రోమింగ్ ఛార్జీలు లేని ‘నూతన టెలికం విధానం,’ అందరికీ బ్రాడ్‌బాండ్(అట)


కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి మంత్రి కపిల్ సిబాల్ ‘నూతన్ టెలికం విధానం’ (ఎన్.టి.పి) ప్రకటించాడు. రోమింగ్ ఛార్జిలు లేని ఈ విధానంలో ఐదు ప్రధాన అంశాలున్నట్లు ప్రకటించాడు. పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు పైకి కనిపిస్తున్న ఈ విధానం పూర్తి వివరాలు అందితే తప్ప మంచి, చెడులను నిర్ధారించలేము. కపిల్ ప్రకటించిన ఐదు ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి.

  1. డిమాండ్ చేయడంతోనే బ్రాడ్‌బాండ్ (బ్రాడ్‌బాండ్ ఆన్ డిమాండ్)
  2. ఒక దేశం-ఒక లైసెన్సు విధానం. దీని ప్రకారం రోమింగ్ ఛార్జీలు ఉండవు.
  3. టెలికం నెట్‌వర్క్ ఆపరేషన్లను టెలికం సేవలను విడదీసి రెండింటికి వేరు వేరు లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రవేశపెట్టడం.
  4. మార్కెట్ ధరలకు స్పెక్ట్రం అమ్మకాలు.
  5. చాతగాని ఆపరేటర్లకు ఓ పద్ధతి ప్రకారం స్వస్తి పలకడం


నూతన విధానంలో వినియోగదారులకు సంబంధించి పెద్ద మార్పు రోమింగ్ ఛార్జీలు రద్దు చేయడం మినహా మరొకటి కనిపించడం లేదు. ‘అందరికీ బ్రాడ్‌బాండ్’ అని ఇప్పుడే కాదు చాలా కాలం నుండి చెబుతున్నారు. కాని గ్రామీణులకు ఇప్పటికీ సరైనరీతిలో బ్రాడ్‌బాండ్ అందుబాటులో లేదు. ఈ లక్ష్యం, సాధారణ వినియోగదారులను కూడా దృష్టిలో పెట్టుకుని “టెలికం విధానానం” రూపొందించాము అని చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో అనుసరించడానికి కాదని గతంలోని పలు విధాన పత్రాలు రుజువు చేస్తున్నాయి.

నెట్‌వర్క్ ఆపరేషన్ నుండి సర్వీసుల అందజేతను విడదీయడం కూడా టెలికం విధానంలో పెద్ద మార్పుగా పేర్కొనవచ్చు. ఇప్పటివరకూ ఈ రెండింటికీ ఒకే లైసెన్సు పొందవచ్చు. ఇకముందు వేరు వేరు లైసెన్సులు పొందవలసి ఉంటుంది. మొబైల్ ఆపరేటర్లు తమ నెట్‌వర్క్ ను తామే నిర్వహిస్తూ, సర్వీసులను కూడా అందించినట్లయితే వారు రెండు లైసెన్సులు పొందవలసి వుంటుంది. నూతన విధానం ప్రకారం స్పెక్ట్రంను కూడా లైసెన్సుల కేటాయింపులనుండి విడదీయనున్నారు. ఇప్పటివరకూ ఆపరేటర్లందరికీ లైసెన్సుతో పాటు నిర్ధిష్ట మొత్తంలో స్పెక్ట్రంను ఉచితంగా కేటాయించారు. అదనంగా స్పెక్ట్రం కావలసినవారు వివిధ రేట్లను చెల్లించవలసి ఉండేది. ఇకనుండి అదనపు స్పెక్ట్రం మొత్తాన్ని మార్కెట్ ధరలకే కేటాయిస్తారు. 2జి స్పెక్ట్రం కుంభకోణం నేపధ్యంలో ఈ మార్పు జరిగిందని భావించవచ్చు.

ఎప్పటినుండో వల్లిస్తున్న “అందరికీ అందుబాటులో బ్రాడ్ బాండ్” నినాదం మరొకసారి విధాన పత్రంలో చేర్చారు. ఈ స్వప్నం సాకారం కావడానికి మరో తొమ్మిది సంవత్సరాల పాటు సమయాన్ని తమకు తాము ఇచ్చుకున్నారు. 2020లోపు “అందరికీ అందుబాటులో బ్రాడ్ బాండ్” సాధించడానికి 500 MHz అదనపు స్పెక్ట్రం అమ్మాలని నిర్ణయించారు. ఇందులో 300 MHz స్పెక్ట్రాన్ని రానున్న ఐదు సంవత్సరాలలోనే అమ్మేయాలని భావిస్తున్నారు.

