ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ


రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ) సమావేశాల్లో వ్యాఖ్యానించాడు. ప్రపంచీకరణ విధానాల ఫలితంగా దేశాల మధ్య, పెట్టుబడుల ప్రవాహానికి సరిహద్దులు చెరిగిపోయిన నేపధ్యంలో, ఈ పరిణామం అనివార్యమని ఆయన తేల్చి చెప్పాడు.

యూరప్ లో తలెత్తిన రుణ సంక్షోభం, అమెరికా ఎదుర్కొంటున్న నెమ్మదైన ఆర్ధిక వృద్ధి సమస్యలు భారత దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రణబ్ ముఖర్జీ ఎన్.డి.సి సభ్యులకు వివరించే ప్రయత్నం చేశాడు. బైటి ప్రభావాలు ఉన్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్ధ మౌలికాంశాలు (ఫండమెంటల్స్) బలంగానే ఉన్నాయని కూడా ఆయన ఊరడించాడు. ప్రస్తుత కోశాగార సంవత్సరంలో భారత ఆర్ధిక వృద్ధిలో కొంత సవరణ జరుగుతుందనీ, మౌలికాంశాలు శక్తివంతంగా ఉన్నందున మధ్య కాలిక ఆర్ధిక వృద్ధి ఉత్సాహకరంగానే ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ తెలిపాడు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ అంతకంతకూ ప్రపంచీకరణ చెందుతున్నందున ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదనీ ఆయన సెలవిచ్చాడు.

ప్రపంచీకరణ నేపధ్యంలో భారత దేశంలోకి విదేశీ కంపెనీల పెట్టుబడులు విస్తృతంగా దేశంలోకి వస్తున్నాయి. దిగుమతి సుంకాలు విపరీతంగా తగ్గించడం, ఎగుమతులకు ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సాహకాలు ఇవ్వడం, విదేశీ అప్పులు సేకరించడం తీవ్రం కావడం తదితర పరిణమాలతో బైటి దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ ముడి వేయబడడం నానాటికి పెరుగుతోంది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు భారత దేశ కంపెనీలు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుండగా, భారత దేశ పబ్లిక్, ప్రవేటు రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్ధలు విదేశీ కంపెనీలలోనూ, ద్రవ్య సంస్ధలలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ విధంగా ఒకరి ఆర్ధిక ప్రయోజనాలు మరొకరి ఆర్ధిక ప్రయోజనాలపైన ఆధారపడడం పెరిగిపోతున్నది. దానితో ఆయా దేశాల్లో జరిగిన ఏ పరిణామమైనా అనివార్యంగా ఇతర దేశాలపై ప్రభావం చూపడం అనివార్యమవుతోంది.

1990 ల చివరిలో ఆసియా టైగర్లుగా పేరు పొందిన ఆగ్నేయాసియా దేశాలు సింగపూర్, హాంకాంగ్,  సౌత్ కొరియా, మలేషియా తదితర దేశాలలో విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున బైటికి తరలి పోవడంతో అక్కడి ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి. అలాగే అర్జెంటీనా సైతం అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు లభించక ఆర్ధిక వ్యవస్ధ దివాళా తీయడంతో దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అప్పటి అర్జెంటీనా ప్రభుత్వం అప్పులన్నింటీపైనా మారిటోరియం విధించడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధను కాపాడుకోగలిగింది. అలా కాకుండా ఇప్పటి గ్రీసు దేశం లాగా ఐ.ఎం.ఎఫ్ షరతులకు లోబడి దేశ వనరులని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టినట్లయితే ప్రజల పరిస్ధితి దుర్భరంగా మారి ఉండేది.

