ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ తగ్గించిన ‘ఫిచ్ రేటింగ్స్’


ఫిచ్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ ఇటలీ, స్పెయిన్ దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గించింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు యూరో జోన్ లో వరుసగా మూడవ, నాల్గవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కావడం గమనార్హం. ఇటలీ రేటింగ్ ఎ+ నుండి ఎఎ- కు ఒక మెట్టు తగ్గించగా, స్పెయిన్ రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ- కు (‘ఎఎ+’ నుండి ‘ఎఎ’ ను వదిలి ‘ఎఎ-‘ కు తగ్గించడం) రెండు మెట్లు తగ్గించింది. రెండింటి ఔట్‌లుక్ ను మైనస్ వద్ద ఉంచింది. దానర్ధం రెండు దేశాల రేటింగ్ లను భవిష్యత్తులో మరొకసారి తగ్గించే అవకాశం ఉందని. ఈ లోపు ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకున్నట్లయితే ఫిచ్ సంస్ధ తన ఔట్ లుక్ మార్చుకోవడమో లెదా రేటింగ్ పెంచడమో చెయ్యవచ్చు. తగిన చర్యలు తీసుకోకుండా పరిస్ధితి మరింత దిగజారితే రేటింగ్ మరింత తగ్గించబడుతుంది.

ఇటలీ, స్పెయిన్ లు రెండూ యూరప్ రుణ సంక్షోభంలో పీకలదాకా కూరుకుని ఉన్నాయి. రెండు దేశాల సావరిన్ బాండ్లను యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేస్తూ బాండ్లపై వచ్చే రిటర్న్స్ (యీల్డ్) పెరగకుండా సహాయపడుతోంది. ఇసిబి ఈ దేశాల బాండ్లను కొనుగోలు చేయనట్లయితే మార్కెట్ లోని మదుపుదారులు అత్యధిక యీల్డ్ డిమాండ్ చేస్తూ మరింత త్వరగా రుణ సంక్షోభంలోకి నెట్టి ఉండేవి. అంటే ఇటలీ, స్పెయిన్ లు రెండూ వాస్తవానికి రుణ సంక్షోభంలో మునిగి ఉన్నట్లే లెక్క. ‘ఇ.సి.బి బాండ్ల కొనుగోలు’ వెంటిలేటర్ గా ఇరు దేశాలకు ఉపయోగపడుతున్నది. దానిపైనే ఆధారపడి అవి ఊపిరి తీసుకుంటున్నాయి తప్ప ఆ వెంటిలేటర్ తొలగిస్తే అవి డిఫాల్ట్ అవడం ఖాయం కావచ్చు.

స్టాండర్డ్ & పూర్, మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఇప్పటికే ఇటలీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించాయి. దానితో ఇటలీ రేటింగ్ తగ్గుదల మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇటలీ బాండ్ల యీల్డ్ (బాండ్లు కొన్నవారికి పీరియాడికల్ గా చెల్లించే వడ్డీ) పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధపై మదుపుదారులకు నమ్మకం సడలిందని ఫిచ్ తెలిపింది. డౌన్ గ్రేడ్ తర్వాత డాలర్, యెన్ లతో పోలిస్తే యూరో విలువ తగ్గిపోయింది. అమెరికా షేర్లు కూడా కొంతవరకు ప్రభావితమయ్యాయి. మొత్తం మీద ప్రభావం పెద్దగా లేదని చెప్పవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర రెండు రేటింగ్ సంస్ధలు ఇటలీ, స్పెయిన్ డౌన్ గ్రేడ్ విషయంలో ఏమైతే చెప్పారో అవే అంశాలను ఫిచ్ చెప్పడంతో మార్కెట్లకు కొత్తగా భయపడవలసిన అంశమేమీ కనపడలేదు. దానివల్లనే ప్రభావం పెద్దగా లేదని వారు తెలిపారు.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇసిబి), యూరోపియన్ యూనియన్ (ఇయు), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్) సంస్ధలు మూడో ఇటలీ, స్పెయిన్ లలో వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాలను అమలు చేయాలని గతం నుండీ గట్టిగా చెబుతూ వచ్చాయి. ఆ దేశాల ప్రభుత్వాలు ప్రకటించిన పొదుపు ఆర్ధిక విధానాలలో వ్యవస్ధాగత సర్ధుబాటు కార్యక్రమాలు గా చెప్పుకోదగ్గ చర్యలేవీ లేవని ప్రవేటు కంపెనీలు పెదవి విరిచాయి. ఫిచ్ డౌన్ గ్రేడ్ ఆ అంశాన్ని వేలెత్తి చూపుతున్నదని కొంతమంది విశ్లేషకులు ముఖ్యంగా ప్రవేటు కంపెనీల సలహాదారులు చెబుతున్నారు. కంపెనీలకు అదే లాభం గనుక వారు అదే చెబుతారు.

