గడ్డాఫీ మరణంపై పలు అనుమానాలు, అంతర్జాతీయ న్యాయస్ధానం విచారణ


గడ్డాఫీ మరణం చుట్టూ పలు అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో అతని విగత శరీరానికి అంతిమ సంస్కారాలు ఆలస్యం అవుతున్నాయి. సజీవుడిగా పట్టుకున్న ముమ్మర్ గడ్డాఫీ ఎలా చనిపోయాడన్న అంశంపై పలు కధనాలు ప్రచారంలోకి వచ్చాయి. గడ్డాఫీని పట్టుకున్న అనంతరం ఒక ట్రక్కులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గడ్డాఫీ మద్దతుదారులకూ, గడ్డాఫీని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తిరుగుబాటుదారులకూ మధ్య కాల్పులు జరిగాయనీ, ఈ కాల్పుల్లో గడ్డాఫీ తలకు బులెట్ గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్ళేలోపు చనిపోయాడనీ తాత్కాలిక ప్రభుత్వం ప్రధానంగా చెబుతోంది. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు మాత్రం గడ్డాఫీని బాగా కొట్టి తలలో కాల్చి చంపారని చెప్పినట్లుగా ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడించింది.

రహస్య సమాధి

సద్దాం హుస్సేన్ మరణానంతరం అతని శవం పూడ్చిన చోటు పెద్ద పుణ్య క్షేత్రంగా మారింది. ఇరాక్ ప్రజలు సద్దాంను తీవ్రంగా ద్వేషించారని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు విష ప్రచారం చేయగా అదే ప్రజలు సద్దాం హుస్సేన్ ను అమరవీరుడిగా ఆరాధిస్తున్నారు. అతని సమాధి ఇప్పుడు ఇరాక్ లో పెద్ద యాత్రా స్ధలం. అదొక పుణ్య క్షేత్రం. ఒసామా బిన్ లాడెన్ సమాధి కూడా అలాగే పూజలందుకుంటుందన్న భయంతో “అచూకి తెలియని చోట, సముద్రంలో పారేశామని” అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు. ఇప్పుడూ అవే భయాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్నీ, అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లనూ వెంటాడుతున్నాయి. గడ్డాఫీ సమాధి అమరుల క్షేత్రంగా మారుతుందన్న భయంతో అతని శవాన్ని ఎక్కడ పాతిపెట్టాలన్నదీ తిరుగుబాటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గడ్డాఫీ మరణం పట్ల లిబియా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ ఓ వైపు ప్రచారం చేస్తూ, లిబియా ప్రజలు గడ్డాఫీ సమాధిని పుణ్య క్షేత్రంగా మారుస్తారని ఎందుకు భయపడుతున్నారో పశ్చిమ వార్తా పత్రికలు వివరణ ఇవ్వడం లేదు.

ఈ నేపధ్యంలో గడ్డాఫీని కూడా ఎవరికి తెలియని చోట పూడ్చాలని నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎన్.టి.సి – ఫిబ్రవరిలో తాత్కాలికంగా ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వం) భావిస్తున్నట్లుగా ‘గార్డియన్’ పత్రిక తెలిపింది. “మూడో పార్టీ వ్యక్తులు లిబియా బైటినుండి వస్తారు. వారు పేపర్ వర్క్ కి సంబంధించిన కార్యక్రమం పూర్తి చేస్తారు” అని ఎన్.టి.సి ప్రతినిధి మొహమద్ సయె తెలిపాడు. మూడో పార్టీ అంటే అంతర్జాతీయ న్యాయ స్ధానం (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ -ఐ.సి.సి) కి చెందినవారేనని మహమద్ తెలిపాడు. ఐ.సి.సి ప్రతినిధులు పేపర్ వర్క్ పూర్తి చేయడానికే వస్తున్నారు తప్ప గడ్డాఫీ మరణం ఎలా జరిగిందీ వాస్తవాలు తెలుసుకోవడానికి కాదన్నామాట. ఐ.సి.సి నిజానికి అమెరికా, యూరప్ ప్రయోజనాలకు వంతపాడే తొత్తు న్యాయస్ధానం. గడ్డాఫీ మరణం సజావుగానే జరిగిందని చెప్పడానికి ఐ.సి.సిని వినియోగించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం గడ్డాఫీ విగత శరీరం రేవు పట్టణం మిస్రాటా లో ఉంచారు. ఆయన సొంత పట్టణం సిర్టేలో చనిపోయినప్పటికీ ఆక్కడే ఉంచకుండా మిస్రాటాకు గడ్డాఫీ శరీరాన్ని ఎందుకు తెచ్చిందీ వివరం లేదు. ఎన్.టి.సి లో అంతర్గతంగా ఉన్న విభేధాలే గడ్డాఫీ శరీరాన్ని మిస్రాటాకు తేవడానికి కారణమని రాయిటర్స్ తెలిపింది. కాని ఎన్.టి.సి విభేదాలకు గడ్డాఫీ శరీరం తరలింపుతో సంబంధం ఏమిటో రాయిటర్స్ వివరించలేదు. గడ్దాఫీని సజీవంగా పట్టుకున్నప్పటికీ, గాయాలతో ఉన్న ఆయన చనిపోవడం “చాలా బాధాకరం (వెరీ డిస్ట్రబింగ్)” అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ ప్రతినిధి అభివర్ణించాడు. లిబియాలో మానవ హక్కుల ఉల్లంఘనను పరిశీలిస్తున్న ప్యానేలే గడ్డాఫీ మరణంపై కూడా విచారణ జరపవచ్చని ఆ ప్రతినిధి, రూపర్ట్ కాల్‌విల్లె తెలిపాడు.