ప్రపంచీకరణలో భాగంగా భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ మార్కెట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుండడంతో భవిష్యత్తులో భారత ప్రజల అవసరాలతో సంబంధం లేకుండా ప్రపంచ మార్కెట్ శక్తుల అవసరాలకు అనుగుణంగా భారత ఆర్ధిక వ్యవస్ధలో మార్పులు జరగడం ఒక నియమంగా మారిపోతుంది. కష్టకాలంలో ఆదుకునే ప్రభుత్వరంగ పరిశ్రమలను ఒక్కొక్కొటి అయినకాడికి అమ్మి వేస్తున్నందున భవిష్యత్తులో సంక్షోభాలు సంభవించినప్పుడల్లా భారత ఆర్ధిక వ్యవస్ధ మరింతగా ప్రపంచ మార్కేట్ శక్తులకు బానిసగా మారిపోతుంది. అటువంటి పరిస్ధితిలోనే ఇపుడు గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు చిక్కుకుని ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ద్రవ్య సంస్ధల చేతుల్లో ప్రపంచ పెట్టుబడులన్నీ కేందీకృతం కావడం పెరిగిపోతుండడంతో సంపద కేంద్రీకరణం మరింతగా పెరిగిపోయి, గుత్తస్వామ్యం మరింత తీవ్రం అవుతుంది. అప్పుడిక వేళ్లపై లెక్కించగల కొద్ది సంస్ధల చేతుల్లోకి ప్రపంచ ఆర్ధిక పగ్గాలు వెళ్ళేవైపుగా పరిణామాలు తీవ్రం అవుతాయి. ఈ లోగా కార్మికవర్గం మేలుకొని తమ ప్రయోజనాల కోసం ఉద్యమించనట్లయితే ప్రపంచ స్ధాయిలోనే కరువు, ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం పెచ్చరిల్లి సామాజిక సంక్షోభాలు తీవ్రం అవుతాయి.

ఈ పరిణామాలు రాకుండా ఉండడానికి ప్రణబ్ ముఖర్జీ దగ్గర్నుండి ఐ.ఎం.ఎఫ్ వరకూ ఎవరి దగ్గరా తగిన ఎత్తుగడలూ, ఆర్ధిక మాయోపాయాలూ ఏమీ లేవు. ప్రపంచ స్ధాయిలో యూరప్ రుణ సంక్షోభం మార్కెట్లను వణికిస్తుండగా అమెరికాలో సాగుతున్న అతి నెమ్మదైన ఆర్ధిక వృద్ధి ఎమర్జింగ్ దేశాల ఎగుమతి మార్కెట్లను కుచించివేస్తోంది. దానితో ఇండియా, చైనా లాంటి ఎమర్జింగ్ దేశాల జిడిపి వృద్ధి క్షీణిస్తోంది. వీటిలో కూడా చైనాకంటె ఇండియాపై అధిక ప్రభావం పడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. 2010-11 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక వృద్ధి 8.5 శాతం నమోదు కాగా 2011-12 నాటికి అది 8 శాతానికి తగ్గిపోతుందని ప్రణబ్ ముఖర్జీ ఎన్డిసి సమావేశంలో తెలిపాడు. ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ లో (ఏప్రిల్-జూన్) జిడిపి 7.7 శాతం మాత్రమె వృద్ధి చెందిందని ఆయన తెలిపాడు. భారత ప్రభుత్వం ఎనిమిది శాతం వృద్ధి చెందుతుని ఆశిస్తున్నప్పటికీ అంతర్జాతీయ విశ్లేషకుల్లో మెజారిటీ మాత్రం 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

గత సంక్షోభంతో పోలిస్తే ఈ సారి సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద తగిన ఆర్ధిక ఉపకరణాలు లేని సంగతిని ప్రణభ్ ముఖర్జీ హెచ్చరించాడు. అందువలన భారత దేశ బడ్జెట్ లోటుని వీలైనంతగ తగ్గించడానికి ఇప్పటినుండే ప్రయత్నాలు చేయాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రస్తుత సంవత్సరానికి (2011-12) బడ్జెట్ లోటు లేదా కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్) 4.6 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనీ అందరూ దానికి సహకరించాలని ప్రణబ్ ముఖర్జీ కోరాడు. స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలో బడ్జెట్ లోటు తగ్గించడం అంటే ప్రజలకోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు తగ్గించడమే తప్ప ధనికవర్గాలకూ, ప్రవేటు కంపెనీలకూ ఇస్తున్న రాయితీలూ తగ్గించే విషయం ఎన్నడు ప్రభుత్వాల ఆర్ధిక చర్యల డిక్షనరీలో చోటు చేసుకోవు. ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు తగ్గించడం, ఉద్యోగాలు కోతపెట్టడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోలు తదితర నిత్యావసరాల ధరల్లొ ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయడం ఇవే ప్రభుత్వాలకు కనిపిస్తాయి. కనుక బడ్జేట్ లోటు లక్ష్యాన్ని చేరుకోవడం అంటే భారత ప్రజలు మరిన్ని అధిక ధరలు ఎదుర్కోబోతున్నారనే లెక్క.

