ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యంచైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం తీవ్రమైన అసమానతలు గల దేశం. కనుక వెనుకబడిన ప్రాంతాలకు అధికంగా కేటాయింపులు చేసి అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహకారం అందించాలంటే ప్రణాళికా బద్ధ ఆర్ధిక వ్యవస్ధ తప్పనిసరి.

పెరుగుతున్న జనాభాకు దీటుగా వివిధ ఉత్పత్తులను ఎంతెంత ఉత్పత్తి చేయాలీ, అవి ఏ దామాషాలో పంపిణీ చేయాలీ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ ఉత్పత్తి టార్గెట్ లను నిర్ణయించాల్సి ఉంటుంది. ఉత్పత్తి జరిగాక సక్రమంగా అందవలసిన చోటుకు చేరవేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పెద్ద ఎత్తున మానవ శ్రమ అవసరం అవుతుంది. అటువంటి మానవ శ్రమ అందజేయగల సౌకర్యం ప్రభుత్వం వద్దనే ఉంటుంది తప్ప ప్రవేటు సంస్ధలు నెరవేర్చలేవు. అది కాక ప్రభుత్వం పైన ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం చూడవలసిన బాధ్యత ఉంటుంది గనక ఆ మేరకు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటూ విధానాలను రూపొందించుకుంటుంది.

ప్రవేటు రంగానికే ఆర్ధిక వ్యవస్ధను అప్పజెప్పినట్లయితే ఏమవుతుంది? ప్రజా సంక్షేమం వాటికి బాధ్యత కాదు. వారి ఏకైక లక్ష్యం లాభాల సంపాదన. అది కూడా అధిక లాభాలు కావాలి. ఆ లాభాలు స్ధిరంగా ఉన్నా కష్టమే. అవి ప్రతి సంవత్సరమూ, ప్రతి నెలా, ప్రతి రోజూ, వీలయితే ప్రతి గంటా గతం కంటే పెరుగుతూ పోవాలి తప్ప తగ్గడానికి వీల్లేదు. లాభాలు అనుకున్నంత రాకపోయినా అది చెడ్డవార్తే. లాభాలు బాగానే వస్తాయి, కాని అనుకున్నంత రానందుకు చెడ్డవార్తగా మారుతుంది. లాభం వస్తుంది, కాని గతం కంటే కొద్దిగా తగ్గుతుంది, ఇక కొంప మునిగినట్లె. ఆదాయం స్ధిరంగా ఉంటుంది, కాని లాభశాతం పెరగలేదు కనుక కంపెనీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే. ఇలా ఉంటాయి, లాభాల లెక్కలు. వీటిపైనే కంపెనీల దృష్టంతా.

తాము చేస్తున్న ఉత్పత్తి సమాజానికీ అవసరమా కాదా అన్నది ప్రవేటు కంపెనీలకు అనవసరం. ఓ పక్క ప్రజల్లో మెజారిటీ ఆకలి దరిద్రాలతో అలమటిస్తుంటే, ఐఫోన్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్, టాబ్లెట్లు, పిక్సెల్ కెమెరాలు ఇలాంటి ఉత్పత్తులకు కంపెనీలు పోటీ పడుతుంటాయి. పేదరికం పోవడానికీ, ఆకలి సమస్య తీరడానికి అవసరమైన ఉత్పత్తులను చేయడం ద్వారా దేశ సమస్యలను పరిష్కరించడంలో పాలుపంచుకునే బాధ్యత వాటికి ఉండదు. దానిక్కారణం ప్రవేటు పెట్టుబడికి లాభాలు తప్ప మరొక లక్ష్యం లేకపోవడమే. కాని ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం కనుక, ప్రజాస్వామ్యంలో ప్రజలే రారాజులు గనుక ప్రభుత్వాలు ప్రజలకోసమే పని చేయాలి గనుక ప్రజల ప్రయోజనాలకు ఏది ముఖ్యమో దానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను ప్రభుత్వాలు అమలు చేస్తాయా లేదా అన్నది మరొక సమస్య. కాని ఆ నిబంధనలు ఉన్నాక వాటి అమలు కోసం ప్రజలు డిమాండ్ చేసే హక్కుంటుంది. అ విధంగా ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధ ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది.

