బాన్సువాడ ఉపఎన్నిక ఫలితాలు, తెరాస జైత్రయాత్రకు బ్రేకు?


బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. తెరాస తరపున నిలబడిన సిటింగ్ ఎం.ఎల్.ఎ పోచారం శ్రీనివాసులు దాదాపు యాభై వేల ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్ పై విజయం సాధించినట్లుగా ఫలితం ప్రకటించారు.

పోచారం ఎన్నిక అందరూ ఊహించినదే కాగా, శ్రీనివాస్ గౌడ్ కు వచ్చిన ఓట్ల సంఖ్య మాత్రం ఎవరూ ఊహించినవి కావడమే ఇప్పుడు వార్తగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తాము గెలిచిన పది స్ధానాలకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో దాదాపు అన్ని స్ధానాల్లొ కాంగ్రెస్, టి.డి.పి లకు డిపాజిట్లు దక్కలేదు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. సమాజంలోని అన్నిరంగాల ప్రజలు సమ్మెకు పూనుకోవాలన్న లక్ష్యంతో, సకల జనులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్న లక్ష్యంతో ప్రారంభమైన “సకల జనుల సమ్మె” రికార్డు స్ధాయిలో 34 రోజుల నుండీ సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తోంది.

ఇటువంటి పరిస్ధితుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి పోచారం శ్రీనివాసులు విజయం తధ్యం అనేది అందరూ ఊహించిందే. అయితే ఆయనకు వచ్చే మెజారిటీ ఓట్ల విషయంలోనే వివిధ అంచనాలు వేసుకుంటూ ఫలితాల కోసం ఎదురు చూశారు. అధికులు, కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్లు దక్కకపోవచ్చనే ఎదురు చూశారు. కాని ఆ పరిస్ధితి ఎదురుకాకపోగా నామ మాత్రంగా నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్ధికి దాదాపు నలభైవేల వరకూ ఓట్లు రావడం వార్తగా నిలిచింది.

సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్.టి.సి కార్మికులు రికార్డు స్ధాయిలో పాతిక రోజులుగా సమ్మె చేసి నిన్ననే విరమించారు. తెలంగాణ ఆర్టిసి యూనియన్ వాళ్ళు సమ్మె విరమించకముందే అధికారిక యూనియన్ ఎన్.ఎమ్.యు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా, ప్రభుత్వం ఎన్నడూ లేని రీతిలో లేని డిమాండ్లకు కూడా అంగీకరించినా ఆర్టిసీ కార్మికులు సమ్మెను విరమించడానికి సుముఖత చూపలేదు. ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ ఆర్టీసీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఆర్టిసి సమ్మె విరమించబడింది. ప్రభుత్వ కుట్రలకూ, సీమాంధ్ర నాయకుల ఎత్తుగడలకూ తెలంగాణ కార్మికులు లేదా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరనీ ఈ పరిణామం రుజువు చేసింది.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రవేటు పాఠశాలలు, కాలేజీలు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఈ రోజు విరమణ ప్రకటిస్తూ సమ్మెకు తమ మద్దతు కొనసాగుతుందనీ, ఇతర రూపాలలో సమ్మెను కొనసాగిస్తామని వారు ప్రకటించారు. పన్నెండు రోజులు మాత్రమే విద్యార్ధులు క్లాసులు నష్టపోయారనీ, సెలవుల్లో పాఠాలు చెప్పి నష్టాన్ని పూడుస్తామనీ వారు ప్రకటించారు.

ఉద్యోగ జె.ఎ.సి రెండు రోజుల క్రితం ప్రభుత్వంతో చర్చలకు హాజరయ్యి సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశాయి. ఉద్యోగులు ముందు సమ్మె విరమిస్తే ఎస్మా, కేసుల ఎత్తివేత పట్ల నిర్ణయిస్తామని మంత్రులు ప్రకటించారు. కాని ఎస్మా రద్ధు, కేసుల ఎత్తివేతలాంటివి తమ డిమాండ్లు కాదనీ, చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పరచడానికి ప్రభుత్వం తీసుకోవలసిన కనీస చర్యలనీ స్పష్టం చేసి మంత్రులకు షాకిచ్చారు. తమ డిమాండు ఆర్ధికమైనది కాదనీ ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే’ తమ ఏకైక డిమాండనీ తేల్చి చెప్పారు.

