యూరప్ రుణ సంక్షోభాన్ని ప్రపంచానికి అంటించొద్దు -అమెరికా తదితరులు


శుక్రవారం, జి20 గ్రూపు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రధాన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపు సమావేశాల సందర్భంగా యూరప్ రుణ సంక్షోభం పరిష్కరించే బాధ్యతను ప్రపంచ దేశాలపై వేయడానికి యూరప్ దేశాలు (ఇ.యు) చేసిన ప్రయత్నాన్ని అమెరికా తదితర దేశాలు తిప్పికొట్టాయి. యూరప్ రుణ సంక్షోభాన్ని యూరప్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, ప్రపంచానికి అంటించాలనుకోవడం సరికాదని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వాదించాయి.

యూరప్ రుణ సంక్షోభం నేపధ్యంలో ఐ.ఎం.ఎఫ్ వద్ద ఉన్న నిధులను రెట్టింపు చేయాలనీ, తద్వారా యూరోప్ రుణ సంక్షోభ పరిష్కారం కోసం మరిన్ని నిధులని ఐ.ఎం.ఎఫ్ అందుబాటులో ఉంచాలని ఇ.యు దేశాలు ప్రతిపాదించగా దానికి జి20 సమావేశాల్లో మద్దతు లభించలేదు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలనుండి ఈ పధకానికి మద్దతు లభించడం విశేషం.

జి20 గ్రూపు దేశాల ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు అధిపతుల సమావేశాలు పారిస్ లో శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఇందులో యూరప్ రుణ సంక్షోభమే ప్రధాన చర్చాంశంగా ఉంటుందని ఇప్పటికే సమాచారం వెలువడింది. రెండో రోజయిన శనివారం యూరప్ సంక్షోభంపై జి20 గ్రూపు దేశాలు మరింత వివరంగా యురో సంక్షోభంపై చర్చలు జరపనున్నాయి. మరో తొమ్మిది రోజుల తర్వాత యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్నందున యూరోజోన్ సంక్షోభం భాధ్యత్ను అప్పటికి వాయిదా వేశే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

శనివారం సాయంత్రానికల్లా జి20గ్రూపు సమావేశాల్లో ఆమోదించబడిన డాక్యుమెంటూ వెలువడే అవకాశం ఉంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ కమ్యూనిక్ ద్వారా వెలువడతాయి. వచ్చే నవంబరు 3, 4 తేదీల్లో కేన్స్ నగరంలో జి20 దేశాల ప్రభుత్వాధిపతుల సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల ఎజెండాను కూడా శనివారం ముగిసే జి20 మంత్రివర్గ సమావేశాలు రూపొందిస్తాయి.

1990 ల ప్రారంభంలోనే స్ధాపించబడిన జి20 కూటమి మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పటినుండో ప్రపంచ వ్యవహారాల్లో తమకు కూడా పాత్ర కావాలని చైనా, ఇండియా, బ్రెజిల్ లాంటి ఎమర్జింగ్ మార్కెట్ దేశాలు చేస్తున్న డిమాండ్ కు అమెరికా యూరప్ లు జి20ని సమాధానంగా చూపాయి. ఎమర్జింగ్ దేశాల ప్రతినిధులు కూడా జి20 గ్రూపు సమావేశాలకు హాజరై అమెరికా, యూరప్ లకు తాన తందానా అనడం తప్ప వారికి సరైన అధికారాలు, ఫలితాలు అప్పజెప్పడం ఇంతవరకూ జరగలేదు.

ప్రపంచ వాణిజ్య సంస్ధ చర్చలలో ఎమర్జింగ్ దేశాలు ఒకే మాటతో వ్యవహరిస్తూ అమెరికా, యూరప్ లు తమ దేశాల్లో వ్యవసాయం లాంటి రంగాలలోని కంపెనీలకు పెద్ద ఎత్తున ఇస్తున్న సబ్సీడీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శక్తివంతంగా మారడంతో అవి జి20ని తమకు సరైన వేదికగా ఎంచుకున్నాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా జి20 గ్రూపు గణనీయమైన పాత్ర పొషించింది. ఈ గ్రూపుని అడ్డు పెట్టుకుని అమెరికా, యూరప్ లు సంక్షోభంతో దివాలా తీసిన తమ కంపెనీలకు ఎమర్జింగ్ దేశాల తో కూడా బెయిలౌట్ లు ఇప్పించగలిగాయి.

సంక్షోభం అనంతరం వరుసగా సమావేశాలు జరిగినప్పటికీ ఆ తర్వాత మర్చిపోయారు. ఇపుడూ యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం పెద్ద సమస్యలుగా ముందుకు రావడంతో మళ్ళీ జి20 గ్రూపు అవసరం అమెరికా, యూరప్ లకు గుర్తుకు వచ్చింది. యూరప్ ఆశలకు తగ్గట్లుగానే ఎమర్జింగ్ దేశాల మంత్రులు, సెంట్రల్ బ్యాంకర్లు ఐ.ఎంఎఫ్‌కు మరో 350 బిలియన్ డాలర్ల మేరకు అదనంగా నిధులను సమకూర్చాలని ప్రతిపాదించినట్లుగా రాయిటర్స్ తెలిపింది.

అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితరులు దీనిని తిరస్కరించాయి. ఐ.ఎం.ఎఫ్ లో ఆధిపత్య దేశాలయిన అమెరికా, జపాన్, జర్మనీ, చైనా దేశాలు ఐ.ఎం.ఎఫ్ వద్ద ఉన్న 380 బిలియన్ డాలర్లు చాలని తెలిపాయి. ఇంకా ముట్టుకోని నిధులు ఐ.ఎం.ఎఫ్ వద్ద బోలెడన్ని ఉన్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ అన్నాడని రాయిటర్స్ తెలిపింది. యూరోజోన్ రుణ సంక్షోభం యూరప్ మాత్రమే పరిష్కరించుకోవాలన్న వాదనను జర్మనీ అంగీకరించింది. అక్టోబరు 23 న జరిగే ఇ.యు సమావేశాల్లో పరిష్కారం దొరకాలని జర్మనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

యూరోజోన్ రుణ సంక్షోభం త్వరగా పరిష్కరించుకోవాలని అమెరికా యూరప్ పైన వత్తిడి తెస్తున్నది. ఇతర దేశాలు కూడా వత్తిడి తేవాలని అది కోరుతోంది. లేకుంటే ప్రపంచం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతుందని అది భయప(పె)డుతోంది. నిర్ణయాత్మకంగా ఇ.యు వ్యవహరించాలని అది డిమాండ్ చేస్తోంది. తమ వ్యవహారం తాము చూసుకుంటామనీ అమెరికా పదే పదే హెచ్చరించవద్దని కూడా ఇ.యు కొన్ని రోజుల క్రితం యాష్ట పోయింది. అమెరికా ముందు తన సంగతి చూసుకోవాలని కూడా ఎత్తి చూపింది.

యూరోపియన్లు తమ ఇంటిని అదుపులో పెట్టుకోవాలని ఆస్ట్రేలియా, సమావేశాల్లో కోరింది. యూరప్ త్వరగా తమ సంక్షోభాన్ని పరిష్కరించుకునేలా జి20 వత్తిడి తేవాలని కెనడా ఆర్ధిక మంత్రి అభిప్రాయపడ్డాడు. తమలో తాము పరిష్కరించుకోకుండా ఐ.ఎం.ఎఫ్ నిధులపైన యూరప్ దృష్టి పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించాడు.

యూరో జోన్ రుణ సంక్షోభం పరిష్కారం కోసం యూరప్ బ్యాంకులకు ప్రభుత్వాలు మరింత పెట్టుబడులను సమకూర్చాలని జర్మనీ, ఫ్రాన్సులు ఒక పధకాన్ని రూపొందించాయి. అంటే మరొకసారి బ్యాంకుల నష్టాలను ప్రజా ధనంతో పూడ్చడానికి యూరోపియన్ దేశాలు పధక రచన చేస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s