భారత దేశానికి సంబంధించి ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇప్పటికి ఆర్.బి.ఐ పది సార్లు వడ్డీ రేట్లు పెంచింది. తద్వారా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చెలామణీని తగ్గించి ద్రవ్యోల్బణం తగ్గించాలని ఆర్.బి.ఐ లక్ష్యం. కాని వడ్డీ రేట్లు పెంచినందువలన ద్రవ్యోల్బం తగ్గే పనైతే అది ఎన్నడో తగ్గి ఉండేదనీ, నిజానికి వడ్డీ రేట్ల ద్వారా తగ్గే ద్రవ్యోల్బణం ఎన్నడో తగ్గిందనీ, ఇక ఆ మార్గంలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు లేవనీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియా, ప్రధాని ఆర్ధిక సలాహాదారుల బృందం అధిపతి కౌశిక్ బసులు చెప్పేశారు. వడ్డీ రేట్ల పెంపుదల వలన కంపెనీలకు అప్పుల సేకరణ భారంగా మారిందనీ, దానితో అవి పెట్టుబడులు పెట్టడం మందగించి దాని ప్రభావం ఆర్ధిక వృద్ధీపై పడుతోందనీ వారి వాదన. కంపెనీల పరిస్ధితి ఎలా ఉన్నా అధిక ద్రవ్యోల్బణం భారం ప్రజలపై ఎక్కువగా ఉంటోంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉందని మన ఆర్ధిక పండితులు పడుతున్న బాధ అంతా కంపెనీల కోసమే తప్ప, దానివలన ప్రజలు అధిక ధరలు ఎదుర్కొంటున్నారన్న ధ్యాస వారి లేదని గుర్తించాలి.

జాతీయ అభివృద్ధి మండలి సమావేశాల్లో 12 ఆర్ధిక పంచవర్ష ప్రణాళిక (2012-17) కోసం అప్రోచ్ పేపర్ రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని, సీనియర్ కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరైనారు. 1. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అనిశ్చితి, 2. బలహీనంగా మారిన బిజినెస్ సెంటిమెంట్, 3. వెంటాడుతున్న అధిక ద్రవ్యోల్బణం భారత దేశాన్ని పీడిస్తున్న నేపధ్యంలో ప్రణాళిక రూపకల్పన సవాలుగా మారిందని ప్రణబ్, ఎన్డీసి కి తెలిపాడు. రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపడుతున్నప్పటికీ పన్నుల వసూళ్ళ విషయం ఆందోళనగా ఉందని ప్రణబ్ చెబుతున్నాడు. పన్నుల పునాదిని విస్తృతపరచాలని ఆయన చెబుతున్నాడు. అంటే పన్నుల పరిధిలోకి మరింతమందిని తీసుకురావాలని ఆయన సూచిస్తున్నాడు. ఈ మరింతమందిలో ఉద్యోగులు, కార్మికులే తప్ప పెట్టుబడిదారులు ఉండరన్నది మామూలు విషయమే.

1961 ఆదాయ పన్ను చట్టం స్ధానంలో ‘డైరెక్ట్ టాక్స్ కోడ్’ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయం ఇప్పటికే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చర్చలు జరుపుతున్నదనీ, రాబోయే చలికాలం పార్లమెంటు సమావేశాల్లో అది తన నివేదిక సమర్పిస్తుందనీ చెబుతున్నారు. వచ్చే సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందాలని ప్రణబ్ కాంక్షించాడు. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న ఎన్డిసి సమావేశాలు చర్చిస్తున్న పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో మరిన్ని మార్కెట్ సంస్కరణలు చేపట్టనున్నారన్నది స్పష్టమవుతోంది. మార్కెట్ సంస్కరణలు మార్కెట్ శక్తులకు స్నేహ పూరితంగానూ, ప్రజా సామాన్యానికి భారంగానూ ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

One thought on “ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ

  1. 100 కోట్ల పైగా జనం వున్న దేశం తన తిండి తను తినగలిగే పరిస్థితి నుండి ఎవరో తుమ్మితే మనకు జలుబు చేసే స్థితికి దిగజారటమేమిటి? పైగా ఈ అసమర్ధతను ఆర్ధిక మంత్రి ఒప్పుకోవటమేమిటి. ప్రపంచీకరణ పేరుతో దేశాన్ని ఈ పరిస్థితికి తెచ్చారు. సో, మనకు అన్నీ వున్నా వాటిని మనం కొనగలిగే స్వాతంత్రాన్ని భవిష్యత్తులో కోల్పోనున్నాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s