ఇదిలా కొనసాగుతుండగా ‘మూడు రోజుల రైల్ రోకో’ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఉన్న కొన్ని బలహీనతలు బైటికి వచ్చాయి. ప్రభుత్వం సమ్మెను విఫలం చేయడం లక్ష్యంగా పెట్టుకుని, పోలీసులతో జాగ్రత్తగా పధకం వేసినట్లయితే తెలంగాణ సమ్మెను విఫలం చేయగలరు అని రైల్ రోకో నిరూపించింది. ఇది ఉద్యమకారుల పూర్తి వైఫల్యం కాకపోయినప్పటికీ గణనీయమైన అంశంగానే పరిగణించవలసి ఉంటుంది.

రైల్ రోకో మొదటి రోజుకు ముందే ప్రభుత్వం అనేక చోట్ల ముందస్తు అరెస్టులు చేయడం, నాయకులనూ మూడొందల వరకూ అదుపులోకి తీసుకోవడం ద్వారా రోకోపై మొదటి దెబ్బతీసింది. ఆ తర్వాత మొదటిరోజు ఆందోళనలో పట్టాలపై కూర్చున్నారని కొంతమందినీ, కూర్చోడానికి వెళుతున్నారని మరికొంతమందిని 2300 వరకూ అరెస్టులు చేసి కొన్ని రైళ్లను నడపగలిగింది. అయితే వీటిలో భద్రత ఉన్న పోలీసులు తప్ప ప్రయాణీకులెవరూ లేరనీ టి.జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం తెలిపాడు.

ఆశ్చర్యకరంగా రెండో రోజుతోనే రైల్ రోకో విరమిస్తున్నట్లు కోదండరాం ప్రకటించాడు. విరమణకి కారణాలు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. మూడో రోజు రైల్ రోకో రద్దు చేసుకుని తెలంగాణ బంద్ కు పిలుపిచ్చారు. తెలంగాణ బందు తెలంగాణలో విజయవంతం అయినా జంటనగరాల్లో విజయవంతం కాలేదని ఛానెళ్ళు చెబుతున్నాయి.

స్ధూలంగా చూస్తే తెలంగాణకు ప్రజల మద్దతు అదే స్ధాయిలో కొనసాగుతుండగా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల ప్రజలు విసిగిపోయిన పరిస్ధితి కనిపిస్తోంది. సమ్మెలవల్లా, రోకోల వల్లా ప్రజలకు కష్టనష్టాలు ఎదురవుతున్నాయి తప్ప ప్రధాన ఆధిపత్య వర్గాలయిన కంపెనీలు, రాజకీయ నాయకులు, ధనికులు పెద్దగా నష్టాలను ఎదుర్కోవడం లేదు.

తెరాస అభ్యర్ధికి తగ్గిన ఓట్ల మెజారిటీ లేదా కాంగ్రెస్ అభ్యర్ధికి దక్కిన డిపాజిట్లను, రైల్ రోకో సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమయిన బలహీనతలకు ఆపాదించవచ్చునా? సమ్మెలవలన ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కాంగ్రెస్ అభ్యర్ధి ఓట్ల సంఖ్యను పెంచాయా? లేక తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాబల్యం తగ్గుముఖం పట్టి, ఉద్యమంలో ఏదో విధంగా భాగస్వామ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నదా? లేక తెరాస బలం కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ, పోగొట్టుకున్న తన బలాన్ని తిరిగి పొందుతున్నదా?

గతంలో తెలంగాణ ఉద్యమం క్రెడిట్ మొత్తం తెరాసకు దక్కుతున్న పరిస్ధితి నెలకొని ఉందని అప్పటి ఉప ఎన్నికల ఫలితాలను బట్టి విశ్లేషకులు భావించారు. తెరాసకు మాత్రమే పూర్తి క్రెడిట్ దక్కుతుందన్న నియమం లేదనీ ఉద్యమంలో శ్రమిస్తే కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారనీ బాన్సువాడ ఉపేన్నిక ఫలితం నిరూపిస్తున్నట్లుగా తోస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఎం.ఎల్.ఎలు, ఎం.పి లు తెగించి రాజీనామాలు చేయగలిగితే, తద్వారా తమ హైకమాండు సత్వరం నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి పెంచితే, వారికి తగిన ఫలితం దక్కడమే కాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా తగిన బలాన్ని సంతరించుకోవచ్చని కూడా బాన్సువాడ ఫలితం సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటున్నకొద్దీ తెరాస బలం కోల్పోవడమే జరుగుతుంది. తెరాస మరింత నిర్ణయాత్మకంగా ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప ఉద్యమ ఫలితంలో గణనీయమైన భాగాన్ని కాంగ్రెస్ పార్టీకి కోల్పోక తప్పదేమో.

10 thoughts on “బాన్సువాడ ఉపఎన్నిక ఫలితాలు, తెరాస జైత్రయాత్రకు బ్రేకు?

 1. మెజారిటీ తగ్గటానికి కెసీఅర్ మీద తెలంగాణావారికి సడలుతున్న నమ్మకం కూడా ఒక కారణం కావచ్చు. కెసీఅర్ తన ఒంటెద్దు పోకడలు తగ్గించుకోక పోతే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. కేసీఅర్ కి ఫైట్ టు ఫినిష్ వ్యూహం లేదనే అనుమానం కలుగుతుంది. తెలుగు దేశం రాజకీయాల్లోంచి వచ్చిన కేసీఅర్ కి అంతటి శక్తి ఉంటుందనుకోవటం కూడా అనుకోవట్లేదు.

 2. భాన్స్ వాడ లో కాంగ్రెస్ పార్టీకి కన్ను లొట్టపోయి డిపాజిట్ దక్కదానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
  ౧. ) తెలుగు దేశం పార్టీ వోట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడటం. తెలుగు దేశం పార్టీ పోటీ ని బహిష్కరించింది కానీ తన వోటర్లకు ఎన్నికలను బహిష్కరించమని పిలుపు ఇవ్వలేదు. తెలుగు దేశం పార్టీ శ్రేణులన్నీకసిగా పోచరంకు వ్యతిరేకంగా పని చేసాయి.
  ౨. ) కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణా పై ఇదే సమయం లో కసరత్తు ప్రారంభించడం – తెలంగాణా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చేసిన ప్రచారం ఆ పార్టీ వోటర్లు పక్కకు జరగకుండా చేసాయి.
  ౩. ) బాన్స్ వాడ లో గణనీయ సంఖ్యలో వున్న ఆంద్ర సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్రభుత్వం “అన్నివిధాల” మేనేజ్ చేయడం.
  నిజానికి తెలుగు దేశం పార్టీ గనక ఇక్కడ పోటి చేసి వుంటే పరిస్థితి మరో రకం గా వుండేది.
  కచ్చితంగా కాంగ్రెస్, తెలుగు దేశం రెండు పార్టీలకూ డిపాజిట్లు గల్లంతయ్యేవి.
  కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల మాచ్ ఫిక్సింగ్ ఫలితమే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కడం.
  అంటే కాని టీ ఆర్ ఎస్ హవా ఏదో తగ్గిందని కాదు.
  మీ విశ్లేషణ తప్పు.

 3. గౌతం గారు, మీ వ్యాఖ్య ద్వారా కొంత సమాచారం అందింది. ధన్యవాదాలు.
  పొలిటికల్ జె.ఎ.సి నాయకుల ద్వారా నాకు అందిన సమాచారాన్ని బట్టి తెలంగాణలో టిడిపి కి ఇప్పుడు పునాది తుడిచిపెట్టుకు పోయింది. అదీకాక పోచారంతో పాటు టిడిపి శ్రేణులు తెరాస లోకి వచ్చి ఉండాలి కదా. బహుశా బాన్సువాడ టిడిపిలో పోచారం వ్యతిరేకులు ఉంటే వారు మీరన్నట్లు కసిగా అయనకి వ్యతిరేకంగా పని చేసి ఉండాలి. కాని ప్రస్తుతం తెలంగాణ డిమాండ్ లోతుగా పాతుకుపోయిన పరిస్ధితుల్లో టిడిపి, కాంగ్రెస్ ల కింద శ్రేణులు ఇంకా ఉన్నాయంటారా?
  కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రజలకు ఏమీ కనిపించడం లేదు. నిజానికి వారు కసరత్తు చేస్తున్న సూచనలు కూడా ఆగిపోయిన సంగతి మీరు గమనించలేదా? కొద్ది సేపటి క్రితం టి.జె.ఎ.సి సమావేశం ముగిసింది. మంత్రులు కె.వి.పి, లగడపాటి లతో చర్చలు జరుపుతున్నారని నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇకనుండి కాంగ్రెసు, దాని నాయకులే ఉద్యమానికి టార్గెట్ అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఆందోళనలో పాల్గొనడం కూడా చాలా తక్కువగానే ఉంది. కనుక మీ రెండవ పాయింటులో నిజం లేదేమో.
  ఆంధ్ర సెటిలర్లు బాన్సువాడలో ఎంతమంది ఉన్నారు? సెటిలర్లు అన్నది చాలా పెద్దపదం. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళి స్ధిరపడడం ఇండియాలో చాలా సాధారణం. అలాంటిది ఒకే రాష్ట్రంలో వేరే జిల్లాకి వెళ్లడం, అక్కడ స్ధిరపడడం వ్యతిరేకించవలసిందేమీ కాదు. వారిని సెటిలర్లు అని దూరం పెట్టడం సరికాదని నా అభిప్రాయం. రేపు తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణనుండి ఆంధ్రకు, ఆంధ్ర నుండి తెలంగాణకు అలాగే ఇతర రాష్ట్రాలనుండి ఇక్కడికీ, ఇక్కడినుండీ ఇతర రాష్ట్రాలకూ వివిధ కారణాలతో వెళ్ళీ స్ధిరపడడం కొనసాగుతుంది. తెలంగాణ వనరులను దోచుకోవడంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు (ధనికులు), రాజకీయ నాయకుల పాత్ర ఉంది తప్ప సీమాంధ్ర ప్రజల పాత్ర లేదు. ప్రజల మధ్య సజీవ సంబంధాలను స్వాగతించాలి. గౌరవించాలి. అప్పుడే అన్నదమ్ముల్లా విడిపోవడం సాధ్యపడుతుంది.
  కాంగ్రెస్, టిడిపిల హవా తగ్గినట్లే తెరాస హవా తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పటి పరిస్ధితుల్లో తక్కువగా ఉండవచ్చు. ఆ పార్టీలన్నీ ఒక తానులో గుడ్డలే. తెరాస ఆ రెండింటితో ఎన్నికల ఒప్పందాలు చేసుకోవడమే అందుకు రుజువు. ఉద్యమ వేడిలో తెరాస తప్పులను తెలంగాణ ప్రజలు క్షమించేస్తున్నారు. ఒప్పులు లెక్కకు వచ్చినట్లే తప్పులు కూడా ఎప్పటికైనా లెక్కకు వస్తాయి.

 4. gowtam nivayan గారు..
  మీ విశ్లేషణ బాగుంది. నెను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ.. టి.ఆర్.ఎస్. నాయకత్వాన జరిగిన సకలజన సమ్మె విఫలం కావటం కూడా ఉపఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసుండొచ్చు అని అనిపిస్తుంది. జానారెడ్డి లాంటి వారిని నమ్ముకొవటం తెలంగాణా వారి అమాయకత్వం.

 5. >కేసీఅర్ కి ఫైట్ టు ఫినిష్ వ్యూహం లేదనే అనుమానం కలుగుతుంది<
  అది నిజం.
  ఉద్యమం ఈ స్ధాయికి వచ్చిందంటే రాజకీయ జె.ఎ.సి లో దానితో పాటు ఉన్న సి.పి.ఐ (ఎం.ఎల్- న్యూడెమొక్రసి), బి.జె.పి పార్టీలు ముఖ్యమైన కారణం. కె.సి.ఆర్ ఎంతసేపటికీ కాంగ్రెస్ తో స్నేహం చేస్తూ లాబీయింగ్ ద్వారా తెలంగాణ తీసుకురావచ్చన్నదే ప్రధాన వ్యూహం.
  సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణతో ముడిపడిన ఆర్ధిక ప్రయోజనాలను వదులుకోవడం అస్సలు ఇష్టం ఉండదనీ, ఆ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం వారు ఎంతకైనా తెగిస్తారనీ, వారిని డీకొడితే తప్ప తెలంగాణ రాదని తెలిసినవారు ప్రధానంగా న్యూడెమొక్రసీ వాళ్ళే. ఇక బి.జె.పి కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగనక కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏదైనా చేస్తుంది.
  కె.సి.ఆర్ కి ఫైట్ టు ఫినిష్ అనే ఉద్యమం ఒకటి చేయవలసి ఉంటుందని కూడా తెలిసి ఉండదేమో. తెలిసి ఉండకపోవడం అంటే అటువంటి ఎత్తుగడ పట్ల ఆయనకు కమిట్‌మెంట్ ఉండవలసిన అగత్యం లేకపోవడమే.
  సీమాంధ్ర నాయకులు ఎం.ఆర్.పి.ఎస్ ని కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడేలా చేయగలగడం గమనిస్తే వారు డబ్బుతో దేన్నైనా కొనగలరని అర్ధం అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులనీ, టి.కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ లనూ కూడా వారు కొనేసారని కూడా అర్ధం అవుతోంది. ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నా వారు ఆ ఛాయలకు కూడా రావడం లేదంటే దానర్ధం సుస్పష్టమే. పైగా మంత్రులు కె.వి.పి, లగడపాటిలతో చర్చిస్తున్నారట! సిగ్గులేకపోతే సరి!!
  కె.సి.ఆర్ ని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడించడంలో, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పని చేయలవలసిన అవసరాన్ని గుర్తించేలా చేయడంలో న్యూడెమొక్రసీ పార్టీది ప్రధాన పాత్రగా కనిపిస్తోంది.

 6. రమణగారు సకల జనుల సమ్మె కేవలం తెరాస నాయకత్వాన మాత్రమే జరగలేదు. ఇంకా అనేక సంఘాలు పార్టీలు ఉన్నాయి. సకల జనుల సమ్మె విఫలం కాలేదు నిజానికి. రైల్ రోకో విఫలం అయ్యింది అంతే. రైల్ రోకో కూడా విఫలం అయినట్లు కనిపిస్తున్నదే తప్ప అది కూడా ఎనభై నుండి తొంభై శాతం వరకూ సఫలం అయ్యిందనే చెప్పాలి. మొదటి రోజు ద.మ.రై అనేక రైళ్ళను రద్దు చేసింది. పోలీసు రక్షణతో నడిపిన రైళ్ళు రెండు మూడు మాత్రమే కదా. కార్యకర్తలు, నాయకులు అరెస్టు కావడం కూడా ఒక విధమైన సఫలమే.
  అయితే ప్రభుత్వం నిర్భంధానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే రైల్ రోకోను అర్ధంతరంగా ముగించవలసి వచ్చింది. ఉద్యమ రూపాల పట్ల ప్రణాళికలు వేసుకోవడంలో వైఫల్యం బాగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఉద్యమాన్ని ఇంతవరకూ తీసుకొచ్చిన ఘనత జె.ఎ.సి నాయకులకు ఇవ్వవలసిందే.
  ఇంకొక విషయం ఏమిటంటే తెలంగాణ సమ్మెకు సంబంధించిన వార్తలను ఇతర ప్రాంతాలలో నిజాయితీగా అందిస్తున్న ఛానెళ్ళు ఒకటో రెండో కనిపిస్తున్నాయి. హెచ్.ఎం.టి.వి, జీ 24 గంటలు ఛానెళ్ళు తప్ప మిగితావన్నీ పక్షపాతంతో వార్తలు అందిస్తున్నాయని జె.ఎ.సి నాయకులు చెబుతున్నారు. అది కూడా ఇతర ప్రాంతాలవారికి సమ్మె విఫలం అయిందన్న ఆలోచన జనించడానికి కారణమేమో.

 7. సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) పార్టీకి అది సంక్షీప్త నామం. ఆ పార్టీ జాతీయ పత్రిక ‘న్యూ డెమొక్రసీ.’ ఇది కమ్యూనిస్టు విప్లవ పార్టీ. సి.పి.ఐ, సి.పిఎం పార్టీలను రివజనిస్టు పార్టీలుగా ఈ సంస్ధ పేర్కొంటుంది. ఆ పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలని ఎన్నడో వదిలిపెట్టాయని చెబుతుంది. అధిపత్య వర్గాల పార్టీలైన కాంగ్రెస్ లాంటి పార్టీలకు తోకలుగా సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు మారాయనీ విమర్శిస్తుంది. ఈ పార్టీ తరపున గుమ్మడి నర్సయ్య ఇల్లెందు (ఖమ్మం జిల్లా) నియోజకవర్గ ఎం.ఎల్.ఎ గా ఐదు సార్లు ఎన్నికయ్యాడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడు. కాని ఆయన ఓట్లు మాత్రం తగ్గకపోవడం విశేషం. విప్లవ పార్టీలు వారి పత్రికల పేరుతో పిలవబడడం ఇక్కడ సర్వ సాధారణం.

 8. బాన్స్‌వాడ నియోజక వర్గంలో లంబాడా వోటర్లు ఇరవై వేల మంది ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లంబాడా సంఘం నాయకుణ్ణి కొనేశాడని ఎన్నికలకి ముందే వార్తలొచ్చాయి. గత ఎన్నికలలోనూ కాంగ్రెస్ కుల సంఘం నాయకులని ఉపయోగించుకుని ప్రచారం చేసింది. ఇదేమీ కాంగ్రెస్‌కి కొత్త కాదు.

 9. కోస్తా ఆంధ్ర నాయకులకి అనుకూలంగా ఉండకపోతే జానారెడ్డి లాంటివాళ్ళకి పదవులు ఉండవు. అసలు కాంగ్రెస్‌కి తెలంగాణాలో ఆచూకీ లేకుండా చేస్తేనే తెలంగాణా రాష్ట్రం వస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s