నరేంద్ర మోడిపై ఛార్జి షీటు దాఖలుకు పుష్కల అవకాశాలు


గుజరాత్ మారణకాండలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి జాకియా జాఫ్రి కేసులో నిజా నిజాలను వెల్లడించడానికి సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ ‘రాజు రామచంద్రన్’ నివేదిక పుణ్యమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపైన ఛార్జి షీటు దాఖలు చేసి విచారించడానికి అవకాశాలు పెరిగాయి. అమికస్ క్యూరి నివేదికలో పొందుపరిచిన వివరాల ఆధారంగా 2002లో జరిగిన ముస్లింల మారణకాండకు బాధ్యుడిగా నరేంద్రమోడిపైన ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం తగిన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. నివేదిక ఇంకా రహస్యంగా ఉన్నప్పటికీ దానిని సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కు అందజేయవచ్చు.
1200 మందివరకూ ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఇప్పటి దశలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడం నరేంద్ర మోడి పండగ జరుపుకున్నాడు. ఆ ఉత్సాహంతో ప్రధాని మంత్రి పదవికి తాను పోటీదారుడనని చెప్పుకోవడానికి మూడురోజుల ఉపవాస దీక్ష కూడా నిర్వహించాడు. ఆ సందర్భంగా మత సామరస్యత గురించి గొప్ప హిత బోధ ఆయన చేశాడు. అక్కడితో ఆగకుండా రెండు రోజుల క్రితం ద్వారకలో మళ్లీ ఒక రోజు దీక్ష జరిపి మరొకసారి మత సామరస్యత ఆవశ్యకత గురించి నొక్కి చెప్పాడు.అమికస్ క్యూరీ నివేదికలోని కొన్ని అంశాలపై తనకు సమాచారం అందినట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. ఆ పత్రిక ప్రకారం అమికస్ క్యూరీ, సిట్ అభిప్రాయాలు కొన్నింటితో తీవ్రంగా విభేదించాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కి వ్యతిరేకంగా కేసు పెట్టడానికి ఆధారాలేవీ లేవని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. సీనియర్ గుజరాత్ పోలీసులను క్రాస్ ఎగ్జామిన్ చెయ్యడం ద్వారానే, సంజీవ్ భట్ తో సహా, ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అమాయకుడా, దోషా అన్నది నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. హిందువులను ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర పోలీసు అధికారులకు నరేంద్ర మోడి సూచనలు ఇచ్చిన సమావేశానికి హాజరయ్యానని పోలీసు అధికారి సంజీవ్ భట్ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, మారణకాండ బాధితులకు ద్రోహం చేస్తూ నరేంద్రమోడిని కేసునుండి బయటపడేలా నివేదిక సమర్పించింది. సిట్ తనను విచారించలేదనీ, తన సాక్ష్యాన్ని పట్టించుకోలేదని చెబుతూ సంజీవ్ భట్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో నరేంద్ర మోడికి కష్టాలు మొదలయ్యాయి. దానికి ప్రతికారంగా నరేంద్రమోడి సంజీవ్ భట్ పైన దొంగకేసులు నమోదు చేసి జైలుకి పంపాడు. సంజీవ్ భట్ తో పాటు నరేంద్రమోడి సమావేశానికి వెళ్లిన భట్ డ్రైవర్ ను ప్రలోభపరిచి తనవైపుకి తిప్పుకున్నాడు. డ్రైవర్ (కానిస్టేబుల్) చేత సంజీవ్ భట్ కి వ్యతిరేకంగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయించాడు. తనను బట్ బలవంతపెట్టి స్టేట్ మెంట్ ఇప్పించాడని కానిస్టేబుల్ ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశాడు.

మరో ముఖ్య విషయం కూడా అమికస్ క్యూరి నివేదిక పొందుపరిచింది. ముస్లింలపై మారణకాండ జరుగుతుండగా ఇద్దరు రాష్ట్ర మంత్రులు పోలీసు కంట్రోల్ రూంలో ఉన్నందునే సంజీవ్ భట్ స్టేట్ మెంట్ కు అవకాశం ఏర్పడించని ఆయన తెలిపాడు. కేసుపై విచారణ జరుపుతున్న ట్రయల్ కోర్టు అమికస్ క్యూరి అభిప్రాయాలతో అంగీకరించినట్లయితే ముఖ్యమంత్రి నరేంద్రమోడిని ప్రాసిక్యూట్ చేయడానికి రంగం సిద్ధమయినట్లే. అమికస్ క్యూరీ ప్రస్తావించిన నేరాల ప్రకారం నరేంద్రమోడి పైన విధించదగిన సెక్షన్లు ఇలా ఉన్నాయి: 153 ఎ (కమ్యూనిటీల మధ్య శతృత్వం రేకెత్తేలా ప్రకటనలు చేయడం), 153 బి (జాతీయ సమగ్రతకు భంగం కలిగేలా ప్రకటనలు చేయడం, నిందించడం), 505 (ప్రజలను మోసం చేసే ప్రకటనలు జారీ చెయ్యడం), 166 (గాయం చేసే ఉద్దేశ్యంతో చట్టం నిర్దేశించిన పద్ధతిని పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తి గౌరవించకపోవడం), ఇంకా ఇతర సెక్షన్లు. 166 సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది. పాలనా వ్యవస్ధకు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ముఖ్యమంత్రి మోడిపైన అల్లర్లు చెలరేగకుండా చూడవలసిన బాధ్యత ప్రత్యేకంగా ఉంటుంది.