ప్రజల తిరుగుబాటు కాదు

తిరుగుబాటుదారులే లిబియా తిరుగుబాటు ప్రారంభించారని చెప్పినప్పటికీ వాస్తవం అది కాదని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు గూఢచార బలగాలు, వారి తొత్తులయిన లిబియా మాజీ మిలట్రీ అధికారులూ కలిసి ప్రారంభించిందే తప్ప అది ప్రజా తిరుగుబాటు కాదని గతంలోనే పత్రికలు వెల్లడించాయి. ట్యునీషియా, ఈజిప్టు, యెమెన్, బహ్రెయిన్ దేశాలలో నియంతలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన ఫోటోలను వీడియోలను అన్నీ పత్రికలు, వార్తా సంస్ధలు, ఛానెళ్ళు ప్రచురించాయి. ఆ దేశాల్లో రోజుల తరబడి రాజధాని నగరాలలోని ప్రధాన కూడళ్లలో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. అక్కడే గుడారాలు ఏర్పరుచుకుని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలువురు ఆందోళనకారులు మిలట్రీ, పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. బహ్రెయిన్ లాంటి చొట్లకు సౌదీ అరేబియా, కతార్ దేశాల నియంతలు తమ సైన్యాలను సైతం పంపి తిరుగుబాట్లను అణిచివేసిన విషయాన్ని అన్ని పత్రికలూ రాశాయి.

కాని లిబియా ప్రజల తిరుగుబాటుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫొటోను కూడా ఏ ఒక్క పత్రికా ప్రచురించలేకపోయింది. లిబియాలో ప్రజలు వీధుల్లోకి ఏ ఒక్క నాడూ వచ్చిన దాఖలాలను పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు, పత్రికలు ఛానెళ్ళు చూపలేకపోయాయి. అదిగో తిరుగుబాటు అనడం, ఇదిగో యుద్ధం అనడం వెంటవెంటనే జరిగిపోయింది తప్ప అందులో ప్రజల పాత్ర ఏ మాత్రం లేని సంగతిని పశ్చిమ దేశాల విష పత్రికలు ఎన్నడూ ప్రస్తావించలేదు. లిబియా సైన్యాధికారులు ఒకరిద్దరు తిరుగుబాటు పక్షంలో చేరిపోయారని వార్తలు రాశాయి తప్ప గడ్దాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక్క సైనికుడ్నీ అవి చూపలేకపోయాయి. ఎనిమిది నెలల తిరుగుబాటులో ఒక్కరోజుకూడా ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు అని చూపడానికి ఒక్క సాక్ష్యాన్ని కూడా తిరుగుబాటుపై ప్రచారం చేసిన పశ్చిమ దేశాల పత్రికలు చూపలేదు. అలాంటిది గడ్డాఫీ చనిపోయినపుడు లిబియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారంటూ ఇంకా అబద్ధాలు ప్రచారం చేయడం పచ్చి మోసం తప్ప మరొకటి కాదు.

