అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -1


ప్రజాస్వామిక సంస్కరణల కోసం అరబ్ దేశాల్లో ప్రజానీకం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యమిస్తున్న నేపధ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యానికి తీవ్రం ఆటంకాలు తలెత్తాయి. ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలలో గట్టి మద్దతుదారులుగా ఉన్న ట్యునీషియా, ఈజిప్టు లలో నియంతృత్వ ప్రభుత్వాలు కూలిపోయాయి. కుట్రలు పన్ని ఆ రెండు దేశాలలో ప్రజా ఉద్యమాలు చివరివరకు కొనసాగకుండా అమెరికా చూసుకోగలిగింది. తమ పాత అనుచరులను, నమ్మకస్తులనే ఆ దేశాల్లో పాలకులుగా కొనసాగించగలుగుతోంది. అరబ్ ప్రజా ఉద్యమాలకు స్పందనంగా అమెరికా, యూరప్ లు లిబియాలోని గడ్డాఫీ ప్రభుత్వాన్ని సైనిక చర్యతో కూల్చివేశాయి.

అయితే, అరబ్ ప్రజాందోళనలలో  అమెరికా, యూరప్ ల కుట్రలు కూడా పూర్తిగా సఫలం అయ్యాయని చెప్పడానికి వీల్లేకుండా ఉంది. ట్యునీషియాలో అడపా, దడపా ప్రజలు ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈజిప్టు  ప్రజానీకం తాత్కాలిక మిలట్రీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంస్కరణలు అమలు చేయడానికి తగిన వేగంతో చర్యలు తీసుకోవడం లేదనీ, అతి నెమ్మదిగా చర్యలు తీసుకుంటూ అమెరికా, ఇజ్రాయెల్ ల ప్రయోజనాలు నెరవేర్చాలని చూస్తున్నదనీ ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా ఇప్పటికి అనేకసార్లు వివిధ నగరాలలో మళ్లీ మళ్ళీ ఆందోళనలు నిర్వహించారు. పాలస్తీనాను ఆక్రమించి ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయంపై దాడి చేసి అక్కడి సిబ్బందినీ, రాయబారులనీ తరిమి కొట్టారు. ఇజ్రాయెల్ జెండాను పీకి పారేసారు. ఇలా రెండు సార్లు జరిగింది. ఇజ్రాయెల్ ఎంబసీపై దాటిపట్ల అమెరికా తీవ్ర అభ్యంతరం మాత్రమే తెలపగలిగింది.

బహ్రెయిన్ లో సౌదీ అరేబియా, కతార్ లాంటి మత ప్రభుత్వాలు తమ సైన్యాలను పంపి ఉద్యమాలను పాశవికంగా అణచివేశాయి. అనేకమందిని బూటకపు విచారణలు జరిపి జైళ్లకు పంపించారు. కొంతమందికి మరణ శిక్షలను కూడా విధించారు. ఉద్యమకారులకు వైద్యం చేశారని ఆరోపించి బహ్రెయిన్ నియంత పలువురు డాక్టర్లకు జైలు శిక్షలు విధించాడు. అయినప్పటికీ బహ్రెయిన్ లో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా ఉంది. యెమెన్ నియంత తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించినా ప్రజలు నమ్మడం లేదు. ఉద్యమకారులను చంపిస్తున్నప్పటికీ ఉద్యమం శాంతించడం లేదు.

యెమెన్ లో అమెరికా ద్వంద్వ విధానాన్ని ప్రజలు బహిరంగంగా నిరసిస్తున్నారు. లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ అమెరికా, యూరప్ లు పూర్తి విజయం సాధించలేక తంటాలు పడుతున్నారు. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సొంత పట్టణం సిర్టేను ఆక్రమించుకోవడానికి నెల రోజులుగా శ్రమిస్తున్నా వల్లగావడం లేదు. పైగా తమ వశం అయిందనుకుంటున్న రాజధాని ట్రిపోలిలో గడ్డాఫీ మద్దతుదారులు పెద్ద ఎత్తున కాల్పులకు దిగారు. లిబియా దక్షిణాన ఉన్న ఎడారి నగరం సాబా ఇంకా గడ్డాఫీ బలగాల ఆధీనంలోనే కొనసాగుతోంది.

అమెరికా ‘అతి’

ఈ పరిస్ధితుల్లో అమెరికా ఏ చిన్న సానుకూల పరిణామం సంభవించినప్పటికీ దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి టెర్రరిజంపై యుద్ధంలో ముందడుగు వేస్తున్నామనీ త్వరలోనే ఆల్-ఖైదాను పూర్తిగా ఓడించనున్నామనీ చెప్పుకుంటోంది. ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ దాడులను పసిగట్టి ఎదుర్కోలేక, తన చాతగానితనానికి పాకిస్ధాన్ ను బాధ్యురాలిగా చెయ్యడానికి తెగబడుతోంది. హక్కానీ గ్రూపు నాయకుడు జలాలుద్ధీన్ హక్కానీకి బాబాయి వరస అయ్యే వ్యక్తిని పాకిస్ధాన్ స్వయంగా అమెరికాకు అప్పగించగా, అతనిని అరెస్టు చేసినట్లుగా చెబుతూ హక్కాని గ్రూపులో ముఖ్యనాయకుడిని పట్టుకున్నామని ప్రకటించుకుంది. రహస్యంగా అతని సాయంతో హక్కానీ గ్రూపుతో సంబంధాలు పెట్టుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.

తాజాగా సెప్టెంబరు 30 తేదీన ‘ఆల్-ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా’ (ఎ.క్యు.ఎ.పి) సంస్ధ నాయకుడు, అమెరికా దేశీయుడు అయినా అన్వర్ ఆల్-అవలాకీ అనే కరుడు గట్టీన టెర్రరిస్టును డ్రోన్ దాడిలో చంపేశామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు. యెమెన్ నుండి ఈయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ, ఆత్మాహుతి దాడులకు పురిగొల్పుతున్నాడనీ, ఆ మధ్య గాలిలో విమానాలని పేల్చివేయడానికి జరిగిన కుట్రలకు ఈయన ప్రధాన సూత్రధారి అనీ అమెరికా ప్రకటించింది. “ఒసామా బిన్ లాడెన్ స్ధాపించిన జిహాదీ నెట్‌వర్క్ కు అతని మరణం తీవ్రమయిన నష్టం” అని ఒబామా, ఇతర అమెరికా అధికారులు ప్రచారం చేశారు. “ఆల్-ఖైదాలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి”గా అమెరికా అధికారులు అవలాకిని అభివర్ణించారు.

కాని వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ప్రఖ్యాత ప్రపంచ రాజకీయాల విశ్లేషకుడు జేమ్స్ పెట్రాస్ వెల్లడించాడు. ఆల్-అవలాకి హత్య చుట్టూరా జరిగిన ప్రచారం అంతా అతి అని చెప్పడానికి బోల్డన్ని ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నాడు. అవ్లాకి హత్యకు ఉన్న రాజకీయ ప్రాముఖ్యతను గొప్పది చేసి చూపడం ద్వారా ముస్లిం ప్రపంచంలో నానాటికి తగ్గిపోతున్న అమెరికా ప్రభావాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశించిందని ఆయన వాదిస్తున్నాడు. అవలాకి హత్యను పెద్ద విజయంగా స్టేట్ డిపార్ట్‌మెంట్ అభివర్ణించడం అమెరికా తను విరోధులను ఓడించడంలో గల మిలట్రీ సామర్ధ్యాన్ని పెచ్చు చేసి చూపడానికేనని ఆయన తెలిపాడు. ఒబామా నేతృత్వంలో అమెరికా విచ్చలవిడిగా డ్రోన్ దాడులకు పాల్పడుతున్న నేపధ్యంలో తమ దాడుల్లో ముఖ్యనాయకులు చనిపోతున్నారని ప్రచారం చేయడానికీ తద్వారా తమ విచ్చలవిది డ్రోన్ దాడులకు చట్టబద్ధత తేవడానికి అవలాకి మరణాన్ని అతి చేసి చెబుతున్నారని జేమ్స్ పెట్రాస్ తెలిపాడు.

ఆల్-అవలాకీ ప్రాముఖ్యత ఓ మిధ్య

యెమెన్ ఒక చిన్న పేద దేశం. ఆ దేశంలో ‘అన్వర్ ఆల్-అవలాకి,’ మత సిద్ధాంతంపై బ్లాగ్ నడిపే ఒక బ్లాగర్. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంవరకే పరిమితమైన వ్యక్తి. అమెరికా చేపట్టే మిలట్రీ, సాంస్కృతిక జోక్యందారీ పద్ధతులను ప్రతిఘటించేవైపుగా ముస్లిం మతస్ధులను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. అమెరికా మద్దతు ఉన్న నియంత ఆలి అబ్దుల్లా సలే వ్యతిరేక ప్రతిపక్షాలతో సంస్ధాపరమైన అనుబంధం ఉన్నది. దక్షిణ యెమెన్ లో చాలా కొద్ది సంఖ్యలో చిన్న పట్టణాలలోనే ఇతని ప్రభావం పరిమితమై ఉంది. ఈయన సంస్ధగా అమెరికా చెబుతున ఎ.క్యు.ఎ.పి లో అవలాకి మిలట్రీ నాయకుడుగానీ, రాజకీయ నాయకుడు గానీ కాదు.

సి.ఐ.ఎ చాలా సంస్ధలను  ఆల్-ఖైదా అనో, దాని అనుబంధ సంస్ధలనో చెబుతూ ఉంటుంది. అలాంటి అనేక సంస్ధలలాగానే ఎ.క్యు.ఎ.పి కూడా స్ధానికంగా స్వతంత్రంగా ఏర్పడిన ఒక సంస్ధ మాత్రమే. అంటే అది స్ధానిక నాయకుల ద్వారమే మాత్రమే నిర్వహించబడుతూ, వారి నియంత్రణలోనే ఉంటుంది. అనేక ఇతర మత సంస్ధల భావాలతో దీనికి సహజంగానే అమోదం ఉంది. ఎ.క్యు.ఎ.పి మిలట్రీ, రాజకీయ కార్యకలాపాలలో అవలాకి పాత్రం చాలా తక్కువ. యెమెన్ నియంత సలేను తప్పించడం కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంపైన ఈయన ప్రభావం అస్సలు లేదనే చెప్పాలి. ఈఅయన ప్రభావంతమైన ప్రచారకర్తగా చెప్పడానికి కూడా సాక్స్యాలేవీ లేవు. యెమెన్ లో గానీ ప్రజా ఉద్యమాలు తలెత్తిన ట్యునీషియా, ఈజిప్టు, బహ్రెయిన్ లలో గానీ ఈయన అనుచరులు తక్కువమందే. లోతైన అధ్యయనం పెద్దగా లేకుండానే అవలాకి గురించిన ఈ వివరాలను తెలుసుకోవచ్చు.

ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలలో అవలాకి ప్రభావం లేదన్న సంగతి తేలికగానే అర్ధం అయ్యే విషయం కావడంతో, లేని ప్రాముఖ్యతను ఆయనకు అంటగట్టడానికి ‘అవలాకి నిజమైన ప్రభావం ఇంగ్లీషు మాట్లాడే జిహాదీ కార్యకర్తలలో ఎక్కువగా ఉన్నద’ని అమెరికా గూఢచార సంస్ధలు చెబుతాయి. సంస్ధాగత టెర్రరిస్టు కార్యకలాపాలపై ఆయన ప్రభావం లేకపోవడాన్ని కప్పిపుచ్చడానికి ‘అమెరికాపై దాడి చేయడానికి కొంతమంది టెర్రరిస్టులను ఆయన వ్యక్తిగతంగా తయారు చేశాడని’ చెబుతాయి. వ్యక్తిగతంగా తయారు చేసినందున పెద్దగా వెలుగులోకి రాలేదని అవి చెప్పదలిచాయన్నమాట.

గత సంవత్సరం అక్టోబర్ నెలలో యెమెన్ నుండి చికాగో వెళ్ళిన సరుకుల విమానంలో బాంబులను రవాణా చేయడంలో అవలాకి హస్తం ఉందని అమెరికా గూఢచారులు అనుమానిస్తున్నారు. అమెరికాలోని ఫోర్ట్ హుడ్ మిలట్రీ బేస్ లో మేజర్ నిడాల్ మాలిక్ పదమూడు మంది సైనికుల కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఆ చర్యకు అవలాకియే సైద్ధాంతిక సమర్ధనను ఈ-మెయిల్ ద్వారా అందించాడని కూడా వారు ఆరోపిస్తున్నారు. నార్వేలో కొద్ది నెలల క్రితం కాల్పులు జరిపి 77 మందిని పొట్టనబెట్టుకున్న క్రిస్టియన్ తీవ్రవాది ‘ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్’ తన హత్యాకాండకి అమెరికాలోని ప్రఖ్యాత ముస్లిం ద్వేష సిద్ధాంతకర్తలు మేర్లిన్ గెల్లెర్, డేనియల్ పైప్స్ లను తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పాడు. కనుక వీరిద్దరినీ అమెరికా అధ్యక్ష భవనం, మానవ రహిత డ్రోన్ విమాలతో దాడి చేసి చంపవలసిందేనా?

సి.ఐ.ఎ, ఎం.ఐ 16, ఇంకా ఇతర ఆల్-ఖైదా నిపుణులు వ్యక్తం చేసిన అర్ధంలేని అనుమానాలను నిజమేనని భావించినా, అమెరికాకి వ్యతిరేకంగా జరిగిన టెర్రరిస్టు చర్యలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాత్ర పోషించాడని భావించినా, అవన్నీ పూర్తిగా పిల్ల చేష్టలుగా మాత్ర్రమే తేలాయి. ఆయన హస్తం ఉందని పేర్కొన్న టెర్రరిస్టు చర్యలు హాస్యాస్పదమైన రీతిలో విఫలమయ్యాయి. అవన్నీ అమెరికా బద్రతకు ప్రమాదం తేగల స్ధాయికి అత్యంత దూరంలోనే ఉండిపోయాయి. అండర్‌వేర్ లో బాంబు పెట్టుకుని, డిసెంబరు25, 2009 తేదీన, డెట్రాయిట్ నగరంపైన విమానాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఉమర్ ఫరూక్ అబ్దుల్ ముతాలబ్’ తన ప్రయత్నంలో ఘోరంగా విఫలమవడమే కాక తన శరీర భాగాలను కాల్చుకున్నాడు. చికాగోకు పంపిన విమానంలో పేలుడు పదార్ధాలు కూడా అదే రీతిలో ఉన్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s