేశీమారక ద్రవ్య నిల్వల మొత్తం విలువ తగ్గిపోతుందన్నది చైనా భయం.

“యూరో రుణ సంక్షోభం పరిష్కరించుకోడానికీ, సంక్షోభం ఇతర దేశాలకు పాకకుండా ఉండడానికీ ఇ.యు దేశాలన్నీ సాధ్యమైనంత త్వరగా ఒక సమగ్ర ఒప్పందానికి వస్తాయని మేము నమ్ముతున్నాం” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియాంగ్ యు పేర్కొంది. “ఈ ఆటంకాలను అధిగమించగల సామర్ధ్యం ఇ.యు కి ఉన్నదని చైనా విశ్వాసంతో ఉంది. ద్వైపాక్షిక మార్గాలలో, బహుళపక్ష మార్గాలలో సంబంధిత దేశాలకు అవసరమైన సహాయాన్ని మేము అన్ని వేళలా అందించాం” అని ఆమె పేర్కొన్నది.

ఆదివారం యూరప్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. తమ బ్యాంకులకు రీ క్యాపిటలైజ్ చేయడానికి ఇ.యు దేశాల నాయకులు దాదాపు ఒక ఒప్పందం సమీపానికి వచ్చాయి. (రుణ సంక్షోభాన్ని తట్టుకోవడానికి వీలుగా బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉంచుకోవడానికి వీలుగా ఈ చర్యను చేపట్టాయి.) 440 బిలియన్ యూరోల (600 బిలియన్ డాలర్ల) ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ (యూరోపియన్ ఫైనాన్షియల్ స్టబిలిటీ ఫెసిలిటీ) నిధులను ఎలా అందజేయాలి అన్న విషయాన్ని చర్చించుకున్నాయి. అయితే, గ్రీసు అప్పును కొనుగోలు చేసిన ప్రవేటు పార్టీలు ఎంతమేరకు అప్పుకి సంబంధించిన నష్టాలను భరించాలి అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. గ్రీసు రుణ భారం తగ్గించుకోవడానికి వీలుగా ఆ దేశానికి అప్పు ఇచ్చినవారంతా కొంతభాగాన్ని రద్దు చేసుకోవాలన్నది ఇక్కడి ఐడియా. వివిధ దేశాలు కాకుండా ప్రవేటు వ్యక్తులు, బ్యాంకులు గ్రీసుకి అప్పించినందువలన రానున్న నష్టాన్ని ఎంతమేరకు భరించాలి ఉన్న విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిందన్నమాట. అంతేకాక ప్రభుత్వాలు తమ వాటా పెంచకుండానే ఇ.ఎఫ్.ఎస్.ఎఫ్ నిధులను పెంచడం ఎలాగన్న విషయంలోనూ విభేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. బుధవారం, అక్టోబరు 26 తేదీన ఇ.యు రెండవ శిఖరాగ్ర సమావేశం జరపనుంది. ఈ సమావేశంలో ఒబ్బందాలు జరుగుతాయని భావిస్తున్నారు.

చైనా, బ్రెజిల్ దేశాలనుండి నిధులు సమీకరించి దానిని యూరో బాండ్లు కొన్నవారికి ఇన్సూరెన్సుగా ఏర్పాటు చేయాలన్న పధకం ఒకటి చర్చలో ఉంది. అయితే సంక్షోభంలో ఉన్న యూరో జోన్ దేశాల సావరిన్ రుణబాండ్లను మరిన్ని కొనడానికి చైనా, బ్రెజిల్ లు ఎందుకు ఆసక్తి చూపుతాయన్నది మిస్టరీగా ఉంది. ఈ పధకం ఏ ధైర్యంతో రూపొందించిందీ విశ్లేషకులకు అర్ధం కాలేదు. వివరాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఈ పధకం పట్ల వ్యాఖ్యానించడానికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జియాంగ్ నిరాకరించింది. అది తమ పరిధిలోది కాదని పేర్కొంది. అయితే సంక్షోభ పరిష్కారానికి ఇ.యు దేశాలు తీసుకొనే చర్యలన్నింటికీ చైనా మద్దతు ఉంటుందని మాత్రం చెప్పింది.

చైనాయే నేరుగా యురో బాండ్లను కొనుగోలు చేయడానికి బదులు మొదట ఐ.ఎం.ఎఫ్ చేత కొనుగోలు చేయించి ఆ తర్వాత ఐ.ఎం.ఎఫ్ నుండి చైనా ప్రభుత్వం కొనుగోలు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. దీనివలన చైనా ప్రభుత్వంపై నేరుగా ప్రమాదం భరించే భారం పడకుండా తప్పించుకోవచ్చు. అమ్మకానికి ఉంచిన రుణ బాండ్లను బట్టి చైనా పెట్టుబడులు పెట్టేదీ లేనిదీ తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షోభం నేపధ్యంలో చైనా, ఇ.యు ల మధ్య జరగాల్సిన వార్షిక సమావేశం వాయిదాపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీలో నెం.4 గా భావిస్తున్న అధికారి జియా క్వింగ్లిన్ ఈ వారంలోనే ఇ.యు సందర్శించనున్నాడు. ఈయన గ్రీసు, జర్మనీ, నెదర్లాండ్స్ తదితర దేశాలను సందర్శించనున్నట్లు తెలుస్తొంది.

చైనా వాణిజ్య మిగులే పెద్ద ఎత్తున విదేశీమారక ద్రవ్య నిల్వలుగా తరలుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, యూరో బాండ్లు తప్ప చైనాకు నమ్మకంగా పెట్టుబడులు పెట్టుకోదగ్గ చోటు ఉందా అన్నది అనుమానమే. సావరిన్ బాండ్లు తప్ప ప్రవేటు పెట్టుబడులలో విదేశీమారక ద్రవ్య నిల్వలను పెట్టాలని ఏ దేశం కోరుకోదు. సావరిన్ బాండ్లు కూడా ఆర్ధికంగా శక్తివంతమైన దేశాల సావరిన్ బాండ్లలోనే పెట్టుబడులు పెట్టాలని అంతా కోరుకుంటారు. ఇప్పటివరకూ అమెరికా, యూరో బాండ్లు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి. అవి కూడా సంక్షోభంలో పడినట్లయితే చైనా లాంటి వాణిజ్యమిగులు ఉన్న దేశాలకు ఎక్కడ తమ సొమ్ముని పెట్టాలన్నది సమస్యగా మారుతుంది. కనుక ఉన్న మార్గాలనే ప్రమాదరహితంగా చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నది.

వ్యాఖ్యానించండి