
ది గార్డియన్ పత్రిక గడ్డాఫీ మరణంపై కొంత సమాచారాన్ని అందించింది. గడ్డాఫీని పట్టుకున్నపుడు ఆయన సజీవంగా ఉన్న వీడియోను ప్రచురించింది. అందులో గడ్డాఫిని పట్టుకుని ట్రక్కులోకి మారుస్తున్న దృశ్యం ఉంది. గడ్డాఫీ బాగా తెలివిగానే ఉన్నట్లుగా ఆ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. ట్రక్కులోకి మారుస్తుండగా ‘అతన్ని సజీవంగా ఉంచండి’ అని ఒకరు అరిచారని గార్డియన్ తెలిపింది. తదనంతరం రక్తపు మడుగులో ఉన్న గడ్డాఫీ ఫొటో అన్ని వార్తా సంస్ధలూ ప్రచురించాయి. ఈ మధ్యలోనే గడ్డాఫీ తలలో కాల్చారని స్పష్టమవుతోంది. సిర్టే పట్టణంపై దాడులు తీవ్రం కావడంతో ఇక అక్కడ ఉండం క్షేమకరం కాదని గడ్దాఫీ తన వాహనాల కాన్వాయ్ లో బాడీగార్డులతో కలిసి బయలుదేరాడు.
పట్టణం బైటికి వచ్చాక ఫ్రాన్సుకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు రెండు సార్లు గడ్డాఫీ కాన్వాయ్ పైన బాంబుదాడులు చేసింది. ఈ దాడిలో గడ్డాఫీ గాయపడ్డాడు కాని బతికే ఉన్నాడు. “మిగిలినవాళ్లం కొన్ని గ్రూపులుగా విడిపోయాం. ఒక్కో గ్రూపు ఒక్కోవైపు వెళ్ళడానికి నిశ్చయించుకుని బయలుదేరాం. నాతో పాటు నలుగురు వాలంటరీ సైనికులు గడ్డాఫీ, అబూ బకర్ యూనిస్ జబర్ (గడ్డాఫీ ఆర్మీ ఛీఫ్) లతో ఉన్నాం” అని గడ్డాఫీ వ్యక్తిగత బాడీ గార్డుల్లో కరైన మన్సౌర్ దౌవ్ ఆల్-అరేబియా టి.వి ఛానెల్ కు తెలిపినట్లుగా గార్డియన్ రాసింది. దాడి జరిగాక గడ్డాఫీకి ఏమయ్యింది తనకు తెలియలేదని దౌవ్ తెలిపాడు. దాడిలొ గడ్డాఫీకి తీవ్రగాయాలయ్యి సృహ కోల్పోయాడని దౌవ్ తెలిపాడు. దాడిలో వాహనాలన్ని ధ్వంసం కావడంతో పాటు గడ్డాఫీ అనుచరులు కూడా యాభైమంది వరకూ మరణించారు. వారిలో గడ్డాఫీ ఆర్మీ ఛీఫ్ అబూ బకర్ యూనిస్ జబర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. మిగిలిన కొద్దిమంది సమీపంలోనే చెట్ల గుబురులగుండా వెళ్ళి రోడ్డు బ్రిడ్జి వద్ద ఉన్న నీటిపైపు లోపలికి గడ్డాఫీని తరలించారు.
ఈ లోపు తిరుగుబాటు బలగాలు గడ్డాఫీ, అతని అనుచరులపైన దాడి చేసారు. “మొదట మేము వారి పైకి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకులతో కాల్పులు జరిపాం. కాని దానివలన ఫలితం లేకపోయింది. ఆ తర్వాత నడుస్తూ అక్కడికి వెళ్లాం. గడ్డాఫీ మనుషుల్లో ఒకరు తుపాకిని గాల్లో చూపుతూ బైటికి వచ్చాడు. లొంగిపోతున్నాం అంటూ బైటికి వచ్చి మమ్మల్ని చూసినవెంటనే కాల్పులు ప్రారంభించాడు. తర్వాత కాల్పులు జరపడం ఆపమని వారిని గడ్దాఫీ ఆదేశించినట్లుంది. మా మాస్టర్ ఇక్కడే ఉన్నాడని అతను చెప్పాడు. ముమ్మర్ గడ్డాఫీ ఇక్కడె ఉన్నాడు. అతను గాయపడి ఉన్నాడని అతను చెప్పాడు. మేము లోపలికి వెళ్ళి గడ్డాఫీని బైటికి తెచ్చాము. గడ్డాఫీ, ఏమైంది, ఏం జరుగుతోంది అని ప్రశ్నిస్తుండగా ఒక కారులో ఉంచాము” అని ఎన్.టి.సి ఫైటర్ సలేం బకీర్ తెలిపాడు. ఆ సమయానికి గడ్డాఫీ కాళ్లకూ, వీపు భాగంలో గాయాలున్నాయని బకీర్ తెలిపాడు.
