టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం


Updateమత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్ పై ఇద్దరు వ్యక్తులు బుధవారం చేయి చేసుకున్నారు. సుప్రీం కోర్టు క్యాంపస్ లో ఉన్న లాయర్ల ఛాంబర్ లో విలేఖరులతో ముచ్చటిస్తుండగా గదిలోకి చొరబడిన వ్యక్తులు ఆయనపై చేయి చేసుకున్నారనీ, పిడి గుద్దులు కురిపించి నేలమీదికి లాగి కొట్టారనీ “ది హిందూ” తెలిపింది.

తాము శ్రీరాం సేన సభ్యులమని ప్రశాంత్ భూషణ్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది. కాశ్మీరు విషయంలో ప్రశాంత్ భూషన్ చేసిన ప్రకటనలు, వ్యక్తం చేసిన భావాలూ వారికి నచ్చలేదని తెలుస్తోంది. సుప్రీం కోర్టుకు ఎదురుగా ఉన్న నూతన లాయర్ల ఛాంబర్స్ లోని తన ఛాంబర్ లో ఒక టి.వి న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. తమకు అపాయింట్‌మెంట్ ఉందంటూ గదిలోకి చొరబడి ప్రశాంత్ భూషణ్ తో వాదన పెట్టుకున్నారని ఆయన మాట్లాడుతుండగానే కొట్టడం ప్రారంభించారనీ, చొక్కా పట్టుకుని లాగి కిందకు తోసి నేలకేసి ఒత్తి పెట్టి కొట్టారనీ పత్రికలు తెలిపాయి. ఘటనలో ప్రశాంత్ భూషణ్ చొక్కా చిరిగిపోయింది.

ప్రశాంత్ భూషణ్ సిబ్బంది, ఇతరులు గుమి కూడడంతో ఒకరు తప్పించుకుపోయాడు. మరొకరిని వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ప్రశాంత్ భూషణ్ ను రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి సంబంధించి తన వైఖరిపట్ల వారు కోపం పెంచుకున్నట్లుందని ప్రశాంత్ భూషణ్ తెలిపాడు. “నేను కాశ్మీరు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశానని వారు చెబుతున్నారు. అవి వారికి నచ్చలేదు. కాశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నేను చెప్పాను” అని ప్రశాంత్ భూషణ్ తెలిపాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తమకు అప్పగించిన వ్యక్తిని అరెస్టు చేశారు.

సంఘటన పట్ల కిరణ్ బేడి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. “అసహనం ఏ స్ధాయికి చేరిందీ ఇది తెలియ జేస్తోంది. ఇప్పటికీ కమ్యూనిటీ కోసం శ్రమిస్తున్న వ్యక్తిపై చేయి చేసుకోవడం బాధాకరం. వీళ్ళు చాలాకాలం జైలులో ఉండక తప్పదు” అన్నారామె. అన్నా బృందంలో భారత దేశ ప్రధమ ఐపిఎస్ ఉద్యోగి కిరణ్ బేడి కూడా సభ్యురాలన్నది తెలిసిందే.

పాలకులు చెబుతున్నట్లుగా భారత దేశంలో కాశ్మీరు విలీనం ఐన విషయం పూర్తి సత్యం కాదు. పాకిస్ధాన్ సైన్యం కాశ్మీరు మీదికి దండెత్తి వచ్చిన పరిస్ధితుల్లో రక్షణ కోసం తాత్కాలికంగా ఇండియాలో జమ్మూ & కాశ్మీరు స్వతంత్ర సంస్ధానం చేరింది. కొన్ని షరతులతో ఆ కలయిక జరిగింది. షరతుల ప్రకారం కలయిక అనంతరం కూడా కాశ్మీరు ప్రత్యేక దేశంగా కొనసాగింది. దాదాపు నాలుగైదు సంవత్సరాల పాటు కాశ్మీరుకు ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలు ఉన్నారు. మూడు మంత్రిత్వ శాఖలు మినహా ఇతర శాఖలన్నీ కాశ్మీరు ప్రభుత్వం చేతిలోనే కొనసాగాయి. కొద్ది కాలం తర్వాత కాశ్మీరులో ఫ్లెబిసైట్ నిర్వహించి ప్రజాభిప్రాయం ప్రకారం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉండాలా, ఇండియా పాకిస్ధాన్ లలో ఏదో ఒక దేశంలో చేరాలా అన్నది నిర్ణయిస్తామని నెహ్రూ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కానీ నెహ్రూ అభిప్రాయాలు వేరే ఉన్నాయి. మెల్లగా కాశ్మీరుకి కల్పించిన స్వతంత్ర దేశ హోదాను ఉల్లంఘించడం ప్రారంభించాడు. తాను హామీ ఇచ్చిన మేరకు ఫ్లెబిసైట్ జరపమని కోరిన షేక్ అబ్దుల్లాను (ప్రస్టుత కాశ్మీరు సి.ఎం తాత) నెహ్రూ జైలుపాలు చేశాడు. అప్పటినుండి షేక్ అబ్దుల్లా డిమాండ్ చేసినప్పుడల్లా జైలు పాలు చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా షేక్ అబ్దుల్లాను 17 సంవత్సరాల పాటు జైలులోనే ఉంచారు. కాశ్మీరు స్వతంత్రం కోసం పాటుపడినవాడిగా షేక్ అబ్దుల్లాకు ‘కాశ్మీరు సింహం’ అన్న పేరు కూడా స్ధిరపడింది. క్రమంగా కాశ్మీరుని పూర్తిగా తమ సార్వభౌమాధికారం ఉన్న ప్రాంతంగా ఇండియా చెప్పడం ప్రారంభించింది.

పాకిస్ధాన్, ఇండియాల సైన్యాలు కలుసుకున్న చోట నిలువునా గీత గీసి కాశ్మీరును ఆ రెండు దేశాల పంచుకున్నాయి. అప్పటినుండీ ఆ గీతను ఉల్లంఘించడానికి కాశ్మీరీలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటివరకూ బంధుత్వాలతో, పొరుగువారిగా నివసిస్తూ వచ్చిన వారు అకస్మాత్తుగా రెండు దేశాలకు చెందినవారిగా పేర్కొంటూ సైన్యాలతో అణచివేయడాన్ని కాశ్మీరీలే కాదు, ఆత్మ గౌరవం తాను బతికే నేలపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరూ సహించలేని విషయం. అలా తమ భూభాగాన్ని రెండు దేశాలు ఆక్రమించుకుని ముక్కలు చేయడాన్ని సహించలేకపోవడమే కాశ్మీరీలు చేస్తున్న నేరం. తమ బంధువులను కలవడానికి గీత దాటుతున్నవారు కూడా ఇండియా, పాకిస్ధాన్ల దృష్టిలో కరుడు గట్టిన టెర్రరిస్టులే అవుతున్నారు.

కాశ్మీరీలు ప్రత్యేక జాతికి చెందినవారు. వారి జాతీ కాశ్మీరీ. వారు కాశ్మీరీ ముస్లింలు. వారి భాష కూడా ఉర్దూ కాదు, కాశ్మీరీయే. వారికి తమదని చెప్పుకొనేందుకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ప్రత్యేక భాష, సంస్కృతిలు కలిగి ఉన్న కాశ్మీరి జాతి ప్రజలు మొదటినుండీ స్వతంత్ర రాజ్యంలో ఉన్నవారే. దేశ విభజన సమయంలో వారు నెహ్రూ ప్రజాస్వామిక కబుర్లను నమ్మి తాత్కాలిక కలయికకు అంగీకరించారు. కాని నెహ్రూ చేసిన మోసం వారిని ప్రస్తుతం టెర్రరిస్టులుగా మార్చింది. కాశ్మీరు అనగానే హిమాలయాల పక్కన అందమైన ప్రకృతిదృశ్యాలతో అలరారే ప్రాంతంగా భారతీయులకు గుర్తుకు వస్తుంది. రాజకీయ పటంలో చూసినపుడు అగ్రభాగాన ఉండే కాశ్మీరు దేశానికి తలలాగా భ్రమ కలిగిస్తుంది. ఆ భ్రమనే నిజంగా భావించే హిందూ మతోన్మాదులు కాశ్మీరు స్వతంత్ర కాంక్షను ద్వేషంతో చూస్తుంటారు.

ఒక్క హిందూ మతోన్మాదులే కాదు ఇతరులు కూడా కాశ్మీరు సొంత ప్రాంతంగా భావిస్తుంటారు. స్వాతంత్రం వచ్చినప్పటినుండీ భారత పాలకులు కాశ్మీరు గురించిన నిజాలను భారత ప్రజలకు అందకుండా తొక్కి పెట్టింది. కాశ్మీరు ప్రకృతి అందాలతో అలరారే భూభాగం ఒక్కటే కాదు. కాశ్మీరు భూభాగంపై మనుషులు నివసిస్తున్నారు. వారు ఎక్కడినుండో వచ్చి కాశ్మీరు భూభాగాన్ని ఆక్రమించుకున్న ముస్లింలు కారు. వారి జాతి పుట్టినప్పటినుందీ ఆ నేలపైనే బతుకుతోంది. వారి జాతి పుట్టుక, ఆవిర్భావం, నాగరికత, సంస్కృతి అన్నీ కాశ్మీరు నేలతో ముడి పడి ఉన్నాయి. అటువంటి వారిని కేవలం ముస్లింలుగానే పరిగణిస్తూ భారత దేశంపైన దాడి చేసి ఇక్కడే స్ధిరపడిన ముస్లింలుగా హిందూ మతోన్మాదులు పరిగణిస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. చరిత్ర వక్రీకరణ. కాశ్మీరు వనరుల కోసం భారత దోపిడీ శక్తులు పనిగట్టుకుని చేసిన వక్రీకరణ. వారికి అప్పట్లో నెహ్రూ రాజకీయ ప్రతినిధిగా పని చేసి కాశ్మీరు ప్రజలకు తరతరాల తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.