నిజానికి రేటింగ్ సంస్ధల డౌన్ గ్రేడ్ కానీ, దేశాల సావరిన్ అప్పులపై యీల్డ్ పెరుగుదల గానీ ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను మరింతగా ప్రవేటు బహుళజాతి సంస్ధల లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెరగాలని కాంక్షిస్తూ జరిగే పరిణామాలే. యూరప్ దేశాల్లో ప్రభుత్వరంగంలో మిగిలి ఉన్న రంగాలను కూడా ప్రవేటు బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడానికీ, ఉద్యోగులకూ కార్మికులకూ సంక్షేమ సదుపాయాల రూపంలో ఉస్తున్న సౌకర్యాలను రద్దు చేసి ఆ సొమ్ముని కూడా కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వినియోగించడానికీ బహుళజాతి కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి డిమాండ్లను వెల్లడి చేసే పరిణామాలే సావరిన్ రుణ బాండ్ల డౌన్ గ్రేడింగ్, బాండ్లపైన యీల్డ్ పెంపుదల లను చూడవలసి ఉంది.

యీల్డ్ పెరుగుతుండడంతో సంబంధిత దేశ ఆర్ధిక వ్యవస్ధపై మార్కెట్లకు నమ్మకం పోతున్నదని వార్తా సంస్ధలు, విశ్లేషకులు గొడవ ప్రారంభిస్తారు. “ఇంకేముంది ఇటలీ (లేదా మరొక దేశం) పని ఐపోయింది” అన్నట్లుగా ప్రతికూల ప్రచారం జోరుగా సాగుతుంది. దానితో సదరు దేశానికి మార్కేట్లో తక్కువ యీల్డ్ కు అప్పు దుర్లభం అవుతుంది. మార్కెట్లో అప్పు సేకరించదలిస్తే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించవలసి ఉంటుంది. అధిక వడ్డీ రేటు చెల్లించడం అంటే ప్రభుత్వ బడ్జెట్ లో మరింత వాటాను అప్పు చెల్లింపుల కింద చెల్లించవలసి రావడం. దానివలన అవసరమైన కార్యకలాపాలకు డబ్బు తగ్గిపోయి ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే జిడిపి కుచించుకు పోతుంది. జిడిపి కుచించుకుపోవడం అంటే ఆ ఆర్ధిక వ్యవస్ధపై మార్కెట్లో మరింత ప్రతికూలత వ్యాపిస్తుంది. మరింతగా యీల్డ్ పెరగడం, అప్పు దొరక్కపోవడం సంభవిస్తుంది.

ఆధునిక ఆర్ధిక వ్యవస్ధలు ముఖ్యంగా స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు ఆదాయం కంటే అధిక బడ్జెట్ లను రూపొందించుకుని ఆ ఖాళీని అప్పుల ద్వారా పూడ్చుకోవడం పైన ఆధారపడి నడుస్తుంటాయి. ద్రవ్యోల్బణం, సావరిన్ అప్పు, సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు, బడ్జెట్ లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ మొదలైన ఆర్ధిక ప్రమాణాలు, పరిణామాలపైన ఆధారపడి ఉంటాయి. ఆదాయం ఎంత ఉంటే బడ్జెట్ అంతకే రూపొందించుకోవడం ఈ వ్యవస్ధల్ళొ అసాధ్యమైన విషయం. ప్రణాళికా బద్ధ ఆర్ధిక వ్యవస్ధలోనైతే ఆదాయానికి తగ్గ ఖర్చులను చేస్తూ, అవసరమైన రంగాలకు తగినంతగా కేటాయిస్తూ, మానవ వనరుల అభివృద్ధికి ఇతోధికంగా కేటాయిస్తూ మొత్తంగా దేశ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేసుకోవడం సాధ్యమవుతుంది. కానీ ప్రణాళిక అంటేనే ప్రవేటు కంపెనీలకు బూతులా వినపడుతుంది. అదొక నేరంలా ప్రస్తావిస్తాయి. ప్రణాళిక అనగానే తమకు తక్కువగా కేటాయిస్తూ, ప్రజల బాగోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంగా పరిగణిస్తాయి. వాస్తవం పూర్తిగా అదే కాకపోయినా కొంతవరకు నిజమే.

అందుకే ప్రణాళికాపద్ధ ఆర్ధికవ్యవస్ధను బహుళజాతి సంస్ధలు శతృవుగా చూస్తాయి. కొంతమంది ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధనే సోషలిజంగా చెబుతుంటారు. కాని అది పూర్తిగా అవాస్తవం. ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధలను కలిగి ఉన్నప్పటికీ చైనా, ఇండియా లాంటి దేశాలు సోషలిజం వూసెత్తకుండా గడుపుకొచ్చాయి. నూతన ఆర్ధిక విధానాలను కావలించుకున్నాక క్రమంగా స్వేచ్ఛా మార్కెట్ విధానాలను అవలంబిస్తూ పూర్తిగా ప్రవేటు కంపెనీలతో సావాసం చేసే ఆర్ధిక వ్యవస్ధలుగా మారుతున్నాయి. నిజానికి స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు ఒక విధంగా ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధలుగా చెప్పుకోవలసి ఉంటుంది. కాకపోతే అక్కడ ప్రణాళికలు పూర్తిగా ప్రధాన మార్కెట్ ప్లేయర్లయిన మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, ద్రవ్య కంపెనీలయిన ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ కంపెనీలు మొదలైనవాటికి అనుకూలంగా ఉంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s