జాకియా జాఫ్రి హత్య కేసుకు సంబంధించి ఆయన భార్య మోడితో పాటు 61 మందిపైన సుప్రీం కోర్టుకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పరిశోధన చేయవలసిందిగా సుప్రీం కోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నియమించింది. సిట్ తన నివేదిక సమర్పించిన అనంతరం వివిధ సాక్షులను విచారించి నివేదికను స్వతంత్రంగా మూల్యాంకనం చేయాల్సిందిగా సుప్రీం కోర్టు రాజు రాంచంద్రన్ ను అమికస్ క్యూరిగా నియమించింది. మోడి పైన కేసు మూసేయాలని సిట్ సిఫార్సు చేసిన సంగతి పత్రికల ద్వారా వెల్లడయ్యింది. పోలీసు అధికారి సంజీవ్ భట్, వివాదాస్పద వ్యక్తి అనీ, ఆధారపడడానికి వీలు లేని సాక్షి అనీ చెబుతూ, ఆ ప్రాతిపదికన మోడి పైన కేసు పెట్టలేమని నిర్ధారించింది. అయితే మోడి పైన కేసు పెట్టి విచారించడానికి సంజీవ్ భట్ సాక్ష్యమే ప్రధానంగా ఆధారపడదగినది. ఆ ఒక్క సాక్ష్యాన్ని సిట్ కొట్టిపారేయడంతో మోడి సాగించిన నరమేధంలో బాధితులైన వారికి న్యాయం దుర్లభం అయ్యింది. ఈ పరిస్ధితుల్లో అమికస్ క్యూరి నివేదిక కీలకంగా మారింది.

ముస్లింలపై హత్యాకాండ సాగుతుండగా పోలీసు కంట్రోల్ రూంలో తిష్టవేసిన ఇద్దరు మంత్రులు పోలీసు విధుల్లో జోక్యం చేసుకున్నారని చెప్పేందుకు తగిన భౌతిక సాక్ష్యం లేదని కూడా సిట్ తేల్చేసింది. సిట్ కు సంజీవ్ బట్ ఇచ్చిన సాక్ష్యంలో తాను ఫిబ్రవరి 27, 2002 తేదీన మోడి జరిపిన సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. హిందువులు, ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులను కోరాడు. గాంధీనగర్ లోని మోడి నివాసంలో సాయంత్రం సమయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఇతర పోలీసు అధికారులెవ్వరూ సంజీవ్ భట్ సమావేశంలో పాల్గొన్నాడని నిర్ధారించలేకపోవడంతో భట్ సాక్ష్యం అనుమానంలో పడింది.

అయితే అమికస్ క్యూరి సిట్ నిర్ధారణలతొ విభేదించినట్లుగా తెలుస్తోంది. సాక్ష్యాన్ని తూచాలి తప్ప లెక్కించకూడదనీ, (భట్ ఒక్కడే ఒకవైపు ఉండగా, ఇతర పోలీసు అధికారులు అంతా ఒకవైపు ఉన్నారు కనక) అలా తూచేపని భట్ తో పాటు మీటింగ్ లో పాల్గొన్న ఇతర పోలీసు అధికారులను కూడా ట్రయల్ కోర్టు బోనులో నిలబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేయడం ద్వారానే సాధ్యమని అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డాడు. మోడి వ్యతిరేక పార్టీ ఇతర అధికారులను ప్రశ్నించే అవకాశం కల్పించకుండా మోడిపైన కేసు ముందుగానే మూసివేయడం సరైంది కాదని అమికస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాక్ష్యులను ప్రశ్నిస్తున్న క్రమంలో క్రాస్ ఎగ్జామిన్ జరుగుతున్న క్రమంలో భట్ అబద్ధం చెప్పాడని తేలవచ్చు, లేదా ఇతర అధికారులు అబద్ధం చెప్పారనైనా తేలవచ్చు అని అమికస్ తెలిపాడు.

పోలీసు కంట్రోల్ రూం లో హోం మంత్రిత్వ శాఖకు సంబంధం లేని ఇద్దరు మంత్రులు ఉండడమే భట్ స్టేట్ మెంట్ నిజం కావడానికి ఆస్కారం కనిపిస్తున్నదని అమికస్ క్యూరి అభిప్రాయ పడ్డాడు. ఆ మంత్రులిద్దరికీ ముఖ్యమంత్రి మద్దతు పూర్తిగ ఉందని సిట్ స్వయంగా పేర్కొనడం దీనికి మరింత మద్దతు లభిస్తోంది. (మంత్రులిద్దరూ పోలీస్ కంట్రోల్ రూంలో ఉండడం ద్వారా మోడీ ఆదేశాలతోనే అక్కడ ఉన్నారన్న అనుమానాలు రేకేత్తింపజేసారు అని సిట్ అధిపతి రాఘవన్ అన్నట్లుగా తెహెల్కా పత్రిక రాసింది.) అమికస్ క్యూరి అభిప్రాయాన్ని సిట్ తిరస్కరించినట్లయితే ఆ నిర్ణయాన్ని ఎహసాన్ జాఫ్రీ, ఆమె సహ వాది తీస్తా సెతెల్వాద్ లు ట్రయల్ కోర్టులో సవాలు చేయవచ్చని తెలుస్తోంది. ట్రయల్ కోర్టు కూడా అమికస్ నివేదికపైన తన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.

మొత్తం మీద నరేంద్ర మోడి భవిష్యత్తు అంధకారంలో చిక్కుకున్నట్లేనా? ఆయన ప్రధాన మంత్రి పదవి ఆశలు దాదాపు ముగిసినట్లే కావచ్చు. కాని వందల మందిని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బలి తీసుకున్న ఆరోపణలున్న నరేంద్రమోడి లాంటి వ్యక్తులపై నేరం ఎలా రుజువవుతుంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s