కాశ్మీరు ప్రజల్లో అత్యధికులు అటు పాకిస్ధాన్‌నూ ఇష్టపడరు, ఇటు ఇండియాలో కలవాలనీ కోరుకోవడం లేదు. గత అరవై సంవత్సరాలకు పైగా పాకిస్ధాన్, ఇండియా ప్రభుత్వాల దారుణాలను చవి చూసిన కాశ్మీరులు ప్రస్తుతం ఆ రెండింటిలో ఏ దేశంలోనైనా కలవాలని కోరుతారంటే నమ్మలేని విషయం. వారు కోరుతున్నది స్వతంత్రం. కాశ్మీరు ఎప్పటినుండో స్వతంత్ర దేశం. తమ స్వతంత్రాన్ని తమకు ఇవ్వాలన్నదే వారి కోరిక.

ఎప్పటినుండో ఒకె దేశంగా ఉన్న సూడాన్ దేశాన్ని రెండు మూడు నెలల క్రిందటే పశ్చిమ దేశాలు సుడాన్, దక్షిణ సూడాన్ లుగా విడగొట్టాయి. పూర్తిగా మతం ప్రాతిపదికన విడగొట్టాయి. దక్షిణ సూడాన్ లో క్రైస్తవులది మెజారిటీ కాగా, ఉత్తర భాగంలో ముస్లింలది మెజారిటీ. కాని దక్షిణ సూడాన్ లో అపారమైన గ్యాస్, పెట్రోలియం నిలవలున్నాయి. తమ స్వార్ధం కోసం, అక్కడి వనరుల కోసం అమెరికా, యూరప్ లు సూడాన్ ను మత ప్రాతిపదికన విభజించడానికి వెనకాడలేదు.

కువైట్ దేశం ఒకప్పుడు ఇరాక్ లో ఒక రాష్ట్రంగా ఉండేది. OPEC దేశాల నియమాలను అతిక్రమించి ఆయిల్ ఉత్పత్తి చేస్తుండం, ఇతర కారణాలతో సద్ధాం హుస్సేన్ కువైట్‌ను ఆక్రమించే ప్రయత్నం చేశాడు. అది వెనక్కి తన్నింది. ఆ విషయం అరబ్బు దేశాల కూటమి అరబ్ లీగ్ చర్చించి పరిష్కారం సాధించుకోగల సమస్య. దానికి బదులు ఎక్కడినుండో వచ్చిన అమెరికా ఎందుకు వేలు పెట్టిందీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం ఇరాక్ పై దాడికి తాము చెప్పినవన్నీ అబద్ధాలేనని అమెరికా, ఇంగ్లండ్ లు ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. ఇప్పుడవి అంగీకరిస్తున్న అంశాలను ఆనాడే చెప్పినవారిని ‘అమెరికాని వ్యతిరేకించడమె వీరి పని’ అని ఎత్తి చూపారు. ఇప్పుడు వారా విషయాలను కాకుండా టెర్రరిజం అనే భూతాన్ని చూపుతున్నారు.

సూడాన్ విభజనను దగ్గరుండి పర్యవేక్షించిన పశ్చిమ రాజ్యాలు కాశ్మీరు విషయంలో ఇండియా, పాకిస్ధాన్ ల కొమ్ము కాయడానికి సిద్ధపడతాయి తప్ప అసలు కాశ్మీరు ఏమంటోందో పట్టించుకోరు. అరవై సంవత్సరాలకు పైగా తమ నేలను నిలువునా చీల్చిన దేశాలను కాశ్మీరీలు ద్వేషిస్తున్నారు. కాశ్మీరు ప్రజల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించినట్లయితే కాశ్మీరీ టెర్రరిజం లేదా భారత పాలకులు చెప్పే ‘హోమ్ గ్రోన్ టెర్రరిజం లేదా పాకిస్ధాన్ ప్రేరేపిత టెర్రరిజం కనపడవు. పాలస్తీనా ప్రాంతాన్ని దురాక్రమించి వలసగా చేసుకున్న ఇజ్రాయెల్ దేశ జాతి దురహంకారాన్ని కట్టిపెట్టినట్లయితే ప్రపంచంలో టెర్రరిజం ఆనవాళ్లు కూడా కనపడవు. ప్రపంచంలో పాలస్తీనా, కాశ్మీరు సమస్యలను అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించినట్లయితే ప్రపంచంలో అసలు టెర్రరిజం అనేదే కనపడదు. ఈ రెండు సమస్యలకు తోడు ప్రస్తుతం ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ ల దురాక్రమణ కూడా టెర్రరిస్టుల జననానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.

ఏ టర్రరిజం అయినా ఊసుపోకకు పుట్టదు. దానికి స్పష్టమైన రాజకీయ కారణాలు ఉంటాయి. వారు ఎన్నుకున్న మార్గమే తప్పుగాని వారి రాజకీయ ఆకాంక్షలు డిమాండ్లలో తప్పులు ఎన్నడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా అది పరిష్కారానికి తగినవిధంగానే ఉంటాయి. కాకపోతే పాలకవర్గాలు పరిష్కారానికి సిద్ధంగా ఉండడమే కావలసింది. కాని వారి ప్రయోజనాలు వేరు. ఈ సమస్యలు రగులుతుంటేనే వారి అక్రమ జోక్యానికి వీలు కలుగుతుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో తిష్టవేసి అక్కడ వనరులను దోపిదీ చేసే వీలు కలుగుతుంది.

కాశ్మీర్ టెర్రరిజం వెనుక ఉన్న సమస్యను పరిష్కరించకుండా వారిని సైన్యంతో మరింత అణిచిపెట్టినంత కాలం కాశ్మీరు టెర్రరిజం తలెత్తుతూనె ఉంటుంది.

28 thoughts on “టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

  1. ఎప్పట్లాగే, కాశ్మీర్, టెర్రరిజం లాంటి వాటిమీద కూడా మీ భావాలు చాలా ఉదాత్తంగా ఉన్నాయి.
    చరిత్రను తెలుసుకోక పోవడం ఇప్పటి జెనరేషన్ ప్రధాన లోపంగా కనిపిస్తుంది. పదో తరగతి ఐపోగానే సైన్స్ గ్రూపులు తీసుకుని ఎంసెట్లు,ఐఐటీ లపై పడటంతో చరిత్ర అనేది ఒకటుందనే విషయం మరిచిపోయి దేశభక్తి పూరిత మసాలా సినిమా డైలాగులను తలకెక్కించుకొని, తమను తాము పెద్ద దేశభక్తుల్లా ఫీలైపోవడం ప్రస్తుత తరానికి బాగా అలవాటైంది. ఇక చరిత్రను వక్రీకరించి, ప్రస్తుత తమ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా పిట్టకథలుగా చలామనీ చేసే పార్టీలు ఉండనే ఉన్నాయి.
    ఇస్లాం పుట్టింది సుమారు 1300 ఏల్ల క్రితం. ఇన్నేల్లుగా లేని ఇస్లామిక్ టెర్రరిజం గత కొన్ని దశాబ్దాలుగా మాత్రమే ఎందుకుంది లాంటి అణుమానాలు వీరికి కలుగవు. దాని వెనకున్న అంతర్జాతీయ రాజకీయాల్ని అర్థం చేసుకునేంత పరిణత,తెలివి వీరికి ఉండవు. మన మతం,సంస్కృతి చాలా గొప్పవి టైపు డైలాగులు సమ్మగా వీరి తలలోకి ఎక్కించేసేశారు. పైన ప్రశాంత్ భూశన్ మీద దాడి చేసింది కూడా అలాంటి బ్యాచే. అసలు కాశ్మీర్ కి మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తి ఎందుకుండాలని అమాయకంగా ఆవేశపడేవారు, తరచుగా కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వారి అగ్ఞానాన్ని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేం. మీలాంటి బ్లాగులు చదివితేనన్నా వారికి కొంత జ్ఞానం కలుగుతుంది. అఫ్కోర్స్.. బాగా ముదిరిపొఇనోల్లకి ఎలాగూ ఎక్కదనుకోండి.

  2. Meeru ee comment prachuristharo ledu naaku doubteee but anyway I just wanna tell my opinion. Kashmiri pandits anna jaathi okati unadani, vaariki kuda anyayam jarigindani okka mukka kuda rayakunda mottam vyasam rasaru meeru … this shows how biased you are :).

  3. శౌరిగారూ, మీ వ్యాఖ్య ప్రచురించనని మీకు ఎందుకు అనిపించింది? ఇంతకుముందెప్పుడయినా మీ వ్యాఖ్య ప్రచురించలేదా?
    ఏదైతేనేం, మీ వ్యాఖ్య విషయానికి వస్తాను.
    “కాశ్మీరు పండిట్” అన్న జాతి ఉందని నిజంగానే నాకు తెలియదు. నాకే కాదు. చరిత్రకారులకు కూడా తెలియదేమో. ఎందుకంటే కాశ్మీరు గురించి నేను చదివిన చరిత్ర పుస్తకాలలో కాశ్మీరీ జాతి గురించి తప్ప మరొక జాతి గురించిన ప్రస్తావన లేదు.
    జాతి అంటే భారత జాతి, కులం పేరుతో ప్రస్తావించుకునే జాతి… ఇలాంటివి కాదని మీరు గమనించాలి.
    సాధారణంగా భారత జాతి అని మనం ప్రస్తావించుకుంటాం గానీ నిజానికి ‘భారత జాతి’ అనేది లేదు.
    భారత దేశం నిజానికి వివిధ జాతుల సమాహారం తప్ప ప్రజలంతా ఒక జాతికి చెందినవారు కాదు.

