
కసబ్ ఉరిశిక్షపై స్టే విధిస్తూ, అతని అప్పీలును వేగంగా విచారించడానికి జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ సి.కె.ప్రసాద్ లతో కూడిన స్పెషల్ బెంచి అంగీకరించింది. తన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సవరించుకుని తన ఉరిశిక్షను సవాలు చేయడానికి అదనపు వాదనలు చేర్చేందుకు కూడా బెంచి కసబ్ ను అనుమతించింది. స్పెషల్ కోర్టు అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష విధించగా బోంబే హైకోర్టు ఉరిశిక్షను ఖాయం చేసింది. అనంతరం కసబ్ సుప్రీం కోర్టులో ఉరిశిక్షను సవాలు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ కౌన్సెల్, అమికస్ క్యూరీ అయిన రాజు రామచంద్రన్ 2008 టెర్రరిస్టు దాడుల కేసును స్వీకరించడమే కాక కేసు విషయంలో కోర్టుకు సహాయపడేందుకు అంగీకరించినందుకు ఆయనను అభినందించింది.
“కసబ్ అప్పీలును ముందు వెనకలు ఆలోచించకుండా వెంటనే తిరస్కరించాలనీ, అప్పీలును వినడానికే వీలు లేదనీ మన దేశంలోఅనేకులు భావిస్తున్నారు. కాని మీరు ఈ కేసు విషయంలో అమికస్ హోదాలో కోర్టుకు సహకరించడానికి అంగీకరించినందుకు మాకు సంతోషంగా ఉంది” అని బెంచి పేర్కొన్నది. “దేశంలో చట్టానికి మాత్రమే అంతిమ అధికారం ఉన్నందున, చట్టం అనుమతించిన న్యాయ ప్రక్రియ పూర్తిగా కొనసాగవల్సి ఉన్నందున కేసును పూర్తి స్ధాయిలో వినాలని భావిస్తున్నాం” అని బెంచి స్పష్టం చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం బెంచి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ‘టెర్రర్ దాడుల తీవ్రత ఎలా ఉన్నప్పటికీ చట్టం అనుమతించిన ప్రక్రియ పూర్తిగా కొనసాగవలసి ఉన్నదని’ అంగీకరించాడు. అయితే కేసు విచారణ వేగంగా కొనసాగాలని కోరాడు. ట్రయల్ కోర్టు, హై కోర్టు లలో జరిగిన వాదనలనన్నింటినీ డాక్యుమెంట్లలో పొందుపరిచారనీ, వాటి అనువాదాలు కూడా సమర్పించబడ్డాయనీ కనుక వీలయినంత త్వరగా సుప్రీం కోర్టు అప్పీలు విచారణను పూర్తి చేయాలని ఆయన కోరాడు. దానికి సుప్రీం కోర్టు బెంచి అంగీకరించింది.
కసబ్ అప్పీలును తక్షణమే ఎటువంటి పునరాలోచన లేకుండా తిరస్కరించాలని అనేకులు వాదిస్తూ వచ్చారు. ఎటువంటి నేరస్ధుడికైనా చట్టం అనుమతించే అన్ని హక్కులూ అందుబాటులో ఉంచవలసిన అవసరం న్యాయ వ్యవస్ధపై ఉంది. రాజ్యాంగానికి అనుగుణంగానే సదరు సౌకర్యాలు కల్పించబడతాయన్న అంశాన్ని విస్మరిస్తూ కొంతమంది కసబ్ ఉరి శిక్ష అప్పీలు పై విచారణను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ముస్లిం అయినందుకో, పాకిస్ధాన్ దేశస్ధుడు అయినందుకో కసబ్ పట్ల చట్టరీత్యా అనుమతించదగిన హక్కులను కూడా తిరస్కరించేంత కఠినంగా వ్యవహరించాలని చెప్పే వీరు, భోపాల్ విషవాయువు విడుదలతో వేలమంది మరణానికి కారణమైన యూనియన్ కార్బైట్ ఫ్యాక్టరీ యజమాని ఏండర్సన్ను రాత్రికి రాత్రి విమానం ఎక్కించి అమెరికా వెళ్ళడానికి అనుమతించడం పట్ల ఎన్నడూ నోరెత్తిన దాఖలాలు లేవు. అమెరికా పట్ల అకారణమైన ప్రభు భక్తి ప్రదర్శించే వీరు పాకిస్ధాన్ పట్ల కూడా అకారణమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు.
వీరి అసంభద్ధ భావనలు వీరి వరకే పరిమితమై ఉన్నంతవరకూ ఫర్వాలేదు గానీ ఎటువంటి పూర్వాభిప్రాయాలు లేని ఖాళీ మెదళ్ళను కూడా వీరు కలుషితం చేస్తుండడమే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది.