ఫిబ్రవరిలో తిరుగుబాటు మొదలయ్యుంది అని చెప్పినప్పటినుండీ బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ తదితర పశ్చిమ దేశాల పత్రికలన్నీ లిబియా తిరుగుబాటుకు సంబంధించి కొన్ని ఫొటోలు ప్రచురించాయి. కానీ అవన్నీ గడ్డాఫీ బలగాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెబుతున్న వాళ్లే తప్ప ప్రజలు ప్రదర్శనలు చేస్తున్న ఫొటోలు గానీ, ఊరేగింపు ఫొటోలు గానీ, కనీసం వందమందయినా ప్రజలు పాల్గొన్న నిరసన ఫొటోలు గానీ అవి ప్రచురించ లేదు. భుజాన రాకెట్ తోనో, చేతిలో తుపాకులతోనో ఉన్న యూనిఫారం లేని వ్యక్తులు రోడ్దుపైన పికప్ ట్రక్కుల్లో వెళుతున్న ఫోటోలే ప్రచురించాయి తప్ప మరొక ఫొటో ప్రచురణకు నోచుకోలేదు. కారణం స్పష్టమే. లేని దృశ్యాలను ఎవరైనా ఫొటోలు ఎలా తీయగలరు? పశ్చిమ రాజ్యాల అధిపతులు సైతం వల్లెవేసిన లిబియా ప్రజల తిరుగుబాటు వాస్తవానికి లిబియా నేలపైన చోటు చేసుకోలేదు. జరిగిందంతా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల దురాక్రమణే తప్ప మరొకటి కాదు. బెంఘాజీలో ప్రజలపై కాల్పులు జరిపాడని గడ్డాఫీపై ఆరోపణలు చేసిన కనీసం దానికి కూడా సాక్ష్యలు చూపలేదు. బెంఘాజీ నగర పౌరులపై తిరుగుబాటు బలగాలుగా చెప్పుకుంటున్నవారు ఎన్ని అకృత్యాలకు పాల్పడిందీ, ఎన్ని అత్యాచరాలకు పాల్పడిందీ పశ్చిమ దేశాల పత్రికలు పట్టించుకోలేదు.

ఆల్-ఖైదాతో స్నేహం

లిబియా తిరుగుబాటు బలగాలు అని చెబుతున్నవారిలో ఆల్-ఖైదా కూడా ఉందన్నది అందరూ ఎరిగిందే. కాకపోతే పశ్చిమ దేశాల పత్రికలు వారిని ఆల్-ఖైదా అనడానికి బదులు ఇస్లామిక్ తిరుగుబాటు దారులు అని పిలుచుకున్నాయి. ఆల్-ఖైదా పైన ప్రపంచ స్ధాయి యుద్ధం ప్రకటించిన అమెరికా, యూరప్ దేశాలు అదే ఆల్-ఖైదాతో కలిసి లిబియాలో ప్రభుత్వం ఏర్పరచడానికి సహకారం అందిస్తుండడం చూస్తే వారి టెర్రరిస్టు వ్యతిరేకతలో నిజం ఎంతో అర్ధం అవుతోంది. టెర్రరిస్టులని విచారించడానికి గడ్డాఫీ సహాయం కూడా తీసుకున్న చరిత్ర అమెరికా, యూరప్ లకు ఉంది. ప్రపంచవ్యాపితంగా అనుమానాలతో అరెస్టు చేసినవారిని అమెరికా వివిధ దేశాలలోని రహస్య క్యాంపులకు పంపి అక్కడ విచారణ చేయించింది. అటువంటి క్యాంపులు నడిపిన దేశాల్లో లిబియా కూడా ఒకటి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటె, తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆల్-ఖైదా గ్రూపులో నాయకుడొకరు లిబియాలోనే విచారణ ఎదుర్కోవడం. ఈ వాస్తవం బైటికి వచ్చినప్పటికీ, స్వయంగా సదరు నాయకుడే ఆ విషయం వెల్లడించినప్పటికీ దానికి వివరణ ఇవ్వాలని అమెరికా, యూరప్ లకు ఏమాత్రం తోచలేదు.