    సోషియాలజీలో ఒకే భాష, సంస్కృతి, జీవన విధానం ఉన్నవారిని ఒక జాతిగా పరిగణిస్తారు. వారి పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, పెళ్ళి పేరంటాలు, ప్రధాన అలవాట్లు, ప్రకృతితో వారికి ఉండే సంబంధం ఇలా అన్నింటిలోనూ వారు తమకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని కలిగి ఉంటారు. అలా ఉన్నవారినందరినీ కలిపి జాతిగా పరిగణించాలి తప్ప ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో లేదా ఒక దేశంలో కలిసి ఉన్నవారంతా ఒక జాతిగా పరిగణించడానికి వీలు లేదు.
    జాతులకు సహజంగా ఒక నిర్ధిష్ట చరిత్రకూడా ఉంటుంది. ఆ చరిత్రను ఆ జాతికి చెందినవారంతా చాలా గొప్పగా పరిగణిస్తారు. చరిత్రనుండి వారికి సంక్రమించిన ఆచారవ్యవహారాలని పదిలంగా కాపాడుకుంటారు. చరిత్రనుండి సంక్రమించడం అంటే పూర్వీకులనుండి సంక్రమించడమనే అర్ధం.
    తమ జాతికి ఏ చోట గాయం తగిలినా వారు తట్టుకోలేరు. అలాంటిది కాశ్మీరీలను నిట్టనిలువునా చీల్చిన పాక్, భారత్ లను (ప్రజలను కాదు) కాశ్మీర్ ప్రజలు ఇన్నాళ్ళూ వ్యతిరేకిస్తూ వచ్చారు.

    ఇటువంటి జాతి నిర్వచనం కిందికి కాశ్మీరు పండిట్ లు వస్తారని అనుకోను. వారు భారత్ నుండి కొన్ని ఏళ్ళ క్రితం వలసవెళ్ళి హిందూ రాజుల పాలనలో ఒక వెలుగు వెలిగినవారు. ఆ విధంగా వారు ధనికులుకూడా అయ్యారు. వారిని కాశ్మీరు నుండి వెళ్లిపొమ్మని చెప్పడాన్ని అందరూ వ్యతిరేకించాలి. కాశ్మీరు స్వతంత్రాన్ని కాంక్షిస్తున్న ప్రధాన కాశ్మీర్ సంస్ధలు కాశ్మీర్ పండిట్ లను వెళ్లగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాశ్మీర్ లో కూడా హిందువుల్లో ఉన్నట్లే మత మూఢులు ఉన్నారు. వారు మత దృక్పధంతో కాశ్మీరీ పండిట్ లపైన దాడులు చేశారు అది సరైంది కాదు.

    కాశ్మీరీలు స్వతహాగా మత మౌఢులు కాదు. ఆ చరిత్ర వారికి లేదు. వారు సహజ సెక్యులరిస్టులు. వారి చరిత్ర దానికి సాక్ష్యం. వారి భూభాగం పరుల ఆక్రమణకు గురయ్యాక వారిలో కొద్దిమంది అనివార్యంగా మత మౌఢ్యంలోకి కొట్టుకు పోయారు. వారి సంఖ్య అత్యల్పం. కాని మెజారిటీ కాశ్మీరీలు సామరస్యాన్నే కోరుకుంటారని వారి చరిత్ర చెబుతుంది.

  4. 1.అప్పటి ఒప్పందాల ప్రకారం కాశ్మీర్ మహారాజు మనదేశంలో విలీనానికి వ్రాత మూలంగా అంగీకరించిన తర్వాతే మన సైన్యాలు కాశ్మీర్ లో ప్రవేసించాయి.2.పాకిస్తాన్ ముందు కొండజాతుల్ను ,తర్వాత సైన్యాన్ని పంపి జమ్ము-కాశ్మీర్ ను ఆక్రమించుకోడానికి ప్రయత్నించింది.మన సైన్యం వారిని తరిమివేసింది .అంతర్జాతీయ ఒత్తిడివల్ల యుద్ధవిరమణ జరిగింది.కాశ్మీర్లోయ, జమ్ము, లడఖ్ ,మన అధీనంలో,గిల్గిత్ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నాయి.3.ముందు పాకిస్తాన్ దురాక్రమణ చేసిన ప్రాంతం నుంచి వదలి పోవాలి.4. కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా భారత్ లో విలీనానికి సమర్థించాడు.5.కాశ్మీర్ లోయలో నుంచి హిందువులను ముస్లిం టెర్రరిస్టులు బెదరింపులతో వెళ్ళగొట్టారు.6.పాకిస్తాను ఎప్పుడూ తాన ఏజెంట్లతో కాశ్మీరులో అల్లకల్లోలం రేకెత్తించడానికి ప్రయత్నిస్తూఉంటుంది.7.ఇవేమీ తెలుసుకోకుండా పై విధంగా రాయడం దేశద్రోహమే అవుతుంది.== రమణారావు.ముద్దు

  5. రమణారావు.ముద్దుగారూ, మీ వ్యాఖ్యను బట్టి మీ నుండి తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఉన్నాయని అర్ధం అవుతోంది.

    భారత్ లో విలీనానికి షే అబ్దుల్లా అంగీకరిస్తే ఆయన్ని 17 సంవత్సరాలు జైలులో ఎందుకు ఉంచినట్టు?
    కాశ్మీరు మహారాజు పూర్తి విలీనానికి అంగీకరించలేదు కదా? అంగీకరిస్తే ఐదేళ్ళు కాశ్మీరుకు ప్రధాని, రాష్ట్రపతి ఎందుకున్నారు?
    జమ్ము&కాశ్మీర్ ని పాక్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం సరే. మన సైన్యం పాకిస్ధాన్ సైనికుల్ని తరిమేస్తే మూడో వంతు కాశ్మీరు పాక్ ఆధీనంలోకి ఎలా వెళ్ళింది?
    కాశ్మీర్ పండిట్ లను వెనక్కి రమ్మని జె.కె.ఎల్.ఎఫ్ సంస్ధ 1990 నుండీ కోరుతోంది. కాశ్మీరు ప్రజల తరపున ఆయుధాలు లేకుండా పోరాడిన జె.కె.ఎల్.ఎఫ్ ను అణచివేసిన ఫలితమే ఇపుడు టెర్రరిజం పెచ్చరిల్లడం నిజం కాదా?
    జె.కె.ఎల్.ఎఫ్ కానీ, హురియత్ కాన్ఫరెన్సు లో అత్యధికులు గానీ ‘మాకు పాక్ వద్దు. ఇండియా వద్దు. స్వతంత్రత మాత్రమే కావాలి’ అని చెబుతున్నట్లు పత్రికలు అనేక సార్లు రాశాయి. డిడిలో ‘ద వరల్డ్ దిస్ వీక్’ అనే కార్యక్రమంలో 1990 కాశ్మీరు ఆందోళనలను కవర్ చేసింది. ఆ రిపోర్టు నేను స్వయంగా చూశాను. వారంతా కూడా అదే చెప్పారు మాకు స్వతంత్రం కావాలని. కాశ్మీరు మీది మాది అనేముందు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారొ అడగనవసరం లేదా? వారితో సంబంధం లేకుందా కాశ్మీరు మాది అని ఇండియన్లు అనడం సబబేనా? మీ ఇంటి స్ధలంలో ఇద్దరు పెత్తందార్లు కొట్టుకుని చెరో ముక్కా ఆక్రమించినా ఇదే తరహా తీర్పు చెబుతారా మీరు?
    మన దేశ ద్రోహం తర్వాత సంగతి. అసలు కాశ్మీరు ప్రజలకి దేశ ద్రోహం అంటే ఏంటో చెప్పండి. వారు స్వతంత్రం కావాలంటున్నారు. వారి భూమి మీద వారికి గల హక్కుతో అడుగుతున్నారు. వారి మాట వినరా? వారికి దేశద్రోహం అంటే కాశ్మీరు ప్రజల స్వతంత్రపిపాసకు ద్రోహం చేయడమే. అది మీ దృష్టిలో ఏ ద్రోహం అవుతుంది?

    మళ్ళీ గమనించండి. కాశ్మీరు అంటే హిమాలయాల పక్కన ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే భూభాగం మాత్రమే కాదు. అక్కడ ప్రజలు ఉన్నారు. వారికి ఒక సంస్కృతి ఉంది. జీవన విధానం ఉంది. వారి బతుకు వారి నేలతో వేల సంవత్సరాలుగా పెనవేసుకుపోయి ఉంది. వారికి ప్రత్యేకంగా ఒక భాష ఉంది. అదంతా కలిపి ‘కాశ్మీరీ సంస్కృతి’ గా వారు చెప్పుకుంటారు. మనకు హిందూ సంస్కృతి అని చెప్పుకునే హక్కు ఎలా ఉందో, వారికి కాశ్మీరీ జాతి సంస్కృతి అని చెప్పుకునే హక్కూ ఉంటుంది. దానిని కాపాడుకునె హక్కు ఉంటూంది. అది అణచివేతకు గురయినపుడు ప్రతిఘటించి కాపాడుకునే హక్కు వారికి ఉంటుంది. ఆ హక్కు వారికి లేకపోతే, భారతీయులు అన్యాయంగా బ్రిటిష్ వాడి మీద తిరుగుబాటు చేసి స్వతంత్రం సాధించుకున్నారని చెబుతున్నట్లే.