పైన చెప్పిన ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధ చైనాలో మావో సేటుంగ్ నేతృత్వంలో పక్కాగా అమలయ్యింది. ఆ మేరకు ప్రజలు సుఖపడ్డారు. కాని ఇండియాలో నెహ్రూ ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధను పక్కాగా అమలు చేయలేదు. ప్రణాళీకా బద్ధ ఆర్ధిక వ్యవస్ధతో పాటు ప్రవేటు పెట్టుబడిని కూడా ప్రోత్సహిస్తూ తమది మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ అని అటూ ఇటూ కాని విధానాలను అమలు చేశాడు. అలా చేయడం వెనుక నెహ్రూకి ఒక్క లక్ష్యం ఉంది. చైనాలో ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధ చేపట్టడం వెనుక పూర్తిగా ప్రజల ప్రయోజనాలను నెరవేర్చాలన్న లక్ష్యం ఉంది. కాని నెహ్రూ కనిపెట్టిన మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ వెనుక, పెట్టుబడులు తగినంతగాలేని భారత దేశ పెట్టుబడిదారులకు పెట్టుబడులు సమకూర్చడం, బ్రిటన్‌తో పాటు ఇతర సామ్రాజ్యవాద దేశాలకు కావలసిన వనరులను, మార్కెట్ సౌకర్యాలను ప్రభుత్వపరంగానే దోచిపెట్టడం లక్ష్యాలుగా ఉన్నాయి.

భారత దేశ పెట్టుబడిదారులు ప్రభుత్వరంగ పరిశ్రమలను ఆలంబనగా చేసుకుని, విదేశీ పెట్టుబడిదారులకు సేవలు చేసుకుంటూ ఎదిగినవారు తప్ప స్వతంత్రంగా ఎదిగిన వారు కాదు. వారి అవసరాలకు అనుగుణంగానే నెహ్రూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పని చేసిందన్నది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అదీ కాక జాతీయోద్యమం దరిమిలా దక్కిన (నామమాత్రపు) స్వతంత్రం కనుక ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో జాతీయోద్యమ సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి. ఆ పరిస్ధితుల్లో ప్రవేటు కంపెనీలకు అనుకూలమైన మార్కెట్ ఆర్ధిక విధానాలు అమలు చేసినట్లయితే ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత రావడం తధ్యం. కనుక ఓవైపు జాతీయోద్యం సెంటిమెంట్లకు అనుగుణంగా స్వతంత్ర విధానాలను అనుసరిస్తున్న కలర్ ఇస్తూనే ఆ ముసుగులో అటు సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలు, ఇటు దేశీయ దళారీ పెట్టుబడిదారుల ప్రయోనజాలు నెరవేరేందుకు వీలయిన ఆర్ధిక వ్యవస్ధను నెహ్రూ స్ధాపించదలిచాడు. అదే మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ. అంటే నెహ్రూవియన్ విధానాల లక్ష్యం ప్రజల బాగోగులు కాదు.

1990ల నాటికి భారత దేశం ప్రధానంగా ఆధారపడిన సోవియట్ రష్యా సామ్రాజ్యవాదం కుప్పకూలడంతో మిగిలిన ఎకైక అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదమే ఇండియాకి కూడా దిక్కయ్యింది. కాని అమెరికాది  స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ. అమెరికా, దానికి జూనియర్ భాగస్వామ్యులైన బ్రిటన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్సులు కూడా స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలే. ప్రపంచంలోని ఇతర మూడో ప్రపంచ దేశాల్లో కూడా ఆర్ధిక పరంగా దాదాపు ఇండియాలో లాగానే పరిస్ధుతులు ఏర్పడి ఉన్నాయి. ఈ నేపధ్యంలో గాట్ ఒప్పందానికి అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు శ్రీకారం చుట్టాయి. ప్రతిదేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు తలనొప్పి అనుకున్న సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాలు మొత్తానికి వినియోగపడేలా గాట్ ఒప్పందాన్ని రూపొందించారు. అప్పటివరకూ ప్రభుత్వరంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజా సంక్షేమ పధకాలను అమలు చేస్తూ, ప్రభుత్వరంగం ద్వారా కొద్దో గొప్పో ప్రజానుకూల విధానాలకు నిధులు సమకూర్చుకున్న దేశాలు గాట్ ఒప్పందంతో ప్రభుత్వరంగాని సర్వనాశనం చేయడానికి పూనుకోవలసి వచ్చింది. అందుకు మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు నిస్సిగ్గుగా సిద్ధపడ్డాయి కూడా.