ఆ తర్వాత ఏం జరిగిందన్నదీ వివరాలలో కొంత అయోమయం నెలకొన్నది. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న మహ్మౌద్ జబ్రిల్ తెలిపిన వివరాల ప్రకారం గడ్డాఫీని తీసుకెళ్తున్న వాహనం కాల్పుల మధ్య చిక్కుకుంది. ఎన్.టి.సి దళాలు, గడ్డాఫీ అనుకూల దళాలు పరస్పరం తలపడ్డాయి. ఈ కాల్పుల్లో గడ్డాఫీ తలకు బలమైన గాయం అయ్యిందని ప్రధాని జబ్రిల్ చెబుతున్నాడు. ఎవరి తుపాకి గుండుకి గడ్డాఫీ బలయ్యిందీ తెలియడం లేదని కూడా ఆయన చెబుతున్నాడు. అయితే గడ్డాఫీని పట్టుకున్న దళాలకు కమేండర్ గా వ్యవహరించిన మిస్రాటా మిలట్రీ కౌన్సిల్ ప్రతినిధి ఫాతి బషాఘా, గడ్డాఫీ అతనికి తగిలిన గాయాలవలన చనిపోయాడని తెలిపాడు. 120 మైళ్ల దూరంలో ఉన్న మిస్రాటాకు అంబులెన్సులో తీసుకెళ్ళామని అతను చెప్పాడు. కాని వీడియో దృశ్యం ప్రకారం గడ్డాఫీని తీసుకెళ్ళింది అంబులెన్సు కాదని ఒక పికప్ ట్రక్కు మాత్రమేనని స్పష్టమవుతోంది.
ఎన్.టి.సి కి చెందిన మరొక అధికారి అబెల్ మాజిద్ మెగ్తా ఇలా చెప్పాడు. “అతని కడుపునుండి రక్తం కారుతోంది. అతనిని చాలా దూరం తీసుకెళ్లవలసి వచ్చింది. రక్తం బాగా పోవడంతో చనిపోయాడు.” అయితే మరొక ఎన్.టి.సి అధికారి చెప్పిన వివరం వీటన్నింటికి భిన్నంగా ఉంది. ఆయన తన పేరు చెప్పవద్దని కోరాడని గార్డియన్ తెలిపింది. “ఎన్.టి.సి ఫైటర్లు అతనిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతనిని చంపేశారు. ఇది యుద్ధం మరి” అని ఆయన చెప్పాడు. ఇదే అసలు సంగతి. గాయపడిన గడ్డాఫీని పైపునుండి బైటికి తెచ్చి పికప్ ట్రక్కులో తరలిస్తూ, పైనుండి వచ్చిన ఆదేశాలమేరకు ప్రయాణంలోనే తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత కాల్చి చంపారు.
గడ్డాఫీ మరణానికి దారి తీసిన పరిస్ధితులపై విచారణ జరపాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో కోరింది. లిబియాపైన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ యుద్ధ విమానాలు ఎనిమిది నెలలపాటు బాంబు దాడులు చేసి అనేకమంది లిబియన్లను పొట్టనబెట్టుకున్నప్పటికీ ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గానీ హ్యూమన్ రైట్స్ వాచ్ గానీ పల్లెత్తి ఒక్కమాట అన్న పాపాన పోలేదు. అంతా అయ్యాక ఇపుడు గడ్దాఫీ మరణంపై విచారణ జరపాలని కోరుతోంది. డూప్లికేట్ మానవహక్కుల సంస్ధల పనితీరు ఇలానే ఉంటుంది.
