సి.ఎం కిరణ్ కుమార్ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్ధితుల గురించి కేంద్ర నాయకులకు వివరించినట్లు తెలిసింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పై తన అభిప్రాయాన్ని కూడా సి.ఎం కేంద్ర నాయకులకు తెలియజేశాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ‘సకల జనుల సమ్మె’ ఉధృతంగా కొనసాగుతున్న నేపధ్యంలో ఢిల్లీలో పరిణామాలు వేగవంతం అయినట్లు కనిపిస్తోంది గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రులు వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ సమావేశాలన్నింటిలోనూ తెలంగాణ విషయమే ప్రధాన అంశంగా చర్చ జరుగుతున్నదని వారి మాటల ద్వారా స్పష్టమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇ.నరసింహరావును కూడా ఢిల్లీకి రావలసిందిగా కోరింది. కేంద్ర పిలుపుమేరకు గవర్నర్ ఢిల్లీకి వేంచేశాడు. శనివారం ఆయన ప్రధానితో సమావేశం కావలసి ఉంది. సమావేశం జరిగిందీ లేనిదీ తెలియరాలేదు. ఎ.పి.పి.సి అధ్యక్షుడు బొత్సాను కూడా ఢిల్లీ రావలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరింది. అయితే ఆయన ఆదివారం ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనను విధించనున్నారన్న సూచనను సి.ఎం. కిరణ్ కుమార్ కొట్టిపారేశాడు. “తెలంగాణ అంశం చాలా కాలంగా నలుగుతోంది. స్ధిరంగా ఆందోళన కొనసాగుతుండడంతో ఇప్పుడా సమస్య బాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వివిధ నాయకులతో సంప్రదింపులు జరుపుతోంది. అతి త్వరలో వారు సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నాను” అని కిరణ్ పేర్కొన్నాడు. కేంద్రం మాత్రమే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందనీ తాను నిర్ణయం ప్రకటించే స్ధాయిలో తాను లేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.
రాష్ట్రపతి పాలన విధిస్తారన్న సూచనను ఆయన తిరస్కరించాడు. “రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించాలి? రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధిస్తారు? అందుకు అవసరమైన ప్రమాణాలు ఏమిటి?” అని కిరణ్ కుమార్ విలేఖరులను ప్రశ్నించాడు. ఢిల్లీకి వచ్చినవెంటనే సి.ఎం, డిప్యుటీ సి.ఎం లు ఆంధ్ర ప్రదేశ్ నుండి కేంద్ర మంత్రులుగా నియమితులైన వారిని కలిసారు. ఎస్.జైపాల్ రెడ్డి, పనబాక లక్ష్మి, పురంధరేశ్వరి, పళ్ళం రాజు లను వారు కలిశారు. వారి సమావేశం అనంతరం ఎస్.జైపాల్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ “నా సహచర మంత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్ధితిపై నా అంచనాను వివరించాను” అని తెలిపాడు. తాను నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పాననీ దానిని పత్రికలతో పంచుకోవడం సాధ్యం కాదని జైపాల్ రెడ్డి తెలిపాడు.
ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ కూడా శనివారం విలేఖరులతో మాట్లాడాడు. “ఈరోజు మంత్రుల బృందం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను కలిసింది. ఆంద్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు కేంద్ర మంత్రులతో కూడా మేము చర్చలు జరిపాము. విస్తృత చర్చలలో భాగంగానే ఈ చర్చలు జరుపుతున్నాము” అని ఆజాద్ తెలిపాడు. రాష్ట్రపతి పాలనవైపుగా రాష్ట్రం పయనిస్తుందా అన్న ప్రశ్నకు ఆజాద్ “ఎందుకు పయనించాలి?” అని ప్రశ్నించి ఆ సూచనను తిరస్కరించాడు.
తెలంగాణ రాష్ట్రం ఆందోలనలతో రాదని సీమాంధ్ర రాజకీయ నాయకులు సకలజనుల సమ్మె ప్రారంభమైనప్పటినుడీ చెవులు కోసిన మేకల్లా అరుస్తూనే ఉన్నారు. తాజాగా సంభవిస్తున్న పరిణామాలతోనైనా వారి నోళ్ళు మూతపడవలసి ఉంది. పది జిల్లాల ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి వచ్చి సమ్మె చేస్తుంటే దాని వలన ఫలితం ఉండదని పేర్కొంటున్న ఈ రాజకీయ నాయకులు మరి దేనికి సమస్యలు పరిష్కారమవుతాయో చెబితే బాగుండేది. డబ్బులు విరజిమ్మి, సారా మద్యం తాగబోయించి, రిగ్గింగ్ చేసి, హత్యలు దొమ్మీలు చేసి ఎన్నికల్లో గెలిచే సోకాల్డ్ నాయకులు గనకనే ప్రజల నిరసన, ఆందోళనలు వీరికి తేలికగా కనిపిస్తాయి.
నాలుగు కోట్ల ప్రజల ప్రయోజనాల కంటే తమ పెట్టుబడులు, ఆస్తుల ప్రయోజనాలనే ముందు పీఠిన నిలుపుతున్న ఈ అంగుష్టమాత్రులు కాకుల్లా ఎంత గోల చేసినా ప్రజాందోళనల ముందు తలవంచక తప్పదని తెలిసే రోజు త్వరలోనే వస్తుంది.