పక్కా సామ్రాజ్యవాద వ్యతిరేకి

ఇలాంటి దగుల్బాజీ దేశలు గడ్డాఫీ పైన ఆరోపణలు చేయడం, లిబియా ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్లు మాట్లాడడంలో నిజం లేదని గ్రహించవలసి ఉంది. గడ్డాఫీ తన పాలనలో ప్రభుత్వ రంగాన్ని నిర్మించి దాని ఫలితాలన్నింటినీ లిబియా ప్రజలకు అందించాడు. ఆఫ్రికా, అరబ్ దేశాల నియంతృత్వ ప్రభుత్వాలేవీ చేయనివిధంగా అనేక మౌలిక సౌకర్యాలను నిర్మించాడు. విద్యా సౌకర్యాలకు అందించడానికి శక్తిమేరకు కృషి చేశాడు. ఇంగ్లండులోని ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలకు డొనేషన్లు కూడా గడ్డాఫీ సమకూర్చాడు. గడ్డాఫీ కొడుకులు ఉన్నత విధ్యను అభ్యసించింది ఇంగ్లండ్ యూనివర్సిటీలలోనే. ఏ ఇస్లామిక నియంతృత్వ పాలకులు చేయని విధంగా లిబియాలో స్త్రీ విద్యను గడ్డాఫీ ప్రోత్సహించాడు. లిబియా మహిళలకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాడు. తన దేశం వరకే పరిమితం కాకుండా తన పొరుగునే ఉన్న పేద ఆఫ్రికా దేశాలకు సహాయం చేయడానికి కూడ గడ్డాఫీ ప్రయత్నాలు చేశాడు. తక్కువ ధరలకు ఆయిల్ అందించాడు. ఆఫ్రికా దేశాలను ఐక్యం చేసి ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అఫ్రికా’ ను ఏర్పరచాలని కలలు గన్నాడు. అది కుదరక ‘ఆఫ్రికన్ యూనియన్’ ను స్ధాపించి బలోపేతం చేయడానికి కృషి చేశాడు. ఇవన్నీ లిబియా ప్రజలకు వ్యతిరేకమయినవి అయితే వారు తప్పకుండా తిరుగుబాటు చేసే వారే. కాని అవన్నీ లిబియా ప్రజలను ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకంటె ఉన్నత స్ధాయిలో నిలిపాయి. మానవాభివృద్ధిలో లిబియా ప్రజలు చాలా దేశాలకంటె ముందుండడానికి కారణం గడ్డాఫీ పాలనే అని గ్రహించవలసి ఉంది.

అయితే, గడ్డాఫీ తన ఆయిల్ వనరులను అమెరికా, యూరప్ దేశాలకు అప్పగించడానికి నిరాకరించాడు. పైగా వాటికి వ్యతిరేకంగా ఆఫ్రికా దేశాలనూ, అరబ్ దేశాలనూ కూడగట్టాడు. దానితో అమెరికా అనేకసార్లు అతన్ని చంపాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలనుండి గడ్డాఫీ తప్పించుకున్నాడు. కాని ఆ దాడుల్లో గడ్డాఫీ కొడుకులు, బంధువులు చనిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా గడ్డాఫీ కొన్ని విషయాల్లో అమెరికా, యూరప్ లకు సహకరించడం ప్రారంభించాడు. అమెరికా, యూరప్ ల ఆయిల్ కంపెనీలకు కొన్ని ఆయిల్ కాంట్రాక్టులను అప్పజెప్పి మంచి చేసుకున్నాడు. కాని పూర్తిగా వనరులను వారికి అప్పగించడానికి గడ్డాఫీ అంగీకరించలేదు. అమెరికా, యూరప్ లతొ సహకరించినప్పటికీ లిబియా ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టడానికి అంగీకరించలేదు. అమెరికా ఆగ్రహించేసరికి భారత ప్రభుత్వం ఇరాన్ తో ఆయిల్, గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి చర్యలకు గడ్డాఫీ అంగీకరించనందునె అతనిపై పశ్చిమ దేశాలు పగబట్టాయి. అరబ్ తిరుగుబాట్లను ఆసరా చేసుకుని గడ్డాఫీని కూల్చడానికి ఇదే సమయంగా భావించాయి. కుట్రలతో లేని తిరుగుబాటుని సృష్టించి ప్రపంచ ప్రజానీకన్ని మోసం చేశాయి. చివరికి చేతికి దొరికిన గడ్డాఫీని అమానుషంగా చంపేశాయి.