ఇక భారత్ లాగే ఇతర మూడో ప్రపంచ దేశాలు కూడా ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధ సూత్రాలను పరిత్యజించి స్వేచ్ఛామార్కెట్ ఆర్ధిక విధానాలను కావులించుకోవడానికి నిర్ణయం జరిగింది. అందుకు మార్గాలే నూతన ఆర్ధిక విధానాలు. నూతన ఆర్ధిక విధానాలు అంటే సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలే. విదేశీ పెట్టుబడులు, ఉత్పత్తుల ప్రవేశానికి వీలుగా నియమ, నిబంధనలను సడలించడం (పూర్తిగా ఎత్తివేస్తే ఇంకా మంచిది), అప్పటివరకూ ప్రజలకోసం ప్రభుత్వాలు కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను అయిన కాడికి ప్రవేటు కంపెనీలకు అమ్మేసి పూర్తిగా ప్రవేటు రంగానికే సమస్త ఉత్పత్తి కార్యక్రమాలను అప్పజెప్పడం, విదేశీ పెట్టుబడులు, ఉత్పత్తులు ఆయా దేశాలలోకి స్వేచ్ఛగా రావడానికి పోవడానికి గేట్లు బార్లా తెరవడం ద్వారా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడమే ఈ విధానాల సారాంశం. ఈ విధానాల అమలుకు పశ్చిమ దేశాలు పెట్టినపేరు ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం’ (Structural Adjustment Program). అంటే ప్రజలకు కాస్తో కూస్తో ఉపయోగపడుతున్న ప్రభుత్వరంగాన్ని ప్రవేటోళ్ళకు అమ్మేసి ప్రజల ప్రయోజనాలను గాలికొదిలి కేవలం ప్రవేటు కంపెనీల ప్రయోజనాలే పరమ లక్ష్యంగా వ్యవస్ధను సర్దుబాటు చేసి స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా మార్చడమన్నమాట!

ఈ వ్యవస్ధలో ప్రభుత్వ పాత్ర నామమాత్రం అవుతుంది. అది ప్రజలచేత ఎన్నుకోబడినప్పటికీ పని చేసేది మాత్రం పెట్టుబడిదారీ ప్రయోజనాలకోసమే. కంపెనీలకు ఎల్లప్పుడూ లాభాలు సంపాదించిపెట్టడమే లక్ష్యంగా వ్యవస్ధ మొత్తం పని చేయాలని ప్రవేటు కంపెనీలు భావిస్తాయి. వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం, ప్రజలు జీవితాల పర్యంతమే కాక తరాల పర్యంతం త్యాగాలు చేస్తూ పోవాలి. దరిద్రం అనుభవించాలి, ఆకలి దప్పులు కష్టం అనుకోకుండా భరించాలి. నిరుద్యోగాన్ని ఆనందంగా ఎదుర్కోవాలి, జబ్బులొస్తే పూర్వజన్మ పాపం అని సరిపెట్టుకోవాలి. సాధ్యమైనంత తక్కువగా వేతనాలు తీసుకోవాలి. అసలు వేతనాలు తీసుకోకుండా ఉచితంగా పని చేస్తే ఇంకా సంతోషం. వారికి స్వర్గలోక సుఖాలు గ్యారంటీ. కాని ప్రవేటు కంపెనీలకు మాత్రం ఏ ఒక్క రోజయినా లాభం తగ్గకూడదు. అది పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉండడం కోసం ప్రభుత్వం, ప్రజలు కంకణాలు, ఉరితాళ్ళు, ఇనపగొలుసులు అన్నీ కట్టుకుని ఉండాలి. ఇదే స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ.

కాని ఇటువంటి ఆర్ధిక వ్యవస్ధకు ఒక్కే అంగలో వెళితే ప్రజలు ఉప్పుపాతరేస్తారు. వాళ్ళకి ఏం జరుగుతుందీ వెంటనే తెలిసిపోతుంది. అలా తెలియకూడదు. వారి కోసమే నని చెబుతూ వారికి వ్యతిరేకంగా విధానాలను చేపట్టాలి. అందుకోసం రక రకాల సిద్ధాంతాలు ఎప్పటినుండో ఉన్నాయి. పోటీ పెరిగితే జనాలకి తక్కువ ధరలకు సరుకులు వస్తాయి అంటారు. వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అది ఎప్పుడూ జరగకపోవడానికి కారణాలు ఎవ్వరూ చెప్పరు. ప్రభుత్వరంగ సంస్ధల్లో కార్మికులు సోమరులుగా మారతారు అంటారు. కాని నలభై ఏళ్లపాటు భారత దేశంతో పాటు అనేక దేశాలు ప్రభుత్వరంగంపైనే ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పలేరు. అతి తక్కువ ధరలకు సరుకులు అందించిన ఘనత ప్రభుత్వరంగ సంస్ధలకు ఉన్న విషయాన్ని దాచి పెడతారు. పాశ్చాత్య దేశాలు సైతం ప్రధాన రంగాలను ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్న సంగతిని విస్మరిస్తారు. సంక్షోభాలు వచ్చి ప్రవేటు కంపెనీలు కుప్పకూలితే వాటిని ఆదుకునేది ప్రభుత్వాలే అన్న సంగతి గురించి మాట్లాడరు. ఇలా ఓడిపోయిన, పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలనే వల్లెవేస్తూ మెల్లమెల్లగా స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధవైపుకి ఇండియా ప్రయాణం మొదలు పెట్టింది.

