
నిజానికి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య కొద్ది వారాలుగా సంబంధాలు కొద్దిగా క్షీణిస్తాయా అన్నట్లుగా మాటల యుద్ధం జరిగింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, సంవత్సర కాలంగా ఆఫ్ఘన్ తాలిబాన్ తో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాలిబాన్ తో చర్చలు జరపడం అన్నది అమెరికా ఆలోచనే. అయితే తాలిబాన్ వరుసగా ఆఫ్ఘన్ ప్రభుత్వాధికారులను, రాజకీయ నాయకులను చంపడంతో చర్చల పట్ల ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు విముఖత్వం ప్రకటించాడు.
తాలిబాన్ తో శాంతి చర్చల నిమిత్తం తాలిబాన్ అధికారం లోకి రాకముందు అధ్యక్షుడుగా ఉన్న బర్హనుద్దీన్ రబ్బానీని కర్జాయ్ నియమించాడు. రబ్బానీ నే తాలిబాన్ కూలదోసి అధికారానికి వచ్చింది. అటువంటి రబ్బానినే తాలిబాన్ తో చర్చలకు నియమించడం వలన మంచి జరిగిందో లేదో తెలియదు కానీ శాంతి చర్చలు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. పరిస్ధితి అలా ఉండగానే సెప్టెంబర్ లో మానవబాంబుని వినియోగించి రబ్బానిని తాలిబాన్ చంపేసింది.
రబ్బానీ హత్య తర్వాత హమీద్ కర్జాయ్ తీవ్ర స్వరంతో పాకిస్ధాన్ పైన ప్రకటన విడుదల చేశాడు. తాలిబాన్ తో చర్చలు జరపడం ఇక వృధా ప్రయాస అని పేర్కొంటూ ఆ చర్చలేవో పాకిస్ధాన్ తోనే జరిపితే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నట్లుగా ఆ ప్రకటనలొ కర్జాయ్ పేర్కొన్నాడు. ఆ ప్రకటన పట్ల పాకిస్ధాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్ధాన్ లో జరిగే ఘటనలకు తమను బాధ్యులుగా చేయడం తగదని పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ప్రకటన ఇచ్చింది. కర్జాయ్ ప్రకటనను ఖండించింది.
ఈ నేపధ్యంలో కర్జాయ్ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. జియో టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్జాయ్ ఈ వ్యాఖ్యానం చేశాడు. ఈ మధ్య కాలంలో అమెరికా బలగాలపై జరుగుతున్న దాడులకు హక్కానీ గ్రూపు ది ప్రధాన బాధ్యతగా అమెరికా పేర్కొంటూ దానిపై మిలట్రీ చర్య తీసుకోవాలని పాక్ పైన ఒత్తిడి పెంచింది. ఫలితంగా హక్కానీ గ్రూపులోని ఒక నాయకుడిని అమెరికాకి లొంగిపోయేలా పాకిస్ధాన్ మేనేజ్ చెయ్యగలిగింది. లొంగిపోయిన నాయకుడి ద్వారా హక్కానీ గ్రూపుతో అమెరికా చర్చలు జరపడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయం అమెరికా స్టేట్ సెక్రటరీ హిల్లరీ క్లింటన్ స్వయంగా అంగీకరించింది కూడా.
అయినప్పటికీ అమెరికా పాకిస్ధాన్ పైన వత్తిడి పెంచడం కొనసాగిస్తూనె ఉంది. నిరంతరం ఒత్తిడి చేస్తూ తనకు కావలసిన చర్యలను పాకిస్ధాన్ చేత అమెరికా చేయిస్తుండగా, సాధ్యమైనంత వరకూ అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆఫ్ఘనిస్ధాన్ లో తన ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండడానికీ, అలాగే ఆఫ్ఘన్ లో ఇండియా ప్రాబల్యం పెరగకుండా ఉండడానికీ పాకిస్ధాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్ధం అవుతున్నది.
