
మూడేళ్ళ క్రితం జార్జియా, రష్యా ల మధ్య తలెత్తిన యుద్ధం ముగించి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి సర్కోజి దౌత్యం నెరిపాడు. మధ్యవర్తిగా వ్యవహరించి ఒప్పందం కుదరడానికి సహాయపడ్డాడు. ఆ తర్వాత సర్కోజి జార్జియా సందర్శించడం ఇదే మొదటిసారి. జార్జియా రాజధానిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ “జార్జియా దేశ సార్వభౌమాధికారానికీ, స్వాతంత్ర్యానికీ, సమగ్రతకూ ఫ్రాన్సు కట్టుబడి ఉంటుంది. రష్యాను మిత్రుడుగా, వ్యూహాత్మక భాగస్వామిగా ఫ్రాన్సు పరిగణిస్తుంది. కాని ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి నెలకొల్పబడాలంటే బెదిరింపులూ, పరిస్ధితిని అస్ధిరపరిచే ప్రయత్నాలూ పూర్తిగా ఆమోదయోగ్యం కాదు” అని అన్నాడు.
రష్యా వ్యతిరేకత ఎలా ఉన్నప్పటికీ, యూరోపియన్ యూనియన్ లోనూ, నాటో లోనూ చేరడానికి జార్జియా స్వేచ్ఛగా తన ఆకాంక్షలను వ్యక్తం చేయగల పరిస్ధితిలో ఉండాలని సర్కోజీ ఆకాంక్షించాడు. 2008లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తున్నదని జార్జియా ఆరోపిస్తున్నది. యుద్ధానికి పూర్వపు స్ధితికి తన సైన్యాలను రష్యా ఉపసంహరించుకోకపోవడం ద్వారా శాంతి ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తున్నది. జార్జియా నుండి విడిపోయిన అబ్ఖాజియా, దక్షిణ ఒస్సేటియా రాష్ట్రాలలొ రష్యా సైన్యాలు కొనసాగుతుండడం శాంతి ఒప్పందానికి విరుద్ధమని ఆరోపిస్తున్నది.
2008లో అబ్ఖాజియా, సౌత్ ఒస్సేటియాలు జార్జియా నుండి విడివడి స్వతంత్ర దేశాలుగా తమను తాము ప్రకటించుకున్నాయి. వెనువెంటనే రష్యా రెండు దేశాలను గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. జార్జియా విడివడిన రాష్ట్రాలను తిరిగి కలుపుకోవడానికి సైనిక చర్య చేపట్టడంతో అబ్ఖాజియా, సౌత్ ఒస్సేటియాలకు మద్దతుగా రష్యా జార్జియాతో తలపడింది. ఈ యుద్ధంలో జార్జియా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్నది. చివరికి సర్కోజీ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం స్వాతంత్ర్యం ప్రకటించుకున్న దేశాలనుంది రష్యా సైన్యాలు వెనక్కి వెళ్ళాల్సి ఉండగా రష్యా దాన్ని పాటించడం లేదని జార్జియా ఆరోపిస్తున్నది.
1990ల నుండి అబ్ఖాజియా, సౌత్ ఒస్సేటియాలలో శాంతి సైన్యాల పేరుతో రష్యా సేనలు కొనసాగుతున్నాయి. జార్జియా అధ్యక్షుదు మిఖాయిల్ సాక్ష్విల్లితో సర్కోజి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏ అంశాలపై చర్చలు జరిపిందీ తెలియరాలేదు. అజర్బైజాన్, ఆర్మీనియాలను సందర్శించిన అనంతరం ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి జార్జియాను సందర్శించాడు. నాటో కూటమి తూర్పువైపుకి విస్తవించడాన్ని రష్యా మొదటినుండి వ్యతిరేకిస్తున్నది. పాత సోవియట్ రష్యా ప్రాంతాలలోకి నాటో విస్తరించడాన్ని మానుకోవాలని చెబుతూ వస్తున్నది. నాటో విస్తరణ రష్యాకు వ్యతిరేకంగా కాదని అమెరియా యూరప్ లు హామీ ఇస్తున్నప్పటికీ ఆ హామీలను రష్యా నమ్మడం లేదు. అమెరికా, యూరప్ ల హామీలు నమ్మి బాగుపడిన దేశం ఏదీ లేదు.