దీనికోసం ప్రణాళికలను కూడా పాలకులు వినియోగిస్తున్నారు. అంటే ప్రణాళికల ద్వారానే ప్రవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేసే ఎత్తుగడను భారత ప్రభుత్వాలు చేపట్టాయి. పూర్తిగా వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఒకవైపు పాపులర్ సంక్షేమ విధానాలను అనుసరిస్తూ మరోపక్క నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్నాయి. జాతీయ ఉపాధి హామీ పధకం, సమాచార హక్కు చట్టం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆహార భద్రతా చట్టం, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు మొదలైన విధానాలకు బహుళ ప్రచారం కల్పిస్తాయి. కాని ప్రభుత్వరంగ సంస్ధలలో వాటాలను ప్రవేటు కంపెనీలకు అమ్మే ప్రక్రియలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత యు.పి.ఎ ప్రభుత్వంలో స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక విధానాలకు కొంతమందీ, ప్రజా సంక్షేమ పధకాలు రూపొందించడానికి మరికొంతమంది పని చేస్తున్నారు. మొత్తం మీద స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను మార్చడమే అందరి లక్ష్యం. కొందరు చేదు మాత్రలు మింగుస్తుంటే ఇతరులు చేదు మాత్రలకు తీపి పూతలను పూసే పని చేపట్టారన్నమాట. ఇదొక రకం శ్రమ విభజన.

ప్రణాళిలద్వారా భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా మార్చే ప్రక్రియను ప్రస్తుతం మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్వహిస్తున్నాడు. ఈయన అమెరికా మానసపుత్రుడు. ఇండియాకు సంబంధించి అమెరికా కన్న కలలను నెరవేర్చేవారిలో ప్రముఖుడు. అందుకే ఆయనను ఆ కీలక బాధ్యతలలో నియమించారు. (అసలు అహ్లూవాలియాను ఆర్ధికమంత్రిగా ఎందుకు నియమించలేదని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ప్రశ్నించిన సంగతిని వికీలిక్స్ ద్వారా వెల్లడయిన డిప్లోమేటిక్ కేబుల్స్ తెలిపిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.) ప్రస్తుతం జాతీయ అభివృద్ధి మండలి (National Development Council) సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్ధిక మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో అహ్లూవాలియా, ప్రధాని మన్మోహన్ సింగ్ లు రాష్ట్రాలకు ఇస్తున్న సలహాలను గమనిస్తే వీరు ప్రజలకోసం పని చేస్తున్నారా లేక ప్రవేటు కంపెనీల కోసమా అని తప్పక అనుమానం వస్తుంది. అందులో కొన్నింటిని చూద్దాం.