  6. మీరు అంతా అశాస్త్రియమైన రాతలు రాస్తారని అర్థం అయిపోయింది —
    మొన్నటి డి ఎన్ ఏ టెస్టు ద్వారా ఈ దేశం లో ఉన్న వాళ్ళందరి డి ఎన్ ఏ ఒకటే అని తేల్చేసారు ..,
    ఈ దేశం అంతా ఒకే జాతి అని నిరూపితమైపోయింది మీరు ఏవో పాత బ్రిటిషు వాడి తొకలు రాసిన చరిత్ర లు చదివినట్లున్నరు
    ఆంగ్లం లో నే అంతా ఉందష అనే కోవకు చెందిన తెల్ల వాళ్ళ ,ఎరుపోళ్ళ చెంచా గిరి యేం చేద్దం
    ఇలాంటి అశాస్త్రీయమైన రచనలు 2011 లో కూడా రావడం బాధాకరం

  7. kaashmir name originated from kashyapa muni …and age old its having hindu culture …the accession of kashmir has no link with abdullah…the problem of occupied kashmir came up because of inept actions of Indian government..1971 Indian leaders did mistake with simla

    all original kashmiris are hindus -they were converted inbetween,there was a big procession to kashmir from kanyakumari and manasasarovar remarked by hoyantsong in his book,,nikoo kanti remarked that its amazing that whole India with different languages have common identity

  8. సరిత గారూ, 120 కోట్ల భారతీయులందరి డి.ఎన్.ఎ ఒక్కటే అని తేల్చిన ఆ పరీక్ష సంగతి తెలుసుకోవాల్సిందే. కానండీ, ఏ ఒక్కరి డి.ఎన్.ఎ మరొకరి డి.ఎన్.ఎ తో సరిపోలదని బయాలజీ చెబుతుంది. ఇంతకీ ఏది శాస్త్రీయమో తమరే కాస్త కనుక్కుని చెప్పండి.
    బ్రిటిషోడు భారత దేశ చరిత్రని హిందూ, ముస్లిం, ఆంగ్లేయ భారతాలుగా విడిగొట్టాడు తప్ప జాతుల పరంగా చరిత్ర రాయాలన్న ధ్యాస వాడికి లేదు.
    ఇంతటి అశాస్త్రీయమైన నమ్మకాలని చరిత్రగా చెప్పేస్తున్నారు చూశారూ, అందుకు అభినందనలు.
    ఇంతకీ, తమరి చెంచాగిరి ఎవరికో? మీకు తెలుసో లేదో గానీ కాంగ్రెసోళ్ళూ పైకి చెప్పకుండా అమెరికాకి చెంచాగిరి చేస్తే, బి.జె.పి వాళ్ళు బహిరంగంగానే చెంచాగిరీ చేస్తరు. మరి వాళ్లే ప్రభుత్వరంగ పరిశ్రమలని అయిన కాడిక అమ్మమని అరుణ శౌరితో మంత్రిత్వ శాఖను ఏర్పరిచారు.
    వాళ్ళూ వీళ్ళు చెప్పిన మాటలు విని నమ్మే బదులు మీరే పూనుకుని అధ్యయనం చేయగలిగితే నిజాలు తెలుస్తాయి. లేనట్లయితే ఇదిగో మీలాగే, అందరి డి.ఎన్.ఎ ఒకటే, భరత జాతంతా ఒకటే లాంటి అశాస్త్రీయ భావాలనే శాస్త్రీయ భావాలుగా పొరబడడం జరుగుతుంది.

  9. మీరు రాస్తున్న విషయాలు ఏ శాస్త్రిగారు (సైంటిస్టు) సిద్ధాంతికరించారో చెప్పగలరా? ఇవన్నీ పుక్కిటి పురాణాలపై ఆధారపడి మత సంస్ధలు ప్రచారం చేస్తున్న అశాస్త్రీయ భావజాలం. శాస్త్రం బహుముఖాలుగా అభివృద్ధి చేందిన ఈ రోజుల్లో వాటి ఆధారంగా ప్రజా జీవితాలని ప్రభావితం చెయ్యాలని చూడడం సరికాదు.

  10. సంస్కృత భాషలో కశ్మీరం అంటే కుంకుమ పువ్వు అని అర్థం. హిమాలయాలలో కుంకుమ పువ్వు మొక్కలు పెరుగుతాయి. అందుకే ఆ ప్రాంతానికి కశ్మీరం అని పేరు వచ్చింది. ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్ Kashmir అని వ్రాయడంతో పాశ్చాత్యులు దాన్ని కాష్మీర్ అని పలుకుతున్నారు, అంతే. మౌర్యుల చరిత్ర చదివితే కశ్మీరం అని వ్రాసి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కాష్మీర్ అని ఎక్కడా వ్రాసి ఉండదు. మతం అనేది సామాజిక పరిస్థితుల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు కుర్దు జాతీయులందరూ యజీదీ మతాన్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు కుర్దులలో 90% మందికి పైగా ప్రజలు ఇస్లాం లేదా క్రైస్తవ మతాలని నమ్ముతున్నారు. ఒకప్పుడు హిందూ మతాన్ని నమ్మిన వియత్నామీయులు ఇప్పుడు బౌద్ధ మతాన్ని నమ్ముతున్నారు. చరిత్రలో అన్ని కాలాలలో ప్రజలు ఒకే మతంలో ఉంటారని అనుకోలేము.

  11. Can you please provide more detailed explanation for Jaathi.

    >>> సాధారణంగా భారత జాతి అని మనం ప్రస్తావించుకుంటాం గానీ నిజానికి ‘భారత జాతి’ అనేది లేదు.
    >>> భారత దేశం నిజానికి వివిధ జాతుల సమాహారం తప్ప ప్రజలంతా ఒక జాతికి చెందినవారు కాదు.
    >>> సోషియాలజీలో ఒకే భాష, సంస్కృతి, జీవన విధానం ఉన్నవారిని ఒక జాతిగా పరిగణిస్తారు. వారి పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, పెళ్ళి పేరంటాలు, ప్రధాన అలవాట్లు, ప్రకృతితో వారికి ఉండే సంబంధం ఇలా అన్నింటిలోనూ వారు తమకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని కలిగి ఉంటారు.

    India ni meeru ippati kallathoti choodakandi … muslim la aakramanalaku poorvam ela undedo alo chinchandi …muslim/British la bhouthika & manasika prabhavaala valla entho maarpu vachindi … aa marpu raaka poorvam andaru vedalani namme varu and vaati prakaaram naduchukunevaru … andariki raamayana mahabharathalu pramanikalu …evi saripova vari jeevana vidhanam chala similar ga undanadaniki (if u r expecting 100% similarity u cannot call any mob as “Jaathi” for that matter) … vaaru vere vere rajula chetha paripalimpabadinantha matrana vaaru veeere jaathi ante evvaru emi cheyyaleru.

    Ippatiki kooda North India and South India aacharalni, pandagalni, Samskruthi ni meeru cheppina vatlannitilio entho similarity undi … ikkada mee definitions are skewed.

  12. శౌరిగారూ మీరు చెప్పిన కశ్యపముని పేరు వ్యవహారం హిందూ మత సంస్ధలు కల్పించిన కధ. భారత దేశ చరిత్రకు సంబంధించిన ప్రజల చరిత్రలో ప్రతి అంశంలోనూ వీరు హిందూ మత సంబంధిత వివరణలు ఇవ్వడానికి ప్రయత్నించారు. వీరు ఎన్.సి.ఇ.ఆర్.టిలోకి కూడా చొరబడి చరిత్ర పాఠాలను కూడా మార్చడానికి ఎన్.డి.ఎ పాలనలో ప్రయత్నం చేశారు. అప్పటి మానవ వనరుల మంత్రి మురళీ మనోహర్ జోషి ఎన్.సి.ఇ.ఆర్.టి నుండి ప్రఖ్యాత చరిత్రకారులను తొలగించి హిందూ మత పుక్కిటి పురాణాలని చరిత్రగా చొప్పించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఎన్.డి.ఎ ప్రభుత్వం ఓడిపోవడంతో ‘భారత దేశ చరిత్ర అధ్యయనం’ బతికి బట్టకట్టింది.

    మన వాస్తవ చరిత్రను మనమే కాలదన్నుకుని చీకటిలో బంధించి, పుక్కిటి పురాణాలని చరిత్రగా ప్రమోట్ చేస్తే జరిగేదేమిటి? భారత ప్రజలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. బ్రిటిష్ వాడు మత ప్రాతిపదికన, రాజుల జీవిత చరిత్రలతో భారత దేశ చరిత్ర రచించి భారతీయులను చరిత్రహీనులుగా చేయడానికి ప్రయత్నించాడు. అదే పని మత సంస్ధల ఆధ్వర్యంలో భారత రాజకీయ నాయకులే పూనుకోవడం వారి స్వార్ధ ప్రయోజనాలకు తప్ప ప్రజల కోసం కాదు.

    కాశ్మీరు పేరు పుట్టుక పైన వివరణ కింద ప్రవీణ్ ఇచ్చారు. అది సహజంగా పుట్టిన పేరు. ప్రకృతిలో కలిసిపోయి బతికిన పూర్వీకులు ఆ ప్రకృతితోనే తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు. మరికొన్ని సార్లు తమ ఉత్పాదక చరిత్రను బట్టి పేర్లు వ్యాప్తిలోకి వచ్చాయి. అంతే తప్ప వ్యక్తుల పేర్లతో జాతులు పుట్టాయనడం ఊహలె తప్ప నిజాలు కావు.

  13. @CHEEKATI గారు: అంతర్జాతీయ పరిణామమనేదే చాలా విస్తృతార్ధమున్న పదబంధం ఇక్కడ సరిపడదు. సరే మీరన్నట్లే ఎందుకేర్పడిందో ఆ సమస్య తొలగిపోయాక, అనగా రష్యా వెళ్ళిపోయాక ఇంకా ఇంకా ఈ తీవ్రవాదం ఏంచేస్తున్నట్లు. పోనీ అమెరికన్ల అధిపత్య భావజాలంతో పోరాడుతున్నదనుకున్నా మరి మిగతా దేశాల్లో తీవ్రవాదం ఎందుకున్నట్లు. సరే అదీ వదిలెయ్యండి. తీవ్రవాద యువకులు పోరాడుతుంది ఈ “అంతర్జాతీయ పరిణామాల”పై అవగాహనతోనా లేక మతోన్మాదంతోనా? మరప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలనలో శిక్షలకు గురైన వారిగురించి మీ అభిప్రాయమేమిటి?

  14. “కాశ్మీరు మీది మాది అనేముందు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారొ అడగనవసరం లేదా? వారితో సంబంధం లేకుందా కాశ్మీరు మాది అని ఇండియన్లు అనడం సబబేనా? మీ ఇంటి స్ధలంలో ఇద్దరు పెత్తందార్లు కొట్టుకుని చెరో ముక్కా ఆక్రమించినా ఇదే తరహా తీర్పు చెబుతారా మీరు?”

    నేను దీనితో ఏకీభవిస్తాను. కానీ అక్కడి ప్రజలలో చాలా మంది తరిమివేయబడ్డారు మరియు కొంతమంది పాకిస్థాన్ నుంచి అక్రమ వలసలద్వారా స్థిరపడ్డారు కదా. అంతాయ్యాక ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే అది నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ ఎలా అవుతుంది? కాశ్మీర్ ఒకవేళ ప్రత్యేక రాజ్యంగా ఏర్పడితే, దాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకోవడమో, అస్థిర పరచడమో చేస్తే అప్పుడు కలిగే రక్షణ పరమైన సమస్యలను దృష్టిలోవుంచుకొని భారత్ ఎలా వ్యవహరించాలని మీ అభిప్రాయం?

    చరిత్రలో నేను షేక్ అబ్దుల్లా గారి గురించి అంత గొప్పగా ఏమీ చదవలేదు. మీరు చెప్పేది సరీనదో, నేను అనుకునేది సరినదో అర్ధంగాకుండా వుంది.

  15. మినర్వా గారు, ఆఫ్ఘనిస్ధాన్ నుండి రష్యా వెళ్ళిపోయాక అమెరికా చొరబడింది కదండీ, ఆఫ్ఘన్ ఫస్తూన్లు (పఠాన్లు) చరిత్రలో అనేక పోరాటాల్లో రాటుదేలిన వారు. వారు ఆఫ్ఘన్ ని దురామ్రమించిన రష్యాపైన పోరాటం చేశారు. దానికి అమెరికా తన ప్రయోజనాల రీత్యా సాయం చేసింది. రష్యా వెళ్ళిపోయాక అమెరికా కూడా అదేపనికి తెగబడింది. రష్యా బదులు తాను ఆక్రమించుకుంటానంది. రష్యా ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు అమెరికా ఆక్రమణకి ఎందుకు ఒప్పుకుంటారు? ఫలితమే అమెరికాపైన ఆఫ్ఘన్లు తాలిబాన్ నేతృత్వంలో గెరిల్లా పోరాటం చేస్తున్నారు. దానిని టెర్రరిజం అని పశ్చిమ రాజ్యాలు అంటున్నాయి. కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అని ప్రచారం చేసి చంపినట్లన్నమాట.

    టెర్రరిజంపై ప్రపంచయుద్ధం అని ప్రకటించక పూర్వమే హంటిగ్టన్ లాంటి వాళ్ళు ‘నాగరికతల మధ్య యుద్ధం’ అంటూ చెత్త పుస్తకాలురాసి భవిష్యత్తులో అమెరికా ముస్లిం దేశాలపై చేసే దురాక్రమణ దాడులకు తగిన భూమికను ఏర్పరిచారు. ప్రస్తుత పరిస్ధితినే చూస్తే అమెరికా, యూరప్ లు ప్రత్యక్షంగా ఆక్రమించుకున్న దేశాలన్నీ ముస్లిం దేశాలే. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా లను ప్రత్యక్షంగా ఆక్రమించుకోగా, సిరియా, పాకిస్ధాన్, పాలస్తీనాలతో పాటు ఇతర ఆఫ్రికా, ఆసియా దేశాలను అవి పరోక్షంగా ఆక్రమించాయి. ఈజిప్టు, ట్యునీషియా, యెమెన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా లలో తలెత్తిన ఆందోళనలని కొన్నింటిని కుట్రలతో పక్కదారి పట్టించగా, మరికొన్నింటిలో ఇంకా క్రూరంగా అణిచివేయడానికి అవి సాయం చేస్తున్నాయి.

    పాకిస్ధాన్ ద్వారా పరోక్షంగా కాశ్మీరులో కూదా అమెరికా నెమ్మదిగా వేలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దాని జోక్యం కొనసాగుతున్నదని కొన్ని పరిణామాల ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

    అమెరికా ఆధిపత్యం ఒక్క పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లలో మాత్రమే పరిమితమై లేదు. ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ అది వేలు పెడుతుంది. దానికి ప్రపల సాక్ష్యం వికీలీక్స్ ద్వారా వెల్లడయిన డిప్లొమేటిక్ కేబుల్సే. పాలస్తీనాపై జాతి దురహంకారానికి పాల్పడుతూ, పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని వలస చేసుకున్న ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు నిస్తోంది. ఒక్క పాలస్తీనా సమస్యే ప్రపంచ వ్యాపితంగా ముస్లింలను అమెరికాకి వ్యతిరేకంగా సమీకృతం చేస్తోంది. కాశ్మీరు సమస్య ప్రధానంగా భారత్ కు వ్యతిరేకంగా టెర్రరిస్టు సంస్ధలతో పాటు కాశ్మీరు జాతియ శక్తులను కూడా సమీకృతం చేస్తోంది.

    తీవ్రవాదం అని అమెరికా చెబుతున్నదంతా తీవ్రవాదం కాదు. ఆఫ్ఘనిస్ధాన్ ని అమెరికా దురాక్రమించింది. ఇండియాను దురాక్రమించిన బ్రిటిష్ పైన ఇండియన్లు పోరాడినపుడు భారత జాతియ పోరాటం ఐనపుడు ఆఫ్ఘన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగే పోరాటం టెర్రరిజం ఎందుకవుతుంది? తాలిబాన్ కి ఒకస్పష్టమైన రాజకీయ లక్ష్యంది. అది అమెరికాను ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్లగొట్టడం.

    విశాల దృష్టితో చూసినపుడు ముందు దురాక్రమణలకు వ్యతిరేంగా పోరాటం చేయ్యవలసి ఉంది. అమెరికా దురాక్రమణను ఓడించాక ఆఫ్ఘన్ పాలకులను దారిలోకి పెట్టుకునే అవకాశం ఆఫ్ఘన్ ప్రజలకు ఇవ్వాలి తప్ప మన పరిష్కారాలను ఆఫ్ఘన్లపైన రుద్దడం సబబు కాదు. కాకపోతే అక్కడ ప్రజలకు మనం మద్దతు ఇవ్వడమో, అంతర్జాతీయంగా తగిన చర్యలను తీసుకోవడమో చేయగలం తప్ప తాలిబాన్ పాలన మత మౌఢ్య పాలన అని భయపెట్టి అంతకంటె పెద్ద దోపిడీదారు అయిన అమెరికా పెత్తనాన్ని ఆహ్వానించడం సరైంది కాదు.

  16. పాక్ నుండి అక్రమ వలసలు జరిగాయనడడం సత్య దూరం. కాశ్మీరును రెండు ముక్కలు చేసి ఇండియా, పాక్ లు ఆక్రమించాయి. ఆ రెండు ముక్కల మధ్య రాకపోకలు జరిగితే అవి అక్రమ వలసలు ఎలా అవుతాయి చెప్పండి? సీమాంధ్ర నుండి ఉద్యోగ రీత్యా హైద్రాబాద్ కి వెళ్ళి స్ధిరపడితేనో, పని వెతుక్కుంటూ వెళ్ళి స్ధిరపడితేనో అవి అక్రమ వలసలు అవుతాయా?

    “చాలా మంది తరిమివేయబడ్డారు” అంటే ఎంతమంది. జమ్ములోనే ఉన్నారు కదా వాళ్ళు? అయినా మొత్తంగా కాశ్మీరు జాతీయ సమస్య పరిష్కారం అయినపుడు కాశ్మీర్ పండిట్ ల సమస్య పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాదు. ఒకటి జాతి సమస్య అయితే మరొకటి ఒక జాతికి చెందిన ప్రజలల్లో అంతర్గత సమస్య. రెండింటినీ పోటీకి పెట్టదం సబబు కాదు.

    ఇపుడు అభిప్రాయ సేకరణ కొంచెంసేపు పక్కన పెడితే, ఇంతవరకూ ఎందుకు జరపలేదు? భారత ప్రభుత్వం ఇచ్చిన రాత పూర్వక హామీయే కదా వాళ్లు అడిగింది? అది అమలు చేయకుండా అరవై సంవత్సరాలు ఎందుకు నాన్చారు? తీవ్ర నిర్బంధం ప్రయోగించి పోలీసులు, సైన్యాన్ని ఇన్నాళ్ళూ కాశ్మిరులో ఎందుకు ఉంచినట్లు? ఈ అంశాలన్నింటిపైన సమాధానం చెప్పుకుని ఒక అవగాహనకు రాగలిగితే మీరు అడిగిన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు చెప్పుకోగలం.

    కాశ్మీరు ప్రత్యేక దేశంగా ఏర్పడితే ప్రాంతీయ భద్రత కోసం ఇండియా అంతర్జాతీయ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. కాశ్మీరు దేశం ఏర్పడగానే పాకిస్ధాన్ ఆక్రమించుకుంటుందనే వాదనలో వాస్తవం లేదు. కాశ్మీరు జాతీయోద్యమంలో టర్రరిస్టు సంస్ధలకు పూర్తి మద్దతు లేదు. పాక్ జోక్యానికి కూడా మద్దతు లేదు. స్వతంత్రతకే మద్దతు ఎక్కువగా ఉంది. కనుక వారు ఆ దృక్పధంతోనే తమ దేశాన్ని రక్షించుకునే పధకాలు అమలు చేసుకుంటారు. కాశ్మీరు కంటే చాలా చాలా చిన్నవైన దేశాలు కూడా మనగలుగుతున్నపుడు కాశ్మీరు ఎందుకు మనలేదు?

    కాశ్మీరుకి స్వాతంత్రం ఇస్తే మరొకరు అడుగుతారనడం వాస్తవ విరుద్ధం. ఏ జాతి అయినా తమ జాతీయ ఆకాంక్షలకు ప్రమాదం ఏర్పడినపుడు మాత్రమే విడిపోవడం గురించి ఆలోచిస్తారు. రష్యా విప్లవం వచ్చాక కమ్యూనిస్టు ప్రభుత్వం జాతులకు స్వయం నిర్ణయాధికార హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించింది. దాని ప్రకారం బాల్కన్ రిపబ్లిక్ లు లిధుయేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాలుగా విడిపోయాయి. కాని యూరప్ లో పశ్చిమదేశాల అకృత్యాలు గమనించి సోవియట్ రష్యాలోనే తమకు రక్షణ ఉందని గమనించి తిరిగి సోవియట్ రష్యాలో చేరిపోయాయి. సోవియట్ లో కమ్యూనిస్టు పాలన అంతరించి కృశ్చెవ్ కాలం నుండి పెట్టుబడిదారీ పాలన పునరుద్ధరించబడ్డాక మళ్ళీ జాతి అణచివేత ప్రారంభం అయ్యింది. దానితో మళ్లీ విడిపోవాలన్న కోరిక వివిధ జాతులలో బలపడింది. దాని ఫలితమే యెల్ట్సిన్ కాలంలో జరిగిన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం. చెప్పొచ్చేదేమంటే ఉత్తి పుణ్యానికి విడిపోవాలని ఏ జాతీ కోరుకోదు. తమ ఉనికికీ, తమ భాషా సంస్కృతులకూ ప్రమాదం ఏర్పడినప్పుడే వారు విడిపోవాలని కోరుకుంటారు. చాలా సులభంగా వారు విడిపోతే ఎట్లా? వీరు దండెత్తితే ఎట్లా అంటూ ఇతరులపై మన పరిష్కారాలను రుద్దడమే హిందూ మత సంస్ధలు చేస్తున్న తప్పు. ఎవరి ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కును అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలి. అది అంతర్జాతీయ సూత్రం. అది వివిధ జాతులకు కల ప్రజాస్వామిక హక్కు కూడ.

    షేక్ అబ్దుల్లా గురించి కాశ్మీరు ప్రజలు ఏం అనుకుంటున్నారన్నదే ఇక్కడ ముఖ్యం బైట ఉన్నవారు ఏం అనుకున్నా దానితో వారికి ఏం సంబంధం లేదు. కాశ్మీరు ప్రజల జాతీయ ఆకాంక్షలకు షేక్ అబ్దుల్లాను ప్రతిరూపంగా అక్కడి ప్రజలు చూశారు. ఆయన కొడుకుగా ఫరూక్ అబ్దుల్లా, మనవడుగా ఒమర్ అబ్దుల్లాలు ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప వారి సొంత ప్రతిభ ఎమీ లేదు. అఖండ భారత్ భావనకు షే అబ్దుల్లా జాతీయ ఆకాంక్షలు వ్యతిరేకంగా ఉన్నాయి తప్ప ఆయన పైన అనేక అబద్ధాలు మత సంస్ధలు ప్రచారంలో పెట్టాయి.

  17. ” ఆ రెండు ముక్కల మధ్య రాకపోకలు జరిగితే అవి అక్రమ వలసలు ఎలా అవుతాయి చెప్పండి?”

    సరే భారత్ ఆధీనంలో వున్న కాష్మీర్‌కి ఒక ప్రత్యేక ప్రతిపత్తైనా వుంది. మరి POK కి అదికూడా లేదుకదా. అక్కడి నుంచి ఇక్కడికి జరుగుతున్న వలసలని మనం ఏవిధంగా demografic configuration ని మార్చడానికి జరిగినవిగా భావించకుండా వుండగలం.

    ఇన్నాళ్ళు ఎందుకుజరపలేదు అన్నాదానికి నాదగ్గర సమాధానంలేదండీ. బహుశా అది మీరన్నట్లు అఖండ భారతావని కలని సాకారం చేసే ప్రయత్నమయ్యుండొచ్చు. ఏదిఏమైనా అది ఖచ్చితంగా నిందార్హమే. ఒక ప్రధాన సమూహాన్ని (పండిట్లు ఒక ప్రత్యేక జాతో కాదో నాకు తెలీదు) అక్కడి నుంచి తరిమేసిన తరువాత మారిన పరిస్తితులనూ, జాతుల సమీకరణాలనూ దృష్టిలో పెట్టుకొని, వచ్చిన వలస ప్రజల్లో ఎందరు నిఖార్సైన కాశ్మీరీలు అనే దాన్ని దృష్టిలో వుంచుకొని ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపడం ఎంతవరకూ సరియైనది?

  18. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోకముందు అక్కడి తాలిబన్లు practise చేస్తుంది terrorism కాదా?

    అమెరికా చేసిన హత్యలు, తీసిన ప్రాణలు చేసినఘోరాలు నిందార్హమైతే తీవ్రవాదులు చేసిన హత్యలను, ఘోరాలను కూడా ఖండించాలికదా?

    ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవల్లో నేను ఇజ్రాయెల్ వైపునుంచి మాత్రమే ఇంతవరకూ చదువుతూ వచ్చాను కాబట్టి దానిగురించి నేను మాట్లాడటం సరికాదు. కానీ అక్కడెక్కడో అన్యాయం జరిగింది కాబట్టి ఇంకెక్కడో హత్యలు చేస్తామనడం ఎంతవరకు సబబు? నిజంగా తీవ్రవాదులకు అమెరికాను దెబ్బతీయగల శక్రిసామ్ర్ధ్యాలున్నాయని ఋజువుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారుకాబట్టి కాబట్టి వాటిని ఇజ్రాయెల్ ప్రభుత్వమ్మీదే ప్రయోగించి వారనుకొనే విమోచనమేదో సాధించవచ్చుకదా? మరి ఈ విమోచనకారులు కేవలం దాని గురించే మాట్లాడకుండా అమెరికన్ల “godlessness” గురించీ, జీవన విధానం గురించీ, అవినీతిగురించీ మాట్లాడినప్పుదు ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు మతపమైన ఇంకా సాంస్కృతీ పరమైన అనిపించట్లేదా?

  19. ఒక విషయం గమనించాలి. కాశ్మీరీ బ్రాహ్మణులలో ఎక్కువ మంది భరద్వాజ గోత్రస్తులు. వాళ్ళు కశ్యప ముని సంతటికి చెందినవాళ్ళు అంటూ వికీపీడియా లాంటి కొన్ని వెబ్‌సైట్‌లలో వ్రాసిన విషయాలు నమ్మశక్యంగా లేవు. పంజాబీ బ్రాహ్మణులలోనూ ఎక్కువ మంది భరద్వాజ గోత్రస్తులే. ఇతర ప్రాంతాలలోనే అనేక విభిన్న గోత్రాలకి చెందిన బ్రాహ్మణులు కనిపిస్తారు.

  20. బ్రాహ్మణులు తమ పూర్వికుల పేర్లని గోత్రాలుగా పెట్టుకోవడం సాధారణం. దాని ప్రకారం చూస్తే కాశ్మీరీ బ్రాహ్మణులు కశ్యప ముని సంతటికి చెందినవాళ్ళు కాదు అనిపిస్తుంది.

  21. భారత కాశ్మీరుకి స్వయం ప్రతిపత్తి గురించా మీరు మాట్లాడుతున్నది? ఆ ఆర్టికల్ ఎప్పుడో చచ్చిపోయింది. మొదటినుండీ భారత సైన్యాలు కాశ్మీరులో తిష్టవేసుకుని ఉన్నాయి. అనేక మంది పురుషుల్ని తీవ్రవాదుల పేరుతో కాల్చి చంపారు. ఎంతమందిని చంపారో లెక్కలేదు. అదృశ్యమైన కేసులు వేలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందమే అక్కడ గుర్తు తెలియని సమాధుల్ని వెయ్యికి పైగా కనిపెట్టింది. సాయుధ బలగాల్ ప్రత్యేకాధికారాల చట్టం అమల్లో ఉంటుంది అక్కడ. దాని ప్రకారం సైనికులు, పారా మిలట్రీలు కేవలం అనుమానంతో ఎవరినైనా కాల్చి చంపొచ్చు. దాన్ని అడ్డుపెట్టుకుని బోర్ కొట్టినప్పుడల్లా రేప్ లు చేస్తుంటారక్కడ. మణిపూర్ లో కూడా ఈ చట్టం అమల్లో ఉంది. అక్కడా అనేక సార్లు సైనిక బలగాల రేప్ లు వెలుగులోకి వచ్చాయి.

    ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పదలిచాను. 2001 జనాభా లెక్కలు పూర్తయ్యాక అన్ని రాష్ట్రాల జనాభా సంఖ్యను భారత ప్రభుత్వం ప్రకటించింది. కాని కాశ్మీరు లెక్కలు ప్రకటించకుండా ఆపించి. ఇప్పటికీ అవి ప్రకటించలేదు. కారణం ఏమిటో తెలుసాండి? దేశం అంతా పురుషలకంటే స్త్రీల సంఖ్య దారుణంగా తక్కువగా ఉంటే కాశ్మీరులో స్తీల కంటే పురుషులు చాలా తక్కువగా ఉన్నారని ఆ లెక్కల్లో తేలింది. అసాధారణ రీతిలో పురుషుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం కాశ్మీరు లెక్కలు ప్రకటించకుండా తొక్కిపెట్టింది. తమ సంఖ్యను పెంచుకోవడానికి ఎక్కువమందిని భార్యలుగా చేసుకుంటారని ముస్లిం పురుషులపైన ఆరోపణలు చేసేవారికి ఇది మింగుడుపడదు.

    పురుషుల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం సుస్పష్టం. ఏదో కొద్దిమేరకు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తేనే వెయ్యికిపైగా గుర్తు తెలియని సమాధులు బైటపడ్డాయి. పూర్తి దర్యాప్తు జరిపితే కాశ్మీరు జనాభా ప్రత్యేకత వెనక ఉన్న మతలబు బైటికి వస్తుంది. ఇటువంటి బతుకు బతుకుతున్న కాశ్మీరీలకి స్వయం ప్రతిపత్తి ఉందనడం కాశ్మీరు ప్రజలపైన నిర్దాక్షిణ్యమైన జోక్ వెయ్యడమే.

    ఇక పాక్ ఆక్రమిత కాశ్మీరు విషయానికి వస్తే దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారని మీకు తెలిసే ఉంటుంది. ఇండియన్ కాశ్మీర్ లాగా కాకుండా అక్కడ ఎంతో కొంత స్వయం ప్రతిపత్తి ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీరు అని ఇండియా అంటున్నా, ఐక్యరాజ్యసమితి గానీ ఇతర దేశాలు గాని దాన్ని ‘పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్’ అని మాత్రమే అంటారు. నామమాత్రంగానే అయినప్పటికీ ఆజాద్ కాశ్మీర్ కి ప్రధాని, రాష్ట్రపతిలు ఉన్నారు. సుప్రీం కోర్టు ఉంది. వాటన్నింటినీ ఇండియాకూడా మొదట ఇచ్చి నాలుగైదు సంవత్సరాలు తర్వాత రద్దు చేసిది ప్రత్యేక ఆర్టికల్ ఇచ్చింది. అది ఇప్పుడు నామమాత్రం అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. దాన్ని తలచుకున్నవారెవ్వరూ ఇప్పుడు లేరు. చచ్చిపోయినా ఆ ఆర్టికల్ రద్దు చేయాలని బి.జె.పి, ఇతర మత సంస్ధలు ఇంకా డిమాండ్ చేస్తున్నాయి.

    పండిట్లను వెనక్కి రమ్మని కాశ్మీరుకి చెందిన అనేక సంస్ధలు అనేక సార్లు ప్రకటించాయి. వారిని వెళ్లగొట్టడం తప్పని వారంతా అనేకసార్లు అంగీకరించారు. పండిట్లను వెళ్లగొట్టడంపైన అనేక అబద్ధాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఐనా పండిట్లకు అన్యాయం జరిగిందన్నదాన్ని ఇప్పటికీ వాదనలో వినియోగించడం సరికాదు. ఆ తప్పును గుర్తించి సరిచేసుకోవాలనుకుంటున్నామని చెప్పాక కూడా దాన్ని ప్రస్తావించడం సింపతీ సంపాదించడానికీ, ఏదో విధంగా వాదనలో నెగ్గడానికి (మీరు కాదు) ప్రయత్నం చెయ్యడమే.

    కాశ్మీరులో జాతుల సమీకరణలో ఏ మార్పూ రాలేదు. నిరంతరం సైనిక పహారా ఉండే కాశ్మీరుకి ఎవరూ వలస వెళ్లలేదు. వెళ్ళినా చాలా చాలా తక్కువ. వ్యాపారం లాంటి తప్పనిసరి అవసరాలు తప్ప పెద్ద వలసలు అక్కడ జరగలేదు. కాకపోతే కాశ్మీరు యువతులను (అందంగా ఉంటారని కాబోలు) భారత దేశంలోని ఇతర రాష్ట్రాల వారు అనేకమంది పెళ్ళి చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ముంబై లాంటి నగరాల్లొ ఇవి ఎక్కువ జరిగినట్లు వార్తలు ఉన్నాయి. ఇటువంటి జంటల్లో విడాకులు ఎక్కువ ఉన్నాయని కూడా ఈ మధ్య ఓ అధ్యయనంలో తేలింది. కారణం గుర్తు లేదు. కాశ్మీరులో యువకులు అదృశ్యం అవుతుండడంతో కాశ్మీరు యువతులకు పెళ్ళిళ్ళు గగనం అయ్యి బైటి రాష్ట్రాల్లో వరుల్ని వెతుక్కోవలసిన పరిస్ధితి అక్కడ ఉంది. కాశ్మీరులో కాశ్మీరీలు పలచబడలేదు. యువకులు పలచబడ్డారంతే.

    అసలదే అభ్యంతరమైతే ఫ్లెబిసైట్ లో ఎవరు పాల్గొనవచ్చన్న విషయంలో నిబంధనలు రూపొందించుకోవచ్చు. అది పెద్ద విషయం కూడా కాదు.

  22. ప్రశాంత్ భూషణ్ తో ఆగలేదు వాళ్ళు. తర్వాత రోజు వాళ్లని హాజరుపరిచిన పాటియాలా హౌస్ కోర్టు వద్ద అన్నా హజారే మద్దతుదారులు భూషణ్ కి అనుకూలంగా నినాదాలిస్తుంటే భగత్ సింగ్ సేనవాళ్ళు దాడి చేసి విపరీతంగా కొట్టారు. ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయని కూడా చెబుతున్నారు.

  23. అమెరికా రాకముందు తాలిబాన్లు ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిజం ప్రాక్టీస్ చెయ్యడం ఏమిటి? ఈ భావన అర్ధవంతంగా లేదు. టెర్రరిజం అంటే కేవలం చంపడం ఒక్కటే అనుకున్నారు లాగుంది. “ఒక రాజకీయ లక్ష్యం కోసం హింసాత్మక పద్ధతులతో టెర్రరైజ్ చేసే ఎత్తుగడలకు పాల్పడడాన్ని” టెర్రరిజం అంటున్నాము. తాలిబాన్ ప్రభుత్వం నడుపుతున్నపుడు టెర్రరిజానికి పాల్పడవలసిన అవసరం దానికి ఎందుకొస్తుంది?

    మీరు చెప్పదలుచుకున్నది మతపరమైన పాలనను తాలిబాన్ చేసిందనీ, అందులో స్త్రీలు బాధలు పడ్డారనీ కాబోలు. అది పాలించడం కోసం తాలిబాన్ ఎన్నుకున్న ఓ పద్ధతి. సౌదీ అరేబియాలో మొన్నటివరకూ స్త్రీలకు ఓటు హక్కు లేదు. నెల రోజుల క్రితమే ప్రకటించారు. అది కూడా నామమాత్రమేననీ, అరబ్ తిరుగుబాట్ల నేపధ్యంలో ప్రకటించారని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ స్త్రీలు డ్రైవింగ్ చెయ్యడానికి వీల్లేదు. ఖురాన్ లో ఉన్నవీ లేనివీ అన్నీ దారుణంగా అమలు చేస్తారు. కనీస ప్రజాస్వామిక హక్కులు పేదవారికి, కార్మికులకు అక్కడ ఉండవు. బహ్రెయిన్, యెమెన్, జోర్డాన్ తదితర దేశాలన్నింటిలో నియంతృత్వ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినవి కూడా కాదు. దశాబ్దాల తరబది నియంతృత్వాల పాలనలో ప్రజలు మగ్గుతున్నారు. అవెందుకు అమెరికాకి కనపడలేదు. అక్కడ ఉన్నది ప్రజలు కాదా? అక్కడి స్త్రీలు స్త్రీలు కాదా? వారి కష్టాలు కష్టాలు కావా? అక్కడ ప్రజలకు ప్రజాస్వామ్యం అవసరం లేదా? ఈ అమెరికా కబుర్లను ఎలా నమ్ముతారండీ? దానికి కొన్ని ఆధిపత్య వ్యూహాలు ఉన్నాయి. మధ్య ప్రాచ్యం, దక్షిణాసియాలతో పాటు చైనాపైన ఓ కన్నెసి ఉంచడానికి ఆఫ్గనిస్ధాన్ అనువైన ప్రాంతం. పైగా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఇరాన్ ప్రబల శక్తిగా ముందుకొస్తోంది. దాన్ని కూడా ఎదుర్కోవాలి. అందుకే అమెరికాకి ఆఫ్గనిస్ధాన్ లొ సైనిక స్దావరాలు కావాలి. అక్కడ తన తొత్తులు ఉండాలి. అదే అమెరికా లక్ష్యం.

    తీవ్రవాదాన్ని ఎవరూ సమర్ధించకూడదు. కానీ అమెరికా తన స్వార్ధ ప్రయోజనాల కొసం ఆధిపత్యం కోసం దురాక్రమణ యుద్ధాలు చేస్తున్నపుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆఫ్ఘనిస్ధాన్ లో గానీ, పాకిస్ధాన్ లో గానీ తాలిబాన్ చేపట్టిన చర్యలన్నింటికీ ఒక లక్ష్యం కనపడుతుంది. ఒక్క తాలిబానే కాక అనేక చిన్నా చితకా టెర్రరిస్టు సంస్ధలు కూడా పని చేస్తున్నాయి. లక్ష్య రహిత హింసకు వీరు ప్రధాన బాధ్యులుగా కనిపిస్తారు. సూసైడ్ బాంబులు కానీ, ఎంబసీపైన దాడులు కానీ అవన్నీ అవసరమైనవే. తాలిబాన్ చేస్తున్నది టెర్రరిజంగా పత్రికలు చెబుతాయి కాని అది చేస్తున్నది గెరిల్లా పోరాటం. తాలిబాన్ ని అమెరికా కూడా తిరుగుబాటుదారులనీ, వారి పోరాటాన్ని ప్రతిఘటనా పోరాటమనీ పిలుస్తుంది తప్ప టెర్రరిజం అనడం చాలా తక్కువ. ఆ అవగాహనతోనే తాలిబాన్ తో చర్చలకు కూడా సిద్దపడింది. ఇంకొక విషయం ఏంటంటే అమెరికా భయపడే హక్కానీ గ్రూపుని కూడా అమెరికా ఇంకా టర్రరిస్టు సంస్ధగా గుర్తించలేదు. కాని దాన్ని అణచివేయాలని పాక్ ని కోరుతుంది. పాకిస్ధాన్ అణచివేస్తుంటే హక్కానీ గ్రూపు భరించలేక అమెరికాతో చర్చలకు దిగాలన్నది అమెరికా లక్ష్యం. అది సిద్ధించినట్లు సూచనలు అందుతున్నాయి. పట్టుకున్నామని చెబుతూ హక్కానీ గ్రూపు నాయకుడ్ని అమెరికా అరెస్టు చేసింది. నిజానికి ఆయన లొంగిపోయాడని తర్వాత తెలిసింది. ఆయనని పట్టించింది కూడా పాకిస్ధానే. అతని ద్వారా హక్కానీ గ్రూపుతో చర్చలు జరపాలని చూస్తోంది. అతన్ని పట్టించడంతో పాక్ పైన అమెరికా ఆరోపణలు ఆగిపోయాయి. ఆరోపణలు చేసినందుకు వివరణ కూడా ఒబామా పాక్ కి ఇచ్చుకున్నాడు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి. అమెరికా చెప్పిన టెర్రరిజంపై యుద్ధ పచ్చి బూటకం. ఆ పెరుతో అది తన ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది అంతే.

    అక్కడెక్కడో అని ఎలా అనగలరు? ప్రపంచం కుగ్రామంగా మారింది కదా? ఎక్కడో ఉన్న అమెరికా మన పొరుగు దేశంపై దాడి చేస్తే మనకి కూడా ఖచ్చితంగా అది కావాలి. అమెరికా జరిపిన దాడిలో ఇండియాను గుప్పిట్లో పెట్టుకోవడం కూడా ఒక లక్ష్యం దానికి మన పాలకులకి వ్యతిరేకత లేదు. కనుక అది పెద్ద విషయంగా వారికి తోచదు. కాని భారత ప్రజలు మాత్రం పట్టించుకొని తీరాలి. ప్రపంచంలొ జరిగే ఏ పరిణామమైనా ఇతర దేశాలపైన ప్రభావాన్ని అనివార్యంగా పడవేస్తున్నాయి. గ్లోబలైజేషన్ నేపధ్యంలో అది మరింత వాస్తవంగా మారింది. కనుక దేనినీ మనది కాదని చెప్పలేము.

    అమెరికాని దెబ్బతీయగల సామర్ధ్యం తమకు ఉన్నదని చెప్పడానికి తాలిబాన్, ఆల్-ఖైదాలు కృషి చేస్తున్నాయనడం నిజం కాదు. వారు ఆఫ్ఘనిస్ధాన్ ని ఆక్రమించిన అమెరికాను తమ దేశం నుండి వెళ్లగొట్టడానికి గెరిల్లా పోరాటం చేస్తున్నారు. దానిని టెర్రరిజం అని అమెరికా అంటోంది. అమెరికా తనకు వ్యతరేకంగా ఉన్నంతవరకూ ఏ పోరాటాలనయినా టెర్రరిజం కిందికి తొసేస్తుంది. ఆ టెర్రరిస్టులే అమెరికా ప్రయోజనాలకి అంగీకరిస్తే మిత్రులుగా స్వీకరిస్తుంది. అమెరికా వర్గీకరణ కరెక్టు కాదు. అది తన ప్రయోజనాల కోసం చేసుకున్న వర్గీకరణ అది. అమెరికాకి అనుకూలంగానే అంతర్జాతీయ పత్రికలన్నీ రాస్తాయి. అవి ఎంత పచ్చి అబద్ధాలైనా వాటికి అభ్యంతరం ఉండదు. దానివలన వివిధ సంస్ధల స్వభావం ఏమిటన్నదీ ప్రపంచవ్యాపితంగానే ప్రజలకు సరైన తెలివిది అందడం లేదు.

    ముంబై దాడులతో పాటు ఇండియాలో జరుగుతున్న దాడుల్లో పాకిస్ధాన్ హస్తం ఉంది. దక్షిణాసియాలో ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఇండియా పాక్ ల మధ్య పోటీ ఉంది. అంటే ఇండియా, పాక్ దేశాల పాలక వర్గాల (ధనికులు) మధ్య పోటీ ఉంది. వీరు ఒకరినొకరు ఓడించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఇండియాపై జరుగుతున్న టెర్రరిస్టు దాడులు. వాటిని ఎవరైనా ఖచ్చితంగా తిరస్కరించాల్సిందే. కాని వాటివెనక ఉన్న అసలు కారణాన్ని మాత్రం మర్చిపోకూడదు. అమెరికా వద్ద ప్రాపకం సంపాదించడానికి కూడా ఇండియా, అమెరికా ల మధ్య పోటీ ఉంది. అది సంపాదిస్తే ఇండియా ధనికులకి కూడా అంతర్జాతీయ కాంట్రాక్టులు దొరుకుతాయి. ఆఫ్ఘన్ యుద్ధాన్ని సమర్ధించినందుకు ఇండియా కంపెనీలకు ఆఫ్ఘనిస్ధాన్ లో కొన్ని కాంట్రాక్టులు దక్కాయి. అప్పుడపుడూ ఇండియా ఆఫ్ఘనిస్ధాన్ కి సహాయం ప్రకటిస్తుంది. ఈ సహాయం నిజానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్న ఇండియన్ కంపెనీలకు ఇవ్వడానికి తప్ప అక్కడి ప్రజల కోసం కాదు. అలా చేసినందుకు ఇండియా ఆఫ్ఘన్ పాలకులకి కమిషన్ ఇస్తుంది. మన పాలకులు కూడా అలా కమిషన్లు పుచ్చుకునే వాళ్లంటే నమ్మ బుద్ధి అవుతుందో లేదో కాని అది నిజం.

    ఇజ్రాయెల్ మీద కూడా పాలస్తీనా సంస్ధలు యుద్ధం చేస్తున్నారు. అక్కడ హమాస్, పి.ఎల్.ఒ లను ప్రజలు ఎన్నుకున్నారు. పి.ఎల్.ఒ ఇజ్రాయెల్ కి లొంగిపోయింది. కనుక దానిపైన ఆరోపణలుండవు. కాని గాజాని పాలిస్తున్న హమాస్ లొంగలేదు. దాంతో అది టెర్రరిస్టు సంస్ధ అయ్యింది.

    అమెరికన్ల “godlessness” గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అమెరికన్లలో అత్యధికులు క్రిస్టియన్లు. ఇక గాడ్‌లెస్‌నెస్ ఎలా ఉంది? అమెరికా పాలకుల అవినీతిని ఎవ్వరైనా మాట్లాడవచ్చు. వారి జీవన విధానంలో లోపాలేమయినా ఉంటే అది కూడా విమర్శించవచ్చు. విమర్శ చేసినంత మాత్రానే ఒక వ్యతిరేకత అంటగట్టడం ఎందుకు? అయినా ఈ అంశాలు ఎవర్ని ఎలా ఉద్దేశించారో నాకు అర్ధం కాలేదు.

  24. భిన్నాభిప్రాయాన్ని సహించలేని తత్వం ఎంత ప్రమాదకరంగా పెరిగిపోతోందో ప్రశాంత్ భూషణ్ పై, మర్నాడే అన్నా మద్దతుదారులపై జరిగిన దాడులు నిరూపిస్తున్నాయి. ఈ అసహనపరులూ, దౌర్జన్యకారులూ దేశభక్తులా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s