“ఒకే దేశం – ఒకే లైసెన్సు” విధానం ద్వారా మొబైల్ ఫోన్ నెంబర్ పోర్టబిలిటీని దేశవ్యాపితం చేయనున్నారు. ఇప్పటివరకూ సర్కిల్ పరిధిలో మాత్రమే పాత నెంబరుతోనే కొత్త ఆపరేటర్ నుండి సర్వీసు పొందే అవకాశం ఉంది. అంటే సర్కిల్ పరిధి దాటినట్లయితే ఆపరేటర్ ను మార్చినవారు నెంబరు కూడా మార్చుకోవలసి ఉంటుంది. కొత్త విధానంలో ఒకే నెంబరును దేశమంతా వినియోగించే అవకాశం లభిస్తుంది. తద్వారా రోమింగ్ ఛార్జిలను రద్దు చేస్తారు.

స్పెక్ట్రం విధానాన్ని ‘నూతన స్పెక్ట్రం చట్టం’ కింద మార్చాలని నిర్ణయించారు. స్పెక్ట్రం కేటాయింపులు పొందేవారు దానిని కొనుక్కుని ఇతర కంపెనీలతో పంచుకోవడానికీ, దానితో వ్యాపారం చేసుకోవడానికీ అనుమతిస్తారు. అంటే ప్రభుత్వం దగ్గర వేలంపాటలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంను ఆ తర్వాత వేరే కంపెనీలకు మారిన మార్కెట్ రేట్ల ప్రకారం లాభాలకు అమ్ముకోవచ్చన్నమాట. స్పెక్ట్రం కొన్నవారు నిరుపయోగంగా ఉంచడానికి వీలు లేకుండా పీరియాడికల్ గా స్పెక్ట్రం ఆడిట్ నిర్వహిస్తామని విధానంలో పేర్కొన్నారు. నూతన విధానానికి మారడానికి ఆపరేటర్లతో పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆ ఇబ్బందులను ఎలాగూ ఆపరేటర్లకు అనుగుణంగానే ప్రభుత్వం పరిష్కరిస్తుందనడంలో అనుమానం లేదు.

నూతన టెలికం విధానం ప్రధాన లక్ష్యం పట్టణ గ్రామ అంతరాలను తుడిచిపెట్టడమేనని కపిల్ సిబాల్ ఘనంగా ప్రకటించాడు. దానికి తగినట్లుగా నిర్ధిష్ట విధానాలను మాత్రం ఒక్క దాన్ని కూడా ఆయన నూతన విధానంలో పొందుపరచలేదు. గ్రామాల్లో టెలిడెన్సిటి 35 శాతం మాత్రమే ఉందనీ దానిని 2017 నాటికి 60 శాతానికీ 2020 నాటికి 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కపిల్ గారు తమ వాక్కుని ఉచితంగా దానం చేసారు. అంటే 2020 నాటికల్లా దేశంలో ప్రతిఒక్కరి వద్దా ల్యాండ్ లైన్ గానీ, మొబైల్ ఫోన్ గాని ఉండేలా చూడాలని లక్ష్యం విధించుకున్నారన్నమాట. ఇది భారత దేశ దారిద్ర్యాన్ని తగ్గించడానికి అప్పుడప్పుడూ పాలకులు చేసే వాగ్దానాలలాంటిదే. విధానాన్ని ప్రకటించినప్పుడు తప్ప ఆ తర్వాత ఒక్క రోజు కూడా ఈ హామీని పాలకులు తలచుకోరు.

అందరికీ ఫోను, అందరికీ బ్రాడ్ బాండ్ అన్న నినాదాలు పదే పదే నిస్సిగ్గుగా వల్లించేవే తప్ప ఆచరణలో అమలయ్యేవి కాదు. అదంతా ఒట్ఠి మోసం, దగా, వంచన! అది కాక దరిద్రంనుండి బైటపడకుండా ల్యాండ్ ఫోన్లతోనూ, మొబైళ్ళతోనూ ప్రజలు ఏం సాధించాలో సిబాల్ గారు తన విధాన పత్రంలో ప్రకటించి ఉంటే బాగుండేది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s