 • భారత ఆర్ధిక వ్యవస్ధపై అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మందగమనం, యూరప్ రుణ సంక్షోభాలు ప్రభావం చూపుతున్నందున భారత దేశం కొన్ని చర్యలు తీసుకోవాలి -ప్రణబ్, అహ్లూవాలియా, మన్మోహన్
 • పన్నెండో ఆర్ధిక ప్రణాళికకు నిధులు సమీకరించడం కోసం పన్నులు పెంచాలి -అహ్లూవాలియా, మన్మోహన్
 • సబ్సిడీలకు కోత పెట్టాలి -అహ్లూవాలియా, మన్మోహన్
 • రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచాలి. కొన్ని రాష్ట్రాలు గత పది సంవత్సరాలలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఈ పద్ధతి మానుకోవాలి -అహ్లూవాలియా, మన్మోహన్
 • ప్రతికూల భావాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ముందుగా తొలగించాలి. ఆ తర్వాతే తొమ్మిది శాతం వృద్ధిరేటు సాధ్యమా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి -మన్మోహన్ (అంటే అవినీతి, నల్లడబ్బు, ఆశ్రిత పక్షపాతం ఇలాంటి ప్రతికూల భావాలని అదేపనిగా ప్రస్తావించకుండా జిడిపి వృద్ధి, కంపెనీల లాభాలు, సంస్కరణల చట్టాలు… ఇలా వీటిగురించే ఆలోచించాలన్నమాట)
 • ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్ర స్థానం మారుతోంది. భవిష్యత్ కేంద్రాలుగా ఎదగడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశాలు మెరుగుపడ్డాయి -మన్మోహన్ (ప్రజల బాగోగులు, వారి సమస్యలయిన ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, పని తదితర సమస్యల పరిష్కారం వీరి లక్ష్యం ఎన్నడూ కాదు)
 • ప్రస్తుతం ప్రైవేటు రంగంలోనే వృద్ధిరేటు అధికంగా ఉంది -మన్మోహన్ (ప్రభుత్వరంగాన్ని అయినకాడికి అమ్మేస్తుంటే అది వృద్ధి ఎలా చూపిస్తుంది?)
 • రైతులు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహపరిచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటె సరిపోతుంది -మన్మోహన్ (ఇది ఆచరణలో పారిశ్రామికవేత్తలవరకే పరిమితమవుతుంది)
 • స్ధూల ఆర్ధిక వ్యవస్ధలో స్ధిరత్వాన్ని సాధించి మార్కెట్ల నిర్వహణను పటిష్టపరచాలి -మన్మోహన్ (దేశంలో జనాల పరిస్ధితి ఎలా ఉన్నా జిడిపి రెండంకెలు ఉండాలనీ, షేర్ మార్కెట్లను జాగ్రత్తగా చూసుకోవాలనీ దీనర్ధం)
 • ఖర్చులను సంస్కరించడం ద్వారా వృద్ధిరేటును పెంచుకోవడమే తమ ప్రధాన లక్ష్యం -ప్రణబ్ ముఖర్జీ (ఖర్చులు తగ్గించుకోవడం అంటే రైతులకు ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలు తగ్గించడం లేదా రద్దు చేయడం. ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా సరుకులు అందుకుంటున్నవారి సంఖ్యని వీలైనంతగా తగ్గించడం. విద్యుత్, గ్యాస్, పెట్రోల్ సబ్సిడీలు తగ్గించడం మొ.వి మాత్రమే. ధనికులపై పన్నులు పెంచడం, కంపెనీలకు ఇస్తున్న పన్నుల రాయితీల రద్దు లాంటి విధానాల ద్వారా కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు. కాని ఆ పద్ధతికి ప్రభుత్వాలు ఇష్టపడవు)
 • పన్నెండో ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు నిధులు సమకూర్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలకు కోతపెట్టి పన్నులు వసూళ్ళు పెంచుకోక తప్పదు -అహ్లూవాలియా (ఈయన ప్రజలను బాదండి అని చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడని వ్యక్తి. భారత దేశ వనరులని విదేశీ, స్వదేశీ కంపెనీలకు దోచి పెట్టడానికి కంకణం కట్టుకున్న నిఖార్సయిన మనిషి)
 • పలు రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. విత్తలోటుకు కళ్లెం వేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం -అహ్లూవాలియా (విత్తలోటు అంటె బడ్జెట్ లోటు, కోశాగార లోటు, ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్యలోటు ఇవన్నీనూ. వేసుకున్న బడ్జెట్ కంటె ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఆ తేడాను బడ్జెట్ లోటు లేదా విత్త లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అంటున్నాం. దీనిని తగ్గించాలని అహ్లూవాలియా చెబుతున్నాడు. అంటె పరోక్షంగా ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడం అన్నమాట. ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడం అంటే పైన చెప్పిన విధంగా ప్రజలకోసం చేసే ఖర్చులో కోతపెట్టడం అని)

“సబ్సిడీలు తగ్గించండి లేదా రద్దు చేయండి, పన్నులు పెంచండి” ఈ రెండే ప్రభుత్వాల ఆదాయాలు పెరగడానికి ఉన్న మార్గాలు. వీటిలో ఎగుమతి, దిగుమతిదారులకు ఇస్తున్న సబ్సిడీలను ముట్టుకోరు. అలాగే అధికాదాయాలు సంపాదిస్తున్న కంపెనీలపైన పన్నులు వేయరు. బలికావలసింది ప్రజలే. వారు ఎన్ని త్యాగాలు చేస్తున్నా మళ్లీ మళ్ళీ త్యాగాలు చేయవలసింది వారే. ఇదే స్వేచ్ఛా మార్కేట్ ఆర్ధిక వ్యవస్ధ లో సూత్రం. వ్యవస్ధమొత్తం ప్రవేటు పెట్టుబడిదారుడికి అప్పజెప్పడమే దాని సారం. ప్రజలను కేంద్రంగా చేసుకునే ప్రణాళికలు పోయి పెట్టుబడిదారుడి లాబాలను కేంద్రంగా చేసుకునే ప్రణాళికలు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పరిస్ధితి మారడానికి సామూహీక ప్రజా చర్యలే దారి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s