ముంబై దాడులకు సంబంధించి వివిధ సాక్ష్యాలను ఇండియా, పాకిస్ధాన్ కు సమర్పించింది. ఈ సాక్ష్యాలలో పాకిస్ధాన్ నుండి ముంబై దాడులను పర్యవేక్షించిన వ్యక్తి గొంతును రికార్డు చేసిన సాక్ష్యం కూడా ఉన్నది. ఇండియా అందించిన సాక్ష్యంతో విచారణ ఎదుర్కొంటున్నవారిలో ఒకరి గొంతు సరిపోయిందని పాక్ పోలీసు ఒకరు కోర్టుకు తెలిపాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
అయితే సదరు పోలీసు సంబంధిత సాక్షిని విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురిలో ఎవరైందీ గుర్తించాడా లేదా అన్నది తెలియరాలేదు. రావల్పిండి లోని అడియాలా జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ విచారణ జరుగుతున్నది.
ప్రాసిక్యూషన్ వాదనను డిఫెన్సు లాయర్ కోర్టులో సవాలు చేశాడు. విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితుల గొంతులను పరిశోధకులు ఎలా రికార్డు చేసిందో తెలపవలసిందిగా డిఫెన్సు లాయర్ కోర్టుని కోరాడు. పాకిస్ధాన్ చట్టాల ప్రకారం సదరు వ్యక్తుల అనుమతి లేనిదే వారి గొంతును రికార్డు చేయడానికి వీలు లేదు.
భారత ప్రభుత్వం గతంలోనే నిందుతుల గొంతు రికార్డు చేసి ఆ నమూనాలను తమకు సమర్పించవలసిందిగా పాకిస్ధాన్ ను కోరింది. వ్యక్తుల అనుమతి లేనిదే వారి గొంతు రికార్డు చేయడానికి వీల్లేదన్న తమ చట్టాన్ని కారణంగా చూపిస్తూ పాక్ అంతర్గత శాఖ మంత్రి రెహ్మన్ మాలిక్ ఆ విషయంలో తన నిస్సహాయతను భారత్ కి తెలియజేశాడు. ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (ఎఫ్.ఐ.ఎ) నిందితుల మాటలను రికార్డు చేయడానికి అనుమతించాల్సిందిగా హైకోర్టును కోరిందని మంత్రి తెలిపాడు. “ఈ కేసులో ఉన్న అన్ని అంశాలనూ ఇండియాతో పంచుకున్నపుడు, రికార్డు చేసిన నిందుతుల మాటల శాంపిళ్లను ఇవ్వడం ఎందుకు వీలు కాలేదు?” అని డిఫెన్సు లాయర్ కోర్టును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కరాచి నగరంలో నిషేధించబడిన లష్కర్ ఎ తొయిబా సంస్ధ శిక్షణా శిబిరాలుగా భావిస్తున్న మూడు స్ధావరాలపై దాడులు చేసినట్లుగా కూడా ప్రాసిక్యూషన్ సాక్షిగా హాజరైన పాక్ పోలీసు కోర్టుకు తెలిపాడు. అయితే ఈ దాడులలో కేసుకు ఉపయోగపడే సాక్ష్యాలేవీ దొరకలేదని ఆయన కోర్టుకు తెలిపాడు. ఈ అంశాన్ని కూడా డిఫెన్స్ లాయర్ సవాలు చేస్తూ సాక్ష్యాలను కృత్రిమంగా తయారు చేయడానికి ప్రాసిక్యూషన్ ప్రయత్నిస్తున్నదని అభ్యంతరం తెలిపాడు.
మరిన్ని సాక్షాధారాలు సంపాదించడానికి వీలుగా పాకిస్ధాన్ నుండి ఒక జ్యుడిషియల్ కమిషన్ ముంబై సందర్శించడానికోసం ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టకు సమర్పించవలసిందిగా పాక్ కోర్టు కోరింది. పాకిస్ధాన్ జ్యుడిషియల్ కమిషన్ ఇండియాకు వచ్చి ముంబై దాడుల కేసుకు సంబంధం ఉన్న కీలకమైన పోలీసు అధికారులనూ, అజ్మల్ కసబ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన మెజిస్ట్రేట్ నూ, ఇంటర్వ్యూ చెయ్యాల్సి ఉంది.
పాకిస్ధాన్ ఎ.టి.సి ముందు సాక్ష్యం ఇవ్వడానికి వీలుగా కసబ్ ను పాకిస్ధాన్ పంపించడానికి ఇండియా నిరాకరించిన నేపధ్యంలో జ్యుడిషియల్ కమిషన్ ను ఇండియా పంపించేందుకు పాకిస్ధాన్ ప్రతిపాదించింది. ఇండియా పాకిస్ధాన్ కు సమర్పించిన డొజైరిలు పాకిస్ధాన్ కోర్టుల్లో అనుమతించడానికి వీలు లేనందున కూడా ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పాకిస్ధాన్ క్రిమినల్ కోడ్ ఛాప్టర్ XL ప్రకారం జ్యుడిషియల్ కమిషన్ నియమించవచ్చని ఎఫ్.ఐ.ఎ సూచించింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ ముంబై సందర్శించి కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులనూ, మెజిస్ట్రేట్ నూ ఇంటర్వ్యూ చేయవలసి ఉన్నది.
ముంబై దాడులకు సంబంధించి పాకిస్ధాన్ కోర్టులో జరుగుతున్న విచారణ ఏ దశలో ఉన్నదీ తెలుసుకోవడానికి ఈ వార్త దోహదపడుతుంది.