ఈ నేపధ్యంలోనే గడ్డాఫీ హత్యను పరిశీలించవలసి ఉంటుంది. గత ఎనిమిది నెలల్లో నాటో సైన్యాలు అనేక సార్లు గడ్డాఫీ ఇంటిపైనా, ఆయన ఉంటాడని భావించిన ప్రతిచోటా బాంబు దాడులు చేసినా గడ్డాఫీని చంపలేకపోయాయి. అనేకసార్లు చంపడానికి ప్రయత్నించాక చేతికి దొరికినప్పుడు చంపకుండా అంతర్జాతీయ న్యాయస్ధానానికో లేదా లిబియా న్యాయస్ధానానికో అప్పజెపుతారని భావించడం అత్యాశే కాగలదు. గడ్డాఫీ హత్యకు గురయిన ఒకరోజు ముందే ఆయన మరణాన్ని కాంక్షిస్తూ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఒక ప్రకటన చేయడం గమనార్హం. కల్నల్ గడ్డాఫీని చంపాలని ఆమె బహిరంగంగానే పిలుపునిచ్చింది. “అతనిని త్వరలోనె పట్టుకుని చంపగలమని ఆశిస్తున్నాను” అని ఆమె ప్రకటించింది. దానిని బట్టి గడ్డాఫీ మరణాన్నే అమెరికా కాంక్షించిందని స్పష్టమవుతోంది. ఇక చేతిక చిక్కిన గడ్డాఫీని హిల్లరీ క్లింటన్ ఆశించనమేరకే దారుణంగా కాల్చి చంపారు. కనీసం లిబియా పాలకుడిగా కాకపోయినా ఒక మనిషికి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా నరహంతక అమెరికా, యూరప్ ల పాలకులకు మనస్కరించలేదు. ఇది ఒక్క గడ్డాఫీ మరణం మాత్రమే కాదు. లిబియా ప్రజల భవిష్యత్తు ఇకనుండి అంధకారం కానున్నది. లిబియా ప్రజల సంపద అయిన ఆయిల్ వనరులు ఇప్పుడు అమెరికా, ఫ్రాన్సు, ఇరాక్, ఇటలీ తదితర దేశాల కంపెనీలు జలగల్లా పీల్చుకు తింటాయి. లిబియా ప్రజలను ఆకలికి, దరిద్రానికీ, నిరుద్యోగానికీ, అవిద్యకీ ఆహరంగా పడేస్తాయి.

ఎలా చనిపోయాడు?

ది గార్డియన్ పత్రిక గడ్డాఫీ మరణంపై కొంత సమాచారాన్ని అందించింది. గడ్డాఫీని పట్టుకున్నపుడు ఆయన సజీవంగా ఉన్న వీడియోను ప్రచురించింది. అందులో గడ్డాఫిని పట్టుకుని ట్రక్కులోకి మారుస్తున్న దృశ్యం ఉంది. గడ్డాఫీ బాగా తెలివిగానే ఉన్నట్లుగా ఆ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. ట్రక్కులోకి మారుస్తుండగా ‘అతన్ని సజీవంగా ఉంచండి’ అని ఒకరు అరిచారని గార్డియన్ తెలిపింది. తదనంతరం రక్తపు మడుగులో ఉన్న గడ్డాఫీ ఫొటో అన్ని వార్తా సంస్ధలూ ప్రచురించాయి. ఈ మధ్యలోనే గడ్డాఫీ తలలో కాల్చారని స్పష్టమవుతోంది. సిర్టే పట్టణంపై దాడులు తీవ్రం కావడంతో ఇక అక్కడ ఉండం క్షేమకరం కాదని గడ్దాఫీ తన వాహనాల కాన్వాయ్ లో బాడీగార్డులతో కలిసి బయలుదేరాడు.

పట్టణం బైటికి వచ్చాక ఫ్రాన్సుకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు రెండు సార్లు గడ్డాఫీ కాన్వాయ్ పైన బాంబుదాడులు చేసింది. ఈ దాడిలో గడ్డాఫీ గాయపడ్డాడు కాని బతికే ఉన్నాడు. “మిగిలినవాళ్లం కొన్ని గ్రూపులుగా విడిపోయాం. ఒక్కో గ్రూపు ఒక్కోవైపు వెళ్ళడానికి నిశ్చయించుకుని బయలుదేరాం. నాతో పాటు నలుగురు వాలంటరీ సైనికులు గడ్డాఫీ, అబూ బకర్ యూనిస్ జబర్ (గడ్డాఫీ ఆర్మీ ఛీఫ్) లతో ఉన్నాం” అని గడ్డాఫీ వ్యక్తిగత బాడీ గార్డుల్లో కరైన మన్‌సౌర్ దౌవ్ ఆల్-అరేబియా టి.వి ఛానెల్ కు తెలిపినట్లుగా గార్డియన్ రాసింది. దాడి జరిగాక గడ్డాఫీకి ఏమయ్యింది తనకు తెలియలేదని దౌవ్ తెలిపాడు. దాడిలొ గడ్డాఫీకి తీవ్రగాయాలయ్యి సృహ కోల్పోయాడని దౌవ్ తెలిపాడు. దాడిలో వాహనాలన్ని ధ్వంసం కావడంతో పాటు గడ్డాఫీ అనుచరులు కూడా యాభైమంది వరకూ మరణించారు. వారిలో గడ్డాఫీ ఆర్మీ ఛీఫ్ అబూ బకర్ యూనిస్ జబర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. మిగిలిన కొద్దిమంది సమీపంలోనే చెట్ల గుబురులగుండా వెళ్ళి రోడ్డు బ్రిడ్జి వద్ద ఉన్న నీటిపైపు లోపలికి గడ్డాఫీని తరలించారు.

ఈ లోపు తిరుగుబాటు బలగాలు గడ్డాఫీ, అతని అనుచరులపైన దాడి చేసారు. “మొదట మేము వారి పైకి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకులతో కాల్పులు జరిపాం. కాని దానివలన ఫలితం లేకపోయింది. ఆ తర్వాత నడుస్తూ అక్కడికి వెళ్లాం. గడ్డాఫీ మనుషుల్లో ఒకరు తుపాకిని గాల్లో చూపుతూ బైటికి వచ్చాడు. లొంగిపోతున్నాం అంటూ బైటికి వచ్చి మమ్మల్ని చూసినవెంటనే కాల్పులు ప్రారంభించాడు. తర్వాత కాల్పులు జరపడం ఆపమని వారిని గడ్దాఫీ ఆదేశించినట్లుంది. మా మాస్టర్ ఇక్కడే ఉన్నాడని అతను చెప్పాడు. ముమ్మర్ గడ్డాఫీ ఇక్కడె ఉన్నాడు. అతను గాయపడి ఉన్నాడని అతను చెప్పాడు. మేము లోపలికి వెళ్ళి గడ్డాఫీని బైటికి తెచ్చాము. గడ్డాఫీ, ఏమైంది, ఏం జరుగుతోంది అని ప్రశ్నిస్తుండగా ఒక కారులో ఉంచాము” అని ఎన్.టి.సి ఫైటర్ సలేం బకీర్ తెలిపాడు. ఆ సమయానికి గడ్డాఫీ కాళ్లకూ, వీపు భాగంలో గాయాలున్నాయని బకీర్ తెలిపాడు.

ఆ తర్వాత ఏం జరిగిందన్నదీ వివరాలలో కొంత అయోమయం నెలకొన్నది. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న మహ్మౌద్ జబ్రిల్ తెలిపిన వివరాల ప్రకారం గడ్డాఫీని తీసుకెళ్తున్న వాహనం కాల్పుల మధ్య చిక్కుకుంది. ఎన్.టి.సి దళాలు, గడ్డాఫీ అనుకూల దళాలు పరస్పరం తలపడ్డాయి. ఈ కాల్పుల్లో గడ్డాఫీ తలకు బలమైన గాయం అయ్యిందని ప్రధాని జబ్రిల్ చెబుతున్నాడు. ఎవరి తుపాకి గుండుకి గడ్డాఫీ బలయ్యిందీ తెలియడం లేదని కూడా ఆయన చెబుతున్నాడు. అయితే గడ్డాఫీని పట్టుకున్న దళాలకు కమేండర్ గా వ్యవహరించిన మిస్రాటా మిలట్రీ కౌన్సిల్ ప్రతినిధి ఫాతి బషాఘా, గడ్డాఫీ అతనికి తగిలిన గాయాలవలన చనిపోయాడని తెలిపాడు. 120 మైళ్ల దూరంలో ఉన్న మిస్రాటాకు అంబులెన్సులో తీసుకెళ్ళామని అతను చెప్పాడు. కాని వీడియో దృశ్యం ప్రకారం గడ్డాఫీని తీసుకెళ్ళింది అంబులెన్సు కాదని ఒక పికప్ ట్రక్కు మాత్రమేనని స్పష్టమవుతోంది.

ఎన్.టి.సి కి చెందిన మరొక అధికారి అబెల్ మాజిద్ మెగ్తా ఇలా చెప్పాడు. “అతని కడుపునుండి రక్తం కారుతోంది. అతనిని చాలా దూరం తీసుకెళ్లవలసి వచ్చింది. రక్తం బాగా పోవడంతో చనిపోయాడు.” అయితే మరొక ఎన్.టి.సి అధికారి చెప్పిన వివరం వీటన్నింటికి భిన్నంగా ఉంది. ఆయన తన పేరు చెప్పవద్దని కోరాడని గార్డియన్ తెలిపింది. “ఎన్.టి.సి ఫైటర్లు అతనిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతనిని చంపేశారు. ఇది యుద్ధం మరి” అని ఆయన చెప్పాడు. ఇదే అసలు సంగతి. గాయపడిన గడ్డాఫీని పైపునుండి బైటికి తెచ్చి పికప్ ట్రక్కులో తరలిస్తూ, పైనుండి వచ్చిన ఆదేశాలమేరకు ప్రయాణంలోనే తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత కాల్చి చంపారు.

గడ్డాఫీ మరణానికి దారి తీసిన పరిస్ధితులపై విచారణ జరపాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో కోరింది. లిబియాపైన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ యుద్ధ విమానాలు ఎనిమిది నెలలపాటు బాంబు దాడులు చేసి అనేకమంది లిబియన్లను పొట్టనబెట్టుకున్నప్పటికీ ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గానీ హ్యూమన్ రైట్స్ వాచ్ గానీ పల్లెత్తి ఒక్కమాట అన్న పాపాన పోలేదు. అంతా అయ్యాక ఇపుడు గడ్దాఫీ మరణంపై విచారణ జరపాలని కోరుతోంది. డూప్లికేట్ మానవహక్కుల సంస్ధల పనితీరు ఇలానే ఉంటుంది.

అరబ్ దేశాలలో తలెత్తిన ప్రజా ఉద్యమాలకు అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన సమాధానమే లిబియా ఆక్రమణ, గడ్డాఫీ హత్య. ట్యునీషియా, ఈజిప్టుల ప్రజా తిరుగుబాట్లు ప్రారంభంలో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ తదితర సామ్రాజ్యవాద దేశాలు నియంత్రించలెకపోయాయి. వారి తిరుగుబాట్లు ఫలవంతం అయ్యే సమయానికి కలుగజేసుకుని అవి పూర్తిగా తమకు వ్యతిరేకంగా మారకుండా చేసుకోగలిగాయి. ఈ పరిష్దితుల్లో లిబియాను చెరబట్టడం ద్వారా మరిన్ని అరబ్ దేశాల్లో మరిన్ని తిరుగుబాట్లు రాకుండా అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ దేశాలు అడ్దుకోదలిచాయి. బహ్రెయిన్, యెమెన్ లలో తీవ్ర నిర్భంధం ప్రయోగిస్తూ అక్కడ తలెత్తిన వాస్తవ ప్రజా తిరుగుబాట్లకు ద్రోహం చేస్తున్న పశ్చిమ దేశాలు మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యానికి భంగం కలగకుండా చూడదలిచాయి. ఫలితమే లిబియా దురాక్రమణ. యెమెన్, బహ్రెయిన్ లలో అణచివేత. సిరియాలోనూ ఇలాంటి కిరాయి తిరుగుబాట్లను ప్రేరేపించి అక్కడ సెక్యులర్ పార్టీ బాత్ పార్టీ ఆధీనంలోని ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తద్వారా లెబనాన్, సిరియాలనుండి ఇజ్రాయెల్ కు ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయడానికీ అమెరికా యూరప్ లు పధకం పన్నాయి. సిరియా కూడా దారిలోకి తెచ్చుకున్నట్లయితే మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ల అరాచకాలకు అంతే ఉండదు. అది అంతిమంగా ప్రపంచ ప్రజలకు ప్రమాకరంగా పరిణమిస్తుంది. ప్రపంచ ప్రజలకు పెను ప్రమాదం అమెరికా, యూరప్ లనుండే తప్ప మరింకెవరినుండీ కాదు.

One thought on “గడ్డాఫీ మరణంపై పలు అనుమానాలు, అంతర్జాతీయ న్యాయస్ధానం విచారణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s