ఈ సందర్భంగా “ప్రశాంత్ భూషణ్ ను మా బృందం నుండి తొలగించే విషయాన్ని మేము తర్వాత చర్చించుకుని నిర్ణయిస్తాం” అని అన్నా హజారే పత్రికలకు తెలపడం ఈ అంశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాశ్మీరుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తేనే ‘అవినీతి వ్యతిరేక సామాజిక కార్యకర్తల బృందం’ లో చీలికలు రావలసిన అవసరం ఏమిటో చాలామందికి అర్ధం కావడం లేదు. “కాశ్మీరుపై ప్రశాంత్ భూషణ్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు తప్పు. కాశ్మిరుపై ప్రశాంత్ భూషణ్ ప్రకటనను మేము ఆమోదించడం లేదు. ఆయన ఒక అంశంపై అభిప్రాయం చెప్పదలుచుకుంటే అది తాను వ్యక్తిగతంగా ఇవ్వవచ్చని ప్రశాంత్ భూషణ్ కి చెబుతాను. బృందం అభిప్రాయాలను ఆయన చెప్పదలుచుకుంటే, ఆయన ముందు బృందంతో మాట్లాడవలసి ఉంటుందని చెబుతాను” అని అన్నా హాజారే విలేఖరులతో చెప్పాడు.
“ప్రజలు నా అభిప్రాయాలను వ్యతిరేకించవచ్చు. కాని అందుకు నన్ను కొట్టడానికి వీల్లేదు. కాశ్మీరుపై నేను వెలిబుచ్చిన అభిప్రాయాల విషయంలో నేను వెనక్కి తగ్గడం లేదు. అవి నా అభిప్రాయాలు. కాశ్మీరు సమస్యపైన స్వేచ్ఛగా, బహిరంగంగా చర్చ చేయడానికి వీల్లేదని మనం చెప్పదలిచామా?” అని ప్రశాంత్ భూషణ్ గురువారం ఒక టి.వికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. అంటే ప్రశాంత్ భూషణ్ కాశ్మీరు సమస్యపై తెలిపిన అభిప్రాయాలు తనవే అని చెప్పాడు. తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే చెప్పానని ఆయన స్పష్టంగా చెప్పాడు. పైగా ఒక బృందంగా ఏర్పడి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి, జన్ లోక్ పాల్ చట్టం చేయించడానికి ఉద్యమిస్తున్నంత మాత్రాన అన్నా బృందంలో సభ్యులందరికీ అన్ని అంశాలపైన ఏకాభిప్రాయం ఉంటుందని ఎవరు భావిస్తున్నారని? ఆ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు.
ప్రశాంత్ భూషణ్ గానీ, అన్నా హజారే గానీ, ఆయన బృందంలోని ఇతర సభ్యులు గానీ ప్రజాజీవితంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళేమీ కాదు. వారి అభిప్రాయాలు అనేకం అంతకు ముందు వారు చేసిన అనేక కార్యక్రమాల ద్వారా చాలామంది ఎరిగినవే. ఇపుడు ప్రశాంత్ భూషణ్ కాశ్మీరుపైన వారణాసిలో ఉపన్యసించిన వెంటనే ఎవరికీ సమస్యగా భావించలేదు. అన్నా హజారే కూడా ఫలానా సభలో ఫలానా విధంగా ఎందుకు మాట్లాడావని ప్రశాంత్ భూషణ్ ను అడగలేదు. ప్రజాస్వామిక సూత్రాలపైన గౌరవం లేని ముగ్గురు వ్యక్తులు తర్వాత రోజు వచ్చి ప్రశాంత్ భూషణ్ పైన దాడి చేసిన తర్వాతనే ఆ విషయమై అందరూ మాట్లాడుతున్నారు. పత్రికలు పనిగట్టుకుని మీ మధ్య విభేధాలు వచ్చాయి గదా అని కొంటే ప్రశ్నలు వేయడంతోనే ప్రశాంత్ భూషణ్ ను బృందం నుండి తొలగించే సంగతి చర్చించి నిర్ణయిస్తామని హజారే నోరు జారడం పూర్తిగా అవాంఛనీయం.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల గురించీ, నిరసన తెలపడం పట్ల వారికి ఉన్న హక్కులగురించీ అన్నా బృందం పదే పదే ప్రభుత్వానికి గుర్తు చేసింది. అన్నా హజారే ఆ హక్కు ప్రశాంత్ భూషణ్ కు లేదని చెప్పదలుచుకున్నారా? అరవై సంవత్సరాలుగా నలుగుతున ఒక సమస్య గురించి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని మూఢులు గుర్తించరు సరే, అన్నా కూడా గుర్తించరా? తమ బృందం లక్ష్యం కేవలం అవినీతికి వ్యతిరేకంగా సమర్ధవంతమైన చట్టం తీసుకురావడం వరకే. కాశ్మీరుపైన కూడా ఒకే అభిప్రాయం ఉండాలని వారేమీ నిబంధన విధించుకోలేదు. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ అభిప్రాయం తప్పని అన్నా హజారే అర్జెంటుగా ప్రకటించవలసిన అవసరం ఎందుకు వచ్చినట్లు? ‘ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నాడు. నాకు సంబంధం లేదు’ అని సింపుల్ గా తేల్చేయవలసిన విషయాన్ని బృందం నుండి తొలగించేదాక అన్నా ఎందుకు వెళ్లవలసి వచ్చింది? ప్రశాంత్ భూషణ్ అభిప్రాయం పట్ల అన్నా హజారే కూడా అసహనంతో ఉన్నాడా?
ప్రశాంత్ భూషణ్ ను బృందం నుండి తొలగిస్తే అన్నా బృందం తర్వాత సంగతి, అన్నా హాజారే పట్లనే విశ్వసనీయత తగ్గిపోక తప్పదు. ఇప్పటికే హిస్సార్ ఉప ఎన్నికలో ఒక రాజకీయ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడం ద్వారా హజారే నిర్ధిష్ట రాజకీయ పార్టీకి లాభం చేకూర్చాడు. అలా లాభం చేకూర్చడం తమ ఉద్దేశం కాదన్నా జరిగింది అదే. ప్రచారం చేయడమే తమ పని ఫలితంతో సంబంధం లేదనడం తగదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రధానంగా ప్రజలపైన నమ్మకం ఉంచాలి తప్ప రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయడం పూర్తిగా వ్యతిరేకించవలసిన విషయం. ఎన్నికల ప్రచారం ద్వారా అన్నా బృందం కూడా అనివార్యంగా ఎన్నికల రొంపిలోకి దిగినట్లే అవుతుంది.
ఈ నేపధ్యంలో అన్నా హజారే తన బృందంలోని ఒక సభ్యుడు వేరొక సమస్య పైన వ్యక్తం చేసిన వ్యక్తిగత అభిప్రాయాలను పట్టుకుని, అవి తప్పని చెప్పి, బృందం నుండి తొలగించడానికి కూడా సిద్ధపడడం మరింతగా అన్నా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అన్నా హజారే, రాజకీయేతర ప్రజా ఉద్యమ నిర్మాణంలో అనుసరించవలసిన షరతులను పక్కకు పెడుతున్న సూచనలు ద్యోతకమవుతున్నాయి. ఇది అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అన్నా బృందంపై మరొకసారి విరుచుకుపడడానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు మునుపటిలాగా అన్నాకు మద్దతు దొరకడం కష్టం కావచ్చు.

ఇక్కడ అసలు దాడి మీదనే అనుమానాలున్నాయి .ఎవరో వెనుకుండి ఆడిస్తున్న నాటకంలా ఉంది. ఆ అదృష్య శక్తుల అసలు లక్ష్యం వేరేగా ఉన్నట్లనిపిస్తున్నది ,ఇందులో పాత్రధారులందరినీ అనుమానించాల్సి వస్తున్నది.
దాడి మీద అనుమానాలా? నాకేం అర్ధం కాలేదు, మీరేం సూచిస్తున్నారో.
వి శేఖర్
హౌ ఆర్ యూ ..
చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించాను కదా? 🙂
కమ్యూనిజం సిద్ధాంతాలకి సామాన్య ప్రజలతో పెరుగుతున్న దూరం మీరు గమనించే ఉంటారు. దీనికి నాకు తోస్తున్న కారణం ప్రతీ అతివాద మతవాదులూ మితవాద సెక్యులరిస్టులూ వాళ్లకిష్టం వచ్చినట్లు కమ్యూనిజం సిద్ధాంతాలని వక్రీకరిస్తున్నారు.
కేవలం కమ్యూనిజం సిద్ధాంతాలని సిద్ధాంతాలుగా మనుషులకి ప్రైచయం చేయడం అన్న ఉద్దేశ్యంతో ఒక కమ్యూనిస్ట్ గ్రూపు బ్లాగుని తయారు చేద్దామనుకుంటున్నాను. కలసివస్తారా?
అవినీతి పై పోరాటం లో ముందున్నంత మాత్రాన అన్నా హజారే నిర్ణయాలన్నీ సరైనవే నని గౌరవింప పనిలేదు. ఖచ్చితంగా కాంగ్రెసుకి వోటెయ్యద్దనడం, ప్రశాంత భూషణ్ ని తొలగించే విషయం ఆలోచిస్తా మనడం ఆయన పార్టీలకతీతంగా ఆలోచించడం లేదనడానికి నిదర్శనాలే.జనలోక్ పాల్ బిల్లు కూడా అవినీతిని రూపుమాపగల అద్భుతమైన ఆయుధం అనుకోవడం కూడా పెద్ద భ్రమే. దీనిని కాలమే రుజువుచేస్తుంది
శివాజీగారు, తప్పకుండా సహకరిస్తాను. ముందు వివరాలు తెలియ జేయండి.
గోపాల కృష్ణగారు. మీరన్నది నిజం. ఆచరణలోనే జన్ లోక్ పాల్ ఏపాటిదో జనానికి అర్ధం అవుతుంది. సమాచార హక్కు చట్టానికి సవరణలు చేయాలని మన ‘మిస్టర్ క్లీన్ ప్రధాని’ మన్మోహన్ నిన్న వాకృచ్చాడు. ఆర్టిఐ వలన ప్రధాని కార్యాలయం డాక్యుమెంట్లు బైటికి రావడంతో ఆయన ఈ పాట అందుకున్నాడు. ప్రజలకి సమాచారం అందటం వలన పాలనలో ఆటంకం కలిగితే ఆ చట్టంలో సవరణలు తేవడమే మేలట. ఈ ప్రధాని తాము చేసే వెధవ పనులు జనానికి తెలియడం వలన ప్రజలు ఆందోళనలు చేసి పాలనకు ఆటంకం కలుగుతోందని ఈ మధ్య అదే పనిగా ఏడుస్తున్నాడు. పాలన అంటే ఈయన దృష్టిలో సంస్కరణలు అమలు చేసి దేశ వనరుల్ని విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడమే. ఏ మాత్రం సిగ్గు లేని జన్మ.
జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి సంతోషం కలిగిస్తుండవచ్చు. ఎవరి రాజకీయాలు వారివి. అలాగే.. వ్యక్తిగత అభిప్రాయాలు కూడా. ప్రశాంతి భూషణ్ అన్నా టీములో ఉండడమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్నా వ్యాఖ్యలు ప్రశాంత్ భూషణ్ ని అవమాన పరిచేవిగా ఉన్నాయి. ఆయన బయటకి వచ్చేస్తాడని ఆశిస్తున్నాను.
అవును. అన్నా తనను తాను గాంధీతో సమానంగా పోల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. జాతీయోద్యమంలో గాంధీ కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేవాడు. జాతీయోద్యమం తన చేతులనుండి దాటిపోయినపుడు ఉద్యమం ఆపాలని కూడా సత్యాగ్రహం చేశాడు. కేజ్రీవాల్ ఇప్పటికే “అన్నా హజారే దేశ పౌరుడుగా పార్లమెంటుకంటే ఉన్నతుడు (ఎబౌవ్ పార్లమెంట్)” అని ప్రకటించాడు. ఏ ఒక్క పౌరుడూ ఒకే ఒక్కడుగా పార్లమెంటుకి అతీతుడు కాదనీ, ఇతర ప్రజానీకంతో కలిసి సామూహిక శక్తిగా ఉన్నపుడే పార్లమెంటుకంటె ఉన్నతులు అవుతారనీ కేజ్రీవాల్ అర్ధం చేసుకోవలసి ఉంది. ఈ వంధిమాగధుల పొగడ్తలతో అన్నా హజారే ములగ చెట్టు ఎక్కితే త్వరలో కిందపడడం ఖాయం. అంతెందుకు? ప్రశాంతి భూషణ్ ని బృందం నుండి తొలగిస్తే చాలు. ఆయన కోటకు బీటలు వారినట్లే. ప్రశాంతి భూషణ్ కి తనకంటూ ఒక ఉనికి ఉంది. పబ్లిక్ ఇంటరెస్టు లిటిగేషన్ ను శక్తివంతంగా వినియోగిస్తూ అనేక కేసుల్నివెలుగులోకి తెచ్చాడు. పౌరహక్కుల కార్యకర్త కూడా.
ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలనే అన్నా హాజారే, కాశ్మీరు ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ప్రశాంతి భూషణ్ చెప్పడాన్ని తప్పుగా చెప్పడం ఏమిటసలు? కొన్ని గ్రూపుల ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు అవసరం లేదని అన్నా హజారే భావిస్తున్నట్లుంది.