
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఈ మధ్య కాలంలో సంబంధాలు మెరుగుపడుతున్న నేపధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముంబైలో టెర్రరిస్టు దాడులు జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ఇండియా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇటీవలే మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. తాజా ఘటన పై ఇంతవరకూ తీవ్ర వ్యాఖ్యానాలేవీ ఇరు పక్షాలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు.
“హెలికాప్టర్ మా గగన తలంలోకి బాగా లోపలికి చొచ్చుకొచ్చింది. బలవంతంగా దానిని కిందికి దింపాం. నలుగురు భారత మిలట్రీ అధికారులను కస్టడీలోకి తీసుకున్నాం” అని పాక్ మిలట్రీ ప్రతినిధి మేజర్ జనరల్ అథర్ అబ్బాస్ తెలిపాడు. ఇండియాకు ఈ విషయమై సమాచారం అందించామని కూడా అబ్బాస్ తెలిపాడు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు, ఒక జూనియర్ కమిషన్ అధికారి హెలికాప్టర్ లో ఉన్నారని పాక్ అధికారి తెలిపాడు.
“వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఛీటా హెలికాప్టర్ ‘నియంత్రణ రేఖ’ ను దాటి పోయింది. ఉద్దేశ్యపూర్వకంగా చొరబడలేదు” అని భారత మిలట్రీ తెలిపినట్లుగా టైమ్స్ నౌ టెలివిజన్ వార్తలు తెలిపాయి. కాశ్మీరు భూభాగంలో పాకిస్ధాన్, ఇండియా ఆధీనంలో ఉన్న భూ భాగల మధ్య ఉన్న రేఖను ‘నియంత్రన రేఖ’ గా పిలుస్తారు. ఇండియా, చైనాల మధ్య ఉన్న రేఖను ‘వాస్తవాధీన రేఖ’ గా పిలుస్తారు. తాజా ఘటనను ఇరు దేశాలు సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 1999 లో ఇరు దేశాలు దాదాపు యుద్ధానికి చేరువలో వచ్చిన కార్గిల్ లోనే తాజా ఘటన చేసుకోవడం యాదృచ్ఛికమో కాదో తెలియవలసి